ఇశ్రాయేలీయుల సిద్ధపాటు
నిర్గమ 2: 23-25.
ప్రార్థన :తండ్రీ! నీ ఏర్పాటు పిల్లల విషయమైన నీ అనంత ఉద్దేశములకు అనంత స్తోత్రములు. మమ్మును నీ మార్గములలో వర్దిల్లజేయుటకు, నీవు అన్ని స్థితిగతులను మాచే అనుభవింపజేసి, అన్నిటిలోను నిన్ను మహిమపరచువారిగా నిలువబెట్టుదువు. గనుక నీవు మాకు ఏర్పరచిన సిద్దపాటును అందుకొనుటకు నీవాక్య వర్తమానమిమ్మని వేడుకొనుచున్నాము. ఆమేన్.
ఒక దొరగారు ఒక పాత పల్లకీని రెండు తాటి గుంజలకు కట్టుకొని, అందులో పరుండి, తెల్లవారిలేచి, సువార్త ప్రకటించెను. అప్పుడు కలెక్టరుగారు వారిని తన బంగ్లాకు తీసికొని వెళ్ళి మీరు చావడానికి వచ్చారా? బ్రతకడానికి వచ్చారా? అని ఆ దొరగారిని అడిగిరి. ఆ ప్రాంతములోని పరిస్థితులు అంత కఠినమైనవి మరి. పొదలో మోషేతో దేవుడు "పద" అన్నాడు. అప్పుడు మోషేకు వధ జ్ఞాపకము వచ్చెను. తాను చంపిన ఐగుప్తీయుని కథ జ్ఞాపకమువచ్చెను. అపుడు "నేను మీ తండ్రి దేవుడనే" అని దేవుడు మోషేతో తన్ను జ్ఞాపకము చేసికొనెను.
ఐగుప్తులో ఇశ్రాయేలీయులకు 450 సం॥లు ట్రైనింగు (శిక్షణ) కావలెను గనుక వారి గర్వము కరగుటకు అంతకాలము పట్టెను. గనుకనే దేవుడు వారి మొర్ర వెంటనే వినలేదు. తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును. తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును అని ప్రభువు చెప్పెను. గనుక ఇశ్రాయేలీయులు బానిసత్వములో ఈ తగ్గింపు పాఠము నేర్చుకొనుటకు ప్రభువు ఉంచెను.
- 1) వినయము నేర్చుకొనుటకు,
- 2) రాజకీయ సంగతులు నేర్చుకొనుట కొరకు.
ఎందుకనగా రాబోయే దినములలో వీరు రాజులు కావాలి గనుక. ఇశ్రాయేలీయులకు
- (1) దేవుని బిడ్డలమని గర్వమున్నది. అది కరగడానికి దేవుడు శిక్షించెను.
- (2) అంతేకాక, వారు నాగరికత నేర్చుకొనుట కొరకు దేవుడు ఐగుప్తులో తన ప్రజలనుంచెను.
యోసేపును ఐగుప్తులో ఖైదులో పెట్టెను గనుక 450సం॥లు దేవుడు వారిని ఖైదులోపెట్టెను గాని ఈ 450 సం॥లు భక్తితో చనిపోయినవారికి మోక్షమున్నది. యూదులకు రాజు అని ఆయన సిలువమీద వ్రాయబడియున్నది. గాని యేసుక్రీస్తు లోకమునకు రాజాయెను. గోషెనుదేశము సారవంతమైనది. శిక్షించినను దేవుడు వారికి తిండి తక్కువ చేయలేదు. అరణ్యములో కూడా వారికి ఏది తక్కువ కాకుండా పోషించెను. ఐగుప్తీయులవల్ల దెబ్బలుతినుట, కష్టమైన పనిచేయుట, ఇశ్రాయేలీయులకు భారమైనది. కాని తిండి తక్కువకాలేదు.
అబ్రాహాము - విశ్వాసి ఇస్సాకు - శాంతిపరుడు యాకోబు - శ్రమానుభవశాలి వీరిపేర్లు మోషే జ్ఞాపకము ఉంచుకొనెను.
మోషేను ఫరోకుమార్తె నీళ్ళలోనుండి తీసెను. గనుక మోషే అని పేరు వచ్చెను. మోషేను దేవుడు అడవిలోనుండి తీసి ఐగుప్తుకు పంపెను. 'నేనెన్నటికి ఐగుప్తు వెళ్లను, ఫరో నన్ను చంపును' అని అనుకొన్న మోషేను దేవుడు నీవు వెళ్ళవలెను. నేను నిన్ను ఏర్చర్చినాననెను.
