(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

12వ పాఠము(అంతరంగ స్థితి)



మత్తయి 26వ అధ్యాయము. “ఈ పాత్ర నా రక్తమువలనైన నా నిబంధన. దీనిలోనిది మీరు త్రాగుడి ఇది నా రక్తము”.


ప్రభు భోజన సంస్కారపు విందు దినమున ఈ విషయమునే వివరించుట అవసరము. దీనినే తలంచుకొనవలెను. మన రెండు నేత్రములు ఎదుట రొట్టె, ద్రాక్షరసము ఉన్నవి. అయితే నేటి ప్రసంగముయొక్క ముఖ్యాంశము ఏదనగా దేవుడు సృష్టిలో కలుగజేసిన వస్తువులు మనము చూస్తే పైకి ఒక విధముగనుక, లోపల మరియొక విధముగను ఉన్నవి. బహిరంగ అంతరంగ స్థితులు ఒక విధముగాలేవు.


ఉదా:-

ప్రభువు మాట నమ్ముటయే వారి పని. అందుచేత అది వారు ప్రశ్నించలేదు. ఆ శరీరమేలాగిస్తారో మనకు తెలియదు. ఆ రొట్టెతోపాటు ఆయన శరీరమును మనకు ఇవ్వకపోతే ఇది నా శరీరమని ప్రభువు చెప్పనే చెప్పడను నమ్మకము వారికున్నది. ఆయన చెప్పినదెల్ల నమ్ముటయనునది దినదినము వారిలో పెరుగుచునేయున్నది గాని తగ్గలేదు. అలాగుననే రక్తము: ఇది మీ పాపములకొరకు చిందింపబడిన నా రక్తము అనెను.


ఈ మాటలు బుధవారము చెప్పెను. గురువారము చిందించెను. కాని గురువారము “ఇది మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము అనెను. అంటే ఇప్పటికే రక్తము చిందింపబడుట ఆరంభమైనది. శత్రువులు శుక్రవారమున ఆయనను పొడిచినప్పుడు ఆయన రక్తము చిందింపబడినది. కానీ గురువారము నాడే ఆయన రక్తము చిందింపబడుట ఆరంభమైనది. కానీ అది మన కన్నులకు కనిపించుటలేదు. అనగా గురువారము అంతరంగముగా కారుచున్నది.


అరటి పండులో తొన, పక్షిలో ఈకల, మనిషిలో చర్మము బహిరంగముగా ముందు వచ్చినవి. కానీ ప్రభువు విషయములో అంతరంగము ముందు బహిరంగము వెనుక వచ్చినది. భూలోక చరిత్ర మనము లోకమందెచ్చట ఉంచినను అశుభ్రత పాపము మొదలగునవి కనబడును. ఇవి మనకిష్టమున్నను లేకపోయినను నిరంతరము కనబడుచునే యుండును.


పాపము ఎక్కడ ఉన్నదో అచ్చట పాపమును ప్రభువు పరిహారము చేయును. పిదప అచ్చట పాపముండదు. ఈ పాపపరిహారమునకై మానవుడు పశ్చాత్తాపపడవలెను. అలాగే మనిషికి జబ్బు వచ్చిన అది పైకి కనబడుచునే యున్నది. ఆ జబ్బు మనిషితో నీ జబ్బు పోయినదని అంతరంగమున నమ్మమని చెప్పును.


అందుచేత ప్రార్ధన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లనూ పొందియున్నానని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మార్కు 11:24 జబ్బు పైకి కనబడుచున్నను పోకముందే పోయినదని నమ్మిన లోపలనున్న జబ్బు నిజముగా పోవును. ఒక స్త్రీకి 18 సం॥లనుండి నడుము వంగిపోయినది. తిన్నగా నడువలేదు. మీటింగునకు వచ్చినది ఆ బలహీనత పోయినదని ఆమెతో ప్రభువు చెప్పెను. ఎందుకనిన ప్రభువునకు పోయినట్లుగా కనిపించుచున్నది. గనుక అయితే ఆ స్త్రీ ప్రభువు చెప్పిన మాటనే నమ్మెను గనుక ఆమె జబ్బు వెంటనే పోయినది గాన పైకి ఒకటి లోపల ఒకటి.


