10. నిర్గమకాండ ధ్యానము

న్యాయము తీర్చిన దేవుడు



నిర్గమ. 6:1-18.

ప్రార్ధన:- తండ్రీ, నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుకొనే తండ్రీ! నీకు వందనములు. నీ న్యాయార్దమైన పద్ధతుల నిమిత్తమై పనుల విషయమై నీకు వందనములు. నీ పిల్లలకు న్యాయము తీర్చిన నీవే మా అనేక సంగతుల విషయమై, మాకుకూడా న్యాయము తీర్చుదువు వందనములు. ఇక్కడి మా లోటులన్ని పరలోకములో మూటలే. గనుక నీ ఊటలోనుండి వాక్యమును తేటగా అందించుము. ఆమేన్.


దేవుడు మోషేతో చెప్పినది ఏమనగా, "నీవు వెళ్ళి ఐగుప్తు రాజుతో నా ప్రజలను పంపివేయవలెనని చెప్పుము. అతను నీ మాట వినడు. చివరకు నేను శిక్ష పంపిస్తాను. అప్పుడు నీ మాట వినును". అలాగే ఇప్పటికాల ప్రజలుకూడా బోధ చెప్పితే వినరు, అద్భుతములు చేసినా వినరు గాని బాధలు వచ్చినప్పుడు లొంగుదురు. అలాగే ఫరోరాజు మొదట లొంగలేదు. కాని ఐగుప్తీయుల తొలిచూలు కుమారులు చనిపోయినపుడు భయపడి ఇశ్రాయేలీయులకు వెళ్ళిపోవలెనని సెలవిచ్చెను. మీరు వెళ్ళిపోవునప్పుడు ఐగుప్తీయుల నగలను అడిగి అలంకరించుకొని వెళ్ళండి అని రాబోవు దేవుడు సంగతులను ముందే చెప్పెను. సాధారణముగా స్త్రీలు నగలు ఇచ్చుటకు ఇష్టపడరు. కాని ఇచ్చే మనసు దేవుడే కలిగించెను. పుట్టనిచోటే పుట్టించే దేవుడు, రొట్టెలు ఎత్తుకొనిపోవు కాకులచేత ఏలియాకు రొట్టెలు ఇచ్చెను. రాజుగారు ఇశ్రాయేలీయులు ఈ పని చేసినందుకు సరిగా కూలి ఇవ్వలేదు. ఇదంతా దేవుడు తన లెక్కలలో వ్రాసికొనెను. ఐగుప్తీయుల నగలు ఇశ్రాయేలీయులకిచ్చుటలో దేవుడు ఇశ్రాయేలీయులకు కూలి నష్టం లేకుండా చేసెను. ఇక్కడ రెండు పాఠములున్నవి. అందులో దేవునియొక్క సర్వశక్తి కనబడుచున్నది.

  • 1వ పాఠము: వారు జనమును పంపరుగాని, పంపేటట్లు చేస్తాను.
  • 2వ పాఠము: నగలు ఇవ్వరు కాని ఇచ్చేటట్లు చేస్తాను.
  • 1) నేనే యెహోవాను,
  • 2) నేనే సర్వశక్తిగలవాడను,
  • 3) నేనే మీకు దేవుడను ఈలాగు ఆయన తన ఉనికిని, పనిని మోషేకు పలుమారులు జ్ఞాపకముచేయుచుండెను.

నిర్గమ కాండములోని ఆరవ అధ్యాయము చిత్రమైన అధ్యాయము. ఈ అధ్యాయమంతా దేవుడిచ్చిన జవాబులు నిండుగా ఉన్నవి. ఇశ్రాయేలీయులు ఎదిరించినారని మోషే ప్రభువుతో మొర్రపెట్టినపుడు, ప్రభువు మోషేతో నేను దేవుడనని గంభీరముగా చెప్పెను. దేవుడు పరిశుద్ధమైన కోపమును మోషేపై చూపెను. దేవుని స్వరంలో

  • (1) గద్దింపు,
  • (2) ఆదరించుట,
  • (3) ఐగుప్తీయులను నేను విమర్శిస్తాను, అను మూడు సంగతులు గలవు.

ప్రభువు మోషేను అహరోనును బలపరచినట్లు, విశ్వాసులను కూడా బలపరచును. "నేనే యెహోవాను" అని 5 సార్లు దేవుడు చెప్పెను.


నిబంధన:- "నేను ఇశ్రాయేలీయులను విడిపిస్తానని చెప్పినమాట ఇప్పుడిప్పుడు మీతో చెప్పినదికాదు, మీ పితరులకాలంలోనుండి చెప్పుచున్నది. ఆనాడు చెప్పినాను. ఇప్పుడు నెరవేరవలసియున్నది" అని దేవుడు ఇశ్రాయేలీయులతో నిబంధన చేసెను.

  • (1) "నేను ఉన్నాను
  • (2) నీకు విరోధంగాయుండు వారికి నేను ప్రాయశ్చిత్తం చేస్తాను
  • (3) నిబంధన జనముగా చేయుదును.

