3. నిర్గమకాండ ధ్యానము

నిర్గమకాండ పరిచయము



నిర్గమ. 1 : 11-22.

ప్రార్దన:-

తండ్రీ, నీ పిల్లలు ఎంత కఠిన శ్రమలోనున్నను, నీవు వారితో ఉన్నావు గనుక వారు నశించిపోలేదు. నీ ఉద్దేశములను కడవరకు నీవు నెరవేర్చుకొనువాడవై ఉన్నావు గనుక నీకు వందనములు. మాకు ఎంత శ్రమ ఉన్ననూ, మా విషయములో నీ చిత్తమును సంపూర్ణముగా జరిగించి, మమ్మును ఆనందింపజేయగలవు గనుక నమస్కారములు. నీ బిడ్డల చరిత్రలోనుండి మాకు కావలసిన వర్తమానము దయచేయుమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్.

నిర్గమకాండము :-

నిర్గమకాండములో దేవుడు ఇశ్రాయేలీయుల మధ్యకు
  • 1) దిగినాడు,
  • 2) వారితో కలిసి నివసించినాడు.

గనుక ఇది విమోచన గ్రంథము. ఆదికాండములో, ఆదిమానవులు పాపములోపడిరి. నిర్గమకాండములో దాని పాప ఫలితమైయున్న దాసత్వములోనికి ఇశ్రాయేలీయులు వెళ్ళిపోవుట ఉన్నది. గనుక ఆదికాండములో నున్న, నిర్గమకాండములోనున్న పాపఫలితమునుండి విడిపించుటకు ఆ తండ్రియే దిగివచ్చెను. ఆ పాప ఫలితము ఎంతవరకు వెళ్ళినదో, ఈ క్రింది పట్టిలో ఉన్నది.


biblemission exodus 1

దేవుడు ఎప్పటికైననూ తన ప్రజలను వారి కష్టములనుండి విడిపించునని తెలుసుకొనుటకు ఈ గ్రంథము వ్రాయబడెను. "ఇశ్రాయేలీయులు విస్తరించినారు, ప్రబలినారు, దేశమంతయు అలుముకొన్నారు గనుక శత్రువులు మనదేశంపై దందెత్తితే వారును శత్రువులతో కలసిపోవుదురని" ఆ రాజును, పెద్దలును ఆలోచించుకొని ఇశ్రాయేలీయులకు ఎక్కువ పని పెట్టవలెనని తలంచి, పీతోము, రామెసేసు అను పట్టణములను వారిచే కట్టించిరి. అవి కట్టుటకు ఇటుకలు, అడుసు వారే స్వయముగా చేసుకొనవలెను.

  • (1) రాజు చేసిన మొదటి చెడు ఆలోచన; పని ఎక్కువ చేయుట
  • (2) ఇశ్రాయేలీయుల మగపిల్లలను పుట్టగానే చంపాలని ఐగుప్తు మంత్రసానులకు ఆజ్ఞ ఇచ్చుట వారు చేయకుండుట.

అందుకనే దేవుడు వారిని దీవించుట.


ఈ దినము ప్రసంగము:-

మగపిల్లలను నైలునదిలో పడవేయుమని రాజు ఆజ్ఞ ఇచ్చుట. రాజు ఇశ్రాయేలీయుల సంఖ్యను తగ్గించవలెనని ఎంత ప్రయత్నించినను, వారి సంఖ్య వృద్ధిఆయెను. శ్రమలు విస్తరించిన కొలది సంఖ్య వృద్ధి అగుచుండెను. దేవుడు పైనుండి సహాయము చేయుచున్నను, భూమిమీద మనుష్యులద్వారాకూడా సహాయము చేయించుచుండెను. కఠిన శ్రమలలో దేవుని సహాయమువలన కలిగిన మేళ్ళు:

  • 1) పిశాచి ప్రోగ్రాం: కఠిన సేవ; అందువలన వారు బలిష్టులై సుఖంగా ప్రసవించుట అనేది దేవుని ప్రోగ్రాం
  • 2) పిశాచి ప్రోగ్రాం: మగపిల్లలను చంపుట. దేవుని ప్రోగ్రాం మంత్రసానులను భక్తిగలవారిగా చేయుట.

దేవుడు చేసిన పనులు:

  • 1) పిశాచి ప్రోగ్రాం చెంతనే తన ప్రోగ్రాం యుంచినారు.
  • 2) తన జనమునకు హాని కలుగకుండా కాపాడెను.
  • 3) అది మాత్రమే కాదు, వారిసంఖ్యను వృద్ధిచేసినారు.

