28. నిర్గమకాండ ధ్యానము

యేసుప్రభువు చేసిన ఉపవాసము - 1



యాకోబు 4: 1-10.

ప్రార్ధన:

పరలోకపు తండ్రీ! పరవాసము నీచేతిలోనే ఉన్నది. భూవాసము నీచేతిలో ఉన్నది. నిత్యవాసము నీ చేతిలోనే ఉన్నది. ఉపవాసము నీ చేతిలోనే ఉన్నది. పరవాసము నిత్యవాసము. అనగా మేము పరమునకు వచ్చిన తరువాత పరవాసము. మేము భూలోకములోనే ఉండి ఇతర దేశములకు సువార్త పనిమీద వెళ్ళినప్పుడు అది భూలోకవాసము. అనగా ఇక్కడే మేముండి, మా స్వస్థానములోనే నివసించేది. మేము పరలోకమునకు వచ్చిన తరువాత అది నిత్యవాసము. అయితే, ఇక్కడే నీ సన్నిధిలో గడుపునది ఉపవాసము. మేము ఎప్పుడైనా సరే నీతోనే ఉండునట్లు ఇవన్నియు; అనగా భూవాసము, పరవాసము, నిత్యవాసము, ఉపవాసములన్నియు నీ చేతిలోనే ఉన్నవి. గనుక మాకు నిర్విచారము. ఎందుకనగా అన్నిటిలో నీవున్నావు. కాబట్టి అనేక వందనములు. మరలా ఈ సాయంకాలము ఉపవాసమును గురించి కొద్దిగా మాట్లాడుకొనబోవుచున్నాము. నీ సన్నిధి వాసము మాకు తోడైయుండునుగాక. మేము అక్కడకు వచ్చిన తరువాత ఇది మీకు పరవాసమగును. అది మాకు నిత్యవాసమగును. అబ్రాహాముయొక్క చరిత్రలో పరవాసము అని ఉన్నది. అప్పుడది పరమునకు వేరైయున్న భూలోకవాసమే. ఇప్పుడు మేము అబ్రాహాము పరవాసములో ఉన్నట్టు ఈలోకములో పరవాసములో ఉన్నాము. మేము ఉపవాసము చేయునపుడు పరలోక నిత్య నివాసము చేసినట్లే. మేము అక్కడకు వచ్చినప్పుడే నీవు మాకు స్పష్టముగా కనబడుదువు. ఇప్పుడు మేము నీ సన్నిధిలో ఉన్నప్పుడు నీవు ఇక్కడకు వచ్చి కనబడి మాట్లాడుచున్నావు. గనుక ఇక్కడైన నీవే, అక్కడైన నీవేగాన ఓ త్రిత్వదేవా! నీకనేక వందనములు. ఆమేన్.

స్తుతి ప్రార్ధన:

  • 1. తండ్రీ నీకనేకవందనములు, ఎందుకంటే ఇన్నినాళ్లనుండి నీవు మాకు చేసిన మేళ్లన్నిటి నిమిత్తము వందనములు.

  • 2. నీకు నమస్కారములు, ఎందుకంటే నీవు మాకు దివ్య లక్షణములుగల దేవుడవైన తండ్రివైనావు గనుక నమస్కారములు.

  • 3. నీకు స్తోత్రములు, ఎందుకంటే ఇక్కడ, అక్కడ నీ తలంపు కలిగి సజీవుల గుంపులో ఉంటాము గాని మృతుల గుంపులో ఉండము. చనిపోయిన మృతుల గుంపులోనివారముకాము. ఎందుకంటే నీయందు నిద్రించువారు సజీవులే. లోకములో "ఎవరైనా మంచముమీద నిద్రపోతూ" ఉంటే, సజీవులంటామా? మృతులంటామా? అలాగే నీయందు నిద్రించే భక్తులందరు సజీవులే గాని మృతులుకారు. నీ వాక్యములో వ్రాయబడినది, ఏమని? నీవు సజీవులకు దేవుడవు గాని మృతులకు దేవుడవుకావు అని వ్రాయబడి ఉన్నది. మేము జీవించినా, నీ వారమే. చనిపోయినా, నీ వారమే. ఒక స్వంత మాట కల్పించుకొన్నాము. అది బైబిలులోలేదు. అదేదంటే మేము పాపములో పడిపోయిననూ నీ వారమే. పాపములోనుండి లేచిననూ, నీ వారమే.

