(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
11వ పాఠము(ప్రభువు బల్ల)
“విందు సిద్ధమైయున్నది” లూకా 14:17.
“నా శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు” కీర్తన 23:5.
- 1. ఇదివరలో ప్రభువు బల్లగురించి ప్రచురించితిమి. ఇప్పుడు పై అంశము ప్రకటించుచున్నాము. మానవులు జన్మింపక పూర్వమే పరలోకపు తండ్రి అందరకు కావలసినవాటిని అనగా ఆకాశములోను, భూమిమీదను ఉన్నవాటిని సృజించెను. మనము భుజింపవలసిన పండ్లు, కూరగాయలు, ధాన్యాదులు అవి మన భోజన పదార్థములుగా అమర్చిపెట్టెను. ఏమియు కొదువలేదు. మనము దేవుని బిడ్డలము కనుక మనకు ఈ ఏర్పాటొక బల్లమీద భోజనమువలె నున్నది. ఇది మనము తలంపవలసిన మొదటిబల్ల ఆదికాండము 1వ అధ్యాయము.
- 2. ఎన్నికజనమగు ఇశ్రాయేలీయులకు దేవుడు నలుబది ఏండ్లు అరణ్యములో భోజనము అనగా వారు కష్టపడి సంపాదింపని భోజనము అనుగ్రహించెను. ఇది మనము తలంచుకొనవలసిన రెండవబల్ల. (మొదటి బల్ల అందరకు, ఈ బల్ల వారికే నిర్గమ 16 ఈ రెండును శరీరమునకు ఆహారము చూపు బల్లలు).
- 3. నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు - కీర్తన 23:5. అదిలేదు, ఇదిలేదు, అది తక్కువ ఇది తక్కువ అని విసుకునట్టివారికి. ఈకీర్తన సంబంధింపదు. 'నాకు లేమి కలుగదు' అని సంతుష్టిపడునట్టి విశ్వాసులకు మాత్రమే సంబంధించుచున్నది. ఈ కీర్తన శరీర జీవనమునకు మరింత ముఖ్యముగా ఆత్మజీవనమునకును కావలసిన సదుపాయములను జ్ఞాపకము చేయుచున్నది. భూలోకములోను, పరలోకములోనుగల సదుపాయములనుకూడ జ్ఞాపకముచేయు చున్నది. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను. ఈ వచనము పరలోకమును జ్ఞాపకము చేయుచున్నది. నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అను వచనము మనము యెంచుకొనదగిన మూడవబల్ల.
- 4. మనుష్యులందరు రక్షణ పొందవలెనని దేవుడు ఇచ్చయించుచున్నాడు అను సంగతి 1తిమోతి 2:4లో ఉన్నది. ఈ సంగతి చూడగా అందరు రక్షణ అంగీకరింపకపోయినను రక్షణ అందరికొరకుద్దేశింపబడినట్టు కనబడుచున్నది. సృష్టిలో మనకు ఉచితముగా ఏర్పరుపబడినవన్నియు తలంచుకొన్నయెడల మన మనస్సునకు ఎంతో విందుగా నుండును. యేసుప్రభువువల్ల కలిగిన ఆత్మీయ రక్షణ తలంచుకొన్న యెడల మనస్సునకు మరింత గొప్పవిందుగా నుండును. రక్షణ ఉచితము. ఎవరైన మనలను విందుకు పిలిచినప్పుడు మనము సంపాదించినది భుజించుటకు వెళ్ళుచున్నామని అనుకొనము. విందు అనుమాట ఉచితము అను తలంపును కలిగించుచున్నది. రక్షణను గొప్ప విందుగా భావించుకొనవచ్చును. రక్షణ మనము సంపాదించినదికాదు. ప్రభువు సంపాదించి మనకు ఉచితముగా ఇచ్చినది. ఈ రక్షణ విందు నాల్గవ బల్ల. ఒక ధర్మాధికారి గొప్ప విందు చేయించి ఇప్పుడు సిద్ధమైయున్నది రండని ప్రజలకు కబురు పంపెననియు, అందరకు పంపెననియు ప్రభువు చెప్పిన ఒక ఉపమానములో ఉన్నది. యేసుప్రభువుతో భోజన పంక్తిని కూర్చున్న యొకరు దేవునిరాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు అని చెప్పినప్పుడు భోజనమునకు సంబంధించిన ఈ ఉపమానము ప్రభువు చెప్పినందువలన అది సర్వజనులను ఆహ్వానించిన రక్షణ విందును జ్ఞాపకము చేయుచున్నది మత్తయి 22:2-10; లూకా 14:15-24.
-
5. క్రీస్తుప్రభువు శ్రమపడక ముందు ఎవరును గ్రహింపలేని ఒక భోజనపు బల్ల సిద్దపరచెను. ఈ బల్లమీద భోజనము మొట్టమొదట గైకొన్నవారు ఆయన అతిసామీప్య శిష్యులు. బల్లయొద్ద యేసు ప్రభువు ఉన్నట్టును బల్లమీద మొదటి వరుసలో ఆయన శరీరమును, రక్తమును ఉన్నట్టును, రెండవ వరుసలో రొట్టెయును, ద్రాక్షారసమును ఉన్నట్టును తరువాత బల్లయెదుట శిష్యులున్నట్టును భావించుకొందుము. ప్రభువు వారికి కనబడునట్లుగా రొట్టెను, ద్రాక్షారసమును అందించెను. ఆ రెప్పపాటులోనే వారి నోటికి తెలియని తన శరీరమును, కంటికి కనబడని తన రక్తమును వారికి అందించెను. ఈ విధముగ ఆయన తననే వారికి అనుగ్రహించెను. ఇది ఒక గొప్ప మర్మము. వారు తీసికొన్నవి నాలుగు. వడ్డించిన ఆయన ఒక్కరే. అందుకొన్నవారు కొందరే. తరుగకుండ ఆయన శరీరమును, ధారబోయకుండ తన రక్తమును వారికెట్లు ఇయ్యగలిగెనో మిగుల ఆశ్చర్యముగా నున్నది. “చిందింపబడుచున్న రక్తము” అని ప్రభువు తన రక్తమును గురించి చెప్పెను. అది ఆయన జీవించియుండగానే చిందింపబడుటకూడ ఆశ్చర్యము.
ప్రభువు భోజనమైనప్పుడు మనమును ఆచరించుచున్న విషయములలో నీ చిత్తము.
ప్రభువు భోజనము ఏ విషయములలో గొప్పది? జవాబు
- 1) దేవుడు మానవుడు అయియున్న యేసుప్రభువు ఏర్పరచెను. గనుక గొప్పది.
- 2) ఆయన తన శరీర రక్తములను అందించుచున్నాడు గనుక గొప్పది.
- 3) ఇది పూర్వకాలములోని ఇశ్రాయేలీయుల పాతనింబంధనకు కాదుగాని మన కాలములో విశ్వాసుల క్రొత్త నిబంధనకు సంబంధించినది గనుక గొప్పది.
- 4) ప్రభువు రెండవసారి వచ్చి సంఘమును తీసికొని వెళ్ళునట్టి దినమువరకు ఆచరింపవలసినది గనుక గొప్పది. కొరింథి 11:26.
- 5) పాపపరిహారము కొరకు ఏర్పడినది గనుక గొప్పది. మత్తయి 26:28.
- 6) తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాదెవడునులేడు అని ప్రభువు చెప్పెను యోహాను 15:23. ఈ మాట లోకములోని స్నేహితులకు అన్వయించుచున్నమాట. “రక్తములో ప్రాణమున్నది” ద్వితీ. 12:23 మత్తయి 20:28. యేసుప్రభువు తన రక్తమును చిందించుట వలన తన ప్రాణమును మనకు సమర్పించినాడు. గనుక గొప్పది.
- 7) కొందరు మూడు నెలలకొకమారు మరికొందరు నెలకొకమారు, ఇంకను కొందరు వారమునకొకమారు ఇది ఆచరించుచున్నారు. విశ్వాసి తన ఇష్టము వచ్చిన సమయమందు ఆచరింపవచ్చును. ఇచ్చువారున్నయెడల నేను ప్రతిదినము ఆచరింతును అని సుందర్ సింగుగారు చెప్పిరి. ఇచ్చుటకు ప్రభువు బల్లవేసియున్నది గనుక గొప్పది.
