39. నిర్గమకాండ ధ్యానము

నిర్గమకాండ సారము - దిగివచ్చుట, నడిపించుట



నిర్గమ. 19:1-25.

ప్రార్దన:

తండ్రీ! నీవు ఏ సమయమందును మాకు వేరుగాలేవు గనుక నీకు వందనములు. నీ పిల్లలమధ్యకు నీవు దిగివచ్చిన రీతినే, మా మధ్యకు దిగివచ్చి, మమ్మును నీతో ఏకముచేసికొనుటకు నీ వాక్య వర్తమానము ఇమ్మని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్.


నిర్గమ 19:5. ఇశ్రాయేలీయులు ఆయన స్వకీయ జనాంగము. వారే ఆయనకు యాజక రూపమైన రాజ్యము.


1వ భాగము:- ఇందు రెండు భాగములు కలవు.

  • 1) విమోచన.
  • 2) దిగివచ్చుట;

నిర్గమ 15వ అధ్యాయమునుండి, పై రెండు అంశములలో ముఖ్యముగా దేవుడు దిగివచ్చుట అనేది చూస్తున్నాము. నిర్గమకాండములో తన ప్రజలు కష్టములో ఉన్నప్పుడు వారిని విడిపించుటకు ఆయన దిగివచ్చెను. ఏదేను తోటలో వారు దిగంబరులుగా ఉన్నప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటకు దిగివచ్చియున్నారు. కాలము సంపూర్ణమైనప్పుడు బేత్లేహేము తొట్టెలోనికి దిగివచ్చెను. 120మంది మేడగదిలో ఉన్నప్పుడు ఆయన మరియొక మారు దిగివచ్చెను. రేపు రెండవ రాకడలో మరియొకసారి దిగివచ్చును.


1. దిగివచ్చుట

  • 1) ఏదెను - దిగివచ్చుట
  • 2) ఇశ్రాయేలు - దిగివచ్చుట
  • 3) బేత్లేహేము - పుట్టుట
  • 4) 120మంది - దిగివచ్చుట.
  • 5) రెండవ రాకడ - దిగివచ్చును.
  • 6) ఏడేండ్ల చివర హర్మెగిద్దోను యుద్ధము దిగివచ్చును.
  • 7) చివర గోగు మాగోగు యుద్ధము. అప్పుడు ఆయన ఏడవసారి దిగివచ్చును.

2. రక్తములేనిదే విమోచన లేనేలేదు. గనుక క్రీస్తుయొక్క (గొర్రెపిల్ల) రక్తమును వారు గుమ్మపు ద్వార బంధములకు పూసికొన్నట్లు మనము మన హృదయములకు విశ్వాసమును రాసికొనవలెను. హెబ్రీ 10:26-29. ఈ రక్తము తొక్కించుట అని అర్ధము. హెబ్రీ. 6:5-6.


2వ భాగము:-
  • 1) మోషేయొక్క పిలుపు,
  • 2) మోషే ఐగుప్తుకు వచ్చుట,
  • 3) ఫరోతో కలహమాడుట
  • 4) ఇశ్రాయేలీయులు బయటకు వచ్చుట.
  • 1. దేవుడు కనబడినది -- పొద
  • 2. మోషే హృదయములో -- వధ
  • 3. మోషే దేవునితో చెప్పిన -- సొద
  • 4. దేవుడు మోషేతో చెప్పినది -- పద
  • 5. ఇది అంతా నిజమే -- గదా!

అహరోను కర్ర జీవమునకు ముంగుర్తు. అది మాంత్రికుల కర్రలను మింగివేసెను. ఇది పునరుత్థానమునకు సూచన. ప్రభువు తన జీవముతో తన మరణమును మింగివేసెను అనునది అహరోను కర్రలో చూడగలము. నిర్గమ. 7వ అధ్యాయము. మోషేను దేవుడు పిలిచి పనిచేయుటకు శక్తిని అనుగ్రహించి వాడుకొనెను. సేవకులుకూడా తాము మంటి వారమని భావించి సంపూర్ణముగా దేవునిపై ఆధారపడిన యెడల ఆయన బలముగా వాడుకొనును. మోషే అంతగొప్ప నాయకునిగా గతకాలములోగాని, రాబోవుకాలములోగాని మోషే వంటి ఆయనను చూడలేము. 9 అద్భుతములుచేసి, ఫరోతో కలహపడి 10 అద్భుతముల ద్వారా వారిని విడిపించెను.


