నిర్గమకాండములోని సన్నిధి
నిర్గమ 25:22.
ప్రార్ధన:
తండ్రీ! నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుచున్న తండ్రీ! వందనములు. నీ సన్నిధిలేని స్థలములేదు. నీ సన్నిధికాంతి ప్రసరింపని చోటులేదు. పొదలోని సన్నిధిని యెదలోనికి దించివేసినావు. నీ ఆశ్చర్యమర్మమెట్లు గ్రహింపగలము! సర్వ సంపూర్ణత నీ సన్నిధిలోనే ఉన్నది. సర్వము నీ సన్నిధిలోనే ఉన్నవి గనుక మాలో నీ సన్నిధి పరిపూర్ణముగా నివసింపజేయుటకు నీ వాక్య సన్నిధిని మాలో ఉంచి, ఈ వాక్య భాగమును వెలిగించుము. యేసునామమున అడుగుచున్నాము. ఆమేన్.
నిర్గమకాండములో ఒక కథ:
ఒక పొద ఉన్నది. ఆ పొదలో అగ్ని నాలుకలు వస్తున్నవి. అందులో
ప్రభువున్నాడు. అక్కడ మోషే ఉన్నాడు. దేవుడు మోషేతో మాటలాడినాడు. మోషే దేవునితో మాటలాడినాడు.
నేను
నీకు
చూపించేదేశము వెళ్ళుమని అబ్రాహాముతో అనగా వెంటనే దేవునిమాట ప్రకారము వెళ్ళెను.
ఇక్కడ దేవుడు మోషే ఐగుప్తుకు వెళ్లుమంటే నీవెవరినైనా పంపుకొనుము నేను వెళ్ళలేను, నేను నత్తివాడను అని సాకులు చెప్పగా దేవుడు బలవంతముగా పంపెను.
ప్రభువు అక్కడ ఒక మాట చెప్పాడు. ఈ పొద స్థలము పరిశుద్ధస్థలము గనుక నీ చెప్పులు తీసివేయుము అని అన్నాడు. మోషే దేవుని యెదుట ఎదిరించి ఏమన్నను బాగేగాని పొద దగ్గర దేవునిచూచెను. దేవుని సన్నిధినిచూచెను. దేవుని మాటలు విన్నాడు ఎంత ధన్యత! ఎంత ధన్యత! దేవుని ఎదిరించే ఈ మురాభి మనిషికి ఎంత ధన్యత వచ్చింది! దేవుని సన్నిధివల్లనే ధన్యత వచ్చింది. సన్నిధివల్లనే చివరకు దేవునిమాట విన్నాడు.
ఈ మురాభి మనిషికి ఎంత ధన్యత వచ్చింది? ఈ మోషే దేవుని సన్నిధికి వెళ్లలేదు. గొర్రెలు కాయుటకు వెళ్లితే దేవుని సన్నిధి వచ్చింది. ఒకదానికిపోతే మరొకటి వచ్చింది. అలాగే ఇప్పుడుకూడా ఏలాటి దుర్మార్గుడైనసరే దేవుని సన్నిధికి వెళ్లారా? దొరికేదే దొరుకును.
- 1. గద్దింపులు
- 2. వర్తమానము
- 3. అద్భుతములు
- 4. ధైర్యము
- 5. సేవ
- 6. ఆదరణ.
ఈ మొదలైనవి దొరుకును. నేడుకూడా దొరుకును. నేడును మీ గ్రామములో సన్నిధి కూటముపెట్టుకొండి. అప్పుడు ఇవన్నియు దొరుకును.
మోషే పొద దగ్గరనుండి ఐగుప్తుకువెళ్ళి, ఐగుప్తునుండి ఎర్రసముద్రముదాటి అడవిలో ఉన్న సీనాయి పర్వతము ఎక్కినాడు. మంచి ఉన్నతమైన కొండ. ఉన్నతమైన స్థితిలోకి వెళ్లినాడు. అక్కడ దేవునితో ముఖాముఖిగా దేవునితో మాటలాడే ధన్యత దొరికింది. మనవలె ఒకగంటకాదు. 40 రోజులు తిండి, తిప్పలులేవు. గొప్ప సన్నిధి. మనలో ఎవరైనా 40 దినములు దైవసన్నిధిలో ఉంటే చచ్చిపోతారు. అన్నంలేక, నీళ్ళులేక చస్తారు. ఈ మోషే మాత్రము చావలేదు. మన బైబిలులో దా॥కీర్తనలో 16:11లో జీవమార్గము. కొండమీద మోషే జీవమార్గము అనగా జీవముతో ఉన్నాడు. నీ కుడిచేతిలో నిత్య సుఖములు కలవు. ఇక్కడ మోషే సుఖముగా ఉన్నాడు.
-
సీనాయి కొండపై సన్నిధిలోనున్న మోషే
- 1. జీవముతో ఉన్నాడు.
- 2. సంతోషముగా ఉన్నాడు.
- 3. సుఖముగా ఉన్నాడు.
ఈ మోషేవలెనే మన దేశములో ఒక భక్తుడు లెక్కవేసి 40 దినములు సన్నిధిలో ఉండాలని వెళ్లారుగాని కృషించి పోయారు. ఆయన దైవభక్తుడే సంపూర్ణ సమర్పణగలవాడే. ప్రత్యక్షతగలవాడే. ఎందుచేతనోగాని 40 దినములు ఉపవాస సన్నిధి భాగ్యము కలుగలేదు. కృషించిపోయారు. మనకు తెలియదు. ఆయనకు తెలియదు గాని మోషేమాత్రము 40 దినములున్నను తిండి, నీరు లేకపోయినను శరీర బలము తగ్గలేదు. ఆశ్చర్యము.
మన తెలుగు జిల్లాలో ఒక విశ్వాసి దేవుని ఆజ్ఞ ప్రకారము 90 దినములు దేవుని సన్నిధిలో ఆహారము నీరు లేకుండా ఉంది, గాని అప్పుడప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు త్రాగి 90 దినములు ఉండిపోయింది.
అక్కడనుండి రాగా మోషే దగ్గరనుండి పెద్ద గీత. దావీదు రాజు వరకును. ఈ దావీదుకు తీరికలేదు, ఎప్పుడును యుద్ధములే దావీదు గురించి బైబిలులో ఒకమాట ఉన్నది. మనిషి మనిషితో మాటలాడిన విధముగా దేవుడు నాతో మాటలాడినాడని దావీదు సాక్ష్యము ఇస్తున్నాడు. సీనాయి కొండమీద మోషేకు దేవుడు వ్రాసి చూపించాడు. అట్లే దావీదుకు గాలిలో వ్రాసి చూపించినాడు గనుక మనమందరము సన్నిధిలో ఉండవలెను.
దీవెన:
ఆలాగు ఆయన సన్నిధిలోని సంపూర్ణ నంతోషము, జీవభాగ్యము ప్రభువు మీకు దయచేయునుగాక! ఆమేన్.