సీనాయి పర్వత శిఖరానుభవము
నిర్గమ. 19:3-25.
ప్రార్దన:
తండ్రీ! నీ ప్రభావ మహిమలతో సీనాయి కొండమీదకు దిగివచ్చిన తండ్రీ, నీకు స్తోత్రములు. నీ మహిమను, ప్రభావమును ఈ భూలోకమే తట్టుకోలేనప్పుడు, మానవ మాత్రులమైన మేము ఏలాగు సహించగలము! అయినను, నీ ప్రేమనుబట్టి, నీ పిలుపునుబట్టి, నీ ఏర్పాటునుబట్టి మమ్ములను కరుణించుచున్నావు గనుక వందనములు. మోషేవలెనే మేమును నీ ప్రభావ మహిమను అనుభవించుటకు నీవు మాతో మాట్లాడుమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్.
సీనాయిపర్వత శిఖరముమీద జరిగిన చరిత్ర ఈ దినము ధ్యానించుకొందాము. రక్షణాపేక్షగల విశ్వాసులారా! ఈ కథలో సీనాయి కొండ ఉన్నది. కొండచుట్టు సరిహద్దున్నది. కొండకు శిఖరమున్నది. కొండ దగ్గర ఆరు లక్షలమంది డేరాలు వేసికొన్నారు. మనుష్యులు, జంతువులు ఎవరూ కొండ దగ్గరకు రాకూడదు. మోషే మాత్రము వెళ్ళవలెను. దేవుడు ఆయనతో మాటలాడును. ఏ పనిమీద మోషే కొండ ఎక్కినాడో గ్రంథములో ఉన్నది. మోషే దేవుని ఎదుర్కొనుటకు వెళ్ళినాడు. సంఘమును విడచి వెళ్ళినాడు. అక్కడకు యెహోవా దిగెను.
- 1) దేవుడు అగ్నిలో దిగినాడు,
- 2) మోషే మేఘములోనికి ఎక్కెను.
రధములుగాని మరిదేనిలోగాని దేవుడు దిగలేదుగాని అగ్నిలో దిగెను. అపుడు కొండంతయు కంపించెను.
- (1) అగ్ని
- (2) పొగ,
- (3) భూకంపము,
- (4) ఉరుములు,
- (5) మెరుపులు,
- (6) బూరలు మోగుచుండెను.
ఇశ్రాయేలీయులు చూచుచున్నారు. మోషే కాలిపోలేదు. అగ్ని ఉంటే కాలిపోవాలిగాని మోషే కాలలేదు. ఇన్ని ఉన్నప్పటికిని మోషే దిగిరాలేదు. భూమి వణికినను కొండమీద మోషే కొండక్రింద ప్రజలున్నారు. అగ్నిలో దేవుడున్నాడు. దూరములోనున్న వారికి భయము గాని దేవుని సన్నిధిలోనున్న మోషేకు భయములేదు. పై ఐదు విషయములలో మోషేకు భయములేదు. గాని దూరములోనున్న ప్రజలు భయపడిరి.
ఇవన్నియు దేవుని సన్నిధియొక్క గురుతులైయున్నవి (పై ఐదు విషయములు). మోషేతో దేవుడు కంఠస్వరముతో మాటలాడెను. మోషేకు పూర్వము ఎవరితోను దేవుడు ఇట్లు మాట్లాడలేదు. మోషేకుముందు దేవునికి సంఘములేదు. గాని మోషే కాలములో సంఘమున్నది. అంతకుముందు ఒక్కొక్కరున్నారు. హేబెలు, ఏనోషు; నోవహు; ఈలాగు ఒక్కొక్కరున్నారు. అయితే మోషే వచ్చిన తరువాత సంఘమునకు వినిపింపవలసినవి మోషేకు చెప్పెను. వస్త్రములు, మొదలైన సమస్తము సిద్ధము చేసికొనండి, స్నానము చేయండి అని మోషేకు తెలియజేసెను. మోషే వారికి తెలియజేసెను. వారు సిద్ధముగా ఉన్నారు. మోషే వచ్చెను. దేవునియొద్దకు వెళ్లెను. అప్పుడు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చెను. ఇపుడు ఇంకా ఎక్కువ ఇచ్చెను.
