మోషే చేసిన ఉపవాసము
నిర్గమ. 34:27-35.
ప్రార్ధన:
తండ్రీ! మోషే చేసిన ఉపవాసమును తలంచుకొని మేమును "నీ సన్నిధిలో కూడుకొనియున్నాము. మోషేవంటి మనోనిదానము మాకు ఈ లేకపోయినను, నీవు కరుణించుటనుబట్టి ఈ ఏర్పాటును మేము జరిగించుకొన్నాము. గనుక నీకు వందనములు. నేటి దినమున మోషే ఉపవాసమును మాకు నేర్పించుటకు నీ వాక్యములోనుండి మాతో మాట్లాడుమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్.
బైబిలులో ఉపవాసము చేసిన వారనేకులున్నారు. వారందరిలో ముగ్గురే గొప్ప ఉపవాసపరులు. వారు
- 1. మోషే
- 2. ఏలీయా
- 3. యేసుప్రభువు.
1. మోషే:- మొదటి 40 దినములును దేవుని సన్నిధిలో ఉన్నాడు. మోషే దేవుని వంకే చూస్తున్నాడు. గనుక ఆహారము, నీరు, నిద్ర, అవసరములేకపోయినది. ఎందుచేతనంటే ఆకలి, దాహము, నిద్ర మోషేకు లేవు. ఈ మూడింటికంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అతని ఎదుటనే ఉండగా వారిని చూస్తున్నాడు గనుక ఆకలి, దాహము, నిద్ర ఎందుకుండును? ఇదే గొప్ప మనోనిదానము. మోషేకు ఇది 80 సం||ల అనుభవము.
- 1) మోషే రాజ కుమార్తె బంగళాలో పెరిగింది 40సం॥లు.
- 2) మిద్యాను దేశములో యాజకుని ఇంట మందలనుకాచిన కాలం 40సం॥లు.
ఇవి రెండు 40సం॥లు కలసి 80సం॥లు. అప్పటికిగాని మోషే నలిగిపోయి, నలిగిపోయి, క్రొత్త మనిషి అయినాడు. అందుచేతనే దేవుని సన్నిధిలో ఉండగలిగినాడు.
- 1. మోషే ఇశ్రాయేలీయుడు. దేవుని ఏర్పాటులో ఉన్నవాడైనప్పటికిని విగ్రహారాధికుడైన ఫరో ఇంటిలో 40 సం॥లు ఉండుట అతనికి చాలా శ్రమగా ఉండెను. ఫరో ఇంటిలో అన్ని సౌఖ్యములున్నవి. అన్నము, పెరుగు, పాలు, వెన్న నెయ్యి, రాజవస్త్రములున్నవి. ఇవిగాక సర్వవిద్యలు నేర్పించిరి.
- 2. మిద్యాను దేశములో విగ్రహారాధికుని ఇంటనుండి అతని మందను కాయుట, అతనికి మరింత శ్రమ. గతిలేక ఉండిపోవలసియుండెను. ఇక్కడెందుకు ఉండవలెను? నా స్వజనులమధ్య ఉండకపోతినే అనే శ్రమ. మిద్యాను దేశమునుండి నా స్వజనులయొద్దకు వెళ్ళగలనా? వెళ్ళలేను. వెళ్ళితే నన్ను చంపుదురు. నా స్వజనులతో నేను యెహోవాను సేవించెదనా? స్వదేశము వెళ్ళగలనా? స్వజనులతో ఉంటానా? ఇక నేను వెళ్ళలేను. తీరా వెళ్లినను చంపుదురు. ఇది మరొక శ్రమ. ఈ రెండు రకములైన శ్రమలమధ్యబడి నలిగిపోయినందున గొప్ప పనికి తయారైనాడు. అలాగే మోషేకు తాను తయారగుచున్నట్లు తెలియదు. గాని దేవునికి తెలిసినందున కొండమీద పొదలో దేవుడు మోషేకు కనబడి, అతనిచేత అద్భుతములు చేయించెను. పొదలో సూచనగా ఉన్న అద్భుతములు చూపించెను. కర్ర, పాము, నీరు, రక్తము; ఇతనిచేత ఇన్ని చేయించినా ఐగుప్తుకు వెళ్ళమన్నపుడు ఫరో రాజుకు భయపడి ఇంకెవ్వరినైనా పంపమన్నాడు.
షరా:- మోషేకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మనకును ఇవ్వనైయున్నాడు. మోషే గడ,గడ వణికెను.
మనమును
వణికెదము.
ఉపవాసము:- మోషే మొదట 40 దినములు కొండమీద ఉపవాసముచేసి కొండనుండి క్రిందకు దిగివచ్చి
పాపముచేసినాడు. అనగా కొన్ని చిన్ని తప్పులలో మోషే పడిపోయినాడు.
