నిర్గమకాండము 4 - మోషే పరిచర్య పిలుపు కొరకై దేవుని సూచన
ప్రార్థన: ప్రభువైన దేవా! మాలో ఏదోఒక లోపమున్నను, మీ శక్తితో జయించు కృపను మాకు దయచేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.
-
మోషే స్వనీతి - దేవుని సునీతి
మోషే తన యవ్వన కాలములో ఇశ్రాయేలీయులకు యధార్దముగా నచ్చజెప్పబోయెను గాని ఇశ్రాయేలీయులు "దేవుడే విడుదల కలుగజేయును" అని గట్టిగా నమ్ముచు మొరపెట్టుటచేత మోషేను తిరస్కరించిరి. అప్పుడు మోషే తన స్వనీతితో విఫలమాయేను గాని ఇప్పుడు దేవుని ప్రణాళిక చొప్పున దైవదూతగా మోషేను పంపుటకు దేవుడు తన సునీతికి మోషేను మార్చుటకు సూచనలు కనబర్చెను.
-
దైవ తరగతి(ట్రైనింగ్): మోషే పునరుద్ధరణ
1. నిరాయుధ స్థితిలో ప్రాణాపాయ ప్రయత్నము: ఒకప్పుడు రాకుమారుడైన మోషే ఇప్పుడు నిరాయుధుడు. మోషే ఆయుధముగా వాడిన కర్రను క్రిందపడవేసినపుడు నిరాయుధుడగుట ఒక రిస్క్ అయితే ఆ కర్ర పాముగా మారుట మరింత రిస్క్, ఆ పామును పట్టుకొని లేపుట అల్టిమేట్ రిస్క్. దేవుడు మనకు తోడైయుంటే ఎంత రిస్కయినా చేయవచ్చు అనే నైజము(నరనరాల్లో జీర్ణించుకొనిపోవుట)ను మోషేలో మొలిపించెను. ఈ ధైర్యనైజ విత్తనమును ఇశ్రాయేలీయుల మద్యలో మొలిపించమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించెను.
దేవుని చిత్తప్రకారం ఈ లోకరక్షణను(కర్ర) ఆయన ఉనికిపట్టులో వదిలిన యెడల మొదట అది ప్రమాదముగా అనిపించినా దానిని సమాధానముతో పట్టుకొనినయెడల అది దేవుని రక్షణగా మారును. ఉదా: ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో ఒకచిన్న బాలుడు తనకు జీవనాధారమైన రెండు చేపలను వదిలివేయుటద్వారా తాను కడుపునిండా భుజించడమే కాక అనేకమందికి ఆహారము అందెను. ఇంకా పేతురు యోహాను తమ వలలు విడిచి అనేకమందిని పరలోకరాజ్యములోనికి చేర్చిరి. దేవునికి సమర్పించుట అనగా దానిని మరిన్ని రెట్లుగా పట్టుకొనుటయే! మనచేతిలోని గింజ ఆయన మాటప్రకారము వదిలితే అది విత్తనమై, మహావృక్షమై(మల్టిప్లై) మధురఫలములను అందించును.
2. పునరుద్ధరణాభ్యాసము: చెయ్యి పాడయి బాగవుట కూడా మోషేను రెస్టోర్ చేయడానికి దేవుడిచ్చిన లైవ్ ట్రైనింగ్. కుష్టుదైపోయిన మోషే చేయి తిరిగి పొందిన ఆనందమును, వారి విడుదల తధ్యమను సంతోషమును ఇశ్రాయేలీయులలో మరల పుట్టించమని దేవుడు ఆజ్ఞాపించెను. వాక్యప్రత్యక్షత పెరిగిన కొలది క్రైస్తవుడు తన్నుతాను పునరుద్ధరించుకొను అనుభవము కలిగివుండవలెను.
3. దైవక్రియ: మోషే మిద్యోనులోనుండి తెచ్చిన తనకర్రతో లేదా తనచెయ్యితో మహత్కార్యములు చేయుట మంచిదే అని ఇశ్రాయేలీయులు సంతోషపడినాగాని దేవుని హస్తము దీని వెనుక ఉన్నదనుటకు గోషాను నుండి నీళ్ళు రక్తముగా మారుట అను సూచక క్రియను దేవుడు అందించెను. మనకు కలిగిన వాటిని దేవునికి సమర్పించినయెడల బాహ్యప్రపంచమును దేవుడు ఆయన ఉనికిలోనికి తెచ్చును.
మోషే సకల విద్యాప్రవీణుడే కాని నలుబది సంవత్సరములు గొర్రెలతో సహవాసము చేయుటచేత మాట మారిపోయినది, ఐగుప్తులో తనవారు ఉన్నారా! చనిపోయారా! అనే బెంగతో దేవుని సహాయము కొరకు నలిగిన హృదయముతో కనిపెట్టు సమయములో దేవుడు ప్రత్యక్షమాయెను. మోషేకు దేవునిపై సంపూర్ణ నమ్మకము కలదు కాని, 0.001% కూడ రిస్కు తీసుకునే పరిస్థితిలో మోషే లేడు. అంతపెద్ద దైవ ప్రణాళిక తన చిన్న మాట పొరపాటు వల్ల ఫెయిల్ అయితే తట్టుకునే స్థితిలో మోషే లేని కారణంగా దేవుని యొద్దనుండి మిటిగేషన్(ప్రత్యామ్నాయ ప్రణాళిక) కొరకు వేడుకొనుచుండెను. అయితే దేవుడు మోషే ప్రస్తుత స్థితిని యెరిగి మొదట మోషేను పునరుద్ధరించుటకు పూనుకొనెను.
షరా! నోటిమాంద్యము: ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి కొదువగా నుండును. కొదువకు సమృద్ధి తన సహోదరునివద్ద నుండును కావున సహోదరులు ఐఖ్యత కలిగి పనిచేయుదురు. అహరోను క్షేమసమాచారము దేవునినోటనుండి వినగానే మోషేకున్న వ్యాకులము పోయి ప్రయాణమునకు సిద్ధపడెను.
దేవుని సూచక క్రియలు దైవజనులకు విశ్వాసమును, సంతోషమును కలుగజేయగా, అవి ఫరోకు కలవరమును కలుగజేయునవై ఉండెను. ఎందుకనగా ఫరో దేవును జ్యేష్టకుమారుడైన ఇశ్రాయేలును దాసత్వములోనికి నెట్టెను. -
ఆఖరి మాట
మోషే ఐగుప్తు రాజ్యవారసుడు. మిద్యోనుకు రాకుమారుని హోదాలో వచ్చెను. తన కుమారుడైన గెర్షోము ఐగుప్తు వారసునిగా పెంచుచు తాను మిద్యోనులో అన్యునిగా భావించెను. అయితే దేవుడు మోషే పౌరసత్వమును మార్గమద్యలో మార్చివేసెను. మోషే తనప్రజల మద్యకు ఇశ్రాయేలు వారసునిగ వెళ్ళెను.
త్వరలో రానైయున్న ప్రభువును కలుసుకొనుటకు ఈలోక వారసత్వమును విడిచి పరలోక పౌరసత్వమును సంపాదించుకొనుటకు తగిన రూపాంతర సున్నతి కలుగుటకు శ్రమపడుదము. దేవుడు రాకడ వరకు మనలను కాపాడును గాక! ఆమేన్.
జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.
Social Presence
Share your thoughts and suggestions
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet -
Recommend this website on Google +