నిర్గమకాండములో వ్రాసిన సంగతులు హెబ్రీయులు ఐగుప్తునుండి ప్రయాణమైన మొదటి సంవత్సర కాలములో జరిగినవి. ఇశ్రాయేలు దేశ నిర్మాణమంతా ఈ సంవత్సర కాలములో జరిగినది. నివాసస్థలమును ఇంకా చేరుకోలేదుగాని నివసించే పద్ధతిని దేవుడు అందరికి అభ్యాసములో పెట్టెను.


అదేవిధముగా పెంతెకొస్తునాడు ఆత్మకుమ్మరింపు మొదలుకొని రెండవరాకడ వరకు మనము అరణ్యమార్గములో ప్రయాణిస్తు, మనతో ఇప్పుడు నివసిస్తున్న ఆయనపై విసుగక మన నిత్య నివాసము చేరుటకు ఆత్మపూర్ణులై, సత్క్రియలతోను, నీతిక్రియలతోను ఆయనను ఆరాదించుటయే మన పని.


ధ్యాన ప్రవేశము: ముఖ్యాంశముల సారాంశములోనికి వెళ్ళుటకు ముందు ఈ విషయములు ధ్యాన పరిధి లోనికి తీసుకొనవలెను.

నిర్గమకాండము ధ్యానము

  1. దేవుడు ఈ లోకములో మనలను ఎందుకు ఉంచెను? నిజానికి ప్రతీ క్రైస్తవునికి ఈ లోకములో ఎందుకు జీవిస్తున్నామనే ప్రశ్న ఏదో ఒక సమయములో పుడుతుంది. ఈ ప్రశ్న పక్కనే ప్రభువు హృదయమును తడుతూ ఉంటాడని గమనించనంతవరకు బాధలు వెంటాడుతూ ఉంటాయి. ఇశ్రాయేలీయులు తీవ్ర నిరాశలోనికి వెళ్ళిపోయినను;మరువక దేవుని మొరపెట్టిరి.

    బానిసత్వ బ్రతుకునుండి విడుదల ఎప్పుడు మొదలవుతుందంటే, నీవు భాధింపబడుచున్నను దేవుని మరువక ఆయనకు మొర్రపెట్టినపుడు.


  2. నిర్గమ 2:25. "దేవుడు ఇశ్రాయేలీ యులను చూచెను; దేవుడు వారియందు లక్ష్యముంచెను."

    మనం ముగిసిపోయింది అనుకున్నపుడు దేవుడు గొప్పగా మొదలుపెడతాడు. మోషే జీవితం నదిలో ముగిసిపోతుందనుకున్నారు కాని లక్షలమందిని ఎర్రసముద్రం దాటించు నాయకుడిగా దేవుడు వాడుకున్నాడు.

    చివరికి వాగ్ధాన దేశము చూసిన తర్వాత మోషే జీవితం ముగిసిపోయింది అనుకొంటే మళ్ళీ యేసుప్రభువు రూపాంతరం పొందినపుడు ప్రత్యక్షమై ప్రభువు పనిలో పాలుపంచుకొనెను. మళ్ళీ రాకడ సమయంలో సువార్తికులు చేయలేని పనిని ప్రపంచమంతటికి కనబరుచుటకు మోషే రాబోవుచున్నాడు. మోషే పని కేవలం హెబ్రీయులను వాగ్ధాన దేశమునకు నడిపించుట మాత్రమే కాక నేటికిని మిగిలియున్నది. మనము క్రీస్తుయొక్క వాగ్ధాన ఫలములు ఫలించుట మోషేకు ఆనందము. లేనిచో మోషే రాక తధ్యము.


    క్రైస్తవుని ప్రస్తుత దశ లేదా ప్రారంభ దశ వేరు అంతిమ దశ వేరు. దేవుని ప్రణాలికలో మనమున్నపుడు గురి చేరువరకు అవసరమైన అన్నిసదుపాయములు ఆయనే చూసుకొనును.


  3. దైవ సంకల్పము మరియు మానవ విశ్వాసము కలిసినపుడు దైవ చిత్తము నెరవేరును. మోషే దైవచిత్తానుసారుడు, విశ్వాస వీరుడు, 40 సంవత్సరములు సకల విద్యలు అభ్యసించిన ధీరుడు. అయినను 40 సంవత్సరములు గొర్రెల కాపరిగా ఎక్కడో అరణ్యములో పడి ఉండెను. లోకానుసారముగా ఇది వ్యర్ధమైన బ్రతుకు గాని, విశ్వాసానుసారముగా ఇది అదృశ్య నిర్మాణము. దేవుడు ప్రత్యక్షమై మోషేను పిలవగా వెంటనే "చిత్తము ప్రభువా" అని దేవునికి సమర్పించుకొనే ధీనత్వ నిర్మాణము జరిగినది.


    ఇప్పుడు అనేకమంది దైవాన్వేషులు ఏదో పక్కనపడి జీవిస్తున్నామని అనుకొనేవారు గుర్తించవలసిన విషయమేమనగా, మన విశ్వాసము పరిపక్వమాయెను. దైవచిత్తమును నెరవేర్చుటకు తన ఆత్మాభిషేకముతో దేవుడు మనలను పంపించుచున్నాడు. నిశ్శబ్ధ కాలము ముగిసినది, నిత్య సువార్త ప్రకటనకు వేళ అయినది.


    ఈతరము బైబిలుమిషను వారసులకు ఆధరణ కలిగించు మాట నిర్గమ 3:6 "నీ తండ్రి దేవుడను", మనము మన పితరుల సమర్పణను గుర్తించి, మనము అనుభవించుచున్న ఈ ఫలములు దేవుడు వారికిచ్చిన వాగ్ధానముల నెరవేర్పు అని దేవుని స్తుతించవలెను.


