నిర్గమకాండము 18 - న్యాయాధిపతుల నియామకము


ప్రార్థన: న్యాయాధిపతివైన దేవా! మీ ఉపదేశమార్గమున నడుచుచు వాదములకు, భేధములకు, వివాదములకు, వ్యాజ్యములకు మేము దూరముగా ఉండు కృపను దయచేయుము. మాలోకలుగు వివాదములను మీవాక్యము ద్వారా సమాధానపర్చుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

యాజక బంధం

మోషే జీవితములో మరుపురాని ప్రదేశము హోరేబు ప్రాంతము. "నా పితరుల దేవుడైన యెహోవా ఎక్కడ" అనే అన్వేషణలో అక్కడ దేవుడు ప్రత్యక్షమాయెను. నా తోబుట్టువులు బ్రతికి ఉన్నారా అను బెంగతో ఉన్నపుడు అక్కడ అహరోను కలిసెను. మోషే మామను ఎదుర్కొని వందనము చేసిన విధానమును బట్టి యాజకుడైన మామపై గల మమకారము కనబడుచున్నది. అక్కడ మోషే భార్య, కుమారులను కలుసుకొనుట సంతోషకరమైన విషయము.

మోషేకు యాజకులపట్ల ప్రత్యేక గౌరవమున్నది. అయితే ఇక్కడ కుటుంబ సంబంధములకంటే పెద్ద విషయము కనబడుచున్నది. అబ్రహాము అమాలేకీయ బృందమును ఓడించినపుడు మెల్కెసెదక్ అను యాజకుడు కలుసుకొని దీవించి ఆధరించెను. అక్కడ యాజక బలియర్పణలు అందించిరి. ఇక్కడ అమాలేకీయులను ఓడించినపుడు యిత్రో యాజకుడు దేవునికి అర్పణలు అర్పించెను. ఒక గొప్ప దైవకార్యము వెనుక, మన సంపూర్ణ సమర్పణ అవసరమైయున్నది. ఇశ్రాయేలు దేశమును మొట్టమొదటిసారిగా ఒక విదేశీ రాయబారియైన యాజకుడు కలిసి అన్నివిషయములు తెలిసుకొని సంతోషించుట గొప్ప సంఘటన.

మోషే యొక్క అభిషేకము వేరు, చేయుచున్న పని వేరు. జరుగుచున్న వ్యాజ్య నివారణ క్రమము వేరు. ఈ విషయము యాజకుడు కనిపెట్టెను. మోషే అభిషేకమును మరలా ప్రతిష్టించెను. యాజకులు కలుసుకొన్నపుడు దేవుడు వారికిచ్చిన గొప్ప అభిషేకము పునరుద్ధరింపబడుట ఆరోగ్యకరమైన దైవ సంకల్పము.

సార్వత్రిక ధర్మవిధులు

ఇంతవరకు మోషే వ్యక్తిగతముగా చేయుచున్న పనికి ఒక సార్వత్రిక ధర్మమును రచించుటకు ప్రజల వ్యాజ్యములను అన్నీ కలిపి దైవ సన్నిధిలో ఉంచుట, వాటి వాటి ధర్మమును మరలా ప్రజలందరికి తెలియజేయుట అను యాజక ధర్మమును చేయుటకు యిత్రో తన యాజక అధికారముతో మోషేను అభిషేకించెను.

పాతనిబంధనలో వ్యాజ్యములు శరీరానుసారమైనవి. క్రొత్తనిబంధనలో ఆత్మానుసారమైన ఈ ధర్మమును ప్రభువు మన హృదయములో పెట్టెను. ఒక నిర్మలమైన అంతరంగ న్యాయాధిపతిని ప్రతీ ఒక్కరిలోను కాపలాగా పెట్టెను. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన ప్రతీఒక్కరిని ఈ న్యాయాధిపతియైన మనస్సాక్షి పాపము చేయకుండా రక్షించును. మనస్సాక్షి పాతనిబంధలో ఎక్కడా కనిపించదు కాని ప్రభువు దానిని సిలువ రక్తముతో శుద్ధిచేసి పరిశుద్ధాత్మ ప్రోక్షింపబడిన తర్వాత(పత్రికలలో మాత్రమే) వాడుకలోనికి తెచ్చెను. పూర్తి వివరము దేవదాసు అయ్యగారు ప్రచురించిన మనస్సాక్షి అను పుస్తకములో చూడగలము.

మనస్సాక్షిని గూర్చి కొన్ని వాక్యములు:
1 పేతురు 3:21. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీరమాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విష యము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.

హెబ్రీ 9:9 ఆ గుడారము ప్రస్తుతకాలమునకు ఉపమాన ముగా ఉన్నది. ఈ ఉపమానార్థమునుబట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేని అర్పణలును బలులును అర్పింపబడుచున్నవి.

హెబ్రీ 9:14 నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించు కొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.

న్యాయాధిపతులు

మనస్సాక్షి మాటను పెడచెవిని పెట్టిన వారు ఈ లోక న్యాయాధిపతి లేదా సంఘపెద్ద వద్దకు తేబడుదురు. వాక్యానుసారమైన న్యాయాధిపతి లేదా పెద్దకు ఉండవలసిన లక్షణములు ఇక్కడ చక్కగా ఇవ్వబడెను. ఈ లక్షణములన్నీ స్వతహాగా ఎవరిలోనూ ఉండవు, కావున యాజకుడు ఈ క్రింది లక్షణములతో పెద్దలను సాధనలో పెట్టవలెను.

21. ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి, లంచగొండులుకాని మనుష్యులను ఏర్పరచుకొని, వేయిమందికి ఒకనిగాను, నూరుమందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పది మందికి ఒకనిగాను, వారిమీద న్యాయాధిపతులను నియ మింపవలెను.

22. వారు ఎల్లప్పుడును ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యెములన్నిటిని యాజకునియొద్దకు తేవలెను. ప్రతి అల్పవిషయమును వారే తీర్చవచ్చును

తీతుకు 1:6. ఎవడైనను నిందారహితుడును, ఏకపత్నీపురుషుడును, దుర్వ్యాపారవిషయము నేరము మోపబడనివారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలుగలవాడునై యున్నయెడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును.

7. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహనిర్వాహకునివలె నిందారహితుడై యుండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక,

8. అతిథిప్రియుడును, సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధిగలవాడును, నీతిమంతుడును, పవి త్రుడును, ఆశానిగ్రహముగలవాడునై యుండి,

9. తాను హితబోధవిషయమై జనులను హెచ్చరించుటకును, ఎదు రాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను.

దేవుని చిత్తప్రకారము నడుచు మనస్సాక్షిని ఆయన మనకు దయచేసి మనలను రక్షించును గాక! ఆమేన్.



జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

పరిచయం | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 18 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | తైలాభిషేకపండుగ

Social Presence Facebook G+ Twitter

ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter