మోషే సుఖోపవాస 40 దినముల వరముల కొరకైన క్లుప్త చరిత్ర
మోషే ఉపవాస దినములకు
- రాకడ ఉపవాసములనియు,
- వరముల కొరకైన ఉపవాసములనియు,
- అద్భుత శక్తికొరకు ప్రార్ధించు దినములనియు పేర్లు వాడుకలగలవు
ఈ ఉపవాస దినములు ఏర్పడుటకుగల ముఖ్యకారణము: గుంటూరు సన్నిధి కూటములో ఒకరికి సన్నిధిలో ఉండగా ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనము తరచుగా వస్తున్నందువలన దైవజనుడైన శ్రీ. యం. దేవదాసు అయ్యగారికి తెలియచేసిరి. ఆ దర్శనమేమనగా ఒక చక్కని కర్ర దానికి ఇరుప్రక్కల గజ్జలు గలిగి సన్నిధిలో కనబడెను. దానినిచూచి విశ్వాసులందరు అందుకొన ప్రయత్నించగా అది పైకి వెళ్ళుచున్నది. మరలా ప్రజలు వెనుకకు వెళ్ళినపుడు అది క్రిందికి వస్తున్నది. అందుచేత ఆ కర్రను ఎవరూ అందుకొనలేకపోయిరి. అట్లు చాలాసేపు జరిగిన తర్వాత చాల పర్యాయములు జరిగిన తరువాత దైవజనుని వద్దకు వెళ్ళి చెప్పగా దైవజనులైన యం. దేవదాసు అయ్యగారు ఈలాగున చెప్పిరి. "ఇది మోషే కర్ర, వరముల కర్ర. దేవుడు మోషేకు ఇచ్చినట్లు మీ సన్నిధి కూటస్తులకు ఇచ్చుటకు ఇష్టపడుచున్నాడు. గనుక మోషేవలె 40 దినములు ఉపవాసముండి ప్రార్థించగలిగితే అది తప్పక మీకు అనుగ్రహించును" అని చెప్పిరి.
మోషే చేసినది కఠినోపవాసము. మీరైతే సుఖోపవాసము చేయవచ్చునని సలహా ఇచ్చిరి. అప్పుడు తక్కిన సంఘములకును తెలియపరచిరి. ఈలాగున వ్రాసిరి.
మీకు ఈ కరపత్రము అందినప్పటి నుండియైనా ఈ ఉపవాసము ప్రారంభించి చేయవచ్చునని దైవజనుడు వ్రాయించెను. ఇట్లు జూలై ఒకటినుండి ఆగస్టు తొమ్మిదివరకు 40 దినములైనవి. ప్రతి దినము సన్నిధికూటములోను, సన్నిధికి వెళ్ళలేనివారు ఇండ్లలోను ఉపవాసము చేసిరి. ఆదివారము మాత్రము సంఘమంతాకూడి రాత్రి 7 గం॥ల నుండి 10 గం॥ల వరకు మహా ఉత్సాహముతో విసుగుదలలేని ఉపవాసములు జరిగించిరి. ఇంకా చివరి దినములలో దైవజనుడు ఒక ప్రోగ్రాము (కార్యక్రమము) ఇచ్చిరి.
నిత్యజీవ సన్నిధివారు వారితోపాటు క్రీస్తుమూర్తిగారును కలసి, 40 దినములు ఉపవాసము చేసిన వారిని తెలిసికొని, వారి గృహములను దర్శించవలెనని చెప్పిరి. దానితో ఒక చక్కని పద్దతి ఏర్పాటు చెప్పిరి. ఏదనగా మీరు ఇండ్లకు వెళ్ళినపుడు బోధచేయవద్దు, ఇతర మాటలు మాట్లాడవద్దు. మీరు వెళ్ళి ఆ ఉపవాసపరుల పేరు మీ నోటుబుక్ మీద ఎర్ర సిరాతో వ్రాయండి. తరువాత వారి గుమ్మములో ఎర్రపెన్సిల్ తో సిలువగుర్తు వేయండి. ఆ తరువాత వారిని దీవించండి. దీవించునపుడు ఈ మాటలు మాత్రము చెప్పండి అని చెప్పిరి. ఆ మాటలేవనగా "త్రియేక దేవుడు ఏ ఉద్దేశముతో ఏ దీవెనలిచ్చుటకు మమ్మును మీ ఇంటికి పంపిరో ఆ దీవెనలన్నియు, మీకనుగ్రహించునుగాక. ఆమేన్." అని చెప్పి వచ్చివేయండి. ఎన్ని సంగతులున్నా ఇంకొక దినము మాట్లాడి ప్రార్థించవచ్చును గాని ఇప్పుడు మాత్రము ఏమి మాట్లాడవద్దని చెప్పిరి. గుంటూరు సంఘమంతా చేసియుంటిమి చాల గంభీరమైన శక్తితో, భక్తితో ఈ పని చేసినందున గొప్ప సంతోషము ఆత్మలకునూ, గొప్ప మేలులు శరీరమునకునూ కలిగినవి. తండ్రికే స్తోత్రము.
ప్రియులారా ఇది ఆగస్టు 9 వరకు జరిగిన ప్రోగ్రాము (లేక) కార్యక్రమము అయితే దైవజనుడు ఒకమాట చెప్పారు. ఈ 40 దినములు ముగించిన తరువాత మరుదినము అనగా ఆగస్టు 10వ తేదీ పండుగ జరిగించుకొందాము అని చెప్పిరి. మమ్మును సన్నిధిలో కార్యక్రమము ఏమైయున్నదో అడుగుమని చెప్పగా ఆ ప్రశ్న సన్నిధిలో పెట్టగా ప్రభువు ఈలాగు చెప్పిరి. "మీకు దైవజనుడు ఇన్ని ఘనమైన సంగతులును, గంభీరమైన ఉపదేశము నిచ్చినందున మిమ్మును ఇంతగా తయారుచేసినందుకు ఆయనను ఘనపరచుడి" అని చెప్పిరి. తండ్రీ ఎట్లా ఘనపరచవలెనని మరలా ప్రశ్నించగా ఆయనను తైలముపోసి అభిషేకించండని చెప్పిరి. ఎవరెవరు అభిషేకించాలి అని అడిగినప్పుడు ముగ్గురు వ్యక్తుల పేర్లు చెప్పిరి. ఆ ముగ్గురు ఏమి చెప్పి తలమీద తైలము పోయాలి అని దైవజనుని అడుగగా అదికూడ మీరు ప్రభువునడిగి తెలిసికొండని చెప్పిరి. ఈ ప్రకారము సిద్ధపడి పండుగను ఆచరించితిమి. దైవజనుడైతే 11 గంటలకు బోంచేసి అప్పటినుండి రాత్రి 12 గంటలవరకు ఏమి పుచ్చుకొనలేదు. ఒకరు ఈలాగు చెప్పిరి. 4 గంటలకు ఒక గుక్క హార్లిక్సుకూడ త్రాగలేదు. వారు వృద్దులు టైమ్ ప్రకారము భోంచేసేవారు అయిననూ ప్రభువుకు లోబడి అట్లు ఉపవాసముందిరి. తల స్నానంచేసి క్రొత్త వస్త్రములు ధరించి జరుగనైయున్న కార్యక్రమము కొరకు సిద్ధపడిరి తర్వాత సాయంత్రము 6 గం॥ల నుండి 12 గం॥ల వరకు ఈ కార్యక్రమము జరిగించిరి. సంఘమంతా మైనపు వత్తులు పట్టుకొని ఒకటి వెలిగించి తర్వాత అందరూ ఒకదానికొకటి వెలిగించి పట్టుకొనిరి. ఈ వాడుక ఇతర మిషనులలోను, గృహపండుగలలోను కూడ ఉన్నది. అనగా క్యాండిల్ లైట్ (Candle light service) సర్వీసు.
తరువాత కార్యక్రమము ఆరంభించిరి. తైలాభిషేక కార్యక్రమము వచ్చినప్పుడు దేవాలయమంతా నిశబ్బముగా ఉన్నది. ముగ్గురు వ్యక్తులు ఒకరితరువాత ఒకరు దైవజనుని స్థానము వద్దకు వెళ్ళి
- మొదట వ్యక్తి ఈలాగు చెప్పిరి. "సన్నిధిముందు 5 నిమిషములు మాట్లాడి తరువాత సన్నిధి నేర్పిన తండ్రికి సన్నిధి ఇచ్చిన తండ్రికి నా కృతజ్ఞత తెలియబుచ్చుటకు ఈలాగున తైలముపోసి అభిషేకించుచున్నానని" చెప్పి తైలముపోసి అభిషేకించిరి.
- రెండవవ్యక్తి అట్లే కొన్ని నిమిషములు మాట్లాడి "జ్ఞానము నేర్చిన తండ్రికి, జ్ఞానవరమిచ్చిన తండ్రికి నా హృదయ కృతజ్ఞతను చూపించుటకు ఈలాగు తైలముపోసి అభిషేకించుచున్నాను" అని అభిషేకించిరి.
- మూడవ వ్యక్తియు అట్లే "స్వరమిచ్చిన తండ్రికి నా హృదయ కృతజ్ఞతను చూపించుటకు ఈలాగు తైలముపోసి అభిషేకించుచున్నానని" సీసాలో ఉన్న తైలమంతాపోసి అభిషేకించిరి.
ప్రభువుకు స్తోత్రములు! ప్రియులారా! ఇది గంభీర చరిత్ర. ఇది అప్పుడు మాకు కొంచెమే అర్థమైనది గాన ఇకకాలము జరుగుచున్న కొలది ఇంకా ఈ తైలాభిషేకము యొక్క ప్రత్యేకత్వం పరిశుద్దత దాని అవసరము ఇప్పుడు ఎక్కువగా గ్రహించగలుగుచున్నాము దేవునికే స్తోత్రములు.
విశ్వాసజన సంఘమా! ఈ మాటలు పాటించి చేసి చూడండి. ఆ మహిమ మీకే తెలియనగును. ఎప్పుడైనా చేసి దీనివలన పొందగల శక్తి పొందండి. వరములు పొందండి. వెలిగించబడగోరండని నా సలహా. మరియొక సంగతి ఏమంటే దైవజనుని ఉపదేశమైన తరువాత అయ్యగారు కొంతసేపు అందరిచే స్తుతిచేయించి సన్నిధిలో ఉంచిరి. అప్పుడు ముగ్గురు వ్యక్తులకు దేవోక్తి వచ్చినందున ఒకరితరువాత ఒకరు మాట్లాడిరి.
- మొదటివారు యెహోవా దేవుని స్వరముతో మాట్లాడిరి. అనగా యెహోవా తండ్రి తన గంభీర స్వరముతో ఆమెలోఉండి మాట్లాడిరి. నిజముగా విన్న వారందరి హృదయములు కంపించినవి.
- తరువాత ప్రజలు అందోళన అణచుటకు మరియొక వ్యక్తిలో యేసుప్రభువు నిలచి, "పిల్లలారా! మీయొద్ద ఏమైన ఆహారమున్నదా అని గలిలయ సముద్రతీరమున నిలచి అడిగిన నజరేయుడైన యేసు అను నేను ఈమెలో ఉండి మాట్లాడుచున్నానని" ప్రారంభించి ప్రేమ హెచ్చరికలు దేవోక్తిద్వారా చెప్పిరి.
- తరువాత మూడవవ్యక్తిలో పరిశుద్ధాత్మ తండ్రి నిలచి చాల మంచి హెచ్చరికలిచ్చిరి.
ప్రభువుకు స్తోత్రములు! తర్వాత ప్రభువు వాక్కు ద్వారా ఈ క్రింది విషయములను నొక్కిచెప్పిరి. ఏమంటే ఎస్తేరును జ్ఞాపకము చేసికొంటు యూదులు పురీము పండుగను ఎట్లు ఆచరించిరో; యెప్తాకుమార్తెను ప్రసిద్ధి చేయుటకు 4 దినములు యూదులెట్లు నియమించుకొనిరో; అట్లే క్రొత్తనిబంధనలో మగ్దలేనే మరియ క్రీస్తు ప్రభువును తైలముతో అభిషేకించిన చరిత్ర మరువని చరిత్రగా ఎట్లు జ్ఞాపకము చేసికొనుచున్నారో; అట్లే బైబిలుమిషను వారలారా ఈ తైలాభిషేకమును మీ పండుగలలో ఒక పండుగగా ఆచరించవలెననియు దీనిని మరచి పోకూడదనియు ప్రభువు చెప్పినందున గుంటూరు సంఘమున్ను మరికొన్ని సంఘములున్నూ ఏటేట ఈ 40 దినముల ఉపవాస కార్యక్రమమును, ఆగస్టు 10వ తేదీన తేలాభిషేక పండుగయు జరిగించుచున్నాము. అయితే మనమంతా ఈ కార్యక్రమము చేయగలిగితే ఎంతో గొప్ప అనుభవము కలుగకమానదు.
ఈ మోషే 40 దినముల వరాల ఉపవాస ధ్యానములకై దైవజనులైన యం. దేవదాసు అయ్యగారి సందేశములతో కూడిన "మోషే సుఖోపవాస ధ్యానదీపిక" అను పుస్తకమునందలి ధ్యానములు పటించి ధ్యానించి, అనుసరించిన మీకెన్నియో మేళ్ళు కలుగును. ప్రభువు మీకిట్టి ప్రేరేపణ కలుగచేసి తన దీవెనలు కుమ్మరించునుగాక!