11. నిర్గమకాండ ధ్యానము

ఫరో కఠినత్వము - దేవుని కృప



నిర్గమ. 7:1-24

ప్రార్ధన:

తండ్రీ! నోటిమాంద్యము కలిగిన మోషేను, మాటనేర్పరిగా చేసినావు, వందనములు. ప్రాణభితితో ఎవరి ఎదుటినుండి మోషే పారిపోయినాడో ఆ ఫరోకే ఆయనను దేవునిగా నియమించినావు. ఇక్కడ చేరిన అయోగ్యులమైన మా విషయములోను నీ ఏర్పాటులు అంత గంభీరమైయున్నవి గనుక నీ శక్తిని మా జీవితములో కనుపర్చుటకు వర్తమానమిమ్మని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్.


ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీయులకు హెబ్రీయులని పేరు. ఈ పేరుతో అన్యులు ఇశ్రాయేలీయులను పిలిచిరి. మోషే అహరోనులు వెళ్ళి ఫరోతో ఇశ్రాయేలీయులను పంపివేయవలెనని చెప్పవలెను. దేవుడు మోషేతో చెప్పినది. నిన్ను నేను ఫరోకు దేవుడుగా నియమించియున్నాను. నీ అన్నను నీకు ప్రవక్తగా నియమించియున్నాను. నేను చెప్పవలసినది అంతయు నీవు ఫరోతో చెప్పవలెను. ఇంక ఏమి చెప్పెననగా,

  • (1) నేను నా చేయి చాపుదును,
  • (2) ఫరోను కఠినపరుస్తాను,
  • (3) సూచక క్రియలను, మహత్మార్యములను విస్తరింపచేస్తాను.
  • (4) నేను దేవుడనని ఐగుప్తీయులు తెలిసికొందురు.
  • 1) కర్ర పాముగా మారుట,
  • 2) నీళ్ళు రక్తముగా మారుట. ఈ అద్భుతములు మోషే అహరోనులు చేసిరి.

ఐగప్తు మంత్రగాళ్ళుకూడా "నేనే దేవుడైయున్నానని ఫరో తెలిసికొనవలెను, ఐగుప్తీయులు తెలిసికొనవలెను, ఇశ్రాయేలీయులు తెలిసికొనవలెను" అనునది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఇదివరకు ఐగుప్తీయులును, ఫరోయు; 'హెబ్రీయుల దేవుడు' అనేమాట వాడుచువచ్చిరి. కనుకనే ఆయన ఇక్కడ "నేను హెబ్రీయుల దేవుడనేకాదు, నేనే అందరికి దేవుడైయున్నానని" బైలుపరచుకొనెను. ఆ ప్రకారమే మోషేతో చెప్పెను. ఇదివరకు ఐగుప్తీయులు మా ఫరోవంటి బలవంతుడు లేడనుకొనుచుండిరి. దేవుడు సర్వశక్తిగలవాడని అన్యులు, ఇశ్రాయేలీయులు తెలిసికొనునట్లు ఇప్పుడు సర్వజనులును తెలిసికొనవలెను.

  • 1. ఫరోకు దేవతలు మొదలైనవి ఉన్నవి, వాటి సంగతులే తెలుసును గనుక దేవునియొక్క సంగతులు మోషే ఫరోకు తెలియచెప్పెను. కనుక మోషే ఫరోకు దేవునివలెయున్నాడు. మనము అన్యులకు దేవునివాక్యం బోధించునపుడు వారికి మనము ఒకవిధముగా దేవుళ్ళుగా కనిపించుదుము.
  • 2. మొదటి రెండు అద్భుతములను చూచి ఫరో నమ్మలేదు, అంగీకరించలేదు కనుక దేవుడు అతని హృదయమును కఠినపరచెను. అతని హృదయమును కొంచెము కఠినము చేసికొన్నాడు. గనుక దేవుడు అతని హృదయమును కఠినపరచెను. మన హృదయము కొంచెం మెత్తగాయుంటే దేవుడు ఇంకా మెత్తగాచేయును. మనం కొంచెము ఫలిస్తే దేవుడు ఇంకా ఫలింపచేయును. ఫరో దేవుని అద్భుతములు చూచేకొలది కఠినమాయెను.

ఉదా:- రేగడిమట్టి మీద నీళ్ళు పోసిన కొలది బిగుసుకుపోవును. శిక్షను ఒక కృపవలె, దేవుడు ఫరోకు చూపెను. 10 అద్భుతములు సంపూర్ణమైన కృప గనుక 11వ అద్భుతము అవసరములేదు.


ఉదా: ప్రభువు యూదాతో నీవు ఏమిచేయదలచు కొన్నావో త్వరగా చేయుమనెను. ఫరోను కఠినపరచుట. యూదాతో ఈ మాట చెప్పుట ఈ రెండును ఒకలాగేయున్నవి. ఎందుకనగా యూదా ప్లాన్ అంతా ప్రభువుకు తెలుసును. పాతనిబంధనలో మధ్యవర్తి మోషే. క్రొత్తనిబంధనలో మధ్యవర్తి క్రీస్తు. మోషే చేతిలో ధర్మశాస్త్రం కలదు. క్రీస్తువారి చేతిలో కృపాశాస్తము ఉన్నది. మోషే (లా) అంతా అనగా ధర్మశాస్త్రము అంతా కఠినము. మోషే నీళ్ళు రక్తముగా చేసెను, కఠినము; క్రీస్తువారు నీళ్ళను ద్రాక్షారసముగా చేసెను.


