18. నిర్గమకాండ ధ్యానము

జలము-బలము-ఫలము-౩



నిర్గమ. 17వ అధ్యాయము.

ప్రార్ధన:

సమస్త దివ్య లక్షణములుగల ఓ దేవా! లోకములోని విశ్వాసుల యొక్క, మాలోని అభిమానులయొక్క దేవా! పరలోకములోని పరిశుద్దుల యొక్క దేవా! వారికంటే పైగా ఉన్న పరిశుద్ద దేవదూతలయొక్క దేవా! నీకు స్తోత్రము. సమస్తము నీవే జరుపుము. ఆమేన్.


ఉదయమున నేను మిమ్మును నీటి కొండయొద్దకునూ, ప్రార్ధనాకొండ యొద్దకునూ తీసికెళ్ళితిని. అక్కడనుండి మిమ్మును వెనుకకు తీసికొని రావడము చాలాకష్టము. మీలో, మనలో, అందరిలో, ఎవరినైన ముగ్గురిని మోషేకు బదులు ఒకరు: ఈలాగు అహరోనుకు బదులుగా ఒకరు, హూరుకు బదులుగా ఒకరు. ఈలాగు ఆ ముగ్గురికి బదులుగా ముగ్గురిని ఇక్కడ అనుదిన ప్రార్ధన కూటముగా పెడితే కొన్నాళ్ళైన తరువాత, "ఇక్కడనుండి బెజవాడ రండి, రాజమండ్రి రండి" అని అంటే రారు. ఎందుకు అంటే ఇక్కడ ప్రార్ధన కొండ (దైవసన్నిధి కొండ) మీదకు ఎక్కితిరి గనుక దిగరు, ఇష్టముండదు. ఏలాగంటే ఉదయమున ఒక కొండమీదనుండి మరొక కొండకు వెళ్ళినట్లు అనగా నీటి కొండనుండి ప్రార్ధన కొండమీదికి ఎక్కుట ఎంత కష్టమో, అక్కడనుండి దిగడము అంత కష్టము. కొండెక్కిన తర్వాత దిగరు. కొండమీది కోతైన దిగుతుందిగాని ప్రార్ధనపరులు కొండనుండి దిగరు. అలాగే ముగ్గురు ఇంకా ఎక్కలేదు గనుక ఎక్కితే దిగరు.

  • 1. శత్రు పటాలము:

    ప్రార్ధనాపరులు పై కొండమీద ఉన్నారు. శత్రుపటాలమువారు కొండ క్రింద ఉన్నారు. గనుక ఎవరు ఎవరికి లోకువ? పై వారికి క్రిందివారే లోకువ.


    ఉదా: 1880లో రంపపతూరి జరిగింది అనగా బ్రిటీష్ సైన్యము వారు రంపచోడవరంలో సైనిక కవాతు చేసారు. అప్పుడు రాజమండ్రిలోని అన్ని వీధులలోను తుపాకులతో పటాలం తిరిగారు. అపుడు రంప చోడవరంకెల్లడానికి ఇంటిలోనుండి ఎవరన్నా బైటకు వచ్చారుగాదు, వస్తే వారిని తీసికొనిపోతారు. స్టీమరువచ్చి అందరిని తీసికొని వెళ్ళినది. చనిపోయినవారి శవాలను అక్కడిపాతిరి. ఆ రంపపతూరిలో కోయవారికిని, ఇంగ్రీషువారికిని యుద్ధము. కోయవాళ్ళు కొండలచాటున దాగి ఉండేవారు. వారిలోని 100మంది ఇంగ్లీషు పటాలముపై బండలు విసిరి కొట్టారు గాన బ్రిటీష్ సైనికులు చనిపోయిరి. గనుక "పైనుండేవారికి క్రింద ఉన్నవారే లోకువ". గనుక మనము ప్రార్థన కొండగాని ఎక్కితే అందరు మనకు లోకువ. ఎందుకనగా మన శత్రువులు క్రింద ఉందురు. మనము పైన ఉందుము. పడిపోయేవారు క్రింద ఉందురు. గనుక పైనున్నవారే ఎక్కువ. భక్తిపరులు అనగా ప్రార్ధనాపరులు పైనున్న వారే గనుక వారికే జయము.


  • 2. దేవుని సంఘము రెండు విభాగములు:

    మొదటి భాగము ఎవరు?
    • 1) మోషేవలె కొందరు కేవలము ప్రార్ధనలో ఉందురు. అయితే మరికొందరు
    • 2) యెహోషువవలె సేవలో ఉండువారు. వారు శత్రువులతో పోట్లాడవలెను, శత్రువులను నాశనము చేయవలెను.

    పైన ప్రార్ధనాకూటము; క్రింద ప్రకటన అనగా సువార్త ప్రకటన. క్రిందనున్నవారికి ఉన్న బలము ఏమిటి? "పైవారు మాకై ప్రార్థించుచున్నారు". అదే వారి బలము. పైనుండే వారు క్రిందనున్న వారికి బలము; క్రిందనున్నవారు పై వారియొక్క ఫలము.


