అంతరంగ ఆభరణములు
నిర్గమ 11:1-3.
ప్రార్ధన:
తండ్రీ! మమ్మును లోకములోనుండి, పాపమునుండి, సైతాను నుండి తప్పించుచున్న తండ్రీ! నీకు వందనములు. పిశాచి శోధననే మాకు అనుభవ అంతస్థుగా మార్చిన పరమజనకా! నీకు నమస్కారములు. మాకు ఈలోకములో కలిగే ప్రతి శ్రమను మా అంతరంగములకు అనుభవ-హారముగా వేయుటకు నేటిదినము మాతో మాట్లాడుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్.
- ఐగుప్తీయుల -- 1. వెండినగలు, 2. బంగారు ఆభరణములు;
- ఇశ్రాయేలీయులు -- 1. అడుగుట, 2. తీనికొనుట చేసిరి. అందుకు
- దేవుడు -- 1. కటాక్షము, 2. చొరవ కలిగించెను.
వెండి, బంగారము, వస్త్రములు, ఇంకను తమకు కావలసినవి అన్నియు ఇశ్రాయేలీయులు, ఐగుప్తీయులనుండి దోపుడుగా తీసికొనిరి.
దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పినది ఏమనగా, ఐగుప్తీయులను వెండి, బంగారు నగలను అడిగి తీసికొనుడి. గాని ఇశ్రాయేలీయులు ఆ రెండుగాక వస్త్రములు, ఇతర వస్తువులనుకూడ అడిగిరి. అది వారి గడుసుతనము. అంతకు పూర్వము ఇశ్రాయేలీయులు గొప్ప మొర్రపెట్టిరి. అందువలన వారికి విడుదల, అంతకుపూర్వము హింసలు కలిగినవి. ఐగుప్తీయులకు, ఇశ్రాయేలీయులయెడల కటాక్షము ఎప్పుడు కలిగినది?
- 1) శోధన
- 2) బానిసత్వము
- 3) కష్టాలు అనుభవించిన తరువాత.
ప్రతిరోజు మనకు కలిగే శోధనలలో సుళువుగా పాపములో పడిపోవుట ఉన్నది. గనుక పిశాచి నన్ను శోధించుట, నేను పడుట ఇదేమి బాగాలేదు. "ప్రభువా! మమ్మును త్వరగా నూతన యెరూషలేమునకు తీసికొని వెళ్ళుము. మా బ్రతుకంతా పిశాచికి బానిసత్వమువలెనున్నది. గనుక త్వరగా రమ్ము ప్రభువా!" అని ప్రార్ధన చేయవలెను. (మనకిష్టములేని పాపము చేయుటను గూర్చి పై విధముగా ప్రార్ధించవలెను).
మా కష్టములనుండి తప్పించు ప్రభువా! త్వరగా రమ్ము. బానిసత్వమునుండి మనము విడుదల పొందుటకు ఇపుడు ప్రభువు రావలెను. స్త్రీలను సాధారణముగా నగలు అడుగరు, వారు ఇయ్యరు. ఏవి ఇయ్యరో అవే దేవుడు వారికిప్పించెను.
"ఇశ్రాయేలీయులు మరలా రారు" అని తెలిసియుండియు, ఐగుప్తీయులు వారిమీదగల ప్రేమచేత నగలు ఇచ్చిరి. పెండ్లికుమార్తె ఇక్కడుండగానే ఆత్మీయ నగలు ధరించుకొనవలెను. ఇక్కడే సిద్ధపడవలెను. ఇశ్రాయేలీయులు నిజముగా వారిని దోచివేయలేదు గాని ప్రజలే ఇచ్చివేసిరి. ఇది ఒకరకమైన దోపిడి.
