4. నిర్గమకాండ ధ్యానము

దేవుని గట్టిగా పట్టుకొనుట



హెబ్రీ. 4:14

ప్రార్ధన:-

తండ్రీ! మేము నీ బిడ్డలమై ఉన్నాము. నీవు మా తండ్రివై ఉన్నావు. మమ్మును నీలో ఐక్యపరచుకొనుటకు మీరేలాగు రక్షణ దీక్షను కలిగి ఉన్నారో, అలాగు మీలో నిలచి ఉంచుటకు కావలసిన పట్టుదలను, ప్రార్ధనా దీక్షను కలిగించుము. నీ చిత్తమును మా విషయములో సంపూర్ణముగా నెరవేర్చుమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్.


మోషే చరిత్ర అంతటిలో మనకు కనబడే ముఖ్య అంశము "గట్టిగా పట్టుకొనుట".

  • హెబ్రీ 4:14 మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము.

  • హెబ్రీ 10:23 మనము ఒప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకొందము. విశ్వాసమును గట్టిగా పట్టుకొనవలెను.

  • తిమోతి 3:9 విశ్వాస మర్మము గైకొనుట అనగా పట్టుకొనుట; దేవుని వాక్యమును గట్టిగా పట్టుకొనుడి. ఎదురాడేవారిని ఖండించుటకు శక్తికావలెను, అందుకు బోధన గట్టిగా యుండవలెను, హితవాక్య ప్రమాణమును గైకొనుము.

  • తీతు. 2:7 సత్ క్రియలయందు నిలచియుండుము.

  • హెబ్రీ 3:6 ప్రకారము ధైర్యమును, సంతోషమును చేపట్టుకొనవలెను. ధైర్యము విడిచిపెట్టవద్దు.

  • 1థెస్స. 5:15 ఎడతెగక ప్రార్ధన చేయుడి అనగా ప్రార్ధన అలవాటు మానవద్దు.

  • 1థెస్స. 5:22 కీడుకు దూరముగా యుండుడి. ఏది తప్పో అది మానినారు గనుక తుదవరకు అలాగే ఉండనియ్యుడి.

  • సామె. 4:16 కొందరు కీడుచెయ్యనిదే నిద్రించరు. నీవు అలాగు చేయవద్దు. ఒక్క పట్టుమీదనేయుండుము.

  • ప్రక.2:25 నేను వచ్చువరకు మీకు కలిగియున్న దానిని గట్టిగా పట్టుకొనుడి.

  • ప్రకటన 2:13 నానామమును గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును.


క్రైస్తవులనగా ఎట్టివారు?

  • 1) దేవుని బిడ్డలు (పరలోక బంధుత్వమునుబట్టి)

  • 2) శిష్యులు (జ్ఞానమునుబట్టి అనగా బైబిలులోని సంగతులు బాగా తెలుసుకొనుటనుబట్టి).

  • 3) ఉప్పుసారము కలిగియుండువారు. అనగా ఈ సంగతులన్ని సారముగలవని సంతోషించువారు.

  • 4) యాత్రికులు అనగా లోకములో కలిగిన వృద్ధినిబట్టి లోకాశవైపు చూడనివారు.

  • 5) వెలుగు సంబంధులు అనగా క్రీస్తు వెలుగును వ్యాపింపచేయువారు. గనుక మీకు తెలిసినది మీలో దాచుకొనకూడదు అందరికి తెలియజేయవలెను, వెల్లడిచేయవలెను.

  • 6) శూరులు: అనగా పోరాడువారు గనుక మీకు వచ్చే కష్టాలలో విసుగుకొనకూడదు.

