1. నిర్గమకాండములోని భాగములు
1. నిర్గమకాండ ధ్యానము
నిర్గమ 24:7.
ప్రారంభ ప్రార్ధన:
దేవా! మాకు కలిగే
శ్రమలు మా మేలు
నిమిత్తమై ఉపయోగించుము. ఇశ్రాయేలీయులకు ఐగుప్తులో కలిగిన శ్రమలద్వారావారిని రాజ్యమునకు
ప్రత్యేక
జనముగా యుండుటకు సిద్దపర్చిన రీతిగా మమ్మునుకూడ సిద్దపర్చుము.
దేవా! వెనుకనున్న శత్రువులవల్లగాని, ఎదుట
ఉన్న నీళ్ళవల్లగాని హానికలుగకుండ అద్భుతమైన రీతిగా నీ జనులను కాపాడిన విధముగా మమ్ములనుకూడ సైతాను,
లోకము,
శరీరము అను శత్రువులనుండి కాపాడి, ఆటంకములనుండి విడిపించుమని వేడుకొనుచున్నాము.
దేవా! నలుబది
ఏండ్లు ఇశ్రాయేలీయులకు ఆహారమిచ్చిన పోషకుడవుగాను, ఆజ్ఞలు బోధించు బోధకుడవుగాను, అరణ్యములో నడిపించిన
మార్గదర్శకుడవుగాను ఉన్న విధముగా, మమ్ములనుకూడా ఈ లోకారణ్యములో పోషించుచు, నీ బోధ చూపించుచు, అన్ని
అంధకారముల నుండి క్షేమముగా నడిపించుమని వేడుకొనుచున్నాము. ఇశ్రాయేలీయులకు ప్రార్ధన సమయమందు జయము
కలిగినట్లు, విసుగుదలలేని ప్రార్ధనాశక్తి మాకును అనుగ్రహించుము. మా ప్రార్ధనా చేతులు వాలకుండునట్లు
మమ్మును
బలపర్చుము. ఎప్పుడైనను, ఎక్కడైనను, కొంచెమైనను సైతాను శోధనలోపడే అజ్ఞానము కలుగనీయకుము. నీవే
జయమును ప్రకటించుమని వేడుకొనుచున్నాము.
అనంతుడవైన దేవా! చేదు నీళ్లను మంచినీళ్లగాను, సామాన్య జలమును
ద్రాక్షారసముగాను, మార్చిన నీవు మాకన్నీళ్లను ఆనంద - భాష్పములుగా మార్చుమని వేడుకొనుచున్నాము. నీ కృప
మాకు
తోడైయుండునుగాక, విడుదల అయిన తర్వాత ఓ విమోచనకర్తా ఇశ్రాయేలీయులకు స్తుతి కీర్తన నేర్పినావు.
పరలోకమునకు
వినబడే స్తుతి క్రీర్తన రాగము మాకు ఇక్కడే నేర్పుమని వేడుకొనుచున్నాము. నీ జనాంగమునకు అరణ్యములో ఆరాధన
స్థలమును నియమించిన దేనా! నీ దానములు పొందేపనికంటెను, శత్రువులతో పోరాడే పనికంటెను, నీ సన్నిధిని
కూర్చుండి
నిన్ను ఆరాధించేపని మహాశ్రేష్టమైనదని మాకు బోధించుము. నిన్ను ఆత్మతోను, సత్యముతోను ఆరాధించే
హృదయములను
అనుగ్రహించుము. ఆమేన్.
నిర్గమకాండములోని భాగములు:
- 1. బానిసత్వము: 1&2 అధ్యాయములు.
- (ఎ) విమోచింపబడిన జనులయొక్క బానిసత్వము.
- (బి) మోషే పుట్టుక, మోషే పెంపకము, మోషే ద్వేషింపబడుట, మోషే పారిపోవుట, మోషే వివాహము.
- (సి) శ్రమలు ఇశ్రాయేలీయులకు విశ్రాంతి లేకుండాచేసెను.
శ్రమలు ఇశ్రాయేలీయులను ఐక్యపరచెను.
