30. నిర్గమకాండ ధ్యానము

యేసు ప్రభువు చేసిన ఉపవాసము - 3



మార్కు 1: 9-13

ప్రార్ధన:

తండ్రీ! మరొకమారు నీ ఉపవాస చరిత్రతట్టు తిరుగుచున్నాము. మా నిమిత్తమై నీవు అన్నిటినుండి ప్రత్యేక పర్చుకొన్నావు. నీ దీక్షతో మమ్ములనే తలంచుకొన్నావు గనుక మేమును నీవలె దీక్షబూని నిన్నే తలంచుకొను కృప చూపించుము. అపుడు పిశాచి మిమ్ములనేమి చేయలేడు. ఆలాగు నీవలె, నీ కొరకు ప్రత్యేకించుకొనుటకు నేటిదిన వర్తమాన మిమ్మని యేసునామమున వందించుచున్నాము ఆమేన్.


మిమ్మును అందరిని ఈ చరిత్ర చుట్టు త్రిప్పుట ఎందుకంటే, క్రీస్తు ప్రభువుయొక్క ఉపవాసములోకి తీసికొని వచ్చుటకే. అందరు జ్ఞాపకము తెచ్చుకొండి. యెరూషలేముకు ఉత్తరమున గొప్ప అరణ్యమున్నది. “అక్కడ అడవి మృగములున్నవి" అని మార్కుసువార్తలో ఉన్నది. గనుక ప్రభువు, మృగముల మద్య అక్కడ ఉపవాసములో ఉన్నారు. ఆ ప్రక్కను దూరముగా పిశాచి పొంచియున్నది. దూరమునుండి చూచుచున్నాడు ఎందుకు? ఉపవాసము ముగించగానే సమీపించి శోధించుటకు. ఆయన ఉపవాస దీక్షలో ఉన్నాడు గనుక పిశాచి సమిపించ వీలులేదు.


అట్లే మనముకూడ ఉపవాస దీక్షలో ఉంటే పిశాచి రాలేదు గాని, మన ఉపవాస కాలములో వాడు రావడములేదా! వస్తున్నాడు. అతడు రాకపోయినా అతని బాణములైనా వన్తున్నవి. ఎందుకంటే మనుష్యులమైన మనలో మన జన్మమునుబట్టి, సాతాను. తననైజమును మనలో ఉంచెను. పాపమున్నది, అది పాపనైజము. అది అతని ఆస్తి, గనుక మనము ఉపవాసములో ఉన్నను సరే, అతడు వస్తాడు. అదిగాక మనము చేయు ఉపవాసమునుచూచి అతడు నవ్వుతాడు. ఎందుకంటే ఉపవాస ప్రార్ధనలో కూర్చున్నపుడు "నేను ఇంటికి తాళము వేశానోలేదో" అని వాడే మనకు జ్ఞాపకము చేస్తాడు. అదేగాదు మంచినికూడా జ్ఞాపకము చేయుచూ ఉండును, మన ఉపవాసమును చెడగొట్టుటకు సైతాను వద్ధ మనచేత పాపము చేయించే బాణములు ఉన్నవి.

    అవి ఏవనగా
  • 1. మంచిని జ్ఞాపకము చేయు బాణము
  • 2. చెడుగును జ్ఞాపకము చేయుబాణము.
  • అందుచేత అతడు మనలను హేళనచేయును.

అయితే, యేసుప్రభువులో సైతానుయొక్కయు, ఆదాము, హవ్వలయొక్కయు నైజములేదు. గనుక సైతాను దగ్గరకు రాలేక పొంచియుండెను. అయినను యేనుప్రభువు శోధనలో పడుటకు ఎక్కడైన సందున్నదా! వీలున్నదా! లేకేమి ఉన్నది. ఎందుచేత?


యేసుప్రభువుకు ఆదాము హవ్వల శరీరమున్నది. గనుక పడిపోవుటకు ఆయన వీలున్నది. అందుచేత ప్రభువు 40 దినములు ఉపవాసముంటే ఆయన 40 దినములు శోధింపబడియు, 40 దినములు శోధనను జయించెను. ఆయనకు జయమే. సైతాను దూరముగా ఉండి శోధకులను పంపెను. గాని అది లోపలకు రాలేదు.


