జలము-బలము-ఫలము-1
నిర్గమ. 17: 8-16.
ప్రార్ధన:
దేవా! అపోస్తలుల దేవా! అపోస్తలుల కాలమందున్న ప్రవక్తల దేవా! సంఘముయొక్క పెద్దల దేవా! హతసాక్షుల దేవా! మిషనెరీల దేవా! సువార్తికుల అందరియొక్క దేవా! క్రైస్తవ సంఘముయొక్క దేవా! నీకు స్తోత్రము. సమస్తము నీవే జరుపుకొనుము ఆమేన్.
నిర్గమ 17వ అధ్యా॥లో రెండు పాఠములు, మూడు పాఠములు, నాలుగు పాఠములు, ఐదు పాఠములు, ఆరు పాఠములున్నవి. ఈ కథలోనే బైబిలు అంతా ఇమిడి ఉంది. సంఘచరిత్ర మాత్రమేగాక, పెండ్లికుమార్తె సంఘచరిత్ర మాత్రమేగాక, నీ చరిత్రకూడా ఉన్నది. అంతేగాక నా చరిత్రకూడ ఉన్నది.
ఈ భాగములో
- 1. యుద్ధమును గురించి ఉన్నది
- 2. ప్రార్ధనను గురించి ఉన్నది.
ఈ అధ్యా॥లో ఇవి రెండు కలిసేయున్నవి. ఇశ్రాయేలీయులు బాగా త్రాగారు. అనగా సారా, కల్లు కాదుగాని కావలసిన మంచినీళ్ళు బాగా త్రాగారు. గనుక యుద్ధము అవసరం. త్రాగినందుకు బలము వచ్చింది. గనుక ఆ బలము ఎప్పుడు వాడాలి? యుద్ధములో వాడాలి. అక్కడ అద్భుతకరమైన రీతిలో బండలోనుండి వచ్చిన నీరు త్రాగారు. కొండమీద మోషే, అహరోను, హూరు ముగ్గురున్నారు. ఆ నీళ్ళ కథ వేరు. ఇక్కడ కొండమీద ఉన్నా ఈ ముగ్గురి కథ వేరే. కొండక్రింద యెహోషువ ఉన్నాడు. ఆయన పటాలము ఉన్నది. కొండపై ముగ్గురు, క్రింద యెహోషువ, ఆయన సైన్యము ఉన్నారు. అమాలేకీయుల శత్రుపటాలము వారికి ఎదురుగా ఉన్నది. ఈ రెండు గుంపులకు ఇపుడు యుద్ధము.
లోకములో ఎవరికి జయము? ఎటువంటివారికి జయము? బాగాత్రాగినవారికి జయము. ఆ పటాలమువారు చెరువు నీళ్లు, మామూలు నీరు త్రాగారు. ఇశ్రాయేలీయులు అద్భుతకరమైన బండ నీరు త్రాగారు. అదే అద్భుతనీరు అనగా దేవుడు బండనుండి తీసి ఇచ్చిన నీరు త్రాగారు.
ఉదా:- ఈ రాత్రిగాని సంస్కార భోజనం పుచ్చుకొంటే, బజారులోని ద్రాక్షారసం, రొట్టె తింటాముగాని, పరలోకములో నూతన యెరూషలేములో జరిగే పెండ్లి విందపుడు అద్భుతకరమైన ద్రాక్షారసం త్రాగుదుము. అది అన్నిటికంటె "బలము గలది. అట్లే ఇశ్రాయేలీయులు త్రాగినది అద్భుతకరమైన నీరు గాన, ఇశ్రాయేలీయులు ఎక్కువ బలము గలవారు.
సైతాను ఏర్పాటు:
యుద్ధము ఎప్పుడు చేయాలి? దేవుని జనం. ఐగుప్తులోనుండి బయలుదేరి, వెళ్ళే మార్గములో జరిగించాలి. అపుడు ఏర్పాటు జనము వాగ్ధానదేశము వెళ్లకుండ, చేరకుండా చేయాలి. ఇది సైతానుయొక్క ఏర్పాటు.
ఇశ్రాయేలీయులు ఏమి విడిచివచ్చిరి?
ఐగుప్తు విడిచిపెట్టి, బైటకు వచ్చిరి. క్రైస్తవులు ఏమి విడిచిపెట్టి సంఘములోనికి వచ్చిరి? లోకమును విడిచి సంఘములోనికి వారు ఎక్కడకు ప్రయాణము? వాగ్దానదేశం. క్రైస్తవుల ప్రయాణం ఎక్కడికి? మోక్షానికి ప్రయాణం. అలాగే వారికి యుద్ధము జరిగింది. మనకును యుద్ధము జరగాలి. ఇశ్రాయేలీయులకు ఎందుకు జయము వచ్చినది? ప్రార్ధించుటవలన, మార్గములో వారు అమాలేకీయులతో యుద్ధము చేసినప్పుడు దేవుని బండలోని నీరు త్రాగినందున లోకస్తులైన వారిని జయించిరి.