- 1) నిజముగా మనము పెండ్లికుమార్తె వరుసలో వెళ్ళవలెనంటే మనకి అక్కడకు వెళ్ళుటకు అవసరమైనవన్నియు ఈలోకములోనే అవసరమైనవన్నియు ప్రభువు అనుగ్రహించును. ఆలోకమునకు తగినవి ఇక్కడే ఇచ్చును. ఇశ్రాయేలీయులు తమతో తెచ్చుకొనిన వెండి బంగారు నగలు, వారు అరణ్యములో డేరా వేసినపుడు ఆ దేవాలయములో అవసరమైన పాత్రలకు; ప్రధాన యాజకుడు తాను ధరించుకొనిన పతకమునకు; దేవాలయమునందలి సామానులకు వాడుకొనిరి.
- 2) దావీదు యుద్ధములు చేసి, అన్యరాజులను ఓడించి, వెండి బంగారములను తెచ్చి ఆ బంగారమును పరిశుద్ధ దేవాలయమును కట్టుటకు దానిలోని సామానులకు ఉపయోగించెను. సొలొమోను ఆ పనిని పూర్తిచేసెను.
- 3) సౌలు, అన్యుడు. దేవుని సంఘమును పాడుచేయువాడు. అయినను దేవుడు అతనిని పట్టుకొని, దేవుని సంఘమును బాగుచేయుటకు వాడుకొనెను.
- 4) దేవాలయములోని ప్రతివారిలోను పాపములున్నవి. అనగా పిశాచికి సంబంధించినవి మనకు కలవు గనుక ఈ స్థితిలో మనము నూతన యెరూషలేమునకు తగము. అయినను ప్రభువు మనలను ఇట్టి వాటినుండి విడిపించి, నూతన యెరూషలేమునకు తీసికొని వెళ్ళగలదు.
వారు తమ నగలు ఇచ్చినప్పుడే దేవుడు వారిని వాడుకొన్నాడు. ఆలాగే మన హృదయములను దేవుని కిచ్చినప్పుడే మనలను వాడుకొనగలడు. "తండ్రీ! అన్యజనుల బంగారమును, నీవు వాడుకొన్నావు. నీ సంఘమును హింసించినవానిని నీవు వాడుకొన్నావు. గనుక లోపములు గల నన్నుకూడా నీవు శుద్ధిచేసి వాడుకొనుము" అని ప్రార్ధించవలెను.
- శోధనలు మూడు రకములు. దాని విరుగుడు దైవసన్నిధియే.
- (1) శరీరము,
- (2) లోకము,
- (3) సాతాను.
వీటన్నిటికంటె శరీర శోధనయే గొప్పది. ఈ మూడు రకములైన శోధనలు మనకు వచ్చినపుడు వాటికి వ్యతిరేకమైనవి మనము చేయవలెను. సిరాపడితే నీళ్ళుపోసి కడుగవలెను. చెత్త ఉంటే చీపురుతో తుడవవలెను. చిల్లి ఉంటే మాటువేయవలెను. శరీర శోధనకు శరీరమే కావలెను. ప్రభు శరీరము కావలెను. ప్రభు భోజన సంస్కారము పుచ్చుకొననివారు, శరీర శోధనలను జయించలేరు. గనుక
- 1) తరచుగా మనము దీనిని ఆచరించవలెను.
- 2) లోకములో నున్నాము. లోకమువల్ల శోధన వచ్చినప్పుడు, పరలోక పరిశుద్ధుల సహవానము మనకు అవసరము. వారితో సహవాసము చేయవలెను.
- 3) సాతానువలన కలిగే శోధనను జయించుటకు పరిశుద్దాత్మను పొందవలెను.
- 4) శ్రమలు, వీటిని సహించుకొనుటవల్ల జయము కలుగును.
మన శ్రమలన్నిటిని ప్రభువు సిలువపై వేయవలెను. యాకోబు 1:12. శోధనలను, శ్రమలను ,సహించువారెవరో వారు నూతన యెరూషలేములో ఒక ఆభరణముగానుందురు.
దీవెన:
ఆలాగు పెండ్లికుమారునికి విలువైన ఆభరణములుగా ఉండు ధన్యత నేటిదిన ధ్యానము ద్వారా ప్రభువు మీకు దయచేయునుగాక! ఆమేన్.