అది ఇప్పుడిప్పుడు చేసిన నిబంధనకాదు. మొదటనుండి చేస్తున్నాను" అని ప్రభువు ఇశ్రాయేలీయులతో చెప్పెను. ప్రతి బలి దగ్గర ఒక నిబంధన యుంటుంది. అది రక్త నిబంధన. చివరి బలి యేసుప్రభువు చేసినది. ఆయనకూడా దొంగతో నీవునాతో నేడు పరదైసులో యుందువు. నేను యున్నాను అనునది ఈ అధ్యాయముయొక్క ధ్వని.


6వ అధ్యాయము నిబంధన అధ్యాయము.

నిబంధనను స్వాధీనము చేసికొనగల నిరీక్షణ ప్రార్ధన:

ఓ దయగల తండ్రీ! నిరీక్షణగూర్చి తెలుసుకొని సంతోషించుచున్నాను. నీవు మా నిరీక్షణయైయున్నావు. అయితే మేము నీ నిరీక్షణయైయుండవలెను. "నీ నిరీక్షణ" అనే వాక్యముమీద బలము, సంతోషము దయచేయుము. మనకు నిరీక్షణ ఉండవలెనని బైబిలులో ఉన్నది. ప్రార్ధనచేస్తే అది ఫలించునని నిరీక్షణ ఉండవలెను. అలాగే అన్ని పనులును నెరవేరునని నిరీక్షించవలెను.


నేటి పాఠము - మా నిరీక్షణ కాదుగాని మా యెడల నీకున్న నిరీక్షణయై ఉన్నది. ఓ దయగల ప్రభువా! నీవు నిరీక్షిస్తూ ఉన్నావు. మావల్ల పని జరుగునని నిరీక్షిస్తూ ఉన్నావు. గనుక నీకనేక వందనములు. మావల్ల నీకు ఘనత వచ్చే పని జరుగునని నీవు నిరీక్షించుచున్నావు.


మా ప్రభువైన యేసూ! నీవు దారినవెళ్ళుచు అంజూరపు పండ్లనుచూచినావు గాని ఏమియు ఫలము దొరకలేదు. అలాగే మమ్మును పుట్టించి, పోషించి, విద్యా, బుద్ధులను అనుగ్రహించి మావల్ల ఫలితము పొందవలెనని నిరీక్షించుచున్నావు. నీవు ఆ చెట్టును పుట్టించి దానికి కావలసిన ఎండ, నీరు, గాలి దయచేసినావు. అయిననూ అందులో ఫలములు లేవు. నీవు నిరీక్షించినావు, కాని ఫలములు లేకపోయెను. అలాగే నీవుమాకు అనేక మేళ్లు, విద్య, ధనము, పంటలు మొ॥నవి దయచేసినావు. గనుక నీవు వెళ్ళి నిరీక్షించి, ఫలములు వెదక వెళ్లుదువు. కాని మాలో ఫలములు లేకపోతే ఏమి లాభము? అలాగే మా సేవలో నీవు వారము వారము గుడి సాగించుచున్నావు. బోధలవల్ల అనేకమైన సంగతులు వినిపించుచున్నావు. నీవు కోరినట్లు ఫలములు రాకపోతే, నీవు నిరీక్షించినది వట్టిదే అగునుకదా! తోటమాలి మొక్కలు వేసి పెంట (ఎరువు) వేసి, చుట్టు కంచెవేసి, వాటినిపెంచి, తుదకు ఒక పండైనను చూడకపోతే లాభమేమి? లోకస్థులు ఇంకా చెప్పుకోవడము మేము అనేక పర్యాయములు వింటున్నాము. 'మేము చాలా కష్టపడితిమి, చాలా డబ్బు ఖర్చుపెట్టినాము. కాని మాకు తగిన ఫలము దొరకలేదు' అని అంటున్నారు.


మా ప్రభువా! మా విషయమై నీవుకూడ అలాగే అంటున్నావు. "ఆత్మ జీవన విషయములో మీకు అన్ని ఇచ్చితిని. అయినను మీకు నా తట్టు చూపులేదు, నా తలంపు లేదు. భూమివైపే తలంపు ఉన్నదని" నీవు విచారించెదవు. పెంచే వారికి ఎలాగైనా ఆశ ఉంటుంది కదా! "కష్టపడేవానికి ఎలాగైన ఆశ ఉంటుందని" నీవేగదా విత్తనముల ఉపమానము చెప్పితివి. విత్తినవాటిలో కొన్నిటిని పక్షులు ఎత్తుకొనిపోయినవి. కొన్ని వట్టినేలను పడినవి. కొన్ని ముండ్ల పొదలో పడినవి. అయితే నాల్గవ స్థలములో పడినవాటి విషయమై నీవు సంతోషించుదువు. అది పెరిగి పైరై నూరంతల ఫలము ఇచ్చును. ఆలాగు నీకు నూరంతల ఫలము ఇచ్చు కృప దయచేయుటకు నేటి దిన ధ్యానమును దీవించుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్.


దీవెన:

కాబట్టి న్యాయకర్తయైన క్రీస్తుప్రభువు ఈలోకపు కీడులు, శోధనలన్నిటి నుండి మిమ్ములను తప్పించి, తన అంతరంగ సంస్కార బలముచే మహిమ శరీరులనుగామార్చి, మరణ బలమునుండి తప్పించి, మహిమ రాకడకు ఆయత్తపర్చుకొనునుగాక! ఆమేన్.