ఉదా:- ఒక తండ్రియొక్క కుమారుడు బురదలోపడినను తండ్రి కుమారుడే. ఆ అబ్బాయి కడుగబడిన తరువాతకూడా తండ్రి కుమారుడే. అట్లే మేము నీ యాజ్ఞలకు విరోధముగా ఉంటే నీవు శిక్షిస్తావు గాని వెంటనే రక్షిస్తావు. శిక్షయొక్క ఉద్దేశము రక్షణే. ఇవన్ని తలంచుకొని నీకు స్తోత్రము, స్తోత్రము, జయము, జయం అని స్తుతించుచున్నాము. ఈ న్తుతులు మా స్వంతముగా చేస్తే వట్టివే గాని నీ కుమారునిద్వారా నీయొద్దకు రవాణా చేస్తున్నాము గనుక అవి దేవదూతల స్తుతులు, ప్రసిద్ధికెక్కిన గొప్ప స్తుతులుగా ఉందును. అయితే మా స్తుతులవంటి స్తుతులు చేయడం వారికి (దేవదూతలకు) చేతగాదు. ఎందుకంటే వారెన్నడును పాపము చేయలేదు. ఈ స్తుతులు చేయుటకు మేమే తగినవారము. ఈ స్తుతులు మేము చేయగలిగితే, వాటిని పరలోకపు తండ్రి వింటే, 'ఆయన పరమానంద భరితుడగును' అని మాకు తెలియును. దేవదూతల స్తుతి పరలోక గడప కమ్ములు కదలించే బలమైన స్తుతి.

  • 1. (ఎ) మా స్తుతులు కృతజ్ఞతతో నిండుకొనిన స్తుతులు.
    (బి) మా స్తుతులు నీకృపను తలంచుకొని కృతజ్ఞతతో తలవంచుకొని చేసే స్తుతులు.

  • 2. దేవదూతల స్తుతులు:
    (ఎ) నీ మహిమను తలంచుకొని, నీ గొప్ప తనమును తలంచుకొని చేయు స్తుతులు. గనుక మా స్తుతులు పరలోక వాస్తవ్యులకు, దూతలకు చూపించుము అని వేడుకొంటున్నాము.
    (బి) మా స్తుతులు భూతాలును, సైతానును చూస్తాయి గనుక అవి హడలిపోతాయి. వాటికి పుట్టగతులు లేవుగాని. మొండితనముండును. భయపడునుగాని అప్పుడప్పుడే, గాని పూర్తిగా భయపడవు. ఈ స్తుతులు త్వరగా రానైయున్న యేసు నామమున అంగీకరించుము. ఆమేన్.
  • 1. ఏలీయాయొక్క ఉపవాసము మనశక్తికి మించినది.
  • 2. మోషేయొక్క ఉపవాసము మన ఊహకు మించినది.
  • 1. ఏలీయా అడవిలో నడుస్తు చేసిన ఉపవాసము దేవుని తలంచుకొని చేసెను.
  • 2. మోషే దేవునియొక్క ముఖకాంతి (ముఖము చూస్తు) ఉపవాసము చేసెను. అపుడు మోషేకు వేరొక తలంపు (దైవికము గాని) చిన్న తలంపువస్తేనే, భస్మమైపోయియుండును.

