ఐగుప్తులో దైవప్రణాళిక : వేర్పాటు - ఏర్పాటు
నిర్గమ. 9:1-85.
ప్రార్ధన:
తండ్రీ! నీ పిల్లలకు నీవు ఇచ్చిన ఆధిక్యతలు మేము గ్రహించలేము. లోకములో వారు తృణీకరించబడినప్పటికినీ, తక్కువగా ఎంచబడినప్పటికినీ, నిన్నుబట్టి వారు అధికులే, మేమును ఘనులమే, నీ మహిమ సాధనములమే. ఆలాగు అన్ని స్థితులలోని వారిని, అందరిని నీ సాధనములుగా వాడుకొనగలవు. గనుక నీ ఉపకారాత్మను మాకు దయచేసి, మాతో మాట్లాడుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్.
ఇశ్రాయేలీయులు తమ దేశమును విడచి, ఐగుప్తుదేశములోనికి ప్రవేశించిరి. ఆలాగు ప్రవేశించిన ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులైనవారు హెబ్రీయులని పిలిచెడివారు. వారు ఏ మాట అన్నారో, ఇప్పుడు దేవుడును ఇశ్రాయేలీయులైన వారిని అదేమాట అనుచున్నారు. ఐగుప్తుదేశము గొప్ప దేశము. వారు ధనవంతులు, విద్యావంతులు, నాగరికత కలిగినవారు. అందువల్లవారు తమ్మునుగూర్చి హెచ్చుగా తలంచెడివారు. ఇతరులను తృణీకరించెడివారు. అలాగే ఇశ్రాయేలీయులనుకూడ తృణీకరించిరి. గాని ఇశ్రాయేలీయులు దేవునివలన ఏర్పాటు చేయబడిన జనాంగమని వారు గ్రహించలేదు, గుర్తించలేదు. వారికి వారి దేశమునుబట్టి, వారి ఆచారములనుబట్టి, వారి దేవతలనుబట్టి వారికి అతిశయమున్నది. అందువల్ల హెబ్రీయుల దేవుడైన యెహోవానుకూడ విసర్జించిరి.
ఈ కాలమందుకూడ అలాగే కనబడుచున్నది. లోకములోని వారందరును రెండు గుంపులుగా ఏర్పరచబడిరి.
- 1) విశ్వాసుల గుంపు
- 2) అవిశ్వాసుల గుంపు.
అవిశ్వాసులైన వారికి ఈ లోకములో ఘనత, ధనము, పలుకుబడి మొదలగునవన్నీ యున్నవి. దేవుడు స్వయముగా, హెబ్రీయుల దేవుడు "ఇలాగు చెప్పుచున్నాడని ఫరోతో చెప్పుమని" మోషేతో చెప్పెను. నా జనమును ఐగుప్తీయులనుండి వేరుచేస్తానని నిర్గమ 8వ అధ్యాయములో యెహోవా దేవుడు చెప్పెను. అనగా ఇశ్రాయేలు జనాంగమును విడదీయుట. అలాగే 9వ అధ్యాయములో జనమేకాదు గాని ఆ జనముయొక్క పశువులనుకూడ విడదీస్తానని దేవుడు చెప్పెను. అలాగే దేవుడు విశ్వాసులను, అవిశ్వాసులను వేరుచేయట మాత్రమేకాక విశ్వాసులకు కలిగిన ఆస్థినికూడ వేరుచేయును. విశ్వాసులయొద్దనుండి అవిశ్వాసులకు ఏమియు చెందకుండా దేవుడు వేరుచేయును. హెబ్రీయులు నివసించు గోషెను దేశములోని జంతువులకు జబ్బులు రాలేదు. గాని ఐగుప్త దేశములో నివసించు మనుష్యులకు, వారి జంతువులకు జబ్బులు కలిగెను. హెబ్రీయులకు జబ్బులు లేకపోవుట వారి దేవుని కృప. ఐగుప్తులోనుండు పశువులకు, మనుష్యులకు చావువచ్చెను. దేవుడు తరుణముపై తరుణమిచ్చెను. గాని ఐగుప్తీయులు మనస్సు మార్చుకొనలేదు. ఇందులో కూడ దేవుని కృప మనకు కనబడుచున్నది. దేవుడు అవిశ్వాసులకుకూడ తన కృప చూపెను.
అదివరకు మంత్రజ్ఞులు మోషే చేసిన అద్భుతములలో కొన్ని చేయగలిగినారు. అన్ని చేయలేకపోయినారు. వారు దేవుని శక్తినిచూసి భయపడినారు. అలాగే ఇప్పుడును లోకములోని అవిశ్వాసులు దైవశక్తి లేకపోయినా, తమ పనులలో నెగ్గుకుంటూ వస్తున్నారు. గాని అవిశ్వాసులైనవారు రానైయున్న యేడేండ్ల మహాశ్రమలు తప్పించుకొనలేరు. సహించలేరు. తాళలేరు. ఐగుప్తులో జరిగినటువంటి శ్రమలకన్నా ఈ శ్రమలు అధికముగా ఉండును. మనిషిలో దేవుడు పెట్టినవి రెండు కలవు.
