9. నిర్గమకాండ ధ్యానము

దేవుని కర్ర - మోషే కర్ర



నిర్గమకాండము 4: 1 - 7.

ప్రార్ధన:

ఓ దయగల తండ్రీ! నీ వాక్యము ఎంత విలువైనదో మేము గ్రహించలేము. మేము పరలోకము వచ్చినప్పుడు దాని విలువ తెలిసికొని విచారింతుము. దేవదూతలు చదువవలసిన వాక్యము పాపులమైన మాకు అనుగ్రహించావు గనుక స్తోత్రము. అద్భుతములు కలిగించే నీ వాక్యమును ఎవరు చదువుదురో, అది వారిలో మెదలుచు, కదలుచు, అదరగొట్టుచు, ఆదరించుచునే యుండును. ఇట్టి గొప్ప వాక్యము మాకు అనుగ్రహించిన నీకు స్తోత్రములు. నీ గ్రంథములోని ప్రతి పుటలో నీ ప్రేమ, నీ సర్వ సద్గుణముల వెలుగు కనిపించును. బజారులలో, మేఘములలో ఎక్కడా దొరకని నీ వాక్యము, మా పాపపు చేతులకు అందించినావు. వానచుక్క గొప్పది అనుకొన్నాము. ఎండయే గొప్పది అనుకొన్నాము. వీటిని కలిగించినది నీ వాక్యమే గనుక ఆ నీ వాక్యమే వీటన్నిటికంటె గొప్పది. ఔషధమే గొప్పది అనుకొన్నాము. కానీ ఆ మందును కల్గించినది నీ వాక్యము. గనుక ఆ నీ గొప్ప వాక్యమును మేము కళ్ళను అద్దుకొనవలసినది, చదువవలసినది. లోకములోయున్న అన్నిటికంటె నీ వాక్యము గొప్పది అనే గ్రహింపు మాకు దయచేయుముని ప్రార్దించుచున్నాము. ఆమేన్.


మోషే చేతిలోనిది గొల్ల కర్ర. ప్రభువు మోషేను నీ చేతిలోనిది ఏమిటని అడిగెను. ఎందుకనగా తన చేతిలోనిది ఏమిటో మోషే ఆలోచించుకొనుటకు అడిగెను. అలాగు అడుగుటవలన మోషేయొక్క ఆలోచన దేనిమీదికి వెళ్ళును అనగా

  • 1) కర్ర,
  • 2) గొల్ల కర్ర,
  • 3) ఉద్యోగము (వృత్తి)

ఇవన్నీ జ్ఞాపకమునకు వచ్చెను. "కర్రను నేలను పడవేయమని" దేవుడు చెప్పగా, దేవుడు తనకు ఏదో చెబుతాడు కాబోలు అనుకొనెను. కర్ర క్రింద పారవేయగా పాము అయ్యెను. అప్పుడు మోషే దూరముగా పారిపోయెను. దేవుడు మోషేను పాము తోక పట్టుకొనుమనెను. దేవుడు

  • (1) నీ చేతిలోనిది ఏమిటి అని అడిగెను.
  • (2) కర్ర క్రింద వేయుమనెను.
  • (3) తోక పట్టుకొనుమనెను.

ఈలాగు దేవుడు మోషేను తన తట్టు త్రిప్పుకొనెను. తన మాటలవైపు త్రిప్పుకొనెను. దేవుడు తన సేవకులకు మొదట సులభమైన పని చెప్పును. రానురాను కష్టమైన పని చెప్పును. మోషేకు 40 సం॥లనుండి నెలవైన (అలవాటైన) కర్రయే అది. గాని పాముగా మారగానే భయపడి పారిపోయెను.


మోషేకు ఫరో, మొదట కర్రవలెనే యుండెను. 40 సం॥ల తరువాత పామువంటి వాడాయెను. అందువలన మోషే పారిపోయెను. మరలా ఫరో కర్రవంటి వాడాయెను. అనగా 6లక్షల మందిని సులభంగా తీసికొని పోయెను. తోకపట్టుకొనుమని దేవుడు చెప్పగానే మోషే సందేహించక తోక పట్టుకొనెను. దీనిలో మోషేయొక్క గొప్ప విశ్వాసము కనబడుచున్నది. ఐగుప్తులో జరగవలసిన కధంతా మోషేకు మిద్యానులో కనిపించెను. మోషే పాము తోక పట్టుకొనమనగానే పట్టుకొనెను. కాని ఐగుప్తుకు వెళ్ళమనగా అనేక సాకులు చెప్పెను. అలాగే దేవుని సేవకులు కొన్ని పనులు చెప్పగానే చేయుదురు. కొన్ని చేయరు. ఇది వారి లోపము. ఫరో మిక్కిలి కఠినుడు. చివరకు కర్రవంటి వాడాయెను. ఎర్ర సముద్రము దగ్గర ఎదురైన కష్టము పామువంటిది. అరణ్యములో నీరు చేదుగానున్నప్పుడు ఆకు వేయగానే రుచిగా నుండెను. మాంసములేదని సణిగినపుడు ఇదియు పామువంటి కష్టము. అన్నియు చేతిలోని కర్రవలె అగును.