మరణము చివరి దృష్టాంతము:- పైకి విశ్వాసి మరణించెను, కాని దేవుని దృష్టిలో మరణించలేదు. అంతరంగములో జీవములోనికి వెళ్ళెను. బహిరంగములో సమాధిలోనికి వెళ్ళెను. చాలా సంవత్సరముల క్రిందట బుల్లెయ్య అను ఒకాయన మరణావస్థలో ఉండెను. ఆయన స్నేహితులు వచ్చి అయ్యా చనిపోవుచున్నావా? అని వారు ఏడ్చిరి. అట్లు దుఃఖించుచుచున్నవారి చేతులు పట్టుకొని “అయ్యలారా నేను చనిపోవుటలేదు. ఇప్పుడే బ్రతుకుట ఆరంభించు చున్నాను” అని చెప్పెను. అనగా మోక్షలోకములో నేను బ్రతుకుదునని చెప్పెను. అచ్చట మనము అనుభవించుచున్న కష్ట నష్టములు మరియు మరణమనునవి లేవు. అచ్చట అంతా జీవము, పాపపరిహారము, వెలుగు, సంతోషము మొదలగునవి ఉండును. అట్టి సమయములో జీవమేగాని మరణముండదు.


కాబట్టి ఈవేళ మీరు రొట్టె తీసికొనినప్పుడు రొట్టెతోపాటు ప్రభువుయొక్క శరీరముకూడా తీసికొంటున్నామని మనము నమ్మితే దానివలన వచ్చిన ఫలము మీరందరు అనుభవింతురు. ఇట్లు విడిచి మనము గుడికి వచ్చినది సంస్కారపు రొట్టెను పుచ్చుకొనుటకే. ఇది మనము పెనముమీద కాల్చు రొట్టెకాదు. ఇది ప్రభువు శరీరము. దీనివలన వచ్చు ఫలితమును వివరించుటకు వీలులేదు. అది సంతోషము, జీవము మొదలగునవి. ఫలితాలన్నీ నాకున్నవని నమ్మి మనము ఇప్పుడు ఈ రొట్టెను పుచ్చుకొనవలెను. ఇదియే ప్రభువు శరీరము. అయితే తెలివి తక్కువతనము వలన దీనిని మనము పోగొట్టుకొనుచున్నాము. అందుకనే సంఘము నెలకొకమారు రొట్టెను పుచ్చుకొనుచున్నారు. ద్రాక్షారసముకూడా అట్టిదే. ఇది ప్రభుని మహిమ రక్తము, జీవము, మనిషి చనిపోవుచున్నాడని డాక్టరు నాడిని పట్టుకొని చూచును. అలాగే రక్తమంటే ప్రభువుయొక్క ప్రాణము, జీవము మనలోనికి వచ్చుచున్నది.


పేతురు ప్రభువు నెరుగనని బొంకినాడు. అప్పుడు ప్రభువు పేతురువైపు తీక్షణముగాచూచెను. వెంటనే పేతురు పశ్చాత్తాపపడి ఏడ్చెను. సంతాపపడి ఏడ్చెను. పాపము చేసిన వెంటనే ఏడ్చెను. వెంటనే క్షమాపణకోరినాడు. క్షమాపణ పొందినాడు. పేతురు చాలా గడుసుతనముగలవాడు. వీరినిచూచి పాపము చేసి పేతురు వంటి గడుసుతనమును కోరరాదు. కాని పాపములు జయించుటకు ప్రయత్నము చేయవలెను. అట్లు ప్రయత్నము చేయుచున్నప్పుడు ఓడిపోయినను ఫరవాలేదు. మనిషి పాపములో పడినవెంటనే పశ్చాత్తాపపడిన ప్రభువు వెంటనే క్షమించును. ఆలస్యము చేయడు. మనుష్యుడు పాపము చేసