పది ఆజ్జలు - ప్రభు భోజనము
నిర్గమ. 20:1-26.
ప్రార్ధన:
మా తండ్రివైన యేసుప్రభువా! నీవు మమ్ములను నీ బల్లయొద్దకు రమ్మని కోరుచున్నావు. అక్కడ నీ శరీర రక్తములు ఆహారముగా నీవుంచినావు. మేము సిద్దపడుటకు ఈ దినము సిద్ధపడు వర్తమానము దయచేయుము. ఆమేన్.
ప్రసంగము:
పోయిన ఆదివారము ప్రభువు యెరూషలేము వెళ్ళిన అంశము మీద మాట్లాడుకొన్నాము. అప్పుడు ఆయన యెరూషలేముకు వెళ్ళేటందుకు సిద్ధపడినారు. గార్థభమును తీసికొనివచ్చి దానిమీద బట్టలు వేసి ఆయన కూర్చుండి ప్రయాణము చేసెను. ఆయన సిద్ధపడకుండా యెరూషలేము వెళ్ళలేదు. ఆదికాలమునుండి చివరికాలము వరకు ప్రభువు సిద్ధపడకుండా ఏ పని చేయలేదు. సమస్తము సిద్ధపరచెను. నేలమీద బట్టలుపరచబడిన కొమ్మలు వేయబడినవి. జన సమూహము స్తుతిచేయుట అది పోయినవారము చెప్పిన పాఠము.
ఈ వేళ నేను సిద్ధపడే ఆరాధనకొరకు ఏదైనా వాక్యము వ్రాయమంటే హోసన్నా అని వ్రాయుదును. రేపు ప్రభు భోజనము తీసికొనేటప్పుడు వ్రాయదలచిన పాఠము హల్లెలూయ. ఈ సాయంకాలము మాత్రము హోసన్నా, రేపు సాయంకాలము మాత్రము హల్లెలూయా. ఈ రెండు బైబిలునందున్నవి. తెలుగు భాష బైబిలునందుకూడా ఉన్నది. హోసన్నా = రక్షించు. ప్రభువా! రక్షించుము అని బల్ల దగ్గరకు వచ్చువారు ప్రార్ధించవలెను. బైబిలులోని పది ఆజ్ఞలు మనము చదివితే మనలో ఏమి తప్పిదములున్నవో తెలిసికొనగలము. ఆ పది చదివితే వాటిద్వారా మన హృదయములోనున్న లోటులు తెలిసికొందుము. ఆ పది ఆజ్ఞలకు విరోధముగానున్న పది సంగతులు మన హృదయములోనున్నట్లు తెలియును. అప్పుడు హోసన్నా అనవలెను. ప్రభువా! రక్షించుము.
వేటినుండి? నీవు చెప్పిన పది ఆజ్ఞలలోని విషయములనుబట్టి నేను నడచుటలేదు. ఆ పాపములు నాలో నున్నవి. తలంపు, మాట, క్రియలోనున్నవి. గనుక "హోసన్నా! ప్రభువా రక్షించు" అని అనకపోతే ఈ సిద్ధపాటు ఆరాధన చేయకపోతే రేపు బల్లదగ్గరకు వెళ్ళలేము. ఒకవేళ ఈ పది ఆజ్ఞలలో అన్నిటికి విరోధము కాకపోయినా కొన్నిటికైనా విరోధముగానుంటే హోసన్నా అనవలెను.
వీటిలో మొదటి ఆజ్ఞకు విరోధమైన సంగతి మనలో ఉంటే అపుడు హోసన్నా అనవలెను. ప్రభువా! ఈ పాపమునుండి రక్షించు.
రెండవ ఆజ్ఞకు విరోధముగా నుంటే అప్పుడు హోసన్నా అనవలెను. ఆలాగు ఈ పది ఆజ్ఞల ప్రకారము ఇంటిదగ్గర పరీక్షించుకొనవలెను. ఒక్కొక్క దాని దగ్గర హోసన్నా అనవలెను.
