పవర్ హౌస్ - మోషే ప్రార్ధనా శక్తి
దా.కీ. 25:1-4
విమోచన స్తుతి ప్రార్దన:
ఓ దయగల తండ్రీ! పరలోకమందున్న మా తండ్రీ! నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను కాదుగాని భక్తిహీనులైన మమ్మును విమోచించియున్నావు. వారు అహరోనుమీదను, మోషేమీదను తిరుగబడియున్నారు. విగ్రహారాధనకంటే తిరుగుబాటు చేయుట గొప్ప పాపమైయున్నది. అయినను నీవు వారిని ఎర్ర సముద్రము దాటించినావు. రెండవసారి మరలా తిరుగబడియున్నారు. ఒక ప్రక్కను వారు వాగ్దానము చూస్తున్నారు. ఐగుప్తులోనుండి నీవు వారిని రప్పించిన కృపను చూచినారు. మోషేను చూస్తున్నారు గనుక వారు గంతులు చేయవలసినది. ముందు సముద్రము, రెండు ప్రక్కల కొండలు వెనుక శత్రువులు, ఈ మూడును చూచి వారు భయపడినారు, హడలిపోయినారు, భయపడినారు, ఎదిరించినారు. ఇది బలహీనతయే. ఇన్ని బలహీనతలు ఉన్నప్పుటికిని వారి పక్షమున మోషే చేసిన ప్రార్ధన ఆలకించినావు. గనుక నీకు స్తోత్రములు. మిమ్మును పాలస్తీనాకు తీసుకువెల్తాననే ఒక మహిమ వారికి కనబడుచున్నది. వారి ఎదుట మోషే బోధలు ఉన్నవి. ఇదియొక మహిమ. ఎర్ర సముద్రము వరకు రావడము అనే క్రియ ఇంకొక మహిమ; ఈ మూడు మహిమలు చూచినారు. అయినను కొందరు శత్రువులను, సముద్రమును చూచి భయపడినారు. ఇంత మహిమను చూచిననూ, "వారు నామీద వినుగుకొన్నారు" అని నీవు వారిని దాటించక మానలేదు. న్యాయము చొప్పున దాటించకుండా ఉండవలసినదే. నీవు దాటించకపోతే ఎవరేమంటారు! నీవు వారిని అక్కడ విడిచిపెట్టితే వారు శత్రువుల పాలు కావలసినది. అయినను నీవు వారిని దాటించి అద్భుతము చేసినావు. నీకనేక వందనములు. నిర్గమ కాండము 14వ అధ్యాయములో మేము ఏమి నేర్చుకొన్నామంటే మనుష్యులలో బలపహీనతలున్నను వారి ప్రార్ధనలు నీవు ఆలకిస్తానని తెలియుచున్నది. ఎందుకనిన వాగ్దానములు, మోషే జనాంగములు; అందరూ అన్నియు, నీవియై ఉన్నవి. అందువలన వారు విమోచన కీర్తన పాడిరి. అది ఎంతో గొప్ప కీర్తన. ఇంత గొప్ప కీర్తన! అని చెప్పుటకు వీల్లేదు. ఐగుప్తునుండి, శత్రువులనుండి విమోచించినావు. బాప్తిస్మము పొందుటచేత, నీ రక్తముచేత ముద్రింపబడుటవలన మేము నీ జనమైయున్నాము. గనుక మాలో లోటుపాటున్నప్పటికి నీవు మా ప్రార్ధనలు ఆలకిస్తానని ధైర్యము కలుగుచున్నది. నీవు మా బలహీనతలవైపే చూస్తే మాకు విమోచన ఎలాగు వస్తాది! ధైర్యము ఎలా వస్తుంది! తండ్రీ! నీకు స్తోత్రములు. ఈ మా స్తోత్రములు త్వరగా రానైయున్న నీకుమారుడును, మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అంగీకరించుము. ఆమేన్.
ఓ దేవా! పర్వతముమీద మోషే ప్రార్ధనలో ఉన్నాడు. పర్వతము క్రింద యుద్ధము ఉన్నది. రెండు పటాలములు పోరాడుచున్నవి. ఒక పటాలము దేవుని జనమైన ఇశ్రాయేలీయులు, వారికి నాయకుడు యెహోషువ. రెండవ పటాలములోనివారు శత్రువులైన అమాలేకీయులు. కొండమీద మోషే ప్రార్ధన చేసినప్పుడు దేవుని ప్రజలకు జయము. ఆయన ఆగినపుడు అనగా ప్రార్ధనలో అలిసిపోయి మానినపుడు శత్రువులకు జయము. మోషే చేతులు పైకెత్తి ప్రార్ధన చేసెను. అపుడాయన చేతులు లాగెను. అందుచే చేతులు క్రిందికి దించెను. అపుడు దేవుని ప్రజలకు అపజయము కలిగినది. అప్పుడిద్దరు విశ్వాసులు మోషే చేతులు పైకెత్తిరి. ఒక చేతిక్రింద ఒకరు, మరియొక చేతిక్రింద ఒకరు ఉండి చేతులు పైకెత్తిరి. అప్పుడు దేవుని ప్రజలకు జయము కలిగినది. ఆదుకొన్నపుడు చేతులు ఇక క్రిందికి వ్రాలిపోవు. ఒకచేతిక్రింద హూరు అనే భక్తుడున్నాడు. మరియొక చేతిక్రింద మోషే అన్న అహరోను ఉన్నాడు. మోషే చేతులు వ్రాలకుండా వారు సాయంకాలము వరకు పట్టుకున్నారు. తుదకు దేవుని ప్రజలకు జయము కలిగినది. అలాగే మన దేశములో ఉండే కైస్తవులు - శత్రువుల ప్రయత్నములు జరుగకుండ చేయుమని ప్రార్థిస్తే జయము కలుగును. ప్రార్ధన మానితే శత్రువులకు జయము. ప్రార్ధన మానకుండా ఉంటే మనవారికి జయము. లోకం అంతట ఇపుడు క్రైస్తవులకు విరోధులే లేచారు.
