నిర్గమకాండ ఉపోద్ధాతము
నిర్గమ. 2:1-22.
ప్రార్ధన:తండ్రీ! నీ ఎన్నిక జనులను నీవు ఏలాగు ప్రేమించినావో, ఏలాగు సంరక్షించినావో, ఏలాగు బలపర్చినావో, ఏలాగు నడిపించినావో, ఏలాగు స్థిరపర్చినావో ఆలాగు మమ్ములనుకూడ మహిమ మేఘమెక్కు పర్యంతము విడువక సిద్దపర్చుచుండుము. నేటి దిన నీ వర్తమానము మాకు దయచేయుమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్.
చరిత్ర:- ఆదికాండము చివరనున్న కొద్దిపాటి యాకోబు కుటుంబము నిర్గమకాండములో గొప్ప జనాంగమై ఇశ్రాయేలీయులు అనుపేరు పొందెను. దేవుడు తన జనమును ఐగుప్తులో 400 ఏండ్లు బానిసలుగాను, ఖైదీలుగాను ఉండునట్లు చేసెను. మోషేను పంపి బలవంతముగా తన జనములను ఎర్ర సముద్రము గుండా నడిపించుకొని వచ్చి, సీనాయి కొండమీద ఆజ్ఞలను బోధించి, అరణ్యములో డేరాలతో గుడి కట్టించి వారికి ఆరాధన నేర్పించుచు ప్రత్యక్షమాయెను. ఈ గ్రంథములో పాపమునుండి పాప ఫలితమునుండి దేవుడు తప్పించువాడని బుజువగుచున్నది. దేవుడు అరణ్యములో ఉంచి వారికి పాఠము నేర్పించెను. బలులు, ఆచారములు మొదలైనవి 40 సం॥లు వారికి నేర్పించి, వారిని శుద్ధిచేసి, బహుమానము ఏర్పరచెను. సమర్పణ నేర్పించెను. ఇది వారిచే చేయించెను గాని, వారు చేయలేక మోషేమీద, అహరోనుమీద, తండ్రిమీద సణిగిరి. నడువలేకపోయిరి. తండ్రిని ఘనపర్చలేదు. ఐగుప్త స్థితిని మెచ్చుకొనిరి. చిన్నచిన్న పనులు చేయించి చివరకు గుడారము కట్టించెను. అందులోనికి తండ్రి వచ్చి నివాసము చేసెను.
నిర్గమకాండము పాపఫలితముతో ఆరంభమైనది. ఇందులో ముఖ్య అంశములు రెండు.
- 1. దేవుడు దిగివచ్చుట
- 2. నివాసము చేయుట.
ఆదికాండములో ప్రభువు వాగ్ధాన చరిత్రయున్నది.
- నోవహు ఓడ కట్టినట్లు, యేసుప్రభువు సంఘమనే ఓడకట్టెను.
- అబ్రాహాము ఇస్సాకును బలి ఇచ్చినట్లు యేసుప్రభువు తండ్రిచేత బలిగా ఇయ్యబడిను.
- యోసేపువలె యేసు శోధన సహించి జయించెను.
- నిర్గమకాండములో ప్రభువు చరిత్ర మోషే జీవితములో కనబడుచున్నది. ఈ గ్రంథములో మోషేనుగురించి ఎక్కువగా వ్రాయబడియున్నది. ఇశ్రాయేలీయుల విమోచకుడు మోషే అయితే యేసు అందరియొక్క విమోచకుడు.
- మోషే అన్యురాలును పెండ్లిచేసికొనెను. కారణము ఏమనగా, అన్యులలోనుండి, యూదులలోనుండి వచ్చు పెండ్లికుమార్తె సంఘమును క్రీస్తు ప్రభువు రేపు మధ్యాకాశములో వివాహము చేసికొనును.
