22. నిర్గమకాండ ధ్యానము

సాక్ష్యపు మందసము



నిర్గమ. 40:20; సంఖ్యా. 17:10;

ప్రార్ధన:

తండ్రీ! మమ్మును సృజించి, మాతో ఉన్న తండ్రీ వందనములు. "నీవు మాతోనే ఉన్నావని మానవ చరిత్ర అంతటిలో బుజువు చేసికొన్న ఆ తండ్రీ! నీకు స్తోత్రములు. పాతనిబంధన కాలములో సాక్ష్యపు మందసమును ఆధారముగా చేసికొని, నీ పిల్లలతో ప్రయాణించి, వారితో ముచ్చటించి, వారిని కనాను చేర్చిన తండ్రి! నూతన నిబంధనలో నీ బిడ్డలమైన మాతో ఉండుటకు, మా రూపములో, మా పోలికలో దిగివచ్చివేసిన తండ్రీ నీకు నమస్కారములు. ఏ విధముగానైనను నీ విలువను, నీ ప్రేమను మేము పూర్తిగా గ్రహించలేము. నేడు నీ సన్నిధి మాతో ఉంచి, మాతో మాట్లాడుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్.


ఈ రోజు పాటము పేరు సాక్ష్యపు మందసము. ఈ సాక్ష్యార్ధపు మందసములో లేక పెట్టెలో పది ఆజ్ఞలుగల రాతి పలకలు, చిగురించిన అహరోను కర్ర ఉంచబడెను. ఆ పెట్టెను కెరూబులు తమ రెండు రెక్కలతో కప్పుచుండెను.


దేవుడు ఈ పెట్టెను ఎందుకు తయారు చేయించెను? నేను మనుష్యులలో కలసి మెలసి ఉంటానని తెలియజేయుటకు ఈ పెట్టెను చేయించెను. మనము మన వస్తువులను భద్రము చేసికొనుటకు పెట్టె చేయించుకొంటాము. 'నేను నా ప్రజలమధ్య ఉన్నాను. నేను నా ప్రజలను భద్రము చేసికొన్నాను' అని దేవుడు ఈ పెట్టె చేయించెను. మరియు నా ప్రజలు నన్ను ఎక్కడికి తీసికొని వెళ్ళితే అక్కడికి వెళ్తాను అనికూడ దీని అర్ధము.

  • 1) పెట్టె మన దగ్గరకు రావడము.
  • 2) మనతో పెట్టె రావడము.

'నేను నా ప్రజల దగ్గరకు వెళ్తాను. వారు ఏ పనిచెప్పితే ఆ పని చేస్తాను. వారిని కాపాడుతాను' ఇది దేవుని తలంపై ఉన్నది.

  • 1) ఈ పెట్టెను కర్రతో చేసినారు.
  • 2) ఇది అడవి కర్రతో చేయబడినది.

అనగా ఎండిన భూమిలో మొలచిన మొక్కయొక్క కర్ర. ఆ కర్ర దేవుని వాక్యము అనగా యేసుప్రభువు. మన్నా అనగా యేసుప్రభువు. కరుణాపీఠము అనగా యేసుప్రభువు యొక్క కృప (యోహాను. 1:14). డేరాలో ప్రజలు ఆరాధనలో ఉన్నారు. వారు ఆయన కాంతిలో ఉన్నారు.

  • (1) ఆరాధన స్థలములో నెమ్మది, సంతోషము, శాంతి కలదు.
  • (2) ఆరాధన అనగా దేవుడు ఉండే స్థలము.
  • (3) ఆరాధన అనగా మనిషి ఉండే స్థలము.
  • (4) ఆరాధన అనగా శాంతి ఉండే స్థలము.
  • (5) ఆరాధన అనగా నెమ్మది ఉండే స్థలము.

ఆరాధనలో ఉండే మనిషి అన్ని అనుభవించటమే వీటన్నిటికి కారణము. అనగా వీటన్నిటి యొక్క ఉద్దేశమై ఉన్నది.


మందసము ఉండుట: మందసము అనగా క్రీస్తు ప్రభువు. అన్నిటికి ముందు క్రీస్తుప్రభువు ఉండవలెను. అన్నిటి ఎదుట, మన ఎదుట యేసుప్రభువు ఉండవలెను. ఈలాగు క్రీస్తుప్రభువును ముందుపెట్టుకొని నడుచు వారికి సమస్తమును ఉండును.


కొలస్స 1:18. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలిగేటట్టు మనము ప్రవర్తించవలెను. ఆదివారమున మనము "ఈ దినము ఎవరిది వ్రసంగము అందుము" గాని ఈ ఆదివారము యేసుప్రభువు ఏమి చెప్పారు? అని అనము. పూర్వము ఇశ్రాయేలీయులు - ఈ దినము "దేవుడు ఏ పాఠము చెప్పెను" అనేవారు. ఆరాధనలో మనము మొదటి కుర్చీ ప్రభువునకు వేయకపోతే ప్రయోజనము లేదు. ఆరాధన స్థలములో నుండి ఇశ్రాయేలీయులు అరణ్యసంచారమునకు వెళ్ళిపోయిరి.

సంచారము:

ఇశ్రాయేలీయులు 40సం॥లు అరణ్య సంచారము చేసిరి. అరణ్యము అనగా ముళ్ళు, రాళ్ళు, అడవి జంతువులుండు న్ధలము, బజారులులేనిది, సహాయములేనిది. అయితే మందసము వారితోకూడ ఉండుట వలన వారికి కొదువలేకపోయెను. గనుక మనమును యేసుప్రభువును మనతో తీసికొని వెళ్ళితే మనకు ఏ కొదువయుండదు. ఇశ్రాయేలీయులు యెరికో చుట్టు తిరిగినపుడు వారి దగ్గర ఏ ఆయుధములు లేవుగాని మందసమున్నది. యెరికో గోడలు బలమైనవి. దాని ద్వారములు ఏనుగులతోనే వేయుచుండిరి. మనము ప్రభువును ఘనపరచితే అవుడంతా నఫలమగును. ఈలాగుచేస్తే అనగా నిశ్శబ్దముగాను, నిశ్చయముగాను, జయమువల్లను మన గృహములో యేనుప్రభువును ఘనవరచితే అక్కడే మనకు దీవెన ఉండును. మందసము వలన పట్టణమునకు కాపుదల. యెషయా 42:8లో నాకు రావలసిన ఘనతను ఎవరికిని చెందనియ్యను అని వ్రాయబడినది. అన్నిటిలోను ఘనత ప్రభువునకు వచ్చునట్లు చూడవలెను. ఆ ఘనత మనము తీసికొంటే మనకు హాని.

పాత నిబంధన - క్రొత్తనిబంధన

దేవుడు పాతనిబంధనలో సెలవిచ్చినవి రెండు భాగములుగా నున్నవి. ఇవి క్రొత్త నిబంధనకు ముంగుర్తులుగానున్నవి. అనగా పాతనిబంధనలోని నీడ, క్రొత్తనిబంధనయొక్క నిజ స్వరూపమునకు ముంగుర్తుగా ఉన్నది. అనగా పాత నిబంధనలోని సంగతులు 'కొత్త నిబంధనకు ముంగుర్తుగా నున్నవి. ముంగుర్తు అనగా చాయయొక్క నిజ స్వరూపము. అనగా ఆ చాయకు ఆధారమైనది లేక చాయయొక్క అసలు రూపమై ఉన్నది. పాత నిబంధనలో జరిగిన జంతుబలి చాయ. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు సిలువమీద చేసిన ప్రాయశ్చిత్తము నిజస్వరూపము. పాత నిబంధనలో శరీర సున్నతిగలవాడు యూదుడు. అయితే, క్రొత్త నిబంధనలో హృదయ మార్పు గలవాడే యూదుడు. అలాగే సబ్బాతుకూడాను. పాతనిబంధన మామిడి కాయ అయితే కొత్త నిబంధన మామిడిపండు. పండువచ్చి కాయను కొట్టివేసినది. అనగా కాయను నెరవేర్చినది. కొండ ప్రసంగములో యేసుప్రభువు ఛాయా రూపకములగు జంతుబలి, సున్నతి, సబ్బాతు మొదలగు వాటిని గూర్చి చెప్పలేదు. ఎందుకనగా ఇవన్ని ఆయనను బట్టి నెరవేరవలసియున్నవి. పాతనిబంధనలో పది ఆజ్ఞలు, ఛాయలు కలసియున్నవి. నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమించవలెను. ఇది నూతన నిబంధన ఆజ్ఞయై ఉన్నది.