ప్రార్ధనా తీరులు అనగా ప్రార్థించు విధానములు :-

  • 1) మోకరించుట (ఎలియాజరు)

  • 2) మోకాళ్ళసందున తలపెట్టి ప్రార్ధించుట (ఏలీయా)

  • 3) నేలమీద బోర్లపడి ప్రార్ధించుట (గెత్సేమనే తోటయందు ప్రభువు)

  • 4) నిలువబడి తలవంచుకొని ప్రార్ధించుట (సుంకరి)

  • 5) నిలువబడి ఆకాశముతట్టు కనులెత్తి ప్రార్ధించుట (దావీదు)

  • 6) ఒంటికాలుమీద ప్రార్ధించుట (సుందర్ సింగ్ గారు)

  • 7) శిరస్సుమీద శరీరమంతా ఆనుకొని చేయుట (దేవదాసు అయ్యగారు)

  • 8) రెండుకాళ్ళు, రెండు చేతులు ఎత్తి ప్రార్ధించుట (పాలు)

  • 9) మోకాళ్ళపై నిలువబడుట (యాకోబు)

మూడు ఆశ్చర్యములు :

  • (1) మనము దేవునియొక్క బిడ్డలమైయుండవలెను (ఇది దేవుని కోరిక) పాపాత్ములమైన మనము, ఎదిరించే మనము తన బిడ్డలమై యుండవలెనని దేవుడనుకొనుట ఆశ్చర్యమే.

  • (2) మనము ఇప్పుడు దేవుని బిడ్డలమైయున్నాము. ఇది విశ్వాసులు ఒప్పుకొనే ఒప్పుదల. క్రీస్తు ద్వారా ఇది మనకు కలిగియున్నది. కనుక దేవునియొక్క పోలిక క్రీస్తుయందలి విశ్వాసములో నెరవేరుచున్నది. ఇదికూడా ఆశ్చర్యమే.

  • (3) రాకడలో క్రీస్తు స్వరూపమే కల్గియుండు బిడ్డలమైయుంటాము. అది అన్నిటికంటె గొప్ప ఆశ్చర్యమై ఉన్నది. (ఫిలిప్పీ 38:20-21).

షరా: ఈ మూడు సంగతులనుబట్టి, విశ్వాసులు ఎంత ధన్యులు. ఎంత ఆశ్చర్యము. 1యోహాను 1:3.


మోషే కథ:-

ఈ అబ్బాయి వల్ల వారికి గొప్ప మేలున్నది. ఏ రాజు అయితే పిల్లలను చంపుటకు ఆజ్ఞ ఇచ్చెనో, ఆ రాజుగారే 40 సం॥లు మోషేను కాపాడెను. తల్లికి జీతము ఇచ్చుచు సంరక్షించెను. మరియు మనుష్యులకు హానిచేయు మొసళ్ళు ఆ జమ్ముపెట్టెను హానికరులనుండి కాపాడుచుండెను.

  • 1) ఫరో కుమార్తెకు మోషే సుందరుడైయుండుట కనబడెను. శరీరరీతిని ఇది మోషేలోని సహజకళయై ఉన్నది.

  • 2) మోషే దివ్య సుందరుడై యుండెను. ఇది మహిమ కళ. ఇది తల్లికి కనిపించెను.

అపో. 7:20. శత్రువు మేడలో -

  • (1) పోషణ,
  • (2) సకల విద్యలు,
  • (3) మాట నేర్పరితనము,
  • (4) క్రియా నేర్పరి తనము: ఇవి అన్ని మోషేకు జరిగెను.

మిర్యాము కథ:-

ఈమె మోషేను కాపాడినది. సొంత తల్లినే పిలుచుకొని వచ్చెను. పిల్ల చిన్నదేగాని చేసిన పని గొప్పది. (1) శత్రువుల ఎదుట భోజనపు బల్ల ఏర్పరచి, విద్య చెప్పించిన దేవుడు మన కన్నీళ్ళను ఆనంద భాష్టాలుగా మార్చగలడు. హెబ్రీయుల అబ్బాయని రాజకుమార్తె గ్రహించెను. రాజుగారుకూడా ఆ అబ్బాయినిచూచి ఆ రాజ కుమార్తెను కోపపడలేదు. ఎందుకంటే వెనుక దేవుడున్నాడు గనుక శత్రువుల మధ్యదేవుడు మోషేను కాపాడినాడు. బైబిలులో ఏ కథ చెప్పినా యేసుక్రీస్తువారి కథ చెప్పకుండా ముగించకూడదు.