ఉదా:- మన ఇంట్లో ఉపవాస కూటములో ప్రార్ధనలో ఉన్నాము. బయట వరండామీద కుక్క యొదురుగానున్నది. అది మనకు తెలియదా! తెలుసు. తెలుస్తున్నదా! తెలుస్తున్నది. ఆటంకముకాదా! అవును ఆటంకము. మన పనికి అడ్దముకాదా! అవును అడ్డమే, ఆటంకమే. అందుచేత ఎవరినైన పంపి కుక్కను తోలివేస్తాము. అయితే కుక్కలోపలికి వచ్చినదా! లేదు. గాని దాని కూత వచ్చినది. అలాగే సైతాను తన సర్కీటులోనే ఉంటే దాని శోధన ప్రభువు దగ్గరకు వెళ్లెను. (కుక్క కూత మన చెవిలోకి వెళ్ళినట్లు) మనము ఒకరోజు ఉపవాసము చేస్తే మంచి తలంపులు, చెడ్డ తలంపులు రాకమానవు. గాని వాటిని లెక్క చేయకుండ ఉండవలెను. లెక్కచేయకపోతే అది ఏమియు చేయదు. ప్రభువు 40 దినములు ఉపవాసము చేసేటప్పుడు, ఆయన మనస్సులో తండ్రి ఉన్నాడు. మరియు ఆయన ఆత్మచేత అరణ్యములోకి శోధింపబడుటకై కొనిపోబడినాడు అని ఉన్నది. గనుక ఆయన మనసులో తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. తోడుకొని వెళ్ళిన ఆయన చుట్టు సర్కీటులో దూరముగా సైతాను తిరుగుచుండెను. అది ప్రభువుకు తెలియును.


ఉదా:- ఆఫ్రికాలో ఒక అమ్మాయి క్రైస్తవబడికి వెళ్లవలసి వచ్చెను. బడిలో తన తరగతి పాఠములతోపాటు, క్రైస్తవ పాఠములుకూడ నేర్చుకొనుచున్నది. వారే నేర్పుచున్నారు. ఆ అమ్మాయి బడికి వెళ్ళుట, పాఠములు నేర్చుకొనుట తల్లిదండ్రులకు, గ్రామస్తులకు ఇష్టమేగాని మతము నేర్చుకొనుట వారికిష్టములేదు. నీవు మతము నేర్చుకొనుట మానకపోతే నిన్ను చంపుతామని ఆ అమ్మాయినన్నారు. "మీరు చంపండి గాని నేను మాననని" ఆ అమ్మాయి అనగా గ్రామస్థులందరు ఆమెను అడవికి తీసికొని వెళ్ళి, త్రాటితో ఒక కర్రకుకట్టి ఇంటికి వెళ్ళిరి ఆ అమ్మాయి ఒంటరిగా అడవిలో ఉండెను. తెల్లవారిన తర్వాత ఆ అమ్మాయిని అడవి మృగములు తినివేసియుండునని వచ్చి చూచిరి. ఆ అమ్మాయికి దూరముగా చుట్టు మేరలో గోతులుండుటయు, కాలుదువ్వియున్న మృగముల అడుగులును ఉండెను గాని మృగములు లేవు. మృగములామెను తినకుండ ఆయన కాపాడెను, తిననియ్యలేదు. దేవుడేర్పరచిన వలయాకారము దాటి ఆమె సమీపమునకు వాటిని రానియ్యలేదు. అవి ఆయనవేసిన మేర దాటలేదు. గాని అవి మేరకు వచ్చాయా? లేదా! వచ్చాయి. ఆ అమ్మాయి ఆ మృగములను చూస్తునేయున్నది. ప్రభువు వాటిని రానియ్యడని ఆమెకు తెలుసు. అది ఆమె మనసులో ఉంది. చివరకు అదే జరిగింది.


అలాగే ప్రభువు అరణ్యములో ఉపవాసములో ఉన్నపుడు, దొంగయైన సైతాను వాని సైన్యము, చుట్టు తిరుగుటయేగాని సరిహద్దు దాటి వెళ్ళలేదు. ప్రభువు ఉపవాసములో యున్నపుడు, ఆయనకు మన శరీరమే ఉన్నదిగాని ఆయనకు ఆకలి వేయలేదు, అనగా ఆ తలంపే లేదు. దాహము వేయలేదు, అనగా ఆ తలంపే రాలేదు. అందుచేత ఆహారము, నీళ్ళు అక్కరలేదు. మనలో ఎవరైనా ఉదయం 6గంటలు మొదలు సాయంకాలము 6గంటలవరకు ఉపవాసముంటే ఆకలి, దాహము జ్ఞాపకం రానిస్తే ఉపవాసముకాదు. రానియ్యకపోవడం చాలా కష్టము. ఆకలి జ్ఞాపకము వచ్చునుగాని ఓపికతో యుండవచ్చును. ఆకలి వేయకుండ ఉండుట, జ్ఞాపకము రాకుండా ఉండుట చాలా కష్టము. ఓపికతోకూడ ఉండుట మరింత ముఖ్యము. మత్తయి ఏమి వ్రాసినాడంటే ఆయన 40 దినముల ఉపవాసము ముగించిన పిమ్మట, ఆకలిగలిగి యుండుట సైతాను కనిపెట్టెను. "ఆయన ఆకలిగొనెను". దానికర్థమేమంటే అంతకు ముందున్న 40 దినములలో ఆకలిలేదు. అనగా తిన్నట్టేగదా! ఆలాగుండుటకు కారణమేమనగా, అన్నము; ఆకలి, నీళ్ళదాహము, నిద్ర మొదలగువాటి ధ్యానములు ఆయనకులేవు గాని తండ్రి ధ్యానము, ఆత్మ ధ్యానము, సైతాను ధ్యానము; అది మాత్రమేగాక లోకమంతటి రక్షణార్ధమై తానుచేయుచున్న ధ్యానము మాత్రమే కలిగియుండెను. ప్రభువుకు సైతానున్నట్లు తెలియకపోతే శోధనరాదు, జయమురాదు. జయము రావలెనంటే వాడున్నట్లు తెలియలెనుగాని, వాడిని లెక్కచేయకుండ ఉండవలెను. ఇన్నిటి మధ్యను ప్రభువు ఉన్నప్పుడు మనోనిదానము కుదురుట చాలా కష్టము. అయినను ఆయనకే కుదిరినది. ఇప్పుడు చెప్పినవన్ని విడిచిపెట్టితే, అందులో ఒకటి క్రొత్తది ఉన్నది అది ఏమి? మొట్టమొదటగా ఉపవాసమంటే

  • 1) ఆకలి, దప్పిక నిద్ర, కట్టివేయుట. సైతాను కూతలు కూయుట వినబడుచుండగా లెక్కచేయకుండ ఉండుట; ఇది కష్టము.
  • 2) ఇట్టి స్థితిలో తండ్రిని, ఆత్మను తలంచుకొనవలెను. ఇది మరీ కష్టము.

లోకమంతటిని, ఆదాము మొదలుకొని లోకాంతమువరకు ఆఖరున పుట్టబోయే చివరి మనిషివరకు తలంచుకొనుట కష్టముకాదా! యోహాను ఏమన్నాడు? ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల.

  • 1) మనుష్యులను,
  • 2) వారి పాపములను,
  • 3) వారి అవస్థలను,
  • 4) వాటి పరిహారమును;

యేసుప్రభువు ఈ నాలుగు అంశములను వాటి పరిహారము నిమిత్తము తలంచకపోతే ఎలా? దేవుడైయుండి, తలంచుకొనుట సులువేగాని మనిషైయుంటే తలంచుకొనుట చాలా కష్టము. దేవుని గొర్రెపిల్ల లోక పాపము మోసికొని పోవుట; ఈ నాలుగు పనులు చేయుటకేగదా! ప్రభువు వచ్చినది.