శ్రమలు ఇశ్రాయేలీయులను మొర్రపెట్టునట్లు చేసెను. -
2. విమోచన: 3-15 అధ్యా॥లు.
- (ఎ) దేవుడు దిగివచ్చుట, రక్తముద్వారా ఇశ్రాయేలీయులను విమోచించుట.
- (బి) మోషే పిలువబడుట, ఐగుప్తుకు వచ్చుట, ఫరోఎదుట అద్భుతములుచేయుట, ఇశ్రాయేలీయులు బయలుదేరుట.
- (సి) మోషే జీవితము :
- 1) మొదటి 40సం॥లు తాను రాజకుమారుడననుకొనుట,
- 2) తర్వాత 40సం॥లు తాను వట్టివాడననుకొనుట,
- 3) చివరి 40 సం॥లు దేవుడు తన పనిని జరిగించుకొనుట.
-
3. ఇశ్రాయేలీయులు
విద్యను అభ్యసించుట: 15:22-19వ అధ్యాయము వరకు.
- (ఎ) ఇశ్రాయేలీయులు విద్యనభ్యసించి పూర్తిగా దేవునిమీద ఆధారపడుట నేర్చుకొనవలెను.
- (బి) ఇశ్రాయేలీయులు తమ ప్రయాణములో “మారా” అను స్థలమునకు చేరుట. తరువాత ఏలీము, ఆ తర్వాత సీను అరణ్యము, తర్వాత రెఫీదీముకు చేరుకొనుట: ఇవి వారి ప్రయాణములలోని ముఖ్యస్థలములు. మారా అనగా చేదు; చేదుని దేవుడు తీసివేయడుగాని తీపిగా మార్చగలడు. ఏలీములోని సమృద్ధిని కలిగించగలదు.
-
4. సమర్పించుకొనుట: 20 - 28 అధ్యాయములు.
- (ఎ) విమోచింపబడినవారు ప్రభువుయొక్క చిత్తమును నెరవేర్చవలెను. ఆయన సేవకు 'ప్రతిష్టించుకొనవలెను. వారి ప్రవర్తన విషయములో దైవచిత్తమునే అనుసరించవలెను.
- (బి) నీతి సంబంధమైన చట్టములను దేవుడు వారికిచ్చుట (పదియాజ్ఞలు).
- (సి) మన తండ్రి, తన చట్టములన్నిటిని మన మనస్సులో ముద్రించి, తన ఆత్మనిచ్చి ఆ చట్టముల ప్రకారము నడిపించేవాడైయున్నాడు.
-
5. విమోచింపబడిన వారు ఆయనను ఆరాధించుట.
24 -
40 అధ్యాయములు.
- (ఎ) విమోచింవబడినవారు తమ ఇష్టప్రకారము కాకుండా తండ్రి ఇష్టప్రకారము ఆరాధన చేయవలెను.
- (బి) ఆచార సంబంధమైన కట్టడలు ఇవ్వబడుట.
- (సి) ప్రత్యక్షపు గుడారముయొక్క ఏర్పాటు: అందులోని ప్రతి చిన్న వస్తువునకు విలువ అనుగ్రహింపబడెను.
(యాజకులకు ఉన్న దుస్తులు, వారు చేయు ప్రతిపనికి ప్రత్యేకమైన అర్ధము కలదు. పాదుర్లు గౌనులు వేసికొనుట అవసరము. ఎందుకనగా, నాయకుడు నాయకుడే, యాజకుడు దేవుని దృష్టిలో విశ్వాసుల మద్య ప్రత్యేకము.)
నిర్గమకాండములో దేవుడు ఇశ్రాయేలియులమధ్యకు
- 1) దిగినాడు,
- 2) వారితో కలిసి నివసించినాడు.