3వ భాగము:- నిర్గమ. 15:22. 19వ అధ్యాయము అంతా. దేవుడు వారికి ప్రత్యక్షమై ఆత్మ విద్యను నేర్పుట మొదలుపెట్టెను. ఇది 40సం॥ల యాత్ర పాఠశాల. ఈ యాత్రలో జరిగిన విషయములన్నిటిద్వారా వారు సంపూర్ణముగా ప్రభువుపై ఆధారపడుట నేర్పించుకొనవలయును. విధేయులైనవారియెడల ఆయన ఎట్టి కార్యమైన చేయగలడు. కాని ఇన్నీ మేళ్ళు చేసిన దేవుని జ్ఞాపకము చేసికొనాలి. ఐగుప్తులోనే తిండిని జ్ఞాపకము చేసికొనిరి. విశ్వాసులుకూడ ఇట్టి కృతార్దులైయుందురా?


మారానుండి ఏలీమువరకు ప్రయాణము మారాలో చేదు అనుభవించుట. తరువాత తీయని ఖర్జూరపుపండ్లు ఎలీమువరకు చేరుకొన్నారు. అలాగే విశ్వాసియొక్క జీవితములో కష్టములు వచ్చును. తరువాత ఏలీము మధురమువంటి సమయము వచ్చును. తరువాత సీను అరణ్యము చేరుకొన్నారు. ఇక్కడ మన్నా కురియుట ప్రారంభమాయెను. రెఫీదీము చేరిరి. ఇక్కడ అమాలేకీయులతో యుద్ధముచేసిరి.


అమాలేకీయులు=ఆది 36:12. శరీర రీతిగా జన్మించినవారు గనుక శరీరమునకు=ఆత్మకును ఎప్పుడు యుద్ధము జరుగుచున్నట్లు అమాలేకీయులకు ఇశ్రాయేలీయులకు ఎప్పుడు యుద్ధమే.


4వ భాగము:- అర్పింపబడుట. నిర్గమ. 20-28వ అధ్యాయము. మన విమోచకునియొక్క చిత్తము నెరవేర్చుకొనుటకు సమర్పణ చేసికొనవలయును. ఆయన సేవకొరకు ప్రతిష్టించుకొనవలయును. ఇశ్రాయేలీయుల నాయకుడు మరియు విమోచకుడైన యెహోషువా దేవుని చిత్తమునకు లోబడి ఆయన సేవ చేయవలయును గనుక వారి నడతలకు విశ్వాసమునకు కావలసిన ఆజ్ఞలు ఇవ్వబడెను.


5వ భాగము:- ఆరాధన. నిర్గమ. 24వ అధ్యా॥నుండి 40వ అధ్యాయము వరకు. ప్రత్యక్ష గుడారము ఇవ్వబడెను. దైవసన్నిధి స్థాపించబడెను. దేవుడే మానవులమధ్య నివసించుటకు ఏర్పాటు చేసికొనెను. వారి పరిశుద్ధతకు కావలసిన విధులు ఇయ్యబడెను. దేవాలయమునందు ప్రతిభాగమును ప్రార్ధనాపూర్వకముగా నేర్చుకొనవలెను. ప్రభువు మనమధ్య నివసించును. రేపు పరలోకములో ఆయన, మనము కలసియుందుము అనుటకు సూచనయైయున్నది.


దీవెన:

ఆలాగు నేటిదిన ధ్యానముద్వారా పెండ్లికుమారునితో ఐక్యపరచబడి, నిత్య సహవానములో ఉండుటకు ఇక్కడే ఆయన మిమ్మును సిద్ధపర్చునుగాక! ఆమేన్.