ఈ నాలుగు తలంచుకొనకపోతే రక్షించుట ఎట్లు? చివరిమాట గొర్రెపిల్లకదా భరించుచూ, మోసికొనిపోవలస్సినది!

  • (1) ఇంత పెద్దలోకమును,
  • (2) లోక పాపభారమును,
  • (3) పాపము మోసికొని పోవడము, అను ఈ మూడును చేయడము విషయములో, ఆయన గొర్రెపిల్లవంటివాడు గనుక వినయముగా సహించుకొనవలెను.

అది ఆయనకు ఎంతో కష్టము. ఆ పనిమీదే వచ్చినాడు గనుక ఉపవాసము చేసేటప్పుడు, ఆ నాలుగు పై అంశములు జ్ఞాపకం రాకపోతే పరిహరించుట అనేది ఎట్లు జరుగును? ఆ పనిమీద వచ్చివాటినే తప్పించుకొనకపోతే చేసిన ఉపవాసమునకు విలువలేదు. అట్లే మీరు చేసేవనిమీద ఉపవాసము చేయునవుడు అట్లే చేయవలెను.


ఉదా:- ఒక పంతులమ్మ అయ్యగారి దగ్గరకు వచ్చి నాకు ట్రాన్స్ ఫర్ (బదిలీ) ఇచ్చుటలేదు. ప్రార్ధించుమని కోరింది. అయ్యగారామెను ఉపవాస ప్రార్ధన చేయమన్నారు. ఆమె అయ్యగారు చెప్పినట్లు చేయగా, ఇంటికి వెళ్ళేసరికి ట్రాన్స్ ఫర్ ఆర్డర్ వచ్చింది. ఆమె ట్రాన్స్ ఫర్ మాత్రమేగాని ఇతరాంశములు ఆమె ప్రార్ధనలో లేవు. డబ్బు, పిల్లలు, ఇల్లు ఆమె తలంపులో లేవు. ఆ పంతులమ్మకు ట్రాన్స్ ఫర్ వచ్చింది, అయితే, ట్రాన్స్ ఫర్ తో పాటు రోగులను బాగుచేయువరముకూడ ఆమెకు వచ్చింది. అలాగే యేసుప్రభువుయొక్క ఉపవాసములో కొండమీద ఆయనకు

  • 1) సైతాను తలంపులేదు,
  • 2) లోకాలు తలంచుకోలేదు,
  • 3) పాపాన్ని తలంచుకోలేదు,
  • 4) మోసికొని వెళ్ళడమనేది తలంచలేదు,
  • 5) తుదకు ఇవన్ని సహించుకొనవలెనుగదా! అదికూడ తలంచుకోలేదు.

ఇవి తలంచక; "నేను సాధువైన గొర్రెపిల్లవలె వీటన్నిటిని మోసికొనిపోవలెనుగదా!" అని తలంచుకొనకుండ; తండ్రి దగ్గర ఉదహరించకుండ, ఏలాగు ఆయన ఉపవాసము చేయును!! ఆ పంతులమ్మకు ఆమె కోరని ఒక వరముకూడ వచ్చింది. ట్రాన్స్ ఫర్ వచ్చింది. దాని కదనముగా స్వస్థత వరము వచ్చినది. ఆమెవలె మనమును చేసిన మనకును అడిగినదిగాక మరొకటి అదనముగా వచ్చును. ఉపవాసము వల్ల ఎటువంటి మొండికేసులైనను నెరవేరునుగాని చేయుట చాలాకష్టము.

దీవెన:

ఆలాగున అన్నిటినీ కట్టివేసి, ఆయన యెదుట దీక్షతోకూర్చుండి ఉపవాసము వలన వచ్చే అదనపు వరములను సంపాదించుకొని గొర్రెపిల్ల రూపమును ధరించుకొందురు గాక! ఆమేన్