జలము-బలము-ఫలము - 2
నిర్గమ. 17: 1-16.
ప్రార్ధన:
తండ్రీ! నీకు స్తోత్రములు. మరొకమారు నీవాక్య ధ్యానములోనికి వచ్చినాము. ఎన్నిమార్లు తరచినను, నీవాక్యములోనుండి నూతన ప్రవాహములు, మమ్మును ఆనందింపజేసే నూతన సంగతులు రాక మానవు. అది నీ అద్భుతకరమైన కృప. మాకు కలుగుచున్న హింసలను సహింపుతో జయించుటకు ఇప్పుడు నీవాక్య జలము మాకు తాగించి, మమ్మును బలపరచుమని యేసు నామమున వందించు చున్నాము. ఆమేన్.
వాక్యం అనగా దాహం తీర్చే జలము. ఆ జలమే ఇక్కడ కత్తి అయింది, ఇక్కడ యుద్ధంలో శత్రువులను హతం చేసింది. అదే హెబ్రీ పత్రికలో 4:12. రెండంచుల కత్తి అయింది. గనుక ఇశ్రాయేలియులయొక్క ధైర్యమేమి? దైవ ఆజ్ఞ చొప్పున యుద్ధముగాని, తమ సరదానుబట్టి కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో అంతా యుద్ధమనే యున్నది. అలాగే నిర్గమ 17వ అధ్యాయములో యుద్ధమనే యున్నది. మోషే చేతులు పైకెత్తినపుడు ఇశ్రాయేలీయులకు జయము. మోషేచేతులు లాగినపుడు వారికి అపజయము కలిగినది. అట్లే మన సంఘములో ఆదివారం ప్రార్ధన చేస్తున్నారా లేదా?
మోషే ప్రార్ధన చేసేటపుడు, ఎత్తబడిన చేతులు క్రిందకువాలకుండ చేసెను. ఈ గదిలో ఉన్న మీరు ఇక్కడి సంగతులు మీ ఊరిలో చెప్పితే, వారు బలంగా ప్రార్ధనలు చేయగలరు. అయితే, వారు అప్పుడప్పుడు ప్రార్ధనలు చేసినచో, శత్రువుల మాట విని అలసిపోదురు. మీరు హూరులాగా, అహరోను లాగా చేతులు పట్టుకొంటే మోషేవలె వారు బలముగా ప్రార్ధించగలరు. అప్పుడు ఆ ప్రార్ధన తిన్నగా పరలోకము ఎక్కి వెళ్ళును. శత్రువుకు అపజయము కలిగించును. యుద్ధము ఆరంభించక పూర్వము కొండ క్రింద ఏమున్నది? శత్రుసైన్యము ఉన్నది. వారిని చూడగా ఇశ్రాయేలీయులకు భయము కాదా? అట్లే కానూరు, మద్రాసు, సికింద్రాబాద్, హైదరాబాద్, ఉత్తర ఇండియాలో జరుగుచున్న హింసలను గురించి, మి సంఘముకు చెప్పితే అధైర్యపడుదురు. మనకెందుకులే ఈ మతము అనిపించెదరు.
నిడదవోలులోను, నైజాములోని వరంగల్లులోను 150మంది క్రైస్తవులు హిందూమతము స్వీకరించుటకు బలవంతము చేయబడ్డారు. గనుక ఈ యుద్ధము మనకెప్పుడును ఉండును. గాని చివరకు మనకే జయము ఉండును. ఈ ఉదయం 6గం॥కు మోకాళ్లమీదుండి, మరుసటి 6గం॥లు సంఘమంతటినీ మోకాళ్ళమీద పెట్టించి ప్రార్ధించాలని అయ్యగారికి ఉన్నది. అయ్యగారే చేయాలని ఉంది. అయితే, అయ్యగారికి సంఘం లేదుకదా. ఎవరికి సంఘములేదు! లోకమంతటి సంఘము నాదే,
- 1) అందరికొరకు ప్రార్ధించండి
- 2) అందరికి సువార్త చెప్పండి.
కొండ, బండ: బండనుండి వచ్చిన జలము, ఆ జలము త్రాగి యుద్ధము చేయవలెను. ఈలోకములో యుద్ధము ఇప్పుడు జరుగుచున్నది. ఇంకా ముగియలేదు. ఎందుకంటే బైబిలులో ఎప్పటికప్పుడే ముగింపుగాని అంతటికి ముగింపుకాదు. లోకాంతమందు ముగింపు యుద్ధము జరుగును. అపుడు అంతటికి ముగింపు అగును. ఇది బైబిలు కథలో ఉన్నది. గాని మాటలో లేదు. నిర్గమకాండములో, సమూయేలు గ్రంథములో, సౌలు కాలములో, అమాలేకీయులు పడిపోయిరి అని ఉన్నది. మరలా దావీదు కాలంలో అమాలేకీయులను దావీదు గెలిచినారు అని ఉన్నది. గిద్యోను కాలములో అమాలేకీయులు గెలిచిరి.
- 1. మోషే
- 2. గిద్యోను
- ౩. సౌలు
- 4. దావీదు ఈ నలుగురు వరుసగా ఎప్పటికప్పుడే జయము పొందిరి. ఇది లోకములో క్రైస్తవులకు, లోకమునకు ఎప్పటికప్పుడే జరుగుచున్న యుద్ధమునకు పోలిక. మీరు ప్రార్ధన మానండి అపుడు మీకు అపజయము.