- 1. అప్పుడున్న సంఘమునకు వారు ఆచరించే శాస్త్రము అనగా ధర్మశాస్త్రమును,
- 2. తరువాత రానైయున్న సంఘమునకును కావలసిన శాస్త్రములు బోధించెను.
- (1) ఆచార శాస్త్రము యూదులకు;
- (2) నీతి శాస్త్రము తరువాత సంఘమునకు.
సీనాయి కొండ, నెబోకొండమీద ఇంకా అనేక ప్రదేశములలో మోషే దేవుని కట్టడలను వ్రాసెను.
- (1) మోషే సీనాయి కొండమీద దేవునిని ఎదుర్కొనెను.
- (2) నెబో కొండమీద దేవునితో వెళ్ళెను.
మోషే సీనాయి కొండమీద ఉన్నాడు. యెహోషువా క్రింద ఉండెను. మోషే భూమిమీద ఉన్నప్పుడు, రాజ గృహములో; మిద్యానులో; ఫరోవద్ద ప్రజలతో శ్రమపడినపుడు, భూమిమీద ఉన్నాడు. ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళెను. ఇన్ని శ్రమలుపడెను. ఆలాగు సిద్ధపడెను గనుక దేవుని సన్నిధికి వెళ్ళెను. మిద్యానులో ఉన్నపుడు వెళ్ళమంటే వెళ్ళలేదు. ఎందుకంటే సిద్ధపడలేదు. గనుక మనము దేవుని సన్నిధికి వెళ్ళుటకు సిద్ధపడవలెను. ఇంత కథ ఏమిటనగా:
- 1) కొండ దిగువనున్న సంఘము;
- 2) కొండమీదనున్న మోషే
- 3) దిగివచ్చిన దేవుడు.
ఇది పాలస్తీనా దేశములోనున్నవారికి, ఐగుప్తు దేశములోనున్న వారికి తెలియదు. సిద్ధపడేవారికి తెలియునుగాని, లోకస్థులైన అవిశ్వాసులకు తెలియదు. మోషే కొండమీద ఉండగా, దేవుని మనస్సులోనున్న ఆజ్ఞలు చెప్పెను. ఇవి అపుడే ఉన్నందువలన మనకు పాత నిబంధన కావలెను. అంతకుముందు కొన్ని నెలలక్రిందట మోషేకు దేవుడు కనబడెను. పొద కాలలేదు, కొండమీద అగ్ని ఉన్నది. ఇదే ఆ మహిమ. పొదలోనుండి, అగ్నిలోనుండి దేవుడు పిలిచెను, అగ్నినుండి మాటలాడెను. ఇట్లు దేవుడు, మోషేను సిద్ధము చేసియున్నాడు. కొండమీద మోషే దేవుని అగ్నిచూచి, ఆయన స్వరము విన్నాడు. గనుక ఇప్పుడు గొప్పస్థితిలోకి వెళ్ళినాడు. అట్లే విశ్వాసులకును ఉండును. మోషే పొదలోనుండి అరణ్యమునకు; అరణ్యమునుండి, సీనాయికొండ శిఖరమునకు ఎక్కినట్లు మోషే భక్తి శిఖరమెక్కెను. విశ్వాసులైన వారుకూడ తమ భక్తిలో అట్లే శిఖరమెక్కవలెను. షడ్రకు, మేషాకు, అబెద్నెగోలు అగ్నిలోనున్నను వారు చావలేదు. అగ్నివెలుపలున్న వారు చనిపోయిరి. ఆలాగే ఇక్కడ కొండ అంటుకొనేవారు చనిపోతారు. గాని కొండమీదనున్న