1) మోషే ప్రజలమీద కోపపడినందుకు దేవుడు మోషేమీద కోపపడవలసింది. "నీకు ప్రజలమీద కోపము వస్తే, నేను వ్రాసి ఇచ్చిన పలకలను ఎందుకు పగులగొట్టితివి" అని అనవలసినదిగాని అట్లు అనలేదు, కోపపడలేదు. గాని మోషే పలకలు బద్దలు కొట్టి కొండపైకి మరలా ఎక్కి వెళ్లెను. మోషే పాతనిబంధన కాలపు భక్తుడు గనుక కోపపడినాడు. మనమైతే క్రొత్తనిబంధన కాలపు వారము గాన కోపపడవలెనని మనకు లేదు గనుక కోపపడరాదు. క్రొత్త నిబంధనలో శాపములేదు. దేవుడు అన్నది సన్నిధి, ఉన్నది సన్నిధి. గనుక సన్నిధి ఎక్కడబడితే అక్కడే ఉన్నది. అయ్యగారు మంచముమీద ఉన్నప్పుడు, దేవుని సన్నిధి ఆయనతో ఉన్నది. కుర్చీమీద ఉన్నప్పుడు, కూటములలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఆయనకున్నది.
ప్రభువు అన్నది ఏమనగా "నా సన్నిధి మీకు తోడైయుండును". అది బైబిలులో ఉన్నది. మనము నమ్మితే మనకుకూడ తోడైయుండును. గిద్యోను ఏమన్నాడు? ఇశ్రాయేలీయులేమన్నారు? దేవుని సన్నిధి మాకు తోడై యుంటే మాకు ఈ శ్రమలెందుకు? తెగుళ్లెందుకు? అని విసుక్కొన్నారు. అందుచేత దేవుడు గొర్రెపిల్లను తీసికొని వచ్చి బలివేయమన్నారు. ఆ బలివేయబడిన గొర్రెపిల్లను తిన్నందున వారు ఐగుప్తునుండి దాటిపోయినారు. గనుక సీనాయి కొండమీద దేవుడు మోషేకు 10ఆజ్ఞలు వ్రాసి ఇచ్చినాడు. మోషే కొండ దిగివచ్చుచూ, ఇశ్రాయేలీయుల విగ్రహారాధనను చూచి, వాటిని పగులగొట్టెను. అయితే, ఆజ్ఞలను మొదటగా పగలగొట్టినది ఎవరు?
పదియాజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏది? "నేనే నీ దేవుడనైన యెహోవాను. నేనే దేవుడను" అని దేవుడు చెప్పితే, కొండక్రింద ఇశ్రాయేలీయులు "ఈ బంగారపు దూడే మా దేవుడు, మమ్మును ఐగుప్తులోనుండి తీసికొని వచ్చెను" అని అన్నారు. ఆలాగు అనుటద్వారా వీరు ఈ ఆజ్ఞను బద్దలగొట్టినారు. అందుచే వారే దేవుని ఆజ్ఞలను బద్దలగొట్టి మొదటి సారిగా పాపము చేసిరి. అందుచేత వారి పాపము క్షమింపకూడదు గనుక దేవుడు క్షమించనన్నాడు. గాని మోషే ప్రజల పాపము క్షమించితేనేగాని వల్లగాదు అని బ్రతిమలాడి పట్టుబట్టగా మోషేనుబట్టి దేవుడు వారిని క్షమించినాడు.
మోషే పాపము ఏదంటే రాతి పలకలు పగులగొట్టినాడు. గాని ఆజ్ఞలు పగులగొట్టలేదు. అందుచేత దేవుడు మోషే పాపమును క్షమించినాడు. మోషే చేసిన ఉపవాస దినములు 80. అట్లే మనము చేయవలెను అని వ్రాయబడలేదు. మోషే చేసినాడని మనముచేస్తే చిక్కిపోదుము, చనిపోవడముకూడ జరుగును. గనుక మోషే చేసినట్లు చేయకండి. అద్భుతము - మోషే రెండుసార్లు 80దినములు చేసినను
- 1) శరీరమునకు బలము వచ్చినది
- 2) ఆత్మకుకూడా బలము వచ్చింది.
- 1. మోషే ఇంటిలోనుండి జమ్ము పెట్టెలోనికి, అక్కడనుండి ఫరో ఇంటిలోకి, అక్కడనుండి మిద్యాను అరణ్యములోనికి, అక్కడనుండి ఐగువ్తుకు, అక్కడనుండి సీనాయి పర్వతమునకు, అక్కడ 80 దినములు ఉపవాసమునకు దేవుడు తయారుచేసెను.
- 2. ఏలీయా:- మోషే తర్వాత కొన్ని వందల ఏండ్లకు ఏలీయా వచ్చాడు. ఇతడు మరీ అసాధ్యుడు. మోషే ఉపవాసము గడ్డు అని అనుకొంటే ఏలీయా ఉపవాసము అంతకంటే గడ్డయినది. దివారాత్రులు నడిచినాడు. ఆ ఘటము అటువంటిది. మోషేవలె మీరు కూడ చేయండి అని వ్రాయబడలేదు. గనుక మనము చేయరాదు.
- 3. యేసుప్రభువు:- మోషే ఉపవాసముకంటే ఏలీయా ఉపవాసము కంటే మరింత అద్భుతకరమైన ఉపవాసము ప్రభువు చేసారు. అది అయ్యగారికి తెలుసును గాని వివరించుటకు శక్తిలేదు. ఉపవాస సమయములో ప్రభువుకు నిమిషనిమిషము శోధనలే,
దీవెన:
అయినను, వాటన్నిటిని ఆయన జయించినట్లే, ఈ 40 దినములలో మీరు ప్రభువువంటి మనోనిదానముతో ఉపవాసముచేసి, సమస్తమును జయించగల శక్తి పెండ్లికుమారుడు మీకు దయచేయునుగాక! ఆమేన్