సన్నిధి అనుభవములు
నిర్గమ. 24: 1-11.
ప్రార్ధన:
తండ్రీ, నీ ఏర్పాటు ప్రజలకు పరిచయముచేసి, అందించిన నీ దివ్య సన్నిధిని; ఆశకల్గిన అందరకు పరిచయము చేయుచు, అందించుచున్న తండ్రీ నీకు ఆనంద వందనములు. నీ సన్నిధిలో మేమున్నపుడు, మమ్మును ఎట్టి మహిమ రూపమునకు మార్చుదువో, ఎట్టి కళలతో అలంకరించుదువో, మేము ఊహించలేము, గ్రహించలేము. అట్టి నీ మహిమ సన్నిధినుండి మాకు వర్తమానమిమ్మని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్.
- 1. మోషేపుట్టి పెద్దవాడై ఫరో ఇంటిలో పెరుగు అన్నము తిని పెరిగి,
- 2. తాను ఐదవ ఆజ్ఞ వ్రాయకముందే, 5వ ఆజ్ఞ పాపముచేసి పారిపోయెను.
- 3. అరణ్యములో గొర్రెలను మేపి,
- 4. దేవుని ప్రత్యక్షత కలిగి,
- 5. అపోస్తలునివలె పంపబడి,
- 6. ఏ ఇంటిలో పెరిగెనో ఆ తాతగారిని ఎదిరించి,
- 7. ఇశ్రాయేలీయులను చెరనుండి విడిపించి,
- 8. దారిలోని ఇసుకలో విసుగుకొని ఇశ్రాయేలీయులను నడిపించెను.
- 9. అరణ్యములో ప్రత్యక్ష గుడారము వేయుమని మోషేకు దేవుడు సెలవీయగా వేసెను.
- దానిలో
- 1) ఆవరణము
- 2) పరిశుద్ధ స్థలము
- 3) అతిపరిశుద్ధ స్థలము ఏర్పర్చెను.
ఆవరణములో - బలి అర్పించబడును. పరిశుద్ధ స్థలము యాజకులు (భక్తులు) ఉండునది. మూడవదైన అతిపరిశుద్ధ స్థలము దేవుడు, మోషే మాత్రముండేది. మోషే 40సం॥లో ఫరో ఇంటిలో సర్వవిద్యలు నేర్చెను. రెండవ 40సం॥లు గొర్రెలను మేపెను. మూడవ 40సం॥లు ఇశ్రాయేలీయులను నడిపించెను. చివరి 40సం॥లు సహవాసముకొరకు ప్రత్యక్ష గుడారము వేసెను. అలాగే మనము రాకడ చివరికాలములో ఉన్నాము గాన సన్నిధి అవసరము.
- మోషేవలె,
- 1. ఒక్కరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా ఉండవచ్చును. పరవాలేదు.
- 2. బరంపురములో ఉన్నవారు ఐదుగురు.
- 3. దేవదాసు అయ్యగారి ఉపదేశము ప్రకారము ఏడుగురు సన్నిధిలో ఉండవచ్చును.
- 4. 12మంది ఉండవచ్చును. శిష్యులు పన్నిద్దరుగాన 12మంది ఉండవచ్చును.
- 5. గోత్రములు 12. గాన 12మంది శిష్యులను ప్రభువు ఏర్పాటుచేసికొనెను.
- 6. విజయవాడలో సన్నిధి కూటమునకు ఏడుగురిని ఏర్పర్చిరి.
- 7. నర్సాయపాలెంలో నలుగురు.
- 8. ఆది సంఘములో 120మంది ఉండిరి.
- 9. 12 మందికి "0" కలిపితే 120 మంది.
- 10. ఆది సంఘములో సహవాసములోనున్నవారు అనేకులు.
- 11. ఊరునకు ఒక్కరైనా సన్నిధిలో ఉండవలెను.
- 12. సన్నిధిలో లేకపోతే రాకడకు సిద్ధపడలేము.
బరంపురములోనున్న సన్నిధి కూటములలోనున్నవారు ఐదుగురు. అందులో ఒకరు పరంజ్యోతమ్మగారు. ఈమె రాజమండ్రిలోని యోసేపు పాదిరిగారి కుమార్తె. గొప్ప ప్రత్యక్షతగల ఆమె. వారికి 4గురు మగబిడ్డలు, 4గురు ఆడబిడ్డలు. బిడ్డలందరు గొప్ప ప్రత్యక్షతగలవారే. ఆలీసమ్మగారు ఒకరు, మేరిమ్మగారు ఒకరు. వీరికి గొప్ప ప్రత్యక్షతలు గలవు. వీరును ఐదుగురిలోనివారు. వీరిలో ఒకరికి నలుగురు పిల్లలు. ఒకరికి 14గురు పిల్లలు. వీరు ఏదైనా తెలిసికొనవలెనంటే తండ్రిని అడిగి వస్తామని సన్నిధి గదికి వెళ్ళి అప్పుడే సన్నిధికి వెళ్ళి వచ్చి తండ్రి ఇట్లు చెప్పియున్నారని చెప్పి చెప్పేవారు.
యోసేపు పాదిరిగారు ఉదయం 5గం॥లు కాగానే నీళ్ళుపోసి తీసేవారు. లేవగా ప్రార్థనచేసి, పిల్లలను తిరిగి పండుకొనేమనేవారు. ఎక్కడివారిని అక్కడే ఉంచి ప్రార్ధనచేసేవారు. పిల్లలు బడికివెళ్ళేటప్పుడు ప్రార్ధన చేసేవారు. సమయము లేకపోతే అందరుకలసి పరలోకప్రార్ధన చేసేవారు. ఎక్కడ పనివారిని అక్కడేనుంచి, పిల్లలను అక్కడే ఉంచి ప్రార్ధనచేసేవారు.