ఆయన చావలేదు. ఈ అగ్నికి ఆ అగ్నికి తేడాయున్నది. లోకాగ్ని నాశనముచేసేది. దేవుని అగ్ని కాపాడేది గాని పాపమున్నవారు చనిపోదురు. మోషేమీదనున్న అగ్ని దానియేలు వ్రాసిన అగ్నికి ముంగుర్తు. స్నానము చేసినా, సిద్ధపడినా ఇశ్రాయేలీయులు కొండ ముట్టుకొంటే చనిపోవుదురు. మోషే సిద్ధపడ్డాడు. వారు, సిద్ధపడ్డారు గాని ఇరువురి అంతస్థులో తేడాయున్నది. మోషే సిద్ధబాటుకు, ప్రజల సిద్ధబాటుకు తేడా ఉన్నది. ప్రజలు అక్కడ ఉండగలిగినంత సిద్ధపడ్డారు. మోషే కొండ ఎక్క గలిగినంత సిద్ధపడ్డాడు. మత్తయి సువార్త 25వ అధ్యా॥లో యేసు ప్రభువు చెప్పిన దృష్టాంతములోని కన్యకల గుంపులో మొదటి గుంపు వెళ్ళెను. రెండవ గుంపు వెళ్ళలేకపోయిరి. అందుకు కారణమేమనగా
- 1) విశ్వాసములో,
- 2) భక్తిలో,
- ౩) దేవుని వాక్య జ్ఞానములో తేడాయున్నది.
- 4) అంతస్థులలో మరియు
- 5) అనుభవములో తేడాయున్నది.
అందరు సిద్ధపడుచున్నారుగాని తేడాయున్నది. మోషే సరిహద్దు దాటిన తరువాత దురాలోచన ప్రవేశిస్తే చనిపోవును. ఇట్లు మాటలాడి తిరిగివచ్చు సమయములో ఎప్పుడు చెడ్డ తలంపు వచ్చినా మోషే నశించిపోవును. మనోనిదానము చాలాకష్టమైనది. తన కండ్లు తన చెవులు దేవునివైపే ఉండుట చాలా కష్టము.
మోషేకు దేవుని సన్నిధిలోనున్నప్పుడు చెడు తలంపువస్తే దూది కాలునట్లు కాలిపోవును. ఆ ముగ్గురు బాలురు అగ్నిలో ఎందుకు కాలలేదు? ఆ ముగ్గురు దేవుని సన్నిధిలో ఉన్నారు గనుక వారు ఆ పనికి సిద్ధపడ్డారు గనుక చనిపోలేదు. మోషే గుడారము వేసినప్పుడు అతిపరిశుద్ధ స్థలములో మోషే, దేవుడు ఉండవలెను. అతిపరిశుద్ధ స్థలములో మోషేయొద్దకు మేఘమువచ్చేది. ఆ మేఘమును అంటుకొనకూడదు. ఇప్పుడు భయముపోయింది. ఆ ప్రభువు చనిపోయినప్పుడు తెర చినిగిపోయెను. ఇప్పుడు అందరు దేవుని సన్నిధికి వెళ్ళుచున్నారు. మోషే నాశనము కాలేదంటే సన్నిధిలో నున్నపుడు చెడు తలంపు రాలేదు గనుక మనోనిదానము పోలేదు గనుక. సన్నిధిలోనికి వెళ్ళువారు ఇట్టి వారైయుండవలెను. చెవులు, కండ్లు అన్ని మూసివేసి మనోనేత్రములు తెరువవలెను.
- 1) ఏ చెడ్డ తలంపులులేకుండా చేసికొన్నావా?
- 2) దేవుని చూచితివా?
- 3) మోషేవలె ఏక మనస్సు కలిగియున్నావా?