దేవదాసయ్యగారు కూడ కండ్లకు గుడ్డ కట్టుకొని మోషే ఉన్నట్లు దేవుని మహిమలో ఉండిరి. కండ్లకు ఎందుకు గుడ్డ కట్టిరి? బాహ్యలోకం చూడకుండా, అనగా లోకము కనబడకుండ గంతులు కట్టుకొనిరి. ఉగ్గపెట్టి కనిపెట్టిరి గనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను ఈ ముగ్గురు అక్కడ ఉందురు. అది మోషే గుడారము వంటిదే, అనగా సన్నిధి గుడారము. పూర్వకాలములో మోషే గుడార సన్నిధి ఏర్పరచెను. అది మోషేకు బహు సంతోషము, బహు మహిమ ఆనందము కల్గించినది. గనుక ఇశ్రాయేలీయులు మాకింత ఐశ్వర్యమిచ్చినావు అని గర్వించిరి. ఇది తప్పుగాదు. మోషే ఉపవాసము అయ్యగారుకూడ చేసిరి. కండ్లకు గుడ్డ కట్టుకొని మహిమలోనికి వెళ్లిరి. లేనియెడల కండ్లు పగిలిపోవును. ఉగ్గబెట్టుకొని ఉన్నారు. మోషే ఏలీయాయొక్క ఉపవాసము మన శక్తికి ఊహకు మించినది. గాన యేసుప్రభువుయొక్క ఉపవాసము మనకు సరిపోయింది. ఎందుకంటే ఆయన మనిషియొక్క వరుసలోనికి వచ్చి నిలబడ్డాడు గనుక. ఎందుకంటే యేసుప్రభువునకు

  • 1) దైవత్వమున్నది.
  • 2) మనుషత్వమున్నది.

గనుక మనకు సరిపోయినది. మనకు సరిపోయేటట్లు సరిపుచ్చుటకు ప్రభువు వచ్చెను (ఫిలిప్పీ 2లో) ఆయన రిక్తుడై వచ్చెను అనుమాటకు భావమిదే అనగా దైవత్వము అక్కడనే (పరలోకములోనే) ఉంచి (పెట్టి) ఈ మనుష్యత్వములోనికి ఎంత దైవత్వము కావలెనో అంతే ఉంచెను. ఎందుకంటే మన విషయమై చేయవలసిన పనులు మనుష్యత్వము చేయవలెను గాని ఒక దైవత్వముతోనే చేయరాదు. ఒక్క దైవత్వముతోనే గాదు, లేదా ఒక్క మనుష్యత్వముతోనే గాదు. రెండును ఉండి, రెండూ సమానములుగా చేయవలెను. అందుచేత ఆయన ఉపవాసమువలె అనగా ప్రభువు చేసిన ఉపవాసమువలె అన్నము, నీరు లేకుండా చేయవలెను. ఎవ్వరైనా అలా చేయగలరా? ప్రభువు సెలవిస్తే చేయవచ్చును. శేషారత్నమ్మ 90 దినములు ఉపవాసము ఎట్లు చేసెను? అది మనకు గొప్పది గాని అది మన సిద్దాంతమునకు తప్పు. ఎందుకనగా

  • 1) ఆమె తన భర్తమీద కోపముచేత అతని మారుమనస్సు కొరకు అన్ని దినములు ఉపవాసము చేసెను.

  • 2) విసికి బ్రతుకు చాలించుకొనుటకు ప్రాణహత్య కొరకు ఉపవాసము చేసినది.

  • 3) భర్త కిటికిగుండ నీళ్ళు ఇస్తే త్రాగి ఉపవాసమున్నది. నోరు తడుపుకొని చేసింది.

ఎవరుకూడా ఆమెవలె 90 దినములు ఉపవాసము చేయకూడదు. చిక్కిపోతారు, చచ్చిపోతారు. ప్రభువువలె 40 దినముల ఉపవాసము చేయమని వ్రాయబడలేదు. గనుక ఎవరును చేయరాదు. సాధు సుందర్ సింగు ఆలాగు 40 దినములు ఉపవాసము చేయ యత్నించినాడు. చివరకు

  • 1) చిక్కినాడు,
  • 2) నడువలేక పోయినారు.
  • 3) ఆ తరువాత నేలను పడిపోయారు.