- 8) తన శరీర రక్తములను గైకొనువారు ఎల్లప్పుడు జీవింతురు అని ప్రభువు చెప్పెను గనుక గొప్పది. యోహాను 6అధ్యా॥.
- 9) నాలుగు సంగతులను గమనించండి.
మొదటిది:- ఈ సంస్కార భోజనము మీ కొరకు అని చెప్పబడి యున్నది - లూకా 22:19.
రెండవది:- అనేకుల కొరకు అని చెప్పబడినది - మార్కు 14:24.
మూడవది:- ప్రభువు శరీరమును జ్ఞాపకము చేసికొనుటకు అని వ్రాయబడియున్నది - 1కొరింథి 11:26.
నాల్గవది:- ఆయనవచ్చు పర్యంతము ఇది ఆచరించవలెనని వ్రాయబడియున్నది - 1కొరింథి 11:26 గనుక ఇది గొప్పది. - 10) ఇది పరలోకములో జరుగనైయున్న పెండ్లివిందును జ్ఞాపకము చేయుచున్నది గనుక గొప్పది మత్తయి 26:22; ప్రకటన 19:9.
- 11) గతించిన ఇరువది వందల ఏండ్లనుండియు ప్రభువు కోట్లకొలది విశ్వాసులకు తన శరీరమును రక్తమును ఇచ్చిన ఎట్లు తరగకుండును? బాధపడకుండను ఇచ్చుచున్నాడో ఇదియు మిగుల ఆశ్చర్యముగానున్నది. గనుక గొప్పది. అంత గొప్ప రక్షకుడు స్థాపించిన అంతగొప్ప బల్ల మనకొరకు ఎప్పుడును సిద్ధముగానేయున్నది.
ఈ దిగువను నేర్చిన మరికొన్ని సంగతులు వినండి. 5వ బల్లను గురించి చెప్పిన రీతిని బట్టి మీరుకూడ బల్లయొద్దకు వెళ్ళునపుడు
అట్లే
తలంచుకొనండి. ఏలాగనగా మీయెదుట బల్లవేసియున్నట్టును బల్లకు అవతల ప్రక్క ప్రభువు నిలబడినట్టును, బల్లమీద మొదటి వరుసలో శరీర
రక్తములున్నట్టును, రెండవ వరుసలో రొట్టె ద్రాక్షరసము ఉన్నట్టును, వాటియెదుట బల్లదగ్గర మీరు మోకరించియున్నట్టును
తలంచుకొనండి.
మీకొరకు ఈ నాలుగుగల బల్ల సిద్ధమైయున్నది అని సంతోషించండి. మనకు కావలసినవన్నియు సిద్ధపరచుట తండ్రి మనసులోనున్న కోరిక,
వెలుగు,
గాలి, అగ్ని, నీళ్ళు, ఖనిజములు. భూమ్యాకాశములు మనకొరకు ఆయన సిద్ధపరచుచున్నాడు. గత కాలమందు ఆయన సిద్ధపరచినది తలంచుకొనండి.
ప్రళభయములో మునిగిపోకుండ రక్షింపబడునట్లు ప్రజలకు తండ్రి నోవహు కాలములో ఒక నావను సిద్ధపరచెను. ఇశ్రాయేలీయులకు నివాసార్ధమైన
ఒకదేశమును సిద్ధపరచెను. స్వనాశనమును కోరిన యోనాను సముద్ర విపత్తునుండి రక్షించుటకు మత్స్యమును సిద్ధపరచెను.
అందరము
చదువుకొనుటకు బైబిలు గ్రంథమును సిద్ధపరచెను. మనమది నేర్చుకొనుటకు ఒక సంఘమును సిద్ధపరచెను. మీకు స్థలము సిద్ధపరచ
వెళ్ళుచున్నానని యేసుప్రభువు తన శిష్యులకు చెప్పి వెళ్ళెను యోహాను 14:2. ఇప్పుడది విశ్వాసులకు సిద్ధమగుచున్నది. విశ్వాసీ
దేవుని స్తుతింపుము.