ఇశ్రాయేలీయులు దాసత్వములోనికి వెళ్ళిపోవుట వలన దేవుడు దిగి వచ్చెను. ఆదికాండములో దేవుని ప్రజలు పాపములో పడిరి. నిర్గమకాండములో పాపఫలితములోనికి వెళ్ళిరి. గనుక ఆదికాండములో పాపమునుండి, నిర్గమకాండములో పాప ఫలితమునుండి విడిపించుటకు తండ్రి వచ్చియున్నాడు.
1-10 అధ్యా॥ - 1) దాసత్వము - ఐగుప్తీయులకు బుద్ధిచెప్పుటకు.
10-20 అధ్యా॥ - 2) విడుదల - తండ్రి గనుక వచ్చి విడిపించెను.
20-30 అధ్యా॥ - 3) అరణ్యము (విద్యశాల) - ఇక్కడే ఆయన వారికి అన్నీనేర్పించెను. అనగా వారు చేయవలసినవి, చేయకూడనివి నేర్పించెను.
30-40 అధ్యా॥ - 4) సమర్పణ - గుడారము కట్టించి సమర్పణ చేయించెను. (అన్నీ వారిచే చేయించి చూపించెను). అరణ్యములో నేర్చుకొన్నది యావత్తు అమలులో పెట్టించెను.
షరా:- దాసత్వమునుండి వారిని విడిపించిన తరువాత, అన్ని సంగతులు బోధించిన తరువాత, వారు తాము నేర్చుకొన్న వాటిని అమలులో పెట్టకపోతే ఏమి ప్రయోజనము! అట్లే మన విషయమును. ఇన్నీ విని, వాటి ప్రకారము నడువకపోతే లాభమేమి? నష్టమే!
- తండ్రి,
- (1) వారి దాసత్వములోనికి వెళ్ళి తాళం విప్పి,
- (2) పాఠము నేర్పి,
- (3) ఆరాధన చేయించి,
- (4) వారితో గుడారములోనికి దిగియున్నాడు.
అన్ని పనులు వారి నిమిత్తము చేసియున్నాడు. మన నిమిత్తమును చేసియున్నాడు. అంటే పాపము చేసినప్పుడు ఆది కాండములో వెళ్ళిపోయిన దేవుడు, నిర్గమకాండములో మరలా దిగివచ్చి, దాసత్వమునుండి వారిని విడిపించి, నేర్పించి, నడిపించి, గుడారములో ప్రవేశించెను.
నిర్గమకాండములో - దేవునిగూర్చి రెండు కథలు ఉన్నవి.
మొదటి కథ - దేవుడు దిగివచ్చుట.
రెండవ కథ - దేవుడు నివసించుట. అనగా నిర్గమకాండములో యేసుప్రభువు చరిత్ర దిగి వచ్చుటలోను, నివసించుటలోను ఉన్నది. అనగా మనుష్యులతో నివసించెను.
మోషేకథ - మోషే, దేవుని ముఖముచూచి, దేవుని స్వరమువిని, దేవుని ప్రకాశతతో, కాంతిలో, మహిమలోఈ 40 దినములు గడిపెను. ఆయన ఉరుములకు, మెరుపులకు, ధ్వనులకు జడిసాడా? లేదు. ఆయన బ్రతుకు ఇంకా పెరిగిపోయింది. 40 దినముల ఉపవాసము ఆయనను కృశింపచేయలేదు. గనుక ఒకరోజు ఉపవాసానికే చిక్కిపోతామేమిటి మనము? మోషే కొండెక్కితే, మోషే బ్రతుకుకూడా కొండెక్కినది. ఇది బైబిలుమిషనుయొక్క పనివారు, సంఘము అంతా మాత్రమేగాక, ప్రతి ఒక్కరు ఆచరించవల్సిన క్రమమై ఉన్నది. బైబిలుమిషనువారు ఏ మంచి కార్యము చేసిననూ దేవుడు సఫలపరచును. బైబిలుమిషనులోని ప్రతివారును మోషే అంత పవిత్రముగా ఉండవలెను.
దీవెన :- అట్టి స్థితి పెండ్లికుమారుడైన క్రీస్తు ప్రభువు నేటి దినధ్యానము ద్వారా మీకు దయచేయునుగాక ఆమేన్.