మూడవ ఆజ్ఞకు విరోధముగా పాపములేకపోతే హోసన్నా అననక్కరలేదు. ఒక శిష్యుడు నీటిమీద నడిచినడిచి మునిగిపోవుచున్నాను రక్షించు ప్రభువా! అనెను. అప్పుడు రక్షించెను.
ఆలాగు ఈ పది ఆజ్జలలో ఏ ఆజ్ఞకు విరోధముగా ఉన్నామో ఆ పాపమును ఒప్పుకొన్న తరువాత హోసన్నా అనవలెను. నేటి సాయంకాల వర్తమానము ఏమనగా ఈ పది ఆజ్ఞలనుబట్టి పరీక్షించుకొనుట. మొదటి వర్తమానము పరీక్షించుకొనుట.
పరీక్షించుకొన్న పిమ్మట ఒప్పుకొనవలెను గనుక అది రెండవ వర్తమానము. మూడవది రక్షించుము అని అనుట. ఈ మూడు వర్తమానముల ప్రకారముచేస్తే మీరు సిద్ధపడి ఆరాధనకు వచ్చినట్లు గనుక ఫలితముండును. ఆలాగు సిద్ధపడకపోతే రేపు బల్లయొద్దకు వెళ్ళిననూ ప్రయోజనములేదు. ఒక బోధకుడు ఈ మాట చెప్పెను. ఒక చిన్నపిల్లవాడు బూడిద ఉన్న బూడిదకుప్పమీద కూర్చున్నాడు. దగ్గరకు వచ్చి అబ్బాయీ! నీ బుగ్గకు బూడిద రాసుకొన్నావేమి అన్నాడు. వెంటనే తన చేతితో బుగ్గమీది బూడిదను తుడుచుకొన్నాడు. ఇంకా ఎక్కువైనది. చేతికి బూడిద ఉన్నది. గనుక ఎక్కువైనది. ఆలాగే పది ఆజ్ఞల ప్రకారము పరీక్షించుకొనకుండా తప్పు ఒప్పుకొనకుండా బల్లయొద్దకు వెళ్ళితే మరింత బూడిద వ్రాసికొన్న పిల్లవాని పోలియుండును. పాపము ఎక్కువగును. అందుకే కొందరు ప్రభు భోజనమైన తరువాత ఇంకా ఎక్కువ పాపములోకి వెళ్ళతారు. ఈ రాత్రి ఆ చిన్న వానికథ ఆలోచించండి. ఉదయమునకై నా హృదయము పూర్తిగా శుభ్రము కావలెను. సంస్కారమునకు ముందు ఏమని రావలెను. హోసన్నా కాదు. హల్లెలూయా అని రావలెను. ఎందుకు? నిన్న శనివారము గుడిలో వర్తమానము విన్నప్పటినుండి హృదయము శుద్ధిచేసికొన్నాను. ఇప్పుడు హోసన్నా అనను. హల్లెలూయా అంటాను. అనగా స్తోత్రము అంటాను. స్తోత్రము. స్తోత్రించుచు, స్తుతించుచు రక్షించినందుకు, క్షమించినందుకు, పాప వివరము తెలిపినందుకు, ఒప్పుకొనేటట్లు చేసినందుకు, రక్షించుమని పలికినందుకు హల్లెలూయాయని బెంచి దగ్గరనుండి చెప్పుచు బల్ల దగ్గరకు రావలెను. ఈ వర్తమానము ప్రకారము మీరు చేయకపోతే మీ బెంచిదగ్గరమీరుంటేనే మంచిది. హల్లెలూయా అంటూ రావలెను. ఇప్పటినుండి రేపటివరకు హోసన్నా అంటూ రావలెను. రేపు బల్లదగ్గరకు మాత్రము హోసన్నాయంటూ రావలెను. మీ ఇష్టము. మీరెన్నిసార్లు చెప్పినా మంచిదే మరలా పాపములు ఒప్పుకొననక్కరలేదు. మీరు ఇంటివద్దే పాపక్షమాపణ పొందియుందురు. కృప మాకు తోడైయుండునుగాక! ఈ వర్తమానము ప్రకారము జరుపుకొనే కృప, రేపు హల్లెలూయాతో రాగలిగే కృప, దేవుడు మీకు దయచేయును గాక!
