అగ్నివంటి శ్రమ - మెరుపు వంటి మహిమ
నిర్గమ 3:1-22
ప్రార్ధన:
తండ్రీ! మా విషయమై ఎంతటి ప్రయాసమునకైనను, ఓర్చుకొని, పనిచేయుచున్న తండ్రీ! నీకు వందనములు. నీ ప్రయాసలో నీ ప్రేమను, అంతేగాక 'నిన్ను నీవును' పూర్తిగా వెల్లడి చేసికొన్న సర్యోన్నతుడవైన తండ్రీ, నమస్కారములు. నీవలె మేమును నీతో నిత్యముండుటకు నేటిదిన వర్తమానమిమ్మని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్.
మోషే ఐగుప్తులో యున్నప్పుడు, హెబ్రీయునితో ఐగుప్తీయుడు పోట్లాడుచుండగా అతనికి కోపమువచ్చి ఐగుప్తీయుని చంపి మిద్యాను దేశం పారిపోయెను. ఇక్కడ మోషే తాను స్వయముగా చేసిన పని కలదు. రాజునకు భయపడుట, పారిపోవుట ఉన్నది. 3వ అధ్యాయములో అంతా దేవుడు చేసినదే కనబడుచున్నది.
- 1) దైవ ప్రత్యక్షత,
- 2) దేవుడు - మోషే మోషే అని పిలుచుట,
- 3) ఇది పరిశుద్ధ స్థలము,
- 4) నేను మీ దేవుడను,
- 5) మీ మొర విన్నాను,
- 6) మీ దుఃఖము తెలుసును,
- 7) మిమ్మును విడిపించుదును,
- 8) అందుకే దిగివచ్చినాను,
- 9) హింస చూసినాను,
- 10) నిన్ను పంపుదును,
- 11) నీకు తోడైయుందును,
- 12) నాపేరు ఉన్నవాడు,
- 13) నా ప్రజలకు సంభవించినది చూచినాను,
- 14) నా చేయి చాపుచున్నాను,
- 15) ఐగుప్తీయులకు హెబ్రీయులపై కటాక్షము కలుగజేసెదను
- ఇన్ని మాటలు, దేవుడు మోషేతో మాటలాడెను. గనుక ఇవన్నియు మనకు కావలసినవే.
మూడవ అధ్యాయములో దేవుడు మనకొరకు చేసేది అంతాయున్నది. పాత నిబంధనలో ఇది అద్భుతకరమైన అధ్యాయము. ఇది అనేక వాగ్ధానములుగల అధ్యాయము. దేవుడే స్వయముగా పనిచేసే అధ్యాయము. దేవుడింత కాలమునకు తన పేరును బయలుపరచిన అధ్యాయము. ఆదికాండము 50 అధ్యాయములలో తన పేరు ఆయన బయలుపరచలేదు. 'నేను ఉండేవాడను, ఎక్కడబడితే అక్కడయుండేవాడను, ఎప్పుడుబడితే అప్పుడు యుండువాడను, ఎలాగుబడితే అలాగు యుండే దేవుడను, ఏదిబడితే అదిచేసే దేవుడను' అని ఈ అధ్యా॥లో బయలుపరచెను. ౩వ అధ్యాయమునకు "ఉండే దేవుని అధ్యాయము" అని పేరు. "అన్నిటికి నేనే యున్నాను", 'మీకు నేను ఉన్నాను' అనే గొప్ప అధ్యాయము. క్రొత్త నిబంధనలోని రోమా 7వ అధ్యా॥ను, పాతనిబంధనలో నిర్గమకాండము 2వ అధ్యాయమును సమానము.
నిర్గమ కాండము 3వ అధ్యాయము రోమా 3వ అధ్యాయమునకు సమానము. రోమా 7వ అధ్యాయములో మనిషి - "నేను పది ఆజ్ఞల ప్రకారము చేసి మోక్షమునకు వెళ్ళగలను" అని తలంచును. అయితే రోమా 8వ అధ్యాయములో, 'మనిషి ఆ ప్రకారము చేయలేడు గనుక దేవుడే మనిషిని 10 ఆజ్ఞల ప్రకారం నడువజేయును, అంతా దేవుడే చేసిపెట్టును' అని ఉన్నది. గనుక యోహాను 14:14 ప్రకారము నా నామమున ఏది అడిగితే అది చేస్తాను అని వాగ్ధానము చేసావుకదా ప్రభువా! అని మనిషి అనవలసినదే.
- 1) నేను నమ్ముచున్నాను ప్రభువా!
- 2) ఔను ప్రభువా! నిన్ను స్తుతించుచున్నాను.
"నా స్వంతముగా అయితే ఏమి చేయలేనుగాని నీ వాగ్ధానం నమ్మి స్తుతిస్తే అన్నీ చేయగలను" అని అనవలెను. అందుకు అవసరమైన విధేయతకూడా యుండవలెను.
పొదలో మంటయున్నది కాని పొద కాలిపోలేదు. అలాగే ఇశ్రాయేలీయులకు
శ్రమయున్నది
కాని నశించలేదు, వృద్ధి పొందుచున్నారు. దీనికి గుర్తుగా ప్రభువు మోషేకు పొద చూపెను. మంటయుండెను గాని పొద
కాలలేదు. మోషేకు 80 సం॥ల వయస్సులో ఇది చూపెను. పొద మధ్య దేవుడు యున్నందున పొదకాలలేదు. అలాగే
ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు యున్నందున వారు నశించలేదు. మేళ్ళే పొందిరి. అలాగే క్రైస్తవులకు శ్రమయుండును
గాని
నశించరు. బాగా ప్రార్ధన చేయండి. అందువలన బలము, ధైర్యము, విశ్వాసము కలుగును. లోబడియుండుట నేర్చుకొందురు.
కొత్త క్రైస్తవులగుదురు. సహింపుశక్తి కలుగును. కష్టాలు తప్పించుకొనుటకు ఉపాయములు కలుగును. పనులు
బాగా
చేయుట నేర్చుకొందురు.
మోషేకు
- (1) పొద కనిపించెను,
- (2) అగ్ని కనిపించెను.
గాని సమీపమునకు వెళ్ళినపుడు మాత్రం దేవుని స్వరం వినబడెను. అలాగే ఇశ్రాయేలీయులమధ్య దేవుడు యున్నాడు గాని పైకి శ్రమలు మాత్రమే కనబడుచుండెను. గాని నిజముగా శ్రమలమధ్య దేవుడు యున్నాడు. అలాగే మనకు శ్రమలు యున్నను, మన ప్రార్ధనలు వినబడనట్లు కనబడినను, ఆయన నిజముగా చాటుననుండి మనమొర ఆలకించును.
- 1) మనచేత ప్రార్థన చేయించుటకును,
- 2) మనలను తర్ఫీదు చేయుటకును,
- 3) అన్యులు మనలను చూచి పాఠము నేర్చుకొనుటకును, ఆయన మౌనముగా నుండును.
- (1) యూదులు పస్కాను ఆచరించునపుడు గొర్రెపిల్ల రక్తము వాడిరి. ఆ మాంసము కూడ తినిరి.
- (2) యూదులు పస్కాను ఆచరించునపుడు చేదుకూరలు తినిరి,
- (3) యూదులు పస్కాను ఆచరించునపుడు ప్రయాణము చేయుచుండిరి.
- 1. ప్రభు భోజనమపుడు యేసుప్రభువు శరీరము, రక్తము వాడబడును. గనుక
- 2. ప్రభు భోజనమపుడు పాపములు ఒప్పుకొనుట ఉండవలెను, ప్రయాణము ఉండవలెను అనగా
-
3. ప్రభు భోజనము తీసికొనుచు మనము రాకడకు
సిద్ధపడవలెను. వస్కా ఎందుకు ఆచరించబడెను?
- 1) ప్రయాణము కొరకు,
- 2) శరీర బలము కొరకు,
- 3) కీడు రాకుండుటకు,
- 4) ఆరు లక్షలమంది ఒకచోట సహవాసం చేయుటకును.
అలాగే మనము
- (1) రాకడకు వెళ్ళుటకు,
- (2) ఆత్మబలమునకు,
- (3) కీడు రాకుండుటకు,
- (4) ప్రభువుతో సహవాసము కల్గియుండుటకు
- (5) పాపక్షమాపణ కొరకు,
- (6) చివరగా యేసుప్రభువువలె మనము మారిపోవుటకు ఆయన మనకొరకు ప్రభు భోజనము ఏర్పాటు చేసెను.
దీవెన:
ఈలాగు ఏర్పాటు ప్రజలైన ఇశ్రాయేలీయులవలె అగ్నివంటి శ్రమలమధ్య కాలిపోకుండా కాపాడబడే ధన్యత ఆయన శరీర రక్తముల బలమువలన మహిమమేఘము ఎక్కు అంతస్థు ప్రభువు మీకు దయచేయునుగాక! ఆమేన్.