మరలా భోజనముచేసి బలము తెచ్చుకొనెను. "యేసుప్రభువుయొక్క దైవత్వము. ఆదాము హవ్వలలో ఎంతవరకు దైవత్వమున్నదో అంత దైవత్వము రెండవ ఆదామైన క్రీస్తు తనలో ఇముడ్చుకొన్నాడు. అదే “తగ్గించుకొనెను” అను మాటకు అర్ధము. (ఫిలిప్పీ 2:7).

ఉదా:- రెండు కోపాలు (గ్లాసులు) ఉన్నవనుకొండి.

  • 1) కుడివైపున ఉన్న కోపాలో దైవత్వమున్నదనుకొండి. అందులో క్రీస్తు యొక్క దైత్వమున్నదనుకొండి.

  • 2) ఎడమ ప్రక్కనున్న కోపలో క్రీస్తుయొక్క దైవత్వముతో సమాన కొలత వచ్చే మనుష్యత్వమున్నది. ఇపుడు ఆ రెండు (మనుష్యత్వము మరియు దైవత్వం) సమానమైనవి గనుక ఆదాము హవ్వలు ఆ సైతానును ఏ రెండిటితో జయించలేకపోయిరో, అదిచూచి ప్రభువు ఆ కొలత ప్రకారము ఆ రెండును ధరించి, సైతానుతో పోరాడి జయించెను.

అనగా పడిపోయిన ఆదాము హవ్వలయొక్కయు, వారి సంతానమైన మనయొక్కయు అపజయమును పరిహారము చేసి తాను పొందిన జయము మనకొరకే గనుక ఆ జయము మనకిచ్చుటకై ఉపవాసము చేసెను. యేసుప్రభువు ఎందుకు ఉపవాసము చేసెను? ఆదాము, హవ్వలు ఉపవాసము లేకుండా సైతానును జయించవలసింది. గాని వారు ఆలాగు చేయలేనందున, ఇపుడు మనుష్యులందరు ఉపవాసముచేసి బలము పొంది "సైతానును జయించవలెను". అందుకని అది మాదిరి చూపించుటకు ప్రభువు ఉపవాసముండి జయించెను.


కథ:- ఏదెను తోటలో మంచి చెట్లున్నవి. దేవుడు దాని పండ్లు తినమన్నాడు. అవి తింటే పరవాలేదు. చెడ్డ చెట్టున్నది. దానికి పండ్లున్నవి. అది తినవద్దన్నాడు. అది తింటే అనగా తినకూడనివికూడ తింటే తిండిబోతుతనము. తినవద్దన్నవి తినడము తిండిబోతు తనము. వద్దన్నవి తినడము ఉపవాసమా? కాదు. అందుచేత ఆ మొదటి స్థితి రావడానికి దేవుని కుమారుడు ఉపవాసము చేయవలసి వచ్చింది. ఇపుడు ఆ తిండిబోతుతనము మాని మనము ఉపవాసము చేస్తే సాతానును జయించగలము. లేకపోతే జయించలేము. ఉపవాస క్రమ ప్రకారం చేసిన ఉపవాసము దేనికి సమానమనగా క్రీస్తు పొందిన జయముతో సమానము. తిండి తింటే ఉపవాసమున్నట్టా? కాదు. తినవద్దన్నవి తిన్నందువల్ల హాని వచ్చింది. ఇపుడు ఉపవాసముతో తినకపోవుటవల్ల మేలు వచ్చింది.


ప్రభువు మనలను నావలె మీరు 40 దినములు ఉపవాసముండి అని చెప్పలేదుగాని “ఉపవాసముండండి” అని చెప్పెను. అయితే రోజులు ఎన్నో అది మీ శక్తిని బట్టి నిర్ణయించుకొనుమన్నట్లే ఉన్నది గనుక అది మన ఇష్ట నిర్ణయము.


షరా:- ప్రభువుమాట - మీరు ఉపవాసముండి దుఃఖముఖులై ఉంటే మీరులోకానికి బడాయికి చేసినట్లు గనుక.