మోషే పని:- మోషే పని విడుదలచేయుట, అంతేగాక మోషేకు గొప్ప ఉపాధ్యాయుడు అనే బిరుదుకూడా ఉన్నది. ఈయన గొప్ప టీచరు. అన్ని చీవాట్లు, అన్ని నిందలు ఈయనకే. ఆలాగే యేసుప్రభువునకును, మోషేకు రెండు వరములు. మోషే ఐగుప్తుదేశములో రాజకుమార్తె ద్వారా సమస్త విద్యలు నేర్చుకొన్నాడు. అటుతరువాత మోషేతో కొండమీదను, గుడారములోను దేవుడు మాట్లాడెను. చెప్పవలసినవన్ని తండ్రి చెప్పెను. గనుకనే ఈయన మహాగొప్ప పండితుడు. ఇట్లే మనతోను తండ్రి మాటలాడును. తండ్రి దాచిపెట్టినవారు ఇతరులకు కనబడరు. మోషే సమాధి దేవదూతలు చేసిరి. నేటివరకు ఆయన సమాధి కనబడలేదు.
మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన తండ్రి ఇప్పుడు రాకడవరకు మనతో మాట్లాడును. ఈ గ్రంథముయొక్క సారాంశము విమోచన. ఆదికాండములో వెళ్లగొట్టే దూతలున్నారు. నిర్గమకాండములో శత్రువులను వెళ్ళగొట్టే దూతలున్నారు. అది రక్తమువల్ల జరిగిన విమోచన వలననే సాధ్యపడినది.
నీతి:- ఇశ్రాయేలీయులు పాప దాసత్వమునుండి, ఐగుప్తునుండి ఎప్పటికప్పుడే బైలుదేరినట్లు మనముకూడా పాపమునుండి, లోకమునుండి ఎప్పటికప్పుడే బయటకు రావలసి ఉన్నది. ఇశ్రాయేలీయులు సీనాయికి వెళ్ళినట్లు, మనముకూడా ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధించవలెను అనేది నిర్గమకాండ ఉపదేశమైయున్నది.
అక్షర వివరము:-
- 1. ని:- అనగా నియమింపబడిన జనాంగము; నివసించవలసిన స్థలమునకు వచ్చువరకు, దేవుడు వారియొద్ద నిలచియుండుట.
- 2. ర్గ:- అనగా దేవుడు చెప్పిన మార్గముగుండా ఇశ్రాయేలీయులు ప్రయాణించుట; నిలబడవలసిన మార్గములో వారు నిలచియుండుట.
- 3. మ:- అనగా దేవుడు తన ప్రజల మధ్య నివసించుటకు, పరిశుద్ధ స్థలమును నియమించుమని చెప్పి మందిరము కట్టించి వారి మధ్య నివసించెను.
- 4. కా:- అనగా దేవుడు తన ప్రజలకు కావలసిన వ్యక్తిని నియమించి, వారికి కావలసినవన్ని సఫలము చేయించెను.
- 5. 0:- అనగా పూర్ణము. అనగా దేవుడు తన ప్రజలను పరిపూర్ణముగా విడిపించి పరిపూర్ణ ఆహార ప్రయాణ సదుపాయములు కావించి నడిపించెను. ఆహారము తినుటలోగాని, బండలోనుండి నీరుగాని సమృద్ధిగా రప్పించెను.
- 6. డ:- అనగా దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన నిబంధననుబట్టి వారియెడల దయచూపించియున్నాడు (రాజులు 13:28). దేవుడు వారియందు జాలిపడి, దయచూపి వారియందు లక్ష్యముంచి వారిని నాశనము చేయక తన సముఖములోనుండి త్రోసివేయలేదు.
- 7. ము:- అనగా దేవుడు వారికి ఎన్ని సదుపాయములు చేసినా వారు మూల్గుట మానలేదు. మురుస్తు ఉండవలసినవారు మూలుగుతూ ఉన్నారు. అనగా సణుగుతు, గొణుగుతు ఉన్నారు. గనుక సణుగుల పుస్తకము గొణుగుల పుస్తకమని దీనికి పేరు.
క్రీస్తు చరిత్ర:- పాపదాసత్వములోనుండి మనలను రక్షించుటకై క్రీస్తుప్రభువు + విమోచకుడుగా వచ్చి, కొండమీద కూర్చుని ప్రసంగించి, తానే గొప్ప దేవాలయమై యుండెను. ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టుదునని చెప్పెను.
దీవెన:- ఆలాగున ఈ 40 దినముల ధ్యానాంతమున మీరును దేవాలయమైన గొర్రెపిల్లవలె నూతన యెరూషలేము మందిరముగా తయారగుదురుగాక! ఆమేన్.