నిర్గమకాండము 31 - విశ్రాంతిదిన ఆదేశము
ప్రార్థన: ప్రభువా! మా హృదయమును శుద్ధీకరించి మీ జ్ఞానమును మాకు దయచేయుము. మీయొద్ద నేర్చుకొని నిజమైన సమాధాన విశ్రాంతిలో జీవించు కృపను మాకు దయచేయుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.
1. పరిచయము
ఈ అద్యాయమునందు భూమిమీద మనము పాటించవలసిన రెండు ప్రాముఖ్యమైన దైవ నియమములు గలవు . 1) జ్ఞానమైయున్న దేవుడు తన జ్ఞానాత్మను అనుగ్రహించుట 2) సృష్టిని తన 6 రోజులలో ముగించి 7వ రోజు విశ్రమించిన దేవుడు, మన కొరకు విశ్రాంతి దినమును ఏర్పరుచుట. ఇశ్రాయేలీయుల హృదయము అరణ్యమునుండి పాళెములోనికి, పాళెములో బలిపీఠము దాటి, గంగాళము వద్ద పరిశుభ్రత నేర్చుకొని, మందిరములో ప్రవేశించి, ప్రదీపముల శుద్ధీకరణతో పరిశుద్ధతను అభ్యసించి, స్తుతి ధూపము దాటి దేవునివద్దకు చేరగా, దేవుడు 7వ దినమును పరిశుద్ధపరిచి విశ్రాంతిదినమును ఇశ్రాయేలీయులకు నిత్య నిబంధనగా ఏర్పరిచెను.
2. జ్ఞానహృదయము - జ్ఞానాత్మ
5. సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞానవిద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి యున్నాను.
లేవీ వంశస్తులైన అహరోను, మోషే యాజక నాయకత్వ హృదయమును బట్టి దేవుడు వారికి తన లక్షణమైన సర్వశక్తి ఆత్మను దయచేసెను. నేను రోషము గల దేవుడను అని చెప్పిన ఆయన యెహోషువ శౌర్యహృదయమును బట్టి సైన్యాధిపతిగా చేసెను. బైబిలు పండితులు వదిలివేసిన/తిరస్కరించిన అతి ప్రాముఖ్యమైన సాంకేతిక శాస్త్రమును దేవుడు బెసలేలు, అహోలీయాబు అనువారికి వారి జ్ఞాన హృదయమును బట్టి జ్ఞానాత్మను దయచేసెను. హృదయశుద్ధి గలవారు దైవలక్షణమును తప్పక దర్శింతురు(దేవుడు తన ఆత్మతో దర్శనమిచ్చును).
ఇదివరకు ధ్యానములలో మన పితరులకు దేవుడు చేసిన వాగ్ధానమును నెరవేర్చుటకై మనలను పిలుచును అని చూసినట్లుగా; తమ తరముల కొరకు హూరు, ఊరు, అహీసామా అను వారు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు వీరికి జ్ఞాన అభిషేకమును ప్రతిష్ఠించెను.
నిర్గమ 31:6 అహోలీయాబు బెసలేలుకు తోడుగా నిలిచెను. దేవుడు ఆజ్ఞాపించినవన్నియు చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి యున్నారు. దైవలక్షణమును(దైవాత్మను) రుచి చూచినవారు కలిసి పనిచేయు ఏకాత్మను కలిగియుందురు. ఉదా: యోహాను, యాకోబులు పేతురుకు తోడుగా నిలిచెను. అయితే భేధములు సృష్టించువారికి దైవలక్షముయొక్క రుచి తెలియదు, దాని పరిమళమును గ్రహించుటకు శరీరమును సన్నిధి అభ్యాసములో పెట్టినవారు కారు.
నేటి విద్యార్దులకు శుభవార్త ఏదనగా, మనము హృదయమును సిద్ధము చేసుకొని దేవుని వద్దకు చేరితే ఆయన సమస్త జ్ఞానమునకు మించిన సమాధానమును/ఇన్నోవేషన్ ను మనకు దయచేయును. అది దైవాత్మ కావున దానిలో కార్యసిద్ధి(నేర్పు, నెరవేర్పు) ఇమిడియున్నది(నెరవేరువరకు పనిచేయును).