కృప రమ్యమైనది, ధర్మశాస్త్రము కఠినమైనది. కృప ద్రాక్షారసమువలె రుచికలిగినది. ధర్మశాస్త్రము రక్తమువలె భయంకరమైనది, చూచుటకు అసహ్యంగా నుండును. కృప విస్తరించినది. మనము పాపమునందు నిలచియుండరాదని పౌలు చెప్పుచున్నాడు. మోషేది బోధనా ప్రమాణం అనగా న్యాయశాస్త్రం. క్రీస్తువారిది కృపాప్రమాణం అనగా కృపాశాస్త్రము. దేవుడు మోషేతో దేవుడు తాను చెప్పినది యావత్తూ ఐగుప్తీయులకు, ఫరోకు చెప్పుమనెను. కనుక మనమును ఇతరులకు దైవకార్యములు పూర్తిగా చెప్పవలెను. మొదటినుండి చివరివరకు చెప్పవలెను.

  • 1) దేవుడు ఏమిచేస్తాడా అని ఆ పని సైతాను చేయును
  • 2) దేవుని సేవకులు ఏ పని చేస్తారో అదేపని సైతాను సేవకులు చేస్తారు. దేవుని పని ఎటువంటిదైయుండునో అట్టిదే సైతాను పనికూడా చేయుటకు ప్రయత్నించును.

నీళ్ళు, రక్తము, కర్ర మొదలైనవి. కర్రపడవేయుట దేవుని సేవకుల పని. పాముగా మార్చుట దేవుని పని. అలాగే మంత్రగాళ్ళు కర్రను పడవేయుట, కర్రపాముగా అగుట సైతానువలన జరుగును. దేవుడే సృష్టికర్త అని ఇంతవరకు మనము నేర్చుకొన్నాము. ఇప్పుడు ఈ అద్భుతములనుబట్టి చూడగా సైతానుకూడా సృష్టికర్త అని తెలుస్తుంది. పాపమునకు సృష్టికర్త ఎవరు సైతాను. దేవుడు సృజించినపుడు పాపములేదు. సైతాను ఉద్దేశ్యం ఏమంటే దేవుడు చేసిన పనిని నీరసింపజేయుట, ప్రజలను తన తట్టు తిప్పుకొనుట. సైతానుకూడా సృష్టించేవాడని ప్రకటనలోయున్నది. వాడు దేనికి సృష్టికర్త? పాపమునకు పాపఫలితమునకు అనగా జబ్బు, మరణం, నరకం మొ॥వి ఇదంతా చెడుగు. అక్కడ ఐగుప్తు మంత్రజ్ఞులు పామును చేయుట చెడుగుకాదు కాని వారి ఉద్దేశ్యం చెడుగు అగును. దేవుని ఉద్దేశ్యం తెలుసును గనుక మోషే పాము ఆ పాములను మింగివేసెను. వస్తువులో తప్పులేదుగాని ఉద్దేశ్యములో తప్పుకలదు. అలాగే రాళ్ళను రొట్టెలు చేసికొమ్మని సైతాను ప్రభువుతో చెప్పినమాటలలో చెడ్డ ఉద్దేశం కలదు. వస్తువులలోకాదు.


క్రీస్తు మతము ఒక్కటే ప్రకటన మతము. యూదా, హిందూ మతములు అట్లుకావు. గాని హిందూ మతములో బ్రహ్మ సమాజము, మరికొన్ని సమాజములు ఇప్పుడు ప్రకటన మతములుగా యుంటున్నవి. కాని భక్తిలో తేడాకలదు. దైవశక్తి గొప్పది. ఈ 7వ అధ్యాయములో అదే చూస్తున్నాము. ఈ 7వ అధ్యాయము తాత్పర్యము కనపరచే అధ్యాయము. దేవుని ప్రణాళిక ఏదనగా, మనుష్యులను రక్షించుట, సాతానును నాశనం చేయుట; వాడు చేసేది దేవుని పని నీరసింపజేయుటకును, సాతాను పనిని గొప్పదిగా కనపరచుటకును. పిశాచి దేవుని పనిని ఇమిటేట్ చేయును (అనగా అనుకరించును) గాని దాని పనికి గొప్ప తీర్పు వచ్చును. గనుక మన కనుదృష్టి ఎల్లపుడు దేవునివైపే ఉండవలెను.


దీవెన:

ఆలాగు దేవుని ఉద్దేశ్యములను గ్రహించి, దైవకార్యక్రమములో పాలుపొందు ధన్యత పెండ్లికుమారుడు మీకు దయచేయునుగాక! ఆమేన్.