8. నిర్గమకాండ ధ్యానము

మోషేలోని క్రీస్తు పోలిక



నిర్గమ 3:8.

ప్రార్ధన:

తండ్రీ, బైబిలుమిషనును బయలుపర్చుకొన్న తండ్రీ! నీకు వందనములు. నీవు బయలుపరచుకొన్నావు గనుకనే అన్ని విపత్తులనుండి మమ్ములను సంరక్షించుచున్నావు, స్తోత్రములు. నీ సహవాసము మాతోను, మాలోను ఉంచుటకు నీవు దిగివచ్చినావు, నీ మిషనును దింపినావు గనుక నీ మిషను పిల్లలమైన మాకు నీ రూపము అద్దుటకు నీ వాక్యసందేశము అందించుమని యేసు నామమున వందించుచున్నాము ఆమేన్.


నిర్గమ ముఖ్యోద్దేశము 3:8లో ఉన్నది. దేవుడు తన ప్రజలను నడిపించుటకు పరలోకమునుండి దిగివచ్చెను. ఆ దిగివచ్చుట నేడుకూడ ఉన్నది. అనగా బైబిలుమిషనును నడిపించుటకు సన్నిధి కూటములలోనికి ఆయన దిగివస్తున్నారు. ఇశ్రాయేలీయులకు బైబిలుమిషనువారికి చాల సంబంధమున్నది. ఆదికాండములో మనిషి పడిపోవుట, నిర్గమకాండములో ప్రభువు దిగివచ్చి వారిని విడిపించుట (రక్షించుట) ఉన్నది. అనగా పాపఫలితములైన వ్యాధి, కరువు, అవమానము, మరణము, ఆఖరి శుత్రువైన నరకము - వీటినుండి విడిపించుట ఉన్నది. ఇందు దాసత్వము కనబడుచున్నది. తరువాత అరణ్యము అనే పాఠశాలలో వారికి విద్య నేర్చబడెను. ఈ పాఠశాలలో వారికి పదియాజ్ఞలను ఇచ్చి, ఏర్పాటు ప్రజలు ఎట్లు తమ ప్రవర్తనను కాపాడుకొనవలెనో, పాలుతేనెలు ప్రవహించు దేశములో ఎట్లు దేవునికి అనుకూలముగా నివసింపవలెనో ఆ తర్ఫీదును ఇచ్చెను.


మోషే దర్శనము:- మండుచున్న పొద. పొద అనగా ఇశ్రాయేలీయులు, అగ్నిజ్వాల అనగా ఫరో వారిని పెట్టుచున్న శ్రమలు, అగ్నికి పొదకాలలేదు. అలాగే ఇశ్రాయేలీయులు కూడా ఫరోయొక్క శ్రమలకు నాశనము కాలేదు. దేవుడు ఇశ్రాయేలీయులకు పదియాజ్ఞలే కాకుండా అర్పణలు, యాజకులు, దేవుని గుడారము మొదలగు వాటిని అనుగ్రహించెను. ఇవన్నియు వారు దేవునియొద్దనుండి పొంది, వారు ఎంతో గౌరవముతో 'ఆమెన్' అని జవాబిచ్చుచుండిరి. వారు నడచుట బహుకష్టము గనుక ఒక్కొక్కప్పుడు వారు మోషే అహరోనులమీద, దేవునిమీదకూడ సణుగుకొనుచుండెడివారు. (దేవాలయములో సేవచేయుట, ఆరాధనచేయుట నిర్గమకాండములోనే ప్రారంభమాయెను). ఆజ్ఞలు, అర్పణలు, గుడారములో సేవ ఇవన్నియు దేవునికిని, విశ్వాసికిని ఉన్న సంబంధమును తెలియజేయును. దేవుడు ఏర్పరచిన పద్ధతి ప్రకారము ఆరాధించవలెను గాని వారి స్వంత పద్ధతులు పనికిరావు. దేవునియొక్క పద్ధతులలో మనిషియొక పద్దతులు పెట్టుట చాలా అపాయకరము. విమోచింపబడినవారు ప్రతి నిత్యము శుద్ధి అగుచుండవలెను.