- 1) జ్ఞానము,
- 2) హృదయము.
ఐగుప్తులో కలిగిన శ్రమలు వారి జ్ఞానమునకు అర్థమైనవిగాని మనస్సులో నొచ్చుకోదగినంత కలుగలేదు. గాని వదేండ్ల శ్రమకాలములో జరిగే మహాశ్రమలకు మనస్సు నొచ్చుకొనును. ఐగుప్తలోనున్న తెగుళ్ళకు ఫరో హృదయము నొచ్చుకొనెనుగాని మారుమనస్సు పొందలేదు. అలాగే ఇప్పుడును మనము మారుమనస్సు నొందవలెనని దేవుడు శ్రమలను పంపెను గాని జనులు మారుమనస్సు పొందరు.
ఫరోలో నున్న దుర్గుణములు:
- 1. దేవుని జనులను తృణీకరించుట
- 2. హెబ్రీయుల దేవుని తృణీకరించుట
- 3. కలిగిన శ్రమలనుబట్టి మనస్సును కఠినపరచుకొనుట.
శ్రమలు వచ్చినపుడు దేవుడెందుకు ఊరుకొనవలెనని విశ్వాసులను, అవిశ్వాసులు ప్రశ్నవేయదురు.
- 1) దేవుడు తన బలమును చూపించుటకును,
- 2) దేవుని బలము లోకములోని వారందరు తెలిసికొనుటకును,
- ౩) యెహోవాయే దేవుడని తెలిసికొనుటకు,
- 4) దేవుని నామము భూలోకమంతా ప్రచురింపబడుటకు దేవుడు ఊరుకొనును.
ఇప్పుడు రాకడకాలము. ఈ రాకడ కాలమందు భూలోకమంతట రాకడనుగూర్చిన సువార్త సంపూర్ణముగా ప్రకటింపవలెను. వెయ్యేండ్ల పరిపాలనా కాలములో సంపూర్ణ సువార్త అన్ని భాషలలో, అన్ని ప్రాంతములలో ముందుగనే సువార్త ప్రకటింపబడవలెను. రాకడ వార్త ప్రకటించే విశ్వాసులు అన్ని భాషలలోను మాట్లాడుదురు. ఈ కాలమందు సంపూర్ణ రాకడవార్త సర్వజనాంగమునకు విశ్వాసులు బోధింతురు. బుషులైనవారు తమతమ గుహలను విడిచిపెట్టి బయటకు వత్తురు. ఇది బైబిలులో లేదుగాని సంఘచరిత్రనుబట్టి మనము తెలిసికొనగలుగుచున్నాము.
- 1. యూదులను ఏర్పరచుట -- ప్రభువు ఈలోకములో జన్మించుటకొరకు,
- 2. విశ్వాసులను ఏర్పరచుట -- రాకడవార్త అంతట ప్రకటించుటకు,
- 3. అబ్రాహామును ఏర్పరచుట -- ఆ అట్టి విశ్వాసము అందరూ కలిగియుండుటకు,
- 4 మోషేను ఏర్పరచుట -- దేవుని హృాదయములోనిది బయలుపరచుటకు,
- 5. యెహోషువను ఏర్పరచుట -- దేవుని బిడ్డలకు దేశమును స్థిరపరచుటకు,
- 6. పేతురును ఏర్పరచుట -- యూదులను దేవుని సంఘములో చేర్చుటకు,
- 7. పౌలును ఏర్పరచుట -- అన్యులను దేవుని సంఘములో చేర్చుటకు,
- 8 యోహానును ఏర్పరచుట -- ప్రకటన వ్రాయుటకు,
- 9. ఫరోను ఏర్పరచుట -- దేవుని బలమును చూపుటకును, లోకమంతటా దేవుని నామము ప్రకటించుట కొరకు దేవుడు ఏర్పాటు చేసెను.
దేవుడు చివరివరకు ఊరుకొనడుగాని కొంతకాలము మట్టుకే ఊరుకొనును. నిర్గమాకాండము 9వ అధ్యాయములో ఐగుప్తీయులైనవారు దేవుని అద్భుతములను చూచి భయపడిరి. అలాగే ఇప్పుడును అన్యులు దేవునికి భయపడుచున్నారు. కొందరు రాకడకు సిద్ధపడుచున్నారు. గనుక ఆయన మనలను ఏ పనికొరకు సిద్ధపరచెనో, ఆ పని మనము చేయవలెను. రాకడకు సిద్ధపడుచూ, ఇతరులను సిద్ధపరచేపని మన అందరిముందు ఉన్నది. అనగా ఆ పనియే. ఆయన మనందరి కొరకు సిద్ధపరచినదైయున్నది.
దీవెన:
గనుక ఆ పనిని అందుకొని ఆయనను, ఆయన రాకడను ఈ లోకమునకు కనపర్చు నూచనలుగా నేటి దిన ధ్యానమునుబట్టి వరిశుద్దాత్ముడు మిమ్ములను సిద్ధపర్చును గాక! ఆమేన్.