పోయిన ఆదివారము గొప్ప పండుగ. జయముతో యెరూషలేము వెళ్ళుట. దారి పొడుగున సంతోషమే. విచారమేలేదు. వారు స్తుతించుచున్నారు. హోసన్నా అనికూడా అన్నారు. రెండూ అవసరమే. సిద్ధపడుటకు హోసన్నా, బల్లదగ్గరకు వచ్చుటకు హల్లెలూయా భూమిమీద జీవించినంతకాలము హోసన్నా అనవలెను. పరలోకము వెళ్ళిన తరువాత అక్కడ హల్లెలూయా. హోసన్నా ఉండదు. భూమిమీద మాత్రము రెండూ ఉండును. అనగా రక్షించు అనేది మరియు స్తోత్రము. మనము పరలోకమునకు వెళ్ళునప్పుడు ఇది ఇక్కడ విడిచిపెట్టుదుము. ఆజ్ఞకు విరోధమైన పాపములు విడుచుదుము. ఒప్పుకొనుట తీర్మానము, హోసన్నా విడిచిపెట్టి ఒక్క హల్లెలూయ అనుమాట మాత్రము పైకి వెళ్ళును. ఈ హల్లెలూయా మన జీవాంతమందు పైకివెళ్ళకముందు ఇక్కడనున్నప్పుడే పైకి వెళ్ళుట అవసరము. యేసుప్రభువు గార్థభముమీద ఇప్పుడులేడు. గార్థభాసీనుడుగా లేడు. విజ్ఞాపన సింహాసనముమీదనున్నారు. గనుక మనము భూమిమీదనుండి హోసన్నా అనే మనము హోసన్నా అని అంటూ పాపాత్మురాలైన స్త్రీ కన్నీటి ధారతో ప్రభువు పాదములమీద పడెను. అలాగే హోసన్నా అనే మనము ఈ సిద్ధపాటు శనివార సాయంకాలమున ఆయన పాదములమీద పడవలెను. ఆమెవలె కన్నీటిధార కలిగియుండవలెను. అదైనతరువాత హల్లెలూయా అని స్తుతి చేయవలెను. దానివలె ఇదికూడా జరుపవలెను. ఎంతో ఎక్కువగా జరుపవలెను. పాదములమీద సాష్టాంగముగా పడిపోయినంతగా హల్లెలూయా. పాదములమీద కాదుగాని పైనున్న విజ్ఞాపన సింహాసనము వరకు, త్రియేక దేవుని సింహాసనము వరకు వెళ్ళవలెను. రేపు ఎట్లయిన ప్రభువునందు నిద్రించినపుడు హల్లెలూయా అని ఏలాగైనా వెళ్ళును గనుక ఇప్పుడే ఆలాగు వెళ్ళవలెను. అట్టిదికాదు. ఇట్టివారు బల్లయొద్దకు రావలెను. మనకు రెండు రకములైన బలము అవసరము.
- 1) ఇట్టి బలము,
- 2) అట్టి బలము అవసరము.
- (1) రక్షించు అని అనగల బలము,
- (2) రక్షించినావు ప్రభువా హల్లెలూయా అని అనగల బలము.
ఈ రెండు బలములు కావలెను. మనము ఆ బలము పొందిన అనగా పాపములు తెలిసికొనే బలము (జ్ఞానబలము) ఒప్పుకొనే బలము (పశ్చాత్తావ బలము) తీర్మానము చేయు బలము అనగా (హృదయములో). హృదయ విశ్వాసము రక్షించు అనేది ఆశయ బలము. మనము మన పాపములనుబట్టి, విచారమునుబట్టి ప్రభువును ఆశ్రయించుట జరుగును. లేనియెడల రక్షణలేదు. గనుక అది ఆశ్రయబలము. ఇది ఉంటేనేగాని అది ఉండదు. కాబట్టి ఈ రెండింటినిగురించి ఈ శనివారము గుడిలోమాత్రముగాక రేపుకూడా సిద్ధపడి సిద్ధముగా నున్న సంస్కార భోజనము హల్లెలూయాతో భుజించుటకు మీరందరు రండి. నిరాశపడవద్దు.