ఇది విశ్వాసులకు గొప్ప ఆదరణ. నిర్గమకాండముయొక్క చాలా భావము మొదటి అధ్యాయంలో కనబడుచున్నది.


ఉదా:- ఒక బాటసారిని, దొంగలు వెంబడించుటవలన, ఎవరో వెనుకనుండి గుర్రముమీద వచ్చినట్లు కనిపించుటవలన ధైర్యము కలిగెను. అలాగే భయపడుచున్న హెబ్రీ స్త్రీలకు దేవుడు మంత్రసానులను తోడుగా పంపెను. మంత్రసానులు రాజు సొమ్ము తినుచు, రాజాజ్జకు లోబడలేదు. మరియు వారు అబద్ధమాడిరి. ఇందుచే దేవుడు వారిని దీవించలేదు గాని దేవునికి భయపడినందున మరియు వారికి అబద్ధము ఆడుట పాపము అని తెలియదు గనుకను, దేవుడు చూసి చూడనట్లు ఊరకుండెను.


మోషే తల్లిపేరు యోకెబెదు. ఈమె విశ్వాసురాలు. దేవుడు ఆ అబ్బాయి ద్వారా ఏదోపని చేయించునని ఆ అబ్బాయిని 3 నెలలు కాపాడెను. తరువాత నదిలో జమ్ముపెట్టెలో పెట్టి కాపాడినది (హెబ్రీ 11:23).

  • 1) తాను కాపాడినది మూడు నెలలు గనుకను,
  • 2) దేవుడు కాపాడునని నదిలో ఉంచుటవలనను,
  • ౩) రాజాజ్ఞకు భయపడలేదు గనుకను; (ఈ మూడును కలసి గొప్ప విశ్వాసము ఆయెను).

ఈ కథలో ఒక చిన్న పోలికగలదు. యేసుప్రభువును కూడా పశువుల తొట్టిలో పరుండబెట్టిరి (లోక రక్షకుడు). మోషేనుకూడా తొట్టెలో పరుండబెట్టినారు (ఇశ్రాయేలీయుల రక్షకుడు). యేసుప్రభువు పుట్టినప్పుడు కూడా చిన్నపిల్లలను చంపవలెనను ఆజ్ఞయుండెను. మోషే పుట్టినపుడుకూడా అదే ఆజ్ఞ అమలులో ఉండెను. యేసుప్రభువు తల్లి విశ్వాసురాలు. మోషే తల్లికూడా విశ్వాసురాలు.


యేసుప్రభువును చంపచూసినపుడు ఆయనను ఐగుప్తుకు తీసుకువెళ్ళిరి. మోషేకూడా ఐగుప్తులో దాచబడెను. మోషే పుట్టినపుడు ఇశ్రాయేలీయులు కన్నీటితో నిండియుండిరి. అలాగే ప్రభువు పుట్టినపుడు జరిగిన వధనుబట్టి గొప్ప అంగలార్పు జరిగెను.


ఉదా:- కనాను స్త్రీకి ఇంటివద్ద ఏ అభిప్రాయముండెను? దేవుడు సాయంచేస్తాడనే అభిప్రాయమే చివరివరకు ఆమెకుండెను. ఎన్ని ఆటంకములు వచ్చినాసరే, ఆమె తన అభిప్రాయము విడువలేదు. ఆమెకు వచ్చిన ఆటంకములు

  • (1) నిశ్శబ్దకాలము అనగా ప్రభువు ఏ జవాబు చెప్పక మౌనముగా ఉన్న సమయము,
  • (2) ఇతరులవలన అడ్డు అనగా శిష్యులవలన;
  • (3) యూదులకేగాని నీకుకాదు, పూర్వికులకేగాని నీకు కాదు అని ప్రభువు అనుట,
  • (4) కుక్క పిల్లలు అనే నిరసన భావము. అయినను సహాయము పొందేవరకు ఆమె విశ్వాసము సడలలేదు.

దీవెన:

ఈలాగు ఎన్ని ఆటంకములు కలిగినను, ఎన్ని అవాంతరములు ఎదురైనను ఆయనకు మాత్రమే భయపడి, ఆయన సహాయ ఆశీర్వాదములు పొందు స్థిరవిశ్వానము పెండ్లికుమారుడు మీకు దయచేయునుగాక ఆమేన్.