యోసేపు ఉన్నంతవరకు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో క్షేమమనుభవించిరి. ఏలయనిన గోషెను సారవంతమైన పచ్చికగలదేశమైయుండెను. ఈ హేతువుచేతనే ఆ జనులు వారి వాసస్థానమైన ఈ దేశము విడువనభిప్రాయము లేకుండిరి. అయినను ఆదికాండము 15వ అధ్యాయములో ప్రవచింపబడిన నన్నూరు సంవత్సరములు గతించిన వెనుక, వాగ్దానదేశమునకు బోవుటకై వారిని ప్రేరేపించు కార్యములను దేవుడు సంభవింపజేసెను. మొదటి కార్యమేమనగా తన జనులకును, ఐగుప్తీయులకునుగల స్నేహమును పోగొట్టుట. రెండవదిగా ఐగుప్తు ఇశ్రాయేలీయులకు వెగటుగా చేయబడవలెను. 'స్నేహించే రాజును తీసివేసి, ద్వేషించే రాజును నిలుపుట' ఆయన చిత్తమువలన జరిగెను (దాని. 2:21). అందుచే ఐగుప్తులో క్రొత రాజవంశము లేచియుండెను. అంతకుపూర్వమున్న రాజకుటుంబము వారు ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవావలన యోసేపుద్వారా చేయబడిన కార్యముల విషయమై ఆయన కెంత కృతజ్ఞులైయుండిరో, ఈ రాజకుటుంబమున కేమియు తెలియలేదు. వాగ్ధానము చేయబడిన ఆశీర్వాదము నెరవేరుట అనగా ఆ జనము మిగుల అద్భుతరీతిగా వృద్ధినొందుటవలన తన సింహాసనమునకు విపత్తు కలుగునని క్రొత్త రాజునకు తోచెను. కావున ఇట్లు ఆ జనము వృద్ధినొందకుండ జేయవలెనని కోరి ఇండ్లుకట్టుట, భూమి దున్నుట, మొదలగు భారమైన పనులను వారికి నియమించెను. అచ్చట భూమియంతయు కాలువల సహాయమున సేద్యపరుపబడవలసియుండెను. అయినను, రాజుయొక్క ఉద్దేశము విఫలమయ్యెను. అప్పుడాయన మగపిల్లలందరిని చంపవలెనని హెబ్రీయుల మంత్రసానులకు ఆజ్ఞాపించెను. కాని వారు ఆ ఆజ్ఞప్రకారము చేయనందున ఇదియు నిష్ఫలమయ్యెను. వారు ఆలాగు చేయకపోవుటను గూర్చి రాజుతో చెప్పిన మిష వాస్తవముగా అన్ని విషయములయందు నిజమైనదికాదు. సత్యమేమనగా 'చంపము' అని అన్నయెడల తమ ప్రాణములకు భంగముకలుగునని వారు భయపడిరి. అంతేకాకుండా దేవుని చిత్తమును గురించి వారికంతగా తెలియదు. ధర్మశాస్త్రమప్పటికి ఇయ్యబడియుండలేదు.
ఈ కాలమున ఒక క్రైస్తవుడు చేసిన క్షమింపబడని పాపములను దేవుడు ఆ కాలమున చూచి చూడనట్లుండెను. దేవుడు వారి అబద్ధములను గూర్చి వారిని శిక్షింపక ఆయన యడల వారికి భయమునుగూర్చి వారికి మేలుచేసెను. అప్పుడారాజు కఠినమైన ఆజ్జలనియ్య నిశ్చయించెను. ఇదివరకు మంత్రసానులకిచ్చిన ఆజ్ఞ ఇప్పుడు తన ఉద్యోగస్తులందరికిచ్చెను. ఇట్లు ఆ జనుల వృద్ధికి ఆపద కలిగెను. మరియు తాముండినచోట, ఇదివరకు తమకుండిన నెమ్మది ఇంచుకైన లేకుండునట్లు మనము సులభముగా గ్రహింపవచ్చును. 2వ అధ్యాయము 23-25వచనములలో ఆ జనులు వెట్టి పనులవలన నిట్టూర్పు విడిచి మొర్రబెట్టినట్లును, వారి మూలుగు దేవుడు వినినట్టును కనబడుచున్నది. ఇట్లు దేవునియొక్క ప్రధమోద్దేశము నెరవేరెను.
దీవెన: ఈలాగున దేవుని అనంత ఉద్దేశములు మనలో నిండుగా నెరవేరి, ఈ లోకమును దాటి, మహిమరాకడలో ఎగిరివెళ్ళే అనంత జీవులనుగా పెండ్లికుమారుడు మనలను తయారు చేసికొనును గాక ఆమేన్.