ఉపవాస అవసరత
మత్తయి. 6:1,16-18
ప్రార్ధన:
తండ్రీ! మరియొకమారు నీ ఉపవాసమును ధ్యానించుటకు కూడికొని యున్నాము. నీకొరకు సమయమును ప్రత్యేకించుకొని నీతో సహవాసమునందు గడుపుట, ఈలోక భాగ్యములన్నిటికంటె గొప్ప భాగ్యమైయున్నది. నీవు ఏలాగు దీక్షబూని ఉపవాసముతో ఉద్యోగములో ప్రవేశించినావో, ఆలాగే మేమును నీ సన్నిధిలో నీకొరకు దీక్షబూనుటకు నీ ఉపవాస వర్తమానమిమ్మని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్.
ఉపవాసము:- ఉదయము 6గం॥లకు మొదలుపెట్టి, సాయంకాలము 6 గం॥ల వరకు జరిగిస్తే 1/2గం॥వరకు ధ్యానము కుదురుతుంది. ఆ తరువాత కనిపెట్టే సమయములో చటుక్కున ఏదైనా ఓ చెడ్డతలంపు పుట్టగా, విసుగుకొంటు చతికిలపడెదరు. తమాయించుకొని తిరిగి క్రొత్తగా ఆరంభించవలెను. గాని ఈ మధ్య సమయము పోయింది గనుక సైతానే గెలిచాడు అని అనుకోకూడదు. గాని కష్టపడి తిరిగి ఆరంభించవలెను. యేసుప్రభువుకైతే, మనవలె ధ్యానముచేయుట, తిరిగిలేచుట అనేది లేదు. అంతగొప్ప ఉపవాసము మనము చేయలేము గనుక నావలె మీరు 40 దినముల ఉపవాసము చేయండని ప్రభువు చెప్పలేదు, ఆ విధముగా పత్రికలలోనైనను వ్రాయించలేదు. వ్రాసి ఉంటే చాలామంది చేసేయుందురు. అలాచేసి పిచ్చివారై, మతి చాంచల్యము గలిగి చనిపోయి యుందురు. సుందర్ సింగు భక్తుడైనను, త్యాగపురుషుడైనను, ప్రభువువలె 40 దినములు చేయలేకపోయినాడు, పడిపోయినాడు, చిక్కిపోయినాడు. దేవుని సెలవులేకుండా చేసేవారు కొన్నాళ్ళకు కృశించి తరువాత చనిపోవుదురు. ఉపవాసమెందుకు? బలము, జయము పొందుటకు.
యేనుప్రభువు చరిత్రలోని భాగములు:
- 1. బేత్లెహేములో జన్మించినాడు.
- 2. ఐగుప్తు వెళ్ళినాడు.
- 3. నజరేతులో 18సం॥లు పెరిగినాడు.
- 4. యెరూషలేము పండుగకు వచ్చినాడు.
- 5. యోర్ధాను నదిలో బాప్తిస్మ స్నానమునకు వెళ్ళినాడు.
- 6. అడవిలోకి శోధింపబడుటకు వెళ్ళినాడు.
"ఉద్యోగములో ప్రవేశించుటకు పూర్వము ఉపవాసము అవసరము. ఉపవాసము తర్వాత ఉద్యోగము. మత్తయిలో వ్రాయబడినట్లు ఆయన ఆత్మచేతకొనిపోబడెను. (సైతానుచే శోధింపబడుటకు) మనలో ఎవరును ప్రభువు చేసినట్లు, 40 దినములు ఉపవాసము చేయలేము గాన చేయరాదు. గాని అందుకొరకు ప్రార్ధన చేయవచ్చును, ఆక్షేపణలేదు. ఎందుకంటే "అడగండి, మీకియ్యబడునని ప్రభువు చెప్పినారు, గనుక ఉపవాసము చేయండి మీకివ్వబడునని ప్రభువు చెప్పలేదు. మీరు ఇంటిలోకి వెళ్లండి, తలువువేసికొండి, ప్రార్ధించండి" అన్నారు గాని ఉపవాసము చెప్పలేదు. ఉపవాసము చేయుమని ఇంకొకచోట చెప్పినారు. ఇంకొక సందర్భములో ప్రార్ధనకు స్వంత నడిపింపే, ఎంతకాలమైనను చేయవచ్చును. ఇష్టములేకపోయినను ఇష్టము పుట్టువరకు ప్రార్ధింపవచ్చును. దేవుని ప్రార్థింపవలసిన ఇష్టము పుట్టుకొలదీ, అక్కర కొలది, కష్టముకొలది ప్రార్ధన చేయమన్నారు గాని ఉపవాసము చేయమనలేదు.
ప్రార్ధన:-- 1) జ్ఞానమునుబట్టి,
- 2) మనస్సాక్షినిబట్టి,
- 3) అవసరమునుబట్టి ప్రార్ధన వచ్చును.
అపుడు ప్రార్థించాలనే ప్రేరేపణవచ్చును. ఆశ, ఆతురత కలుగును. ఇవే మనలను ప్రార్ధన గదిలోనికి నడిపించును. అవి నెరవేరితే సరి, అవి జరుగకపోతే దారి, అనగా ప్రార్ధనకు దారి త్వరగా రాదు. ఆశ ప్రార్ధించుటకే యుంటుంది. గాని నెరవేర్పు కొరకు కనిపెట్టువరకు ఉండదు. యేసుప్రభువు నా కొరకు
- 1) నడుము కట్టుకొని,
- 2) ఆకలి కట్టుకొని,
- 3) దాహము కట్టుకొని,
- 4) నిద్ర కట్టుకొని,
- 5) పని కట్టుకొని,
- 6) తల్లిదండ్రులకు సహాయము మాని; అరణ్యములో ఏకాంతముగా మృగములమధ్య, చీకటిలో, ఎండలో "సైతానువలన శోధనలో" ఉండెను. శోధింపబడెను.
ప్రభువునొక ప్రశ్న అడగండి. ప్రభువా! నా నిమిత్తమై నీవు 40 దినములు ఉపవాసములో ఉంటివి గదా! ఆ 40 దినములలో నీవు ఏ పని చేసితివి? ఆ పని దాని నిమిత్తమే గదా! మేము నీ ఎదుట ఉన్నది గనుక మాకు చెప్పుము.
షరా: న్తుతిలేనిదే ఏపనియు ఆరంభించరాదు. స్తుతి చేయనిదే ఏ పనియు ముగించరాదు.
దీవెన:
ఆలాగు పెండ్లికుమారుని ముఖభింబమును ఈ 40 దినములు చూచుచూ, భౌతికమైన తలంపులన్నియు కట్టిపెట్టి, పెండ్లికుమారుని దీక్షనే కల్గియుండు భాగ్యము ప్రభువు మీకు దయచేయునుగాక! ఆమేన్.