లోకము ఒకప్రక్క సంఘము - పరలోకం మరొక ప్రక్క ఉన్నాయి. ఇప్పుడు సంఘము తాను విడిచిపెట్టి వచ్చిన లోకముతో యుద్ధము చేయాలి. (సంఘమునకు, లోకమునకు యుద్ధము) వారైతే బండనీరువల్ల జయించారు. మనమైతే సంఘమైతే అనగా వాక్యోదకమువల్ల జయము పొందగలము. ఇప్పుడు మనము మూడు దినములు వాక్యజలంతో నింపబడ్దాము గనుక ఇంటికి వెళ్ళి మనము వాక్యబలముతో లోకమును జయించాలి. రెఫీదీములో యుద్ధము జరిగినపుడు ముగ్గురు కొండెక్కిరి. వారెక్కింది "ప్రార్ధనాకొండ". చివరికి ఆ ప్రార్థనే కొండెక్కింది.
- వారు ముగ్గురును క్రిందినుండి
పైకి
కొండ పైకెక్కినట్లు వారి
- ప్రార్ధనలు పైకొండకు అనగా దేవుని పర్వతంనకు ఎక్కినవి.
- మన
ప్రార్ధనలుకూడా
దేవుని సింహాసనము వరకు ఎక్కవలెను.
కొందరి ప్రార్ధనలు మేఘము వరకే ఎక్కును గాని మన ప్రార్ధనలు అన్నీ పరలోక సింహాసనము వరకు ఎక్కవలెను.
- 1. కొండపైన ప్రార్ధన,
- 2. కొండ క్రింద యుద్ధము.
మోషే చేయి ఎత్తినప్పుడు జయము, చేయి దించినపుడు అపజయము. ఇశ్రాయేలీయులకు ఆయుధములు లేవు. అమాలేకీయులకు ఆయుధములు కలవు. ఇశ్రాయేలీయులది విశ్వాసమైతే, అమాలేకీయులది అవిశ్వాసము. ఊరకే నిలువబడి ప్రార్థించుట ఏమి కష్టము కాదు, పోరాడుట ఆయనే పోరాడును. ఇశ్రాయేలీయులకు పొరపాట్లు ఉన్నను నాయకులు చెప్పినట్లు చేసి దేవునివైపు చూచిరి. అందువలన వారికి అంతా జయము. ఆయన ఆలోచన కర్త గనుక వారికి ఆలోచన చెప్పును. ఇక్కడ సంగతులు దేవునితో చెప్పుట, ప్రార్థించుట. దేవుని సంగతులు ఇతరులకు చెప్పుట ప్రకటించుట. ఈ రెండు పనులు ప్రవక్తల పనులు.
షరా: అమాలేకీయులు ఎవరితో యుద్ధము చేసిరి? దేవుని సింహాసనమునకు విరుద్ధముగా యుద్ధము చేసిరి. దేవునితోనే యుద్ధము. మన ప్రార్ధనలు వెళ్ళవలసినది మేఘము వరకుకాదు. అలాగైన క్రిందకుపడిపోవును. దేవుని సింహాసనము వరకు వెళ్ళాలి.
- (1) అమాలేకీయులు దేవుని సింహాసనమునకు విరుద్ధముగా వారి హస్తములు ఎత్తిరి గనుక.
- (2) ఈ ముగ్గురును దేవుని పక్షముగా చేతులు ఎత్తిరి, గాని దేవునికి విరోధముగా కాదు.
చేతులు ఎత్తినపుడు మాత్రమే జయము కలిగింది. అట్లే మనమును మన చేతులు ఎత్తి ప్రార్థించినపుడే మనకు జయము. శత్రువులకు అపజయము. ఇశ్రాయేలీయులు బండనీరు త్రాగక ముందు నీరు త్రాగలేదా? త్రాగిరి. అయితే, ఇప్పుడు కొత్తనీరు త్రాగిరి. అలాగే మనమును ఇపుడు దేవుని వాక్యము ధ్యానించునపుడెల్ల క్రొత్త నీరు వచ్చును. మధుర జలము, అద్భుతకర జలము, దేవుని సెలవుమీద వచ్చిన జలము, దేవుడు చెప్పగా వచ్చిన జలము మనకు అందును. ఇక్కడ రెండు కథలు కలవు.
షరా: కొండమీద మోషే చేతులెత్తి ప్రార్థించినపుడు, క్రిందనున్న యెహోషువ, ఇశ్రాయేలీయులు కత్తిచేత శత్రువులను హతము చేసిరి. మనము (ఎఫెసీ 6:17) దేవుని వాక్యమునకుపెట్టు ఒక పేరు పరిశుద్దాత్మ ఇచ్చే ఖడ్గము.
ఇశ్రాయేలీయులచేతిలో ఖడ్గము, కొండక్రింద ఉన్న సైన్యముయొక్క చేతిలో ఒక ఖడ్గమున్నది. అది దేవుని వాక్య ఖడ్గము. ఒకసారి దేవుని వాక్యము వచ్చింది; నీవు వెళ్ళి యుద్ధము చేయుమని. రెండవసారి ఆయన వాక్యము వచ్చి శత్రువులను హతం చేసింది. అంటే అది వాక్యకత్తి యెహోషువచేతిలో ఉన్న మామూలు కత్తికి శక్తి ఇచ్చింది. ఆ వాక్యకత్తి గనుక ఈ మూడు దినములు మనము వాక్యము విన్నాము. ఆ విన్న వాక్యమే మన చేతిలోని కత్తి.
దీవెన:
ఆయన వాక్యఖడ్గము నుండి వాక్కు పొంది, ఆ వాక్యఖడ్గముతోనే శత్రువును సంహరించుటకు కావల్సిన తెగింవును, నేర్పును పెండ్లికుమారుడు నేడు మనకు దయచేయునుగాక! ఆమేన్.