శత్రువులను సంహరించవలెను - పాత నిబంధన
శత్రువులను ప్రేమించవలెను - కొత్త నిబంధన

వ్యభిచారము చేయవద్దు - పాతనిబంధన
తలంపులోనైన చేయవద్దు - క్రొత్తనిబంధన


బలివేయవలెను ఇది ఛాయ మరియు ఆజ్ఞ అలాగే సబ్బాతుకూడ ఛాయ మరియు ఆజ్ఞ. ధర్మశాస్త్రములోని ఛాయలను, ఆజ్ఞలను ఎవరు చేస్తారో వారే నీతిమంతులు. శాస్త్రుల నీతికంటెను, పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోక రాజ్యము చేరరు. మనకు ఇవన్నియు, వీటితోపాటు కొంచెము ఎక్కువయును ఉన్నది. అలాగే పాత నిబంధనవారు దశమ భాగమిచ్చిరి. అయితే మనము దశమ భాగమును, దానికి కొంచెము ఎక్కువగాను ఇయ్యవలసియుండును. యూదుల మతము క్రీస్తుమతములోనికి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అయినది గనుక పదియవ భాగముకంటె కొంచెము ఎక్కువగా ఇయ్యవలెను (పాత నిబంధనకంటె, క్రొత్త నిబంధన ఇంకా ఎక్కువ గనుక). పాత నిబంధనలో పూజారులు ఉన్నారు. క్రొత్త నిబంధనలో సువార్తికులున్నారు. గనుక వీరికి దశమభాగముకంటె ఎక్కువ రావలెను. బైబిలులో పదియవ భాగము ఇవ్వవలెననిలేదుగాని తీసుకొని రావలెననియున్నది. ప్రజలు తీసికొని వెళ్ళి దేవునికి ఇచ్చిరి. దేవుడు వాటిని పూజారుల తీసికొనవలసినదని ఏర్పాటుచేసెను. దశమ భాగములు ఇవ్వవద్దని పిశాచి ఊదుచున్నాడు. ఇస్తే సువార్తికులు పని భాగా చేస్తారు. చేస్తే 'పిశాచి రాజ్యము' వర్ధిల్లదు. ఇవ్వనివారు దొంగలని మలాకీలో వ్రాయబడియున్నది. అనగా ఇవ్వనివారికి దొంగలని పేరు పెట్టబడెను, శాపగ్రస్తుడు అనికూడా ఉన్నది. అప్పుడు వారికి జరిమాన ఉన్నదని సంఖ్య, లేవీయకాండములలో ఉన్నది.


ఉదా:- పదియవవంతు క్రమముగా ఒక వర్తకుడు ఇచ్చుచుండెను. చివరకు తనకు పదివేల రూపాయలు లాభము వచ్చెను. ఆ వర్తకుడు పదివేలలో దశమభాగము ఇచ్చుటకు ఇష్టములేక తక్కువ ఇచ్చెను. అప్పుడు లాభము తగ్గిపోయెను. ఓడ మునిగిపోయెను. ఇది దేవుడు వేసిన పందెము: దశమభాగము ఇచ్చి దేవునిని శోధించండి. ఒకనికి వంద రూపాయలు జీతము. అందులో దశమ భాగము 10రూ. మిగతావి 90 రూపాయలు; అలాగే అటువంటి జీతముగల 12గురు సువార్తికునికి ఈ రీతిగా ఇస్తే, సువార్తికునికి 120 వచ్చును. అనగా దేవుని సేవకునికే ఎక్కువ.


దేవుడిచ్చిన స్వాస్థ్యములో 11 గోత్రములవారే ఉన్నారు. ఒక గోత్రమువారు లేరు అనగా లేవీగోత్రము వారులేరు. వారికి దేవుడే స్వాస్థ్యము. యోసేపుకును మనష్షే ఎఫ్రాయీములకు రెండు గోత్రములు అనగా మొత్తం 13 గోత్రములు అందులో ఒక గోత్రము అనగా లేవీ గోత్రమును తీసివేస్తే, మిగిలినవి 12 గోత్రములు.


ఈ గోత్రములో ముగ్గురున్నారు.

  • 1) విశ్వాసులు,
  • 2) సువార్తికులు,
  • 3) దేవుడు

ఇవి లూధరన్ మిషనులో చెప్పబడలేదు ఎందుకంటే

  • 1) వారు చదువనందున,
  • 2) యూదులకు మాత్రమేయని అనుకొన్నందున,
  • 3) చెప్పితే ఏమైన అనుకుంటారేమోనని తలంచినందున చెప్పలేదు.

దీవెన:

ఈలాగున క్రీస్తు ప్రభువుతో సహవాసముచేసి, ఆయన స్వాస్థ్యముగా ఈ లోకములోనే మారుటకు కావల్సిన సంపూర్ణ సమర్పణ, విధేయతలను పెండ్లికుమారుడు నేటి దిన ధ్యానముద్వారా మీకు దయచేయును గాక! ఆమేన్.