మోషే తల్లి అతనికొరకు పెట్టె సిద్ధముచేసి అతనిని కాపాడెను. దేవుడామెకు వెనుకగానుండి ఇరువురిని కాపాడుచుండెను. పైకి తల్లి కాపాడుచున్నట్లుండెను గాని నిజముగా ఆయనే కాపాడుచుండెను. ఏ రాజుదగ్గరనుండి ఆపదవచ్చునో ఆ రాజు కుమార్తె దగ్గరనే మోషేను ఉంచి దేవుడు కాపాడెను. ఆయన

  • 1. ఆపద తప్పించగలడు,
  • 2. ఉపకారము చేయగలడు.

మోషే దేవుని సంకల్పనలో ఉన్నాడు గనుక దేవుడు ఆయనను ఆపదనుండి తప్పించెను. మోషే 40 సం॥లు ఫరో ఇంట్లో పెరిగెను. మోషే 40 సం॥లు అరణ్యములో 40 సం॥లు గొర్రెలు కాచెను. మోషే పాతనిబంధనకు ముంగుర్తు. ఆపదలు వచ్చునుగాని అవి దేవుని సంకల్పనను ఏమి చేయలేవు. దైవ సంకల్పనలోనున్న మోషేను అవన్ని చంపలేకపోయెను. క్రొత్త నిబంధనకు ముంగుర్తు యేసుక్రీస్తు ప్రభువు.


అరణ్యములో కొందరు నశించిరి. కొంతమంది పాలస్తీనాకు వెళ్ళిరి. ఆలాగే క్రీస్తు ప్రభువునకు కొందరు రక్షింపబడుదురు. వారిలో కొందరు నూతన యెరూషలేమునకు వెళ్ళుదురు. మోషే జమ్ము పెట్టెలో పెట్టబడెను. క్రీస్తుప్రభువు పశువుల తొట్టెలో పెట్టబడెను. దైవసంకల్పన, విశ్వాసము రెండు కలసినపుడే దేవుని చిత్తము జరుగును. రెంటిలో ఒకటి ఉండి, ఒకటి లేకపోయినను నెరవేరదు. అయితే, పిశాచి సంకల్పనలు ఎన్ని ఉన్నను, దేవుని సంకల్పన నెరవేరును. సంకల్పన వచ్చేసరికి విశ్వాసముకూడ సిద్ధముగా ఉంటే వెంటనే నెరవేరును.


మోషేను తల్లిదండ్రులు పెట్టెలో పెట్టిదాచుటకు కారణము, వారికి బలమైన విశ్వాసముండుట వలన. ఆయన ఇశ్రాయేలీయులను ఎర్రసముద్రము దాటించి, కాపాడి, వారి పగవారిని నాశనముచేసెను. ఆపదలోనున్నప్పుడు దేవుడు వారిని కాపాడెను. అలాగే మనలను నూతన యెరూషలేము వెళ్లువరకు కాపాడును. ఆపత్మాలమందు మన విశ్వాసమునకు పరీక్ష వచ్చును. ఐగుప్తీయులను కొంతసేపు రానియ్యడము మరలా వారిని ఆపడము; ఈలాగు శత్రువులను పట్టుకొనువరకు రానిచ్చి, తన ప్రజలను విశ్వాసమునందు స్థిరపర్చెను. మన విశ్వాసము సంపూర్తియైన తరువాత ఆయన మనలను విమోచించును.


దీవెన : ఈ 40 దినముల ధ్యానములలో ఆయన ప్రతిదినము, మనలను ఈలాగు విమోచించుచు, మన విశ్వాసమును స్థిరపర్చుచుండును గాక ఆమేన్.