మనముందున్న ప్రార్థనాంశము ఏదనగా, "శత్రువుల ప్రయత్నములు సాగనీయకుము. శత్రువుల ప్రయత్నములు లయపర్చుము". కొండమీద జరిగిన సంగతి: ఆ ఇద్దరికి మోషేగారి చేతులు మోయుట మాత్రమే తెలిసినది. అయినప్పటికి ప్రార్ధన నెరవేరినది. భుజములమీద చేతులు పెట్టుకొనుట గొప్ప సహాయము. మోషేగారు చేసిన ప్రార్ధన వారు చేయలేదు. చేయకపోయినా సహాయకులైరి. అలాగే అయ్యగారి మనస్సులో తీవ్రమైన ప్రార్ధన ఉన్నది. కాబట్టి మనము సహాయము చేయవలెను. గనుక బలముగా ప్రార్ధన చేయవలయును. ఆ ఇద్దరు ప్రార్ధన చేయక సహాయము చేసారు. అయితే మీరు ప్రార్ధన చేయవలయును. ఎందుకంటే ప్రార్ధన చేయాలని మనకు తెలియును గనుక. ముఖ్యముగా మార్కు 11:24 ప్రకారము చేయవలయును. అయితే శత్రువులయొక్క "ప్రయత్నములు ఆపుచేయుమని చేయాలి". ఆయన ఆపుచేసినట్టు మనకు వెంటనే తెలియదు. వారి పని అట్లేయుండును. అయినను "అపుడు ఆవుచేయుమని మనము అడిగినాము. కాబట్టి ఆగినదనే దృఢ నమ్మకము" మన హృదయములో కలుగజేసుకొనవలెను. అట్లుచేసినట్లయితే మనదృఢ విశ్వాసము వలన అక్కడి శత్రువుల పనికూడ ఆగును. గనుక ప్రతీ విషయములోను పట్టుదల కలిగియుండవలెను. శ్రమ ఎక్కడో ఉంది, మనకు పరవాలేదు అనుటకంటే ఇప్పుడే సిద్ధపదుట మంచిది.
ఉదా: రాజమండ్రికి ౩ మైళ్ళ దూరములో ఉన్న కొవ్వూరులో ఇళ్ళు కాలినవి. ఎక్కడో దూరములో ఉన్న వారికికూడ ఆ మంటలు కనబడినవి. చివరికి వారివరకుకూడ మంటలు వ్యాపించినవి. అలాగే మన దేశములో ఎక్కడో ఒకమూల ప్రారంభమైన ఈ హింసలు అన్నీ ప్రక్కలకును వ్యాపించును. ఆలాగే హింసకులైనవారి మనస్సులో ఒకచోటనేకాదు, దేశమంతా వ్యాపింపచేయవలెనని ఉన్నది. అందుకే వారు క్రైస్తవ ఆచారములు మానివేయమందురు. ఇప్పుడు అట్టి విషయములు అక్కడక్కడ జరుగుచున్నవి.
ఉదా: (Power House) పవర్ హౌస్ పెద్దదా? మనమున్న గది పెద్దదా? మైనపు వత్తి పెద్దదా? మనమున్న గది పెద్దదా? మనకూటము చిన్నదైనప్పటికిని మన ప్రార్ధనా శక్తి దేశమంతటా దుష్టప్రచారము చేయుచున్న మన శత్రువుల ప్రయత్నములను లయము చేయును. కొండమీద ఒంటరిగా ఉండి మోషే ప్రార్ధన చేసినపుడు క్రిందనున్న పటాలములు పారిపోయినవి. తిరిగి ఎన్నటికిని రాలేదు. గనుక మన ప్రార్ధనకుకూడా అట్టి శక్తి ఉంటే ఇప్పుడే అంతటి పని జరుగును. మనకు అనేక మీటింగులు జరుగుచూ ఉన్నందున మన ప్రార్ధనకు పవరు ఎక్కువగా ఉండవలసినది. అట్లులేనియెడల ప్రయోజనములేదు. కాబట్టి పురి ప్రార్ధన చేయవలయును. అనగా ప్రార్ధనను పురి ఎక్కించవలయును.
షరా: ప్రార్ధనకు మీరు రావడము చాలా సుళువేగాని ప్రార్ధన కుదరదు. ఒకవేళ కుదిరితే మనస్సు ఒప్పుకొనదు. అనేకమైన ఆలోచనలు పుట్టును. అందుచేత మరలా ప్రార్ధనా వాలు పడిపోవును. అపుడు దయ్యములు నవ్వును. ఇక్కడ కూడా దయ్యములు ఉన్నవి అని మరువకండి.