గమనిక: నెరవేర్పు తర్వాత దేవుని నమ్మిన వారు సంస్తుతులతో సమాధానము కలిగియుందురు. దేవుని నమ్మని వారు ద్వేషముతో పాపము చేసి మానవాళికి కీడు కొనితెచ్చెదరు.
3. విశ్రాంతిదినము - పరిశుద్ధ నిత్యనిబంధన
దైవాజ్ఞయైన విశ్రాంతిదినమును అనుగ్రహించుటకు దేవుడు ఇశ్రాయేలీయులను ఇంతకుముందు చెప్పిన ప్రత్యక్ష గుడారమను గొప్ప పనిని అప్పగించెను. ఆ పనిలో "విశ్రాంతిదినము" అను దైవాజ్ఞను ఇమిడ్చెను. 7వ దినమున పనిచేయుట మాని విశ్రాంతిదినమును గౌరవింపవలెను. దేవుడు 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రమించెను, ఆ విశ్రాంతిని మరియు దేవుని దీర్ఘశాంతమును, తుది తీర్పు(గోదుమలను గురుగులనుండి వేరుపర్చు) వరకు దేవుని విశ్రాంతిని గౌరవింపవలయును.
క్రీస్తుప్రభువు అనేక రోగములను తరిమికొట్టి, సర్వ మానవాళికి రక్షణను ప్రసాదించెను. సంఘమునకు ఆయా సూచకక్రియలు జరిగించుటకు అధికారమిచ్చెను. సంఘ క్షేమాభివృద్ధికి స్నానాచారములు, సంఘ మేపుదలకు ప్రభు సంస్కారాచారములు, సంఘ కాపుదలకు ఆత్మకుమ్మరిపు మొదలగు అన్నిటి మద్య "సహోదర ప్రేమ" అను ఆజ్ఞను పెట్టెను. నూతన నిబంధన వారసులు ఈ ఆజ్ఞను గౌరవింపవలెను. ఎన్ని భేధములున్నను ఏ మతమును గాని, ఏ మనుష్యుని గాని ద్వేషింపరాదు, దూషింపరాదు, తూలనాడకూడదు, కించపరచకూడదు. ఈ విషయములో ఇంకా ఏమైనా స్పష్టత కావలసినయెడల హృదయమును శుద్ధి చేసికొని దేవుని అడిగినయెడల దేవుడు జ్ఞానాత్మను తప్పక ప్రసాదించును.
క్రొత్తనిబంధనలో ఆదివారము సంఘారాధన మనము పొందబోవు నిత్య విశ్రాంతిని గౌరవించి ఆచరింపవలెను. ఈ సంఘాచారములో సహోదర ప్రేమతో పాటు "ప్రభువును పూర్ణహృదయముతో ప్రేమించుట" అను ప్రధానమైన ఆజ్ఞ అంతర్లీనమైయున్నది. ప్రభువును చూచుచు ఆయనయొద్ద నేర్చుకొన్నయెడల మనకు నిజమైన విశ్రాంతి దొరుకును.
దేవుడు మనం చేయు ప్రతీ పనిలో తన జ్ఞానాత్మను దయచేయును గాక!
మన జీవితంలో నిజమైన విశ్రాంతితో కూడిన ప్రశాంతతను దయచేయును గాక! ఆమేన్.
వాక్యపరిశీలన
మత్తయి11:27. సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.
28. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.
29. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
నిన్నాయాసపెట్టెడి వార్త - విన్నా బెదరకున్నా శాంతి = నన్నా సమయమందున నీ - కన్ను చూచుచున్న విశ్రాంతి || మనో ||
Note: నిర్గమకాండం 20-31, ఈ 12 అద్యాయములు మోషే మరలా కొండమీదికి వెళ్ళినపుడు దేవుడు ఇశ్రాయేలు క్షేమం కొరకు ఏర్పరిచిన విధులు.
జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.
Social Presence
ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet