మోషే సుఖోపవాస ధ్యానములు

theme: ఉనికిపట్టు

పరిచయ వాక్యధ్యానము: ఆదికాండము 15వ అద్యాయము

మోషే సుఖోపదేశ ధ్యానమాలిక కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

బైబిలులో దేవుడు చేసిన సృష్టి, గొప్ప గొప్ప కార్యములు గలవు. ఈ ప్రపంచములో దేవుని దాసులు మాత్రమే చేసిన ఘనమైన కార్యములతో ప్రపంచ రూపురేఖలను మార్చివేసిన రెండు గ్రంథములను (నిర్గమకాండము, అపోస్తలుల కార్యములు) ధ్యానించినకొలది దైవమహిమ ప్రత్యక్షపరచబడుచున్నది.


మనము మరలా "బానిసత్వము అను కాడి" కిందికి పోకుండు నిమిత్తము దేవదాసు అయ్యగారు ధ్యాన మెళకువను అభ్యాసములో పెట్టిరి. అందులో కొంత వ్యవధి మోషే సుఖోపవాస ధ్యానములు (1 July to 10 Aug).


హెబ్రీయులు ఎవరు? వారు బానిసత్వములోనికి ఎందుకు వెళ్ళిరి? దేవుడు వారికి ఇశ్రాయేలు దేశము ఎట్లు ఏర్పాటు చేసి స్వతంత్రులుగా చేసెను? అనువాటి పునాది ఈ రోజు ధ్యానము.


అబ్రహామునకు అనుక్షణం దేవుని మాట వినే అలవాటు - ఆది 22:11
ఇస్సాకునకు ఇష్టము వచ్చినపుడు దేవుని సన్నిధికి చేరే ఆనవాయితీ - ఆది 24:63
యాకోబునకు యాతన వచ్చినపుడు దేవుని పట్టుకొనే పట్టుదల - ఆది 32:26

అందుకే దేవుడు తరతరాల భవిష్యత్తును అబ్రహామునకు చెప్పి విశ్వాసులకు తండ్రిగా నియమించినారు. ఈ ప్రపంచములు అబ్రహాము విశ్వాసము ద్వారా గర్బము ధరించి కనబడినవి. Jocob's ladder


ప్రార్థన: దేవా! మీ సర్వశక్తి సర్వవ్యాప్తియై ఉన్నది గనుక వందనములు. మా పరిస్థితుల అవసరాలను బట్టి, మీ ప్రణాలికను బట్టియు మేము ఈ లోకములో బంధింపబడినను మీ రక్షణ ద్వారా మాకు గొప్ప విడుదల కలుగజేసిన తండ్రీ మీకు స్తోత్రములు. మా బంధకములలో మీ విడుదల ఉనికిని మేము గ్రహించు శక్తిని మాకు ఈ ధ్యానములలో కలుగజేయుమని; మాకు సిద్ధపర్చిన వాటిని అందుకొనుటకు తగిన మారుమనస్సును, రూపాంతరము కలుగజేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.


ఆదికాండము 15వ అద్యాయములో దేవుడు మోషే ద్వారా జరిగింపబోవు మహాత్కార్యములను వివరిస్తున్నపుడు అబ్రాము అప్పటికింకా అబ్రహాముగా మారలేదు; ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే ఎవ్వరూ లేరు. అయినను అబ్రహాములో విశ్వాసము గర్బము(జీవము) ధరించినది. దేవుడు అన్ని మార్గములను తెరిచి విజయము మీద విజయములను అబ్రహామునకు అందించెను. ఆదాము వలన భూలోకమంతా శపింపబడినను, "నీవు అడుగుపెట్టు స్థలమెల్ల ఆశీర్వదింపబడును" అను వాగ్ధానమును అబ్రహామునకు దేవుడు దయచేసి భూలోకమంతా అబ్రహాము సంతానమును సంచరింపజేసి అందరిని ఆశీర్వదించెను.

దేవుడు హెబ్రీయుల భవిష్యత్తును ముందుగా అబ్రహామునకు బైలుపర్చెను.

13 ఆయననీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు.
14 వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.

అబ్రహాము తర్వాత ఏర్పాటు జనాంగమును దేవుడు ఇరుకు మార్గము దిశగా తోడుకొనిపోయెను.

ఇస్సాకునకు కొన్ని మార్గములను తెరిచి కొంత పరిధిలో స్వాతంత్యమును విజయమును అనుగ్రహింపబడినవి. యాకోబునకు అన్ని మార్గములను మూసివేసి ఏకైక మార్గము(నిచ్చెన) ద్వారా నడిపించెను. దేవుడు ఏర్పాటుచేసిన ఒక్క మార్గములో తప్ప మరి ఏ మార్గములోను విజయములేదు. ఇప్పుడు మన పరిస్థితి కూడా ఏకైక ఇరుకు నిచ్చెన మార్గమే. పభువైన యేసుక్రీస్తు మార్గమును హత్తుకొని మిగిలిన ఉరులు(దారులన్నీ) మర్చిపోయి హాయిగా ఉండవలెను.

ఎక్కడ శ్రమలు అధికమగునో అక్కడ దేవుని ఉనికి ప్రత్యక్షమగును.

దైవసన్నిధి ఉనికిపట్టు: మధురమైన తేనె తయారుకు తేనెపట్టులా, దైవకార్యములకు ఉనికిపట్టు దైవ సన్నిధి. తరతరాల జనాంగములను మోయుటకు అబ్రహాము దైవ సన్నిధిలో జీవము పోసుకోవడమే దైవ ఉనికిపట్టు ( ఇంక్యుబెటర్‌గా/అల్లాడుట/పొదుగు) . ఉదా: సౌర కుటుంబము జీవరాసుల మనుగడకు ఉనికిపట్టు. నిర్గమకాండమునకు ఉనికిపట్టు హోరేబు/సీయోను కొండ (అనగా హెబ్రీయుల విడుదల ప్రణాళిక దేవుడు హోరేబు కొండలో ప్రత్యక్షపరిచెను).


ఇశ్రాయేలీయుల మనుగడకు దైవ వాగ్ధానమే ఉనికిపట్టు. సమస్త దేశములకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞల రాజ్యాంగమే ప్రశాంతమైన జీవితమునకు ఆయువు పట్టు.

సంఘములకు, విశ్వాసికి, మారుమనసుకు ప్రామాణికము 10 ఆజ్ఞలు. అపాయ కాలమందు 10 ఆజ్ఞలను బట్టి మారుమనసు పొందిన యెడల ఎట్టి ఆపదయైనను తొలగిపోవును. కోల్పోయినవన్నీ తిరిగి అనుగ్రహింపబడును. ప్రజలు చేయవలసిన, చేయకూడని పనులు 10 ఆజ్ఞలలో ఉన్నవి. వీటిని పాటించుట జీవము; పాటించలేనియెడల లేమి, మరణములు వెంటాడునని బైబిలు బైలుపరుచుచున్నది.


నాశనకరమైన ఈ తరములోనుండి తప్పించుకొనుటకు నిర్గమకాండమును ధ్యానించి జీవ ఉనికిని వెదికి, అక్కడ నివాసము చేయు కృప విశ్వాసులందరికి దేవుడు దయచేయును గాక!

ఈ రాకడ సమయములో విశ్వాసి ఉనికిపట్టులను గూర్చి ధ్యానించవలసిన అవసరములు:

జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

సత్యము, ప్రేమ, జీవముల ఉనికిపట్టు ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము, శాంతి, సమాధానములుండును.


పరిచయం | 1 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | తైలాభిషేకపండుగ