రక్షించేవాడు హోసన్నా దగ్గరున్నాడు. హల్లెలూయ అనేవాడు పరలోక సింహాసనముమీద ఉన్నాడు. గనుక అధైర్యపడవద్దు. రక్షించగలడు. తిండిపెట్టగలడు. స్తుతి చెప్పుటకు స్తుతిపాట నేర్పగలడు. ప్రకటనలో, పాత నిబంధనలో, సువార్తలలోనున్నది హల్లెలూయా. గనుక ఇది క్రొత్తకాదు. కొంతమంది క్రైస్తవులు తమ కుమార్తెలకు హల్లెలూయమ్మ అని పేరు పెట్టుచున్నారు. హోసన్నా అని పెట్టుటలేదు. ఇది ఉంటేనేగాని అది ఉండదు. వట్టి హల్లెలూయా ఉంటే వట్టి హోసన్నే దేవునిని మెచ్చుకొనందే హల్లెలూయా అంటే, సంస్కారమాచరించుటకు ఆకలిలేకుండా. హల్లెలూయా అంటే సంస్కార భోజనమునకు సిద్ధపడక హల్లెలూయా అంటే మనము వట్టివారమౌదుము అని తెలిసికొన్నారు గనుక సిద్ధపడండి. ఈ ఆరాధన ఉన్నదని ఇదివరకు తెలియదా? పోయిన సం॥ము ఈలాగు లేదా? ఈ వేళయితే హోసన్నా హల్లెలూయా. ఈ ఒప్పుదల, ఈయొక్క వివరము విన్నారుగాని ఇదివరకే సిద్ధపడినారు. అది ఇది, ఇది, అది, జ్ఞాపకము తెచ్చుకొని సిద్ధపడండి.
ఒక జమాందారు సిద్ధపర్చి (విందు) ఒక మాటన్నాడు. ప్రభువు బల్లమీద రొట్టె ద్రాక్షరసమున్నది. ప్రభువు బోధకుడున్నాడు. రొట్టె ఇస్తాడు. బోధకునితోపాటు ప్రభువు ఇస్తారు. ఇంత ఘనమైన భోజనమునకు రమ్మని ప్రభువు పిలచుచున్నారు. ఈ కథలో రాజు విందుకు రమ్మని చెప్పినాడు. మంచివారిని పిలిచినాడు. గొప్పవారిని, బీదవారిని, పొదలలో, రాజబాటలలో, వీధులలోనున్న వారినందరిని పిలిచెను. వచ్చినా రాకపోయినా పిలుపు అందరికి. “రండి సమస్తము సిద్ధమైయున్నది". గార్ధభ సింహాసనము మీద కూర్చున్న మన రాజుకూడా ఈ మాటే అంటున్నాడు. “రండి” సమస్తము సిద్ధమైనది సిద్ధపడి రండి. ఇది ఇంతకుమునుపే ఎక్కువమార్లు చెప్పుకొన్న వర్తమానములు కలుపుకొని ముస్తాబైరండి. మిరేలాగైనా స్నానముచేసి, నూతన వస్త్రములు వేసికొని వస్తారని తెలుసు. నేను చెప్పిన ప్రకారము సిద్ధపడిరండి.
దీవెన:
ఈలాగు 40 దినములలో మీరు ఆయన సన్నిధిలో, మీ కొరకు సిద్ధపర్చిన మహిమ అనుభవములను, అంతరంగ సంస్కారమును అందుకొని ఆయన రూపమును సంపూర్ణముగా ధరించుకొందురుగాక! ఆమేన్.