మోషేకు ఇకముందుకు రాబోవు కష్టములను కర్రవలె సుళువుగా పోవునని గ్రహించుటకు ముంగుర్తుగా పాము అద్భుతము దేవుడు జరిగించెను. ఎన్ని శ్రమలో అవి అన్ని పాములవంటివి. ఎన్ని పర్యాయములు దేవుడు వాటిని తప్పించెనో అవి అన్ని కర్రలు వంటివి. మనము వేటేటికి భయపడుచున్నామో, వాటినన్నిటిని ప్రభువు కర్రవలె చేయును. ఈ గొప్ప పాఠము దేవుడు మోషేకు నేర్పెను. మనము మన శ్రమలను లోకువకట్టి వాటిని పట్టుకొంటేనే అవి కర్రగా మారును భయపడేటప్పుడు పాము కర్రగా మారదు. భయపడనపుడే పాము కర్రగా మారెను.


ఇదివరకు ఇశ్రాయేలీయులు ఇటుకలు కట్టుటకు గడ్డి ఇచ్చుచుండిరి. అప్పుడు మోషే ఇశ్రాయేలీయులకు బలి అర్పించుటకు 3 దినములు సెలవు ఇయ్యమనగా అప్పటినుండి ఫరో గడ్డి ఇచ్చుటమాని ఇటుకలు మాత్రం లెక్క ప్రకారం ఇయ్యమనుచుండెను. ఇశ్రాయేలీయుల పెద్దలు వారికష్టములు రాజుతో వివరించగా రాజు వినలేదు కాని పెద్దలకు మాత్రం మోషే అహరోనులమీద కోపము ఎక్కువయ్యెను. అప్పుడు వారేమన్నారంటే

  • 1) దేవుడు మీకు తీర్పుతీర్చునుగాక
  • 2) మమ్మును అసహ్యులుగా చేసితిరి.
  • ౩) ఫరోచేతికి కత్తి ఇచ్చితిరి.
  • 4) మమ్మును శ్రమపెట్టు నిమిత్తము ఇవన్నీ చేసారు.

మరియు ఇంకా ఏమన్నారంటే వీరికి

  • (1) దేవుడు కనబడలేదు.
  • (2) వీరికి దేవుడు చెప్పమనలేదు.
  • (3) వీరిని దేవుడు పంపలేదు.
  • (4) వీరికి అద్భుతములు లేవు.
  • (5) రోగులను బాగుచేయుట వట్టిదే.

ఇది పూర్వపు భాషకాదు. మొదట మోషే మాటలు వినగానే వారికి చాలా సంతోషము ఆయెను. ఇప్పుడు కష్టం రాగానే భాషమారెను. (అనగా అభిప్రాయము మారెను).


పొదలో ప్రభువు చెప్పిన మాటలు:

  • (1) ఇశ్రాయేలీయులు నీ మాట వింటారు.
  • (2) ఫరో వినడు.
  • (3) చివరకు ఫరో నీ మాట వినేటట్లు చేస్తాను.
  • (4) స్త్రీలకు నీయందు కటాక్షం కలుగ చేసి నగలు ఇచ్చేటట్లు చేస్తాను.

ఇవన్ని మోషేకు ప్రభువు చెప్పెను. ఇప్పుడు ప్రజలు వలన మోషే, అహరోనులు నిందించబడిరి. ఇప్పుడు వారి మనసు ఎట్లుండెను? మోషేకు ఇప్పుడు తానుచేసిన అద్భుతములను గూర్చి సందేహము పుట్టుటకు వీలున్నది. ఈ కథే లోకాంతము వరకు విశ్వాసులకు జరుగును. కాని చివరకు జయము విశ్వాసులదే! ఎలాగు అంటే ఇశ్రాయేలీయులకు సెలవు, నగలు మొదలగునవి దొరికినట్లు. ఇదంతా చూసి మోషే ప్రభువు తట్టు తిరిగి ప్రార్ధన చేసెను. 'ఇదంతా ఏమిటి ప్రభువా! నన్నెందుకు విలిచితివి. ఈ ప్రజలకు ఎందుకు కీడు చేసితివి' అని ఈ ప్రకారంగా ప్రార్ధన చేసెను. దానికి దేవుడిచ్చిన జవాబు: 'ఫరోకు నేను ఏమి చేస్తానో నీవు చూస్తావు, బలవంతముగా అతను ప్రజలను పోనిచ్చును. అనగా మనసు మారదు కాని క్రియ మాత్రము జరుగును. బలవంతంగా పోనిచ్చును అనగా తోలివేయును!. త్వరగా వెళ్ళకపోతే తోలివేయుట జరుగును. "నేను యెహోవాను" అనుపేరు, ఈ క్రొత్తపేరు మోషేకు కష్టము వచ్చిన తరువాత బైలుపడెను. ఫరో దృష్టికి "మోషే దేవుని వలన పంపబడినవాడు కాదు. ఇశ్రాయేలీయులు దేవుడు ఏర్పాటు చేసిన జనాంగము కాదు" అనివారు అనుకొనిరి. వారికి అలాగు అనిపించినది. కాని అది నిజముకాదు. నిర్గమ. 3:2 యెహోవాదూత వారికి ప్రత్యక్షమయ్యెను. మోషే ఆ తట్టుకు రావడము యెహోవా చూచెను. దేవుడు పొదమధ్యనుండి మోషేను పిలిచెను. యెహోవాదూత అనగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. త్రియేక దేవుని రూపములో ఆయన మోషేకు మొదటగా కనబడిరి.


దీవెన:

ఆలాగు పెండ్లికుమారుని దర్శనభాగ్యము పొంది ఆయన చేతిలోని బలమైన సాధనములుగా నేటిదినధ్యానము ద్వారా మీరు సిద్ధపరచబడుదురు గాక! ఆమేన్.