25. నిర్గమకాండ ధ్యానము

శత్రువులపై, హింసలపై జయము



నిర్గమ 17: 8-16.

ప్రార్దన:

మా మేలుకొరకై సర్వ సదుపాయములు కలుగచేసిన తండ్రీ! నీకు వందనములు. అందులో మమ్మును సంతోషపెట్టునవి, బాధపెట్టునవి రెండునూ ఇమిడి ఉన్నవి. అవన్నియు మా మేలు, క్షేమము కొరకే నీవు ఏర్పాటు చేసినావు గనుక నీకు స్తోత్రములు. మోషేచేత ప్రార్దన చేయించుటకే, నీ పిల్లలమీదకు అమాలేకీయులను రానిచ్చినావు. అలాగే మేమును తీవ్రమైన ప్రార్ధన చేయుటకే మా విరోధులను, మమ్మును హింసించు వారికి నీవు సెలవిచ్చినావు గనుక మా ద్వారా నీ అంతరంగ ఉద్దేశములు నెరవేర్చుకొనుటకు మాతో మాట్లాడుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్.

  • 1. అమోరీయులు,
  • 2. అమాలేకీయులు,
  • 3. కనానీయులు,
  • 4. ఎదోమియులు,
  • 5. మోయాబీయులు మొదలగువారు ఇశ్రాయేలీయులయొక్క శత్రువులు.

ఇంకనూ విరోధులు ఉన్నారుగాని వీరు ముఖ్యులు. ఇంతమంది ఉన్నప్పటికిని వారు ఇశ్రాయేలీయులను ఏమియు చేయలేకపోయిరి. నిస్సీ అనగా ధ్వజము. నిర్గమ 17:16 యెహోవా నిస్సీ అనగా యెహోవా జెండా లేక ధ్వజము. మోషేయొక్క ప్రార్ధన కొండశిఖరము ఎక్కింది. ఏదో ఒకటి అయ్యేవరకు ఆ ప్రార్ధన క్రిందకు దిగదు.

  • 1) కొండ ఎక్కినది ఎలాగు దిగుతుంది? దిగదు.
  • 2) శిఖరము ఎక్కినది ఇంక ఏలాగు దిగుతుంది?

కొండే ఎత్తు. దానికంటె శిఖరము ఇంకా ఎత్తు. మన ప్రార్ధనలు కూడా అట్లే ఉండవలెను. మామూలు ప్రార్ధనలు చాలవు. శిఖర ప్రార్ధనలు కావలెను. అది మామూలు యుద్ధముకాదు. అమాలేకీయులు ఇతరులతో యుద్ధము చేస్తే, అది మామూలు యుద్ధము. అయితే అమాలేకీయులు దేవుని జనముమీదికి యుద్ధమునకు వచ్చిరి. గాన అది మామూలు యుద్ధముకాదు. దేవుని జనము మీదికి వారు ఎప్పుడు వచ్చారో, అప్పుడు దేవునిమీదికి వచ్చినట్లే.


క్రైస్తవులమీదికి వచ్చిన శత్రువులు దేవునిమీదకు కూడా వచ్చినట్లే కాబట్టి ఈ యుద్ధము సామాన్యమైన యుద్ధముకాదు. గనుక మన ప్రార్ధనకూడ సామాన్యమైన ప్రార్ధన కాదు. శిఖరము ఎక్కి కూర్చుని దిగను అనే ప్రార్ధన కావలయును. "నాకు జయము వచ్చేవరకు నేను దిగేది లేదు" అనే ప్రార్ధన ఇప్పుడు చేయవలయును. దేశములోని "క్రైస్తవ సంఘము అంతటిమీదికి వచ్చిన యుద్ధము ఇది. సంఘము వారిమీదికి వచ్చినది, యుద్ధము చేయుటకు కాదు. వారే యుద్ధము చేయుట, వీరు గెలుచుట. అమాలేకీయులు దేవుని జనముమీదికి వచ్చారుగాని దేవుని జనము అమాలేకీయుల మీదకు రాలేదు. అయితే దేవుని జనము జయించుటకు వచ్చారు. కాబట్టి కాపుదల కొరకు ప్రార్ధనా యుద్ధము చేయుట తప్పదు. ఆ కాలములో శత్రువులయొక్క ఉద్దేశమేమంటే దేవుని జనమును నాశనము చేయుట. దేవుని జనమును నాశనము చేస్తే ఆ జనములో నుండి లోకరక్షకుడు రాడు. అది పిశాచియొక్క ఉద్దేశము. అందుచేత ఇశ్రాయేలీయులు యుద్ధము చేయవలయుననునది దేవుని ఏర్పాటైయున్నది. ఈ కథలో ఒకదరినుండి ప్రార్ధన జరుగుచున్నది(మోషే వలన), ఒక దరినుండి యుద్ధము జరుగుచున్నది(యెహోషువవలన). వీరిద్దరిలో ఎవరు గొప్పవారు? యెహోషువ వలన యుద్ధము, మోషేవలన ప్రార్ధన. గనుక ఇద్దరూ గొప్పవారే.


మోషే చేతులెత్తి ప్రార్ధించుటకు కారణమేమనగా - "అన్యులైన వారు జీవములేని దేవునికి చేతులెత్తి నమస్కరించగా, జీవముగల యెహోవాకు మరి ఎక్కువగా చేతులెత్తి ప్రార్ధించుట ఆయనను గౌరవించినట్లే". గనుక చేతులెత్తుట గౌరవమునకు సూచన.


మోషే బండమీద కూర్చుండెను:

అనగా బండమీద ఆధారపడెను. రాతిమీద పునాది వేయబడిన ఇల్లు పడదు. ఆ రాయి క్రీస్తు ప్రభువే. ఈ నా మాట ప్రకారముగా చేయు ప్రతివాడు "రాతిమీద పునాదివంటివాడు, అనగా రాతి పునాది వేయబడిన ఇల్లు వంటివాడు" అని ప్రభువు కొండ ప్రసంగములో చెప్పలేదా? గనుక మోషే చేతులు వాలిపోవునుగాని ప్రార్ధన వాలిపోదు. యెహోషువా కత్తి పట్టుకొన్న చేయి, అనగా ఆడిన చేయి ఆడినట్లే యున్నది గాని ఆగలేదు. ఈయన చేయి వాలిపోలేదు. అలాగే మోషే చేతిక్రిందనున్న అహరోను అలసిపోలేదు. అయినప్పటికి యుద్ధము ఆగలేదు.


నేటి క్రైస్తవ సంఘముమీద శత్రువులు దండెత్తినారు. గనుక ఇప్పుడు సంఘము మోషేవలె ప్రార్ధనలో ఉండాలి. తక్కినవారు గ్రామములు, పట్టణములు తిరిగి ప్రసంగము చేయాలి. క్రైస్తవులారా! మీరు అధైర్యపడకండి. దేవుడు మనకు తోడైయున్నాడు. వారికి తెలియక ఇట్లు చేస్తున్నారని ధైర్యముగా చెప్పవలయును. ఈ కథలో ప్రార్ధన ఉన్నది. ప్రయత్నమున్నది. ప్రార్ధన చేసినంత మాత్రమున ఫలితములేదు. ఆయా శ్రమలయందున్న వారికి ఆదరణ చెప్పవలయును. మరియు హింసకుల యొద్దకు వెళ్ళి ఓ హింసకులారా! "మీరెందుకు మా క్రైస్తవులను హింసిస్తున్నారు?" అని వారిని ప్రశ్నించి, వారి ప్రశ్నలకు సమాధానములు చెప్పి మరియొకసారి అట్టి ప్రసంగములు చేయకుండ చెప్పవలయును.


“మీ మతము మీరు బోధించుకొండి, మా మతము మేము బోధించుకొంటాము" అని చెప్పాలి. అది మాత్రమేగాక వారి ప్రశ్నలన్నిటికి జవాబులు చెప్పవలయును. ఒక ప్రార్ధన మాత్రమే గాక ప్రయత్నములుకూడా చేయవలయును. అట్టి తీరునుబట్టి మనకు జయము తప్పక కలుగును. కాబట్టి ఈ రెండు రకముల పనులు ప్రతిచోట, ప్రతి స్థలములోను విరివిగా, విపరీతముగా చేయవలయును. శత్రువులు మనలను వెళ్ళగొట్టవలెనని వారు లక్షలకొలది సొమ్ము పోగుచేయుచున్నారు.