యాకోబు ఐగుప్తుకు వెళ్ళినప్పటినుండి శ్రమలు ప్రారంభమైనప్పటికి 115సం॥లు కాలముపట్టెను. ఇప్పటివరకును అబ్రాహాముయొక్క నిబంధన యూదులు కలిగియున్నారు. అయితే ఈ నిర్గమ కాండములో జనాంగమంతటితోను దేవుడు తన నిబంధన ఏర్చరచెను.

దేవుడే దిగివచ్చుట:

  • 1. ఆయన మన పాపదాసత్వమునుండి విడిపించుటకు దిగివచ్చును.
  • 2. ఆయనే మనకు బోధించును.
  • 3. ఆయనే తన కార్యక్రమమును మనచేత చేయించును.
  • 4. ఆయనే మన మధ్యకు వచ్చును.
  • 5. ఆయనే మనలో నివసించును.

ఆదికాండములో యేసుప్రభువు చరిత్ర రక్షణ వాగ్ధానముగా నున్నది. యేసుప్రభువు పుట్టుక ఆదికాండములో కలదు. నిర్గమలో ఆయన దిగివచ్చి మనుష్యులతో నివసించే చరిత్ర ఉన్నది. ప్రత్యక్షపు గుడారములో మేఘరూపముగా యేసుప్రభువు నివసించి ఇశ్రాయేలీయులను నడిపించెను. ఆలాగు ఇప్పుడు సంఘమును నడిపించును.


మోషే క్రీస్తుప్రభువు
1. ఇశ్రాయేలీయుల విమోచకుడు. మానవులందరియొక్క విమోచకుడు
2. శిశువులను వధించుట కలదు. యేసుప్రభువు పుట్టినప్పుడు శిశువధ కలదు.
3. భార్య అన్యురాలు. పెండ్లికుమార్తె అన్యులందు కలదు.
4. మోషే గొప్ప ఉపాధ్యాయుడు. యేసుప్రభువు మహామహోపాధ్యాయుడు.
5. పదియాజ్ఞలు, ధర్మశాస్త్రము తెచ్చెను. కొండ ప్రసంగములో ధర్మశాస్త్రమునకు బదులు కృపాశాస్త్రమును ప్రభువు తెచ్చెను.

బైబిలులోని ఉపాధ్యాయులందరిలో మోషే గొప్పవాడు. ఈయన గ్రంథములు బైబిలు అంతటికి మూలాధారము. దావీదు తన సైన్యమువలన రాజము సంపాదించెను గాని మోషే బోధకుడైయుండి అన్ని నిందలు సహించి, ప్రజలను నడిపించుకొనివచ్చెను. మోషే దేవునివలన తయారు చేయబడిన బోధకుడు, నాయకుడు, పంతులుగారు, ప్రభువు చెప్పగా నేర్చుకొన్నవాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు. ఇప్పుడుకూడా ఆస్థితి చాలామంది కలిగియుండవలెను. దేవునిచే దాచబడిన మనిషి అనగా బాలుడుగా నున్నప్పుడు దాచబడెను. ఫరోనుండి పారిపోయినప్పుడు దాచబడెను. చనిపోయిన తర్వాత తన శవముకూడ కనబడకుండా దాచబడెను.

  • 1. శిశువుగా ఉన్నప్పుడు ఫరో ఇంటిలోనే దాచబడెను.
  • 2. ఐగుప్తీయుని చంపినప్పుడుకూడా దాచబడెను.
  • 3. ఆయన శవముకూడ దాచబడెను.

దీవెన:

ఆలాగు మోషేవలె అన్ని స్థితులలో దాచబడి, ప్రాణ ప్రియుడైన క్రీస్తు ప్రభువునకు మహిమ తెచ్చు మహామహోపాధ్యాయులుగా పెండ్లికుమారుడు మిమ్ములను స్థిరపరచి, మీచేత బలమైన కార్యములు జరిగించి, తన మహిమ రాకడకు ఆయత్త పర్చుకొనునుగాక ఆమేన్.