  • 3. రెఫీదీము కథ:

    ఈ కథలో పెండ్లికుమార్తెను జ్ఞాపకముచేయు కథ ఉన్నది. మోషే యెహోషువతో ఏమి చెప్పెను? 17:9 క్రింద 8 లక్షలున్నారు. వారిలోనుండి మనకొరకు మనుష్యులను ఏర్పర్చుము. అలాగే ఇప్పుడున్న అన్ని మిషనులలోనుండి పెండ్లికుమార్తె పటాలమును ఏర్చరచవలెను.


  • 4. మూడు పనులు:

    • (1) ప్రార్ధన చేయుట,
    • (2) వాక్యపఠనము చేయుట.
    • (3) సేవచేయుట అనగా యుద్ధము చేయుట.

    ఈ మూడు పనులకు మిమ్ములను మీరు ఏర్పరచుకొనవలెను.


    యుద్ధము ఎవరితో అనగా మన శరీరమునకును మన శరీరేచ్చలకును జరుగు యుద్ధమునకు గురుతు. శరీరముతో శరీరేచ్చలను నాశనము చేయుటే యుద్ధముయొక్క ఫలితము గనుక

    • 1. కొందరు ప్రార్ధనలో ఉండవలెను.
    • 2. కొందరు సేవచేయు పనిమీద ఉండవలెను.

    మోషే ఒక్కడే సరిపోతే, యెహోషువ ఎందుకు? ఒక్కడే చాలడు. గాన మోషే అవసరము. యెహోషువ అవసరము, ఇద్దరును కావలెను.


  • 5. నీటిలోనుండి ఫరో కుమార్తెచేత తీయబడిన మోషే, 80 సం॥లకు బండలో నుండి వచ్చిననీరు తీసి, 27లక్షల ప్రజల దాహమును తీర్చెను. యెహోషువ అనగా రక్షకుడు. ఇశ్రాయేలీయులను శత్రు బాధలలోనుండి రక్షించేవాడు, యుద్ధవీరుడు. యేసు అను పేరుకు రక్షకుడనే అర్ధము ఏలాగుండెనో ఆలాగు యెహోషువ వారిని రక్షించెను. యెహోషువ మొదటసారిగా పాలెస్తీనా దేశము వెళ్లినపుడు తనకెదురుగా ఒకదూత నిలిచి కనబడెను. అప్పుడు యెహోషువ, ఆ కనబడిన దూతను "నీవు మిత్రమండల పక్ష వాడవా? లేక శత్రు పక్షపువాడవా?" అని అడిగెను. "యెహోవా పక్షమున, సైన్యాధిపతిగా నున్నాను" అని అతడు అనగా అపుడు యెహోషువ మోకరించెను. అందుచేతనే అమాలేకీయులను గెలిచెను. ఇపుడు యెహోషువావంటి వారు లేవాలి. పూర్ణ సమర్పణ చేయువారు లేచినట్లే లేవాలి. నీకు మోషే పనికావలెనా? లేక యెహోషువ పని కావలెనా? వూర్ణ సమర్పణ చేయువారు ఈ రెంటిలో ఏదైనా చేయగలరు. ప్రభువును అడగండి. ప్రభువా! నేను పూర్ణ సమర్పణ చేసికొంటాను. మోషే తరగతిలోనా యెహోషువ తరగతిలోనా? ఏ తరగతిలోకి నన్ను రమ్మంటావు? అని అడగండి. యెహోషువ తరగతి అంటే మనుష్యులలోని దుర్గుణమును చంపు తరగతి మోషే దగ్గరకు మనము రాలేదు. ఇది ఏడవ అంతస్తు.
    పెండ్లి కుమార్తె
    • 1) ప్రార్ధన మానలేదు,
    • 2) సేవ మానలేదు

    గాని మనము ఆ మార్కు దగ్గరకు రాలేదు. మనకు ప్రార్ధన ఉన్నది సేవ ఉన్నది. గనుక ఈ రెండిటిని మనము పూర్ణ సమర్పణతో జరిగించవలెను.


  • 6. మోషే ఉన్నాడు, మోషే చేతిలో కర్ర ఉంది. దానివల్ల అద్భుతము చేసాడు. మోషే చేతిలో అద్భుతాలు చేసిన కర్ర, అదే మోషే కర్ర. దేవుని చేతిలో మోషే ఉన్నాడు. అది దేవుని కర్ర. ఈ కూటములో ఉన్న మీరందరు మోషేవలె దేవుని కర్రలే. అపుడే మీరు అద్భుతములు చేయగలరు.

దీవెన:

ఆలాగు మీరును, మోషేవలె ఆయన చేతిలోని కర్రలుగామారి, గొప్ప అద్భుతములు చేయు ధన్యత ఈ 40దినముల ధ్యానములలో పెండ్లికుమారుడు మీకు దయచేయునుగాక! ఆమేన్.