క్రైస్తవులకు కలుగు హింసలకు కారణములు:

  • 1. క్రైస్తవులలో (అనేకమందికి) పాపవిసర్జన లేదు.
  • 2. గుడికి శ్రద్ధగా వెళ్ళుటలేదు.
  • 3. సంఘాభివృద్ధికి సరిగా చందావేయుటలేదు.
  • 4. అనుదినము బైబిలు నేర్చుకొనుటలేదు.
  • 5. అనుదినము కుటుంబ ప్రార్ధనలేదు.
  • 6. తాము నమ్మినది ఇతరులకు సరిగా చెప్పుటలేదు.
  • 7. మిషనుల భేదములు పెట్టుకొని ఒకరికొకరు విరోధముగా ఉంటున్నారు.
  • 8. ఇతర మతముల గురించియు, మిషనుల గురించియు, బైబిలులోని కఠినమైన వాక్యములగురించియు ప్రశ్నలున్నపుడు మనుష్యులను అడుగుచున్నారు గాని దేవునిని అడుగుట లేదు. (ఇది గొప్ప నేరము)
  • 9. బీదలకు, రోగులకు అవసరముగలవారికి సరియైన సహాయము చేయుటలేదు.
  • 10. సంఘములోని నేరస్తుల విషయములో సరియైన దిద్దుబాటు చేయుటలేదు.
  • 11. కుటుంబములోని కలహములు, పిల్లలయొక్క తిరుగుబాటులను ఆపుచేయుటలేదు.
  • 12. కేవలము పూర్తిగా దేవునిమీద ఆధారపడుటలేదు. ఏలీయా కాకులమీద ఆధారపడలేదుగాని వాటిని పంపిన దేవునిమీద ఆధారపడెను. అలాగే దేవుడు మనకు అనుగ్రహించిన వాటిమీద, వారిమీద ఆనుకొనవచ్చును. గాని ముఖ్యాధారము కీస్తుప్రభువే అయియుండవలెను.
  • 13. తరచుగా ఆనంద కీర్తనలు పాడుటలో లోపము కలదు.
    షరా:- ఇట్టివాటిలో లోపములుంటే, "శ్రమలు కెరటములవలె, తరచుగా మనమీదికి వచ్చుచుండును".
  • 14. తిండి మత్తువలన అశ్రద్ధ.
  • 15. ఐహిక విచారమువలన అశ్రద్ధ.
  • 16. సోమరితనమువలన అశ్రద్ద.
  • 17. శ్రమకాలమందు భయపడుట. మీరు భయయవడుటవలన శత్రువులకు జయమని బైభిలులోనే యున్నది.
  • 18. మా సంతోషముయొక్క కొలత తగ్గించుటవలన హాని. సంతోషమువలన మనకు జెండా వచ్చును. ప్రభువు కొండ ప్రసంగములో ఏమి చెప్పినారంటే, మీకు శ్రమలు వచ్చునపుడెక్కువ సంతోషింపవలెను - మత్తయి 5:11.
  • 19. ప్రార్ధన నెరవేరనపుడు విసుగుకొనుట వల్ల ఆత్మీయ జీవనము తగ్గిపోవును.

ఈ కారణములవలన శ్రమలు సంఘముపైకి వచ్చుచున్నవి. మనము సరిచేసి కొనవలసినవి సరిచేసికొని, చేయవలసిన ప్రార్ధనలు ముగించినపుడు శ్రమపై జయము వచ్చును.


దీవెన:

ఆలాగు శ్రమలపై సంపూర్ణ జయముపొంది ఆయన రాకడకు ఆయత్తపడు ధన్యత ప్రభువు మీకు దయచేయునుగాక! ఆమేన్.