యం. దేవదాసు అయ్యగారు లూథర్ గిరిలో ఉన్నప్పుడు పిల్లలు మధ్యాహ్నము అన్నము తిని, పాటపాడిన వెంటనే అయ్యగారు నెమ్మదిగా ప్రార్ధన హాలులోనికి వెళ్ళి, ఒకమాట ప్రార్ధనచేసేవారు. "ప్రభువా? నీవు త్వరగా వచ్చుచున్నావు. మమ్మును త్వరగా సిద్ధపర్చుము" అని చిన్న ప్రార్ధన చేసేవారు. పిల్లలు కొందరు వచ్చేటప్పటికి ప్రార్ధన అయిపోయేది. గాన ప్రార్థన సమయములో ఎక్కడివారు అక్కడే ఉండవలెను. అంటే మోషే కాలములో మేఘము ప్రత్యక్షపు గుడారముమీదికి రాగానే, ఎక్కడ నున్న ఇశ్రాయేలీయులు అక్కడే ఎవరి డేరాలముందు వారు చేతులు జోడించి ఉండేవారో, అట్లే మీరును ఎక్కడివారు అక్కడే చేతులు జోడించండి.
ఒక విశ్వాసి చనిపోయేటప్పుడు అయ్యగారు అక్కడనున్నారు. ఆమెతో అయ్యగారు - అమ్మా! నీవు పరలోకమునకు వెళ్ళుచున్నావు. అక్కడనున్న మనవారందరిని అడిగినానని చెప్పుమనగా ఆమె చెప్పుదుననెను.
ఒక పట్టణములో 6గం॥లకు గుడి గంట కొట్టేవారు. సంఘస్తులు వచ్చేవారు. కీర్తనపాడి, వాక్యము చదువుట, ప్రార్థించుట, వెళ్ళిపోవుట చేసేవారు. ప్రతిదినము ఆయన ఒక క్రొత్త తలంపైనా ఇయ్యవలెను. యిర్మియా 12:1. దేవా! నీవు కృపాసత్యములు గలవాడవేగాని లోకములో దుష్టులు ఉన్నారెందుకు అను ప్రశ్నలు కలిగినవారికి ఒక్క తలంపైనా ఇయ్యవలెను. ఆర్. సి. యం. వారు గంట కొట్టగానే ఎక్కడివారక్కడ ప్రతిదినము జపము చేయుదురు. మతగురువుతో ఎవరైనా మాట్లాడుచున్నను గంట వినబడగానే లేక టైము కాగానే సంభాషణ మాని, జపముచేసి, మరలా పని ప్రారంభించును. వారికి ఈ గొప్ప అలవాటున్నది. మొదట పరంజ్యోతమ్మగారికి ప్రత్యక్షత కలుగగా, సహోదరీలు వారికిలేదని కష్టము పెట్టుకొనిరి. గానీ ఆమె - "ప్రభువు మీకును ఇస్తారు". ప్రతివారికి సమయమున్నదనిరి. పరంజ్యోతమ్మగారి ప్రత్యక్షత - ఎ.సి. పాత్రోగారి ప్రత్యక్షత, రెండు టాలీ చేసికొనేవారు అనగా సరిపోల్చి చూసుకొనేవారు.
వెయ్యి సం॥ల పాలనలో ప్రభువునకు కిరీటము పెట్టేవారు స్త్రీలే. ఎందుకంటే పాపము వారివలన వచ్చినందున వారు ఎక్కువ పని చేయుదురు. పరలోకమునకు వెళ్ళిన తరువాత విశ్వాసులకు ఇంకా పని ఎక్కువ ఉన్నది.
- 1) కీర్తనలు పాడుట,
- 2) ప్రభువు ముఖబింబము చూచుచుండుట,
- 3) స్తుతించుట,
- 4) పరిశుద్ధులతో, దూతలతో సంభాషించుట.
స్తుతించుట అనగా "ప్రభువా! ఇక్కడకు తీసికొని వచ్చితివి స్తోత్రములు" అని చెప్పుట. ఈ స్తుతి అన్నిటికంటే గొప్పదై యుండును. ఇక్కడకు అనగా పాపలోకము నుండి పరలోకమునకు అనగా దేవుడుండే స్థలమునకు తెచ్చినావు గనుక వందనములు. బరంపురములో యోసేపు పాదిరిగారి మనుమరాలు పరంజ్యోతమ్మగారి కుమార్తె చిన్న అమ్మాయేగాని ప్రార్ధనా దోరణి చాలా బాగుగానుండేది. డాక్టర్ ఆట్మనమ్మ మిస్సమ్మగారు ఆమె ప్రార్ధనకు ఆశ్చర్యపడేవారు. H. రత్నమ్మగారు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి బి.ఎ. చదువుచున్నది.
అయ్యగారు - పరంజ్యోతమ్మ సహోదరీలతో చెప్పినదేమనగా, "ఈ స్థితి మీకు కలుగుటకు మీ తండ్రిగారి ప్రార్ధన" అని చెప్పిరి.
దీవెన:
ఇట్టి సన్నిధి అనుభవములను మీరును కలిగియుండుటకు, ఆయన సన్నిధిలో కూర్చుండే కుదురును, పట్టుదలను, దీక్షను పెండ్లికుమారుడు మీకు దయచేయును గాక! ఆమేన్