  4. మోషేకు సొంత ఆస్థి అంటూ ఏమీ లేదు, తన మామ గొర్రెలను కాయుటకు ఒక కర్రను సొంతముగా ఏర్పరుచుకొనెను. ఆ కర్రను దేవుని చిత్తమునకు వాడగా అది దేవుని కర్ర ఆయెను. తన శరీరములోని చెయ్యిని దైవచిత్తానుసారముగా వాడగా అంత్యకాలములో మోషే శరీరము మహిమ శరీరముగా మారినందున దేవదూతలు కొనిపోయిరి.


    రోమా 9,10,11,12 అధ్యాయములు: దేవుని శరీరమైన సంఘము దైవ సంకల్పమును నెరవేర్చుటకు నమర్పణతో సాగినపుడు, సంఘము మహిమ శరీరముదాల్చి మేఘమెక్కును.


  5. విమర్శ దినమున దేవుడు అధికారుల మూడత్వమును, కఠినత్వమును బయటపెట్టును కావున, వారి భక్తిహీనతవలన విశ్వాసులకు అధికశ్రమ కలుగును. అధిక శ్రమ దినమున విశ్వాసి దృష్టి దేవుని అద్భుతకార్యముల మీదను, సమీప విడుదలపై ఉంటే సంతోషము, ఆనందము; లేనిచో అధిక వేధన, శోధన కలుగును.


  6. హెబ్రీయులు దాసులుగా ఐగుప్తు రాలేదు గాని, యేసేపు దేశమును రక్షించుటకును, బహుగా అభివృద్ధి చెందుటకును కారకుడాయెను. కాని తరాలు మారిపొగా ఐగుప్తీయులు దాసులుగా మారిపోయి, వెట్టికి అలవాటుపడిరి. క్రైస్తవులు అనేక మంచిపనులు చేసి ప్రపంచమును అభివృద్ధి చేసిరి, కాని తరాలు మారిపోగా విశ్వాసుల మనుగడకు ఆటంకము కలుగుచున్నది. హెబ్రీయులు దేవునికి మొరపెట్టగా వారికి విడుదల కలుగజేసెను.


    విశ్వాసులు దేవునికి మొరపెట్టుట మానుకొనుచున్నారు, ప్రతివిశ్వాసి దేవుని సన్నిధిని నిలిచి ప్రార్థిస్తే, ప్రపంచం తలక్రిందులవుతుంది. ఆయన కృప చొప్పున మన సారము, ఆత్మ ఫలముల పరిమళము వెదజల్లబడుతుంది.


    1. మోషేకు దేవుడందించిన ఆజ్ఞలు 7 రకములు
    2. సార్వత్రిక ఆజ్ఞలు (10 ఆజ్ఞలు. మిగిలిన వాటికి పునాది లాంటివి. నాస్థికులకు మొదటి 5 ఆజ్ఞలు రుచించవు. )
    3. శారీరక విధులు (ఆత్మ సంబంధులకు అంతగా రుచించవు గాని పాటించవలెను)
    4. సామాజిక కట్టడలు (ఎమోషనల్ కంట్రోల్, అనవసరమైన భావోధ్వేగద్వేషాల నిర్మూలన)
    5. నీతి నియమములు (మంచి పద్ధతులు)
    6. విజ్ఞాన ఉత్పత్తులు (బానిస ధోరణి నుండి ఉపయోగకరమైన ఉత్పత్తి కొరకు కావలసిన జ్ఞానమును బోధించుట)
    7. అత్మీయ నియమములు (పరిశుద్ధ జీవిత నియమములు)
    8. మహిమ అంతస్థులు (దేవుని చూచుట, ఆయనతో సహవాసము చేయుట, ఆయన మాట వినుట)
    9. పాపపరిహారార్థ బలి శిక్షలు (పై 7 మీరితే చెల్లించవలసిన పెనాల్టీ)

  7. యాజకవస్త్రములు క్రియలకు సాదృశ్యము. దైవ చిత్తములోని క్రియలు చేయుటద్వార యాజక వస్త్రము ఇవ్వబడును. నేటి క్రైస్తవులు సత్క్రియలు, నీతిక్రియలు మానక చేయవలెను. అదే నిత్య నిబంధన. ముందు చెప్పిన 7 రకముల ఆజ్ఞలు చేయుటయే మనవిధి. పాతనిబంధనలో ఆ 7 విధులలో తప్పిన ప్రకారము పాపపరిహారార్థ బలి అర్పించవలెను. క్రొత్తనిబంధనలో ఆ 7 రకముల ఆజ్ఞలలో దేనినైనా చేయుటకు మనసు ఉండినయెడల అది పాపము. కేవలము దేవుని కృపచేతనే అట్టి పాపప్రేరణ మనసు తొలగింపబడి నూతన హృదయము వచ్చును.


    ప్రభువు చెప్పిన ఆజ్ఞ ప్రకారము సహోదరులు ప్రేమకలిగి ఉండుటయే దేవుని కృప. అదే సత్యము.


    లెండి, ఈ సత్య మార్గముగుండా ప్రయాణమై దేవుని మహిమయెదుట నిలుచుటకు సిద్ధపడుదము. దేవుడు మన ఆత్మలకు సహకారిగా ఉండును గాక!


బహుగా ప్రార్ధన చేయుడి - ఇకమీదట - బహుగా ప్రార్ధనచేయుడి
బహుగా ప్రార్ధనచేసి - బలమున్ సంపాదించి మహిలో కీడును
గెల్వుడి - దేవుని కెపుడు మహిమ కలుగనీయుడి


జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.