15. నిర్గమకాండ ధ్యానము

ఐగుప్తు శక్తి పూజలు - విశ్వాసి భక్తి పునాదులు



నిర్గమ. 12:12; ద్వితీ. 18:9-13.

ప్రార్ధన:

తండ్రీ! మేము నీ రాకడ సమీపకాలములో ఉన్నాము. దయ్యము తన పనులను ఉద్రేక పూరితముగా జరిగించజూచుచున్న దినములలో ఉన్నాము. అయినను దిగులు పడవల్సిన పని లేదు. ఎందుకంటే నిన్నుబట్టి మాకు ఎల్లపుడు జయమే, సంతోషమే గనుక ఆనంద వందనములు. నడుపల్లి ప్రాంతములో నీ బిడ్డలు తిరిగిపోకుండా కాపాడుము. పాతనిబంధనలో చంపవలెనని యున్నది. అయితే ఆ పని మాకు ఇవ్వలేదు. మమ్మును ప్రార్ధించమన్నావు. మేమింకా నేర్చుకొనవలసినవి ఈ దినమందు మరలా నేర్పించుము, దీవించుము. ఆమేన్.


మనము ఈ వేళ మహాముఖ్యమైన అంశములు చదువుకొన్నాము.

  • 1. అబద్ధ ప్రవక్తలు ప్రవచిస్తారు. క్రైస్తవులును వారినిచూచి మోసపోవుదురు.

  • 2. అబద్ధప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేరును. అయినప్పటికిని మీరు వాటిని గైకొనరాదు. వారు అద్భుతములు చేయుదురు. అయినప్పటికిని మీరు వాటిని గైకొనరాదు.

  • 3. ఆ అబద్ధ ప్రవక్తలవలన జబ్బులు పోవును, సంతానము కలుగును, చిక్కులు విడిపోవును. అయినను మీరు అవి పాటించరాదు.

  • 4 సాతానువలన మేలు ఎందుకు కలుగుననగా నిత్యనాశనము పొందుటకే,

  • 5. మీరు బాగా తినుటకు మా విరోధి ఒకడు మీకు మంచి రుచిగల విందు చేయిస్తే అందులో మందుయున్నదని మీకు తెలియదు. తినిన వెంటనే హానిగదా! అట్లే అబద్ధప్రవక్తలును మీకు చేయు మేళ్లవలన హాని కలుగును.

  • 6. మెస్మరిజము, సోదెచెప్పుట, శకునము చూచుట. పద్మము వేయుట, చేతబడిచేయుట, కట్టుబోతుతనము పెట్టుట, విగ్రహముల ఎదుట ధూపము వేయుట, పిల్లలను బలివేయుట, పశ్వాదులను బలివేయుట; ఇవన్నియు పిశాచి కార్యములు గనుక వీటితో పాలుమీకుగూడదు.

  • 7. భక్తులను మోసము చేయుటకు శక్తిపూజగలవారు అద్భుత క్రియలు చేయుదురు. "అయినను వారిని అనుసరింపరాదు" అని ప్రభువు చెప్పినారు. ఐగుప్తు మాంత్రికులు సర్పములను చేయలేదా? అంతమాత్రమున మనమును అట్టివారము కావలెనా? ఇతర మతస్థులు అద్భుతములు చేయవచ్చు గాని వారు క్రీస్తు లేకుండా చేయుదురు.

గనుక అవి మంచివైనయెడల భాగా యున్నవని అనవచ్చునుగాని క్రీస్తు లేనందువలన వారి మతమును అవలంభించకూడదు. లోకములో అనేకమైన మంచి సంగతులున్నప్పటికిని, వాటిని క్రీస్తులేని లోపమున్నది అని సాధు సుందర్ సింగు కనిపెట్టినారు. శక్తిపూజలవలన అద్భుతములు జరుగునుగాని వాటివలన రక్షణయుండదు. ఎందుకనగా వాటిలో క్రీస్తులేనందున వాటివలన రక్షణలేదు.


మొదటి దేవదూతకు (లూసిఫర్ కు) దేవుడు అన్ని సద్గుణములు, సమస్త హక్కులు, శక్తులు ఇచ్చినాడు. గనుక ఆ దేవదూత సైతానుగా మారిపోయినపుడు వాటిని ఆ దూతనుండి ఆయన తీసివేయలేదు. అందుచేత అతడు తన భక్తులకు ఈ లక్షణములను ఇచ్చినాడు. కాని వాటిలో రక్షణలేదు.
ఉదా: ఒక అబ్బాయి బి.ఎ. చదువుకున్నాడు. కాని పాపములో పడ్డాడు. జైలులోవేసారు. అంతమాత్రమున అతని బి.ఎ. చదువు పోయినదా? పోదు. అలాగే దేవదూత దయ్యమైనపుడు అతనిలోని శక్తులు పోవునా? పోవు. గనుకనే అతడు ఇట్టి అద్భుతములు చేయుచున్నాడు. ఇక్కడ బి.ఎ. చదివిన ఉద్యోగి చెడినాడు గనుక తన చదువును చెడుగుగా వాడుకుంటాడు. ఏలాగంటే చెడ్డ ఉత్తరములు వ్రాయును. గవర్నమెంటును తిరస్కరించి ఇంగ్లీషులో ఉత్తరములు వ్రాయును. అది తనకు చెడుగని తెలిసినను చెడ్డకాదని వాదించును.


సైతాను శక్తిపూజలను ఎదుర్కొని వాటిని జయించుటకు మనము ప్రియులైన పిల్లలవలె దేవుని పోలి నడుచుకొనవలెను (ఎఫెసీ. 5:1) మన

  • 1) స్వరూపము,
  • 2) స్వరము,
  • 3) స్వభావము ఈ మూడును దేవుని పోలినవై ఉండవలెను.

తండ్రి, "తనకంటె తన బిడ్డలు గొప్ప విద్య సంపాదించవలెను, గొప్పస్థితిలో ఉండలెనని" కోరును. మనము క్రీస్తుకంటె గొప్పవారముగా ఉండలేము. అయినను ఆలాగు గొప్ప వారముగా కావలెననునది క్రీస్తుప్రభువు ఆశయై ఉన్నది.


ఉదా:- మంటిలోనో పురుగుండును. పక్షి ఆకాశములో సంతోషముగానే ఎగురుచుండును. ఆలాగే మనము ఇహలోకములో పుట్టిన వారమైననూ మన తలంవులు, క్రియలు పరసంబంధమైనవై యుండవలెను. మనము లోకముతో కలసి మెలసి యున్నను, మన మనస్సు ప్రభువు తట్టుండవలెను. మనము ఒక స్థలమునకు త్వరగా వెళ్లవలెనంటే నడక, అంతకంటే వేగముగా వెళ్ళవలెనంటే బండి, ట్రైన్, విమానము ఎక్కుదుము. విశ్వాసి తన తలంవులో విమానముకంటె వేగముగా వెళ్ళునుగాని పని చేయవలసి వచ్చినప్పుడు కొంచెముగా చేయును. అలాగే మన బ్రతుకులోను క్రమ క్రమముగా, నెమ్మదిగా నుందుము. అయితే మనము స్థిరముగా ముందుకు వెళ్ళవల్సిన వారమైయున్నాము. యోసేపు మొదట శ్రమలు అనుభవించి, చివరకు రాజయ్యెను.


ఈ క్రమములో, విశ్వాసము మొదటి మెట్టు, రెండవ మెట్టు ప్రార్ధన: ఇక్కడ "నా ఇష్టప్రకారము చేయుమని" మనము దేవుని బలవంతము పెడదామని అనుకొనకూడదు. దేవుని ఆజ్ఞలను నెరవేర్చుటయే దేవుని ప్రేమించుట, అపుడు మన మనవి త్వరగా అంగీకరింపబడును.

  • 1) విశ్వాసి - అబ్రాహాము
  • 2) ప్రార్థనాపరుడు - మోషే
  • 3) ప్రేమచూపినవాడు - యోహాను.
  • వీరిలోని లక్షణములు మనమును స్థిరముగా కలిగియుండవలెను.


ప్రార్ధన: దయగలతండ్రీ! మేము ఈ దినము సంభాషణ పూర్వకముగా మాట్లాడుకొన్న విషయములు దీవించుము. మేము పెట్టబోవు బైబిలుక్లాసులను దీవించుము. వెంటనే ఆ క్లాసు విద్యార్థులు సమకూడు కృప దయచేయుము. ఆమేన్.

దీవెన:

ఆలాగు విశ్వసించి, బలమైన ప్రార్ధనలు జరిగించి, సాతాను శక్తులపై జయము పొందు గొప్ప భాగ్యము నమన్తమును జయించిన ప్రభువు నేడు మీకు దయచేయునుగాక! ఆమేన్.