  • 1) స్నానముచేసి,
  • 2) తలకు తైలము వ్రాసికొని,
  • 3) అన్నము తినినవారివలెనే ప్రవర్తించవలెను.

ప్రభువు చేసినన్ని రోజులు ఉపవాసము చేయండి అని చెవ్పలేదు. ఎన్ని దినాలైనా చేయవచ్చును. ఉపవాసపరులు -

  • 1) చిక్కితే అది ఉపవాసముకాదు.
  • 2) వినుగుకొంటే అది ఉపవాసముకాదు.
  • 3) మనోనిదానము తప్పితే అది ఉపవాసముకాదు.

మోషే ఏలీయాలకు అది ప్రత్యేకమైన గిఫ్టు (బహుమానము) అది నేటి వారికి కాదు. అనేక గొప్ప భక్తులున్నా వారు ఆ పని చేయలేరు. జాగ్రత్త! మా సన్నిధి నోట్సులు నైతాను ఎత్తుకొని పోవును. లేకకాల్చివేయును. సన్నిధి కూటస్థుల నోట్సులు కాల్చివేయును. మీకు ఆ సంగతి తెలియదు. మీరు మందమతితో ఉందురు. గ్రహించలేరు. గనుక వాటిని జాగ్రత్తగా భద్రపరచి, సమయము వచ్చినపుడు వెల్లడి చేయండి.


ఉదా:- ఎమ్మాయి శిష్యులు దారిలో ప్రభువునుచూచిరి. గాని గుర్తించారా! మాటలాడినారు. గాని గ్రహించినారా! వారు మందమతులై దుఃఖముఖులై ఉన్నందున చూచియు తెలిసికొనలేదు. ప్రభువు మాట వినియు గ్రహించలేకపోయిరి. అట్లే సన్నిధి కూటస్థులకును జరుగును. గనుక జాగ్రత్తగా ఉండండి.


షరా:- మనకు ఉపవాసములున్నవి ఎందుకనగా, మనలను మనము దిద్దుకొనుట కొరకు. యేసుప్రభువు ఉపవాసము ఆయన దిద్దుబాటు కొరకుకాదు, గాని నైతానును జయించుట కొరకు. మనముకూడా సైతానును జయించుటకు ఉపవాసము చేయవలెను. 40 దినములు చేయాలంటే ప్రభువే చెపుతారు. మనిషికి పేరు రావడానికి అనగా 'సైతానా నేను నిన్ను జయించినాను' అనే విశ్వాసము కుదరటానికి ఆయన మనతో ఉపవాసము చేయిస్తారు. ఓ సాతానా! నీవు పాపముచేయించిన నీ మనిషి నిన్ను జయించినాడు. ఆది మనిషి ఓడిపోయినాడు, అయితే ఆది మనిషి పక్షముగా ఉన్న వాని సంతతి వారైన 'విశ్వాసులు నిన్ను జయించుచున్నారు' అని ప్రభువు సాతానుతో చెప్పెను. గనుక ఆ మంచిపేరు మనిషికి రావలెను అనునది ప్రభువు ఉద్దేశమై ఉన్నది. జయించిన వారు క్రీస్తు జయించాడని అనుటకు కాదు. మనిషే అనగా 'నేనుకూడ జయించి, జయించినాడనే పేరు సంపాదించుకొనుట కొరకు ఉపవాసముండవలెను. యేసుప్రభువు ఉపవాసము చేసినప్పుడు పిశాచి ప్రక్కనుండి చూచినాడు గాని దగ్గరకు రాలేదు. ఆయన అంతటి ఉపవాస దీక్షలో ఉన్నారు. అలాగే మీరును ఉపవాస దీక్షలో ఉంటే సైతాను రాడు.

దీవెన:

ఆలాగు జయించిన పెండ్లికుమారునివలె మీరునూ, ఈ 40 దినముల ఉపవాస దీక్షలో సాగి, పిశాచిని సంవూర్ణముగా జయించు శక్తి సంపాదించుకొందురు గాక! ఆమేన్.