ఈ మూడు విధములుగా మనము ప్రశ్నించుకొని ఆ ప్రకారముగా నుండవలెను. మనో నిదానముగలవారు మొదటి గుంపులోని కన్యకలు. నిదానము లేనివారు రెండవ గుంపులోని కన్యకలు. మనో నిదానముతో ఒక గంటైన ఉండలేరా! దేవుని సన్నిధిలో మనో నిదానము కలిగి 40 దినములు మోషే యుండెను. మనముకూడ మనోనిదానము కలిగియుండవలెను. మోషే సువార్తల వృత్తాంతములోనికిని వచ్చెను. మత్త 17వ అధ్యాయము. మోషే ఏలియాలు ఇరువురు 40 దినములు దేవుని సన్నిధిలో నున్నారు గనుక వారిరువురు జత. వారు కొన్ని గంటలు ప్రభువుతో మాటలాడివెళ్ళిరి. మనము దినమునకు ఒక గంటైన దేవుని సన్నిధిలోనుంటే కుటుంబమునకు దీవెన కలుగును. ఒకరు ఒక దినమంత ఉపవాసముండి దేవుని సన్నిధిలో నుండిన బలముండునా? శరీరబలము అధికముగా ఉండును.
దేవుని సన్నిధినుండి మోషే దిగగా ఆయన ముఖములో ప్రకాశత ఉన్నది. ఇశ్రాయేలీయుల దగ్గరకురాగా ఆ కాంతి తగ్గినదిగాని శరీర బలహీనతలేదు.
- 1) మోషే
- 2) ఏలీయా
- 3) యేసుప్రభువు 40 దినములు ఉపవాసమున్నారు. వీరు ముగ్గురు బలహీనులు కాలేదు.
సాధుసుందర్ సింగ్ గారికి బలహీనత కలిగెను. మీరునూ ఇప్పుడే అట్లుచేసి, బలహీనులు కాకుండునట్లు ప్రయత్నించండి. అభ్యానమువల్ల ఇట్లు ఉండవచ్చును.
ఉదా:- ఒకామె అన్నము, నీళ్ళు లేకుండా ఆరు దినములు దేవుని వాక్యము చదివి బైటికిరాగా ఏమితగ్గలేదు. మోషేను దేవుడు పిలిచాడు గనుక 40 దినములు ఉండ గలిగెను. సొంత ఉద్దేశ ప్రకారము ఉంటే బలహీనత వచ్చును. ఇది బైబిలులో వ్రాయబడినది గనుక. అధిక భక్తి కొరకు ఈ క్రమము ఏర్పాటు చేయబడినది. ఇట్లు అందరు ఉండలేరు. ఎవరో ఒకరు ఉండగలరు. మీరు ఉండండి అని చెప్పను. ప్రభువు వద్దనిన, నేను వెళ్ళుమని చెప్పను.
సీనాయి కొండ పవిత్రమైన కొండ. ఇపుడు సీనాయి కొండమీద క్రైస్తవ బైరాగులున్నారు (మిలటరీకి వెళ్ళినవారు చూచిరి). ఇక్కడ ఉండగానే, ఇవన్నీ నేర్చుకొని సిద్ధపడి, పరలోక శిఖరమునకు వెళ్ళవలెను. ఉపవాసము బహిరంగముగా ఉండకూడదు. శరీర బలహీనత ఉండకూడదు. మత్తయి 6:1 లో ప్రభువు చెప్పినట్లు మన నీతి కార్యములు ఆయనకే కనబడవలెను. మనము మహిమకు సిద్ధపడునట్లు ఆత్మ సహాయమున మనము ఆ మనస్సు గలిగి సిద్ధపడవలెను.
దీవెన:
ఆలాగు ఆయన మహిమను, ప్రభావమును అనుభవించుటకు ఇక్కడనే అభ్యాసము చేసికొను కృపను, ధన్యతను ఈ 40 దినములలో పెండ్లికుమారుడు మీకు అనుగ్రహించి మోషేవలె శిఖరానుభవములో స్థిరపరచునుగాక! ఆమేన్.