మీరు ప్రార్ధన చేయండి అపుడు మీకు జయము. ఇశ్రాయేలీయుల కొరకు మోషే ముగ్గురు ప్రార్థించిరి. అపుడు జయము కలిగినది. ప్రార్ధన మానగా వారికి అపజయము, శత్రువులకు జయము కలిగెను. వారాయుద్ధమునకు ముందు నీరు త్రాగిరి. గనుక బలము వచ్చింది. ప్రార్ధన చేయకముందు వాక్యం అను జీవజలము బాగా త్రాగండి, అపుడు మీకు జయము వచ్చును.
"ఈ నుయ్యి లోతుగా ఉంది. నీ దగ్గర త్రాడులేదు, బకెట్టు లేదు. నీకు నీరు ఏలాగు వస్తుంది" అని సమరయ స్తీ ప్రభువుతో అనినది. ఈ సంభాషణ ముదరగా ముదరగా, "మాకు" మెస్సియా రావాలి అపుడు మాకు ఇవన్ని చెప్పుతారని ఆమె అన్నపుడు ఆయన ఒక్కమాట అన్నారు. "నేనే! ఆ మెస్సీయ్యా" అన్నారు. ఆ మాటే వాక్యము. ప్రభువు మాటవల్ల ఈ మాటవల్ల, వాక్య జలము బయటకు వచ్చినది. ఈ మాట విన్నాక, అనగా ఈ జీవజలం త్రాగాక ఆమె ఈ నూతిని మరచింది, చేద మరచింది, కుండ మరచింది, త్రాడు మరిచింది, కొంత నీరు అంతకుముందే తోడి ఉంది, అదికూడ మరచిపోయింది.
ప్రభువు ఆమెను నీళ్ళు అడిగారుగాని ఆమె ఆయనవైపు చూడలేదు, పెడగా చూసింది. ఎందుకంటే యూదుడు గనుక, సంబంధము లేదు గనుక. అయితే, ఆయన గురువు గనుక (గౌను వేసికొన్నారు గనుక) యేసుక్రీస్తుప్రభువు నీళ్ళు అడిగినపుడు, మీకు మాకు సంబంధము ఏమి? అని అడిగినది. యేసుక్రీస్తు ప్రభువు జీవజలము ఎత్తిన తరువాత ఆమెకు దాహం తీరింది. అప్పుడు 'మెస్సీయా వచ్చాడు' అని ఆయన్ను తన గ్రామానికి తీసికొని వెళ్ళినది. దేవుడేగాక చెప్పకపోతే, మోషే ఏమి చేయును! హూరు ఏమి చేయును! అహరోను, యెహోషువా, సైన్యము ఏమి చేయును? వారు ఏమి చేసినా, ఏమి లాభము? దేవుని వాక్యము మనకెక్కడ ఉన్నది? బైబిలులో ఉన్నది. బైబిలులోని కథలు బాగా తరిస్తే అనగా బాగా చదివితేనేగాని ఆ కథలోని జలము బయటకురాదు. అలాగే వాక్యమును తరిస్తేనేగాని అర్ధము తెలియదు. బైబిలు బహు లోతైనది. యాకోబు బావివలె బహులోతైనది. ఆ బావిలో ఎక్కడో అడుగున నీరున్నది. బావిలో ఉన్న నీరు తోడుటకు కష్టపడవలెను. పొడుగైన త్రాడు, బక్కెట్ వేసి, బలంగా లాగాలి. లోతుగా ఉండే దాని నీరు తోడుటకు కష్టపడినట్లు వాక్యములోని కథలు లోతుగా తరిస్తేనేగాని హృదయమనే కుండలోకి నీరు రాదు. బండ నీరు అవసరమే, వాక్య ఉదకము అవసరమే.
- 1) ఏటి నీరు స్నానము చేస్తే నీరు చెడిపోవును,
- 2) చెరువు నీరు మురికి నీరు.
- ౩) మన గంగాళాలు, అన్ని చెంబులు, చేతులుముంచే నీరు అశుభ్రమైనదే.
అయితే బండనుండి వచ్చే నీరు, దేవుని నీరు మహాపవిత్ర నీరు శ్రేష్టనీరు. 6 బానలలోని ద్రాక్షారసము, ఎంత పవిత్రమైనదో ఈ బండ నీరుకూడా అంత పవిత్రమైనది. అయితే బైబిలులోని వాక్యబండలో నుండి వచ్చే జీవజలము, బండనుండి వచ్చిన నీరుకంటె మహాపవిత్రమైన జీవజలము.
సమరయ స్త్రీకి ఎవరు కావలెను? (యేసు కావలెను) అనగా మెస్సీయ కావలెను. చివరకు ఆయనను చూచింది. ఆయన నోటినుండి వచ్చిన వాక్య నీరు త్రాగింది. తన ఊరు వెళ్ళింది, జనాన్ని లాక్కు వచ్చింది. ఆదికాండము మొదలుకొని, చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథము వరకు ఒకే స్వరూపమున్నది, ఒకేగీత ఉన్నది, అది క్రీస్తే. 66 పుస్తకములలోను ఏదోఒక వచనములోను ఆయన రూపమున్నది. 1కొరిం. 10:4; మత్తయి 7:24 ఆ బండ క్రీస్తే. ఆ బండమీద ఎవరైనా ఇల్లు కట్టినారా? కట్టిరి. ఆ ఇల్లు ఏది? సంఘమే ఆ ఇల్లు. ఈ బండకు సూచనగా మోషే ఆ కొండమీద నిలువబడినాడు. బండనీళ్ళు త్రాగుటవల్ల దాహశాంతి గనుక జయము. వాక్యము అను జీవజలం త్రాగుటవల్ల ఆత్మ దాహం తీరింది.
దీవెన:
ఆలాగు ఆయన వాక్యములోని జీవజలము త్రాగి మహిమ రాకడకు ఆయత్తపడు ధన్యత ప్రభువు నేడు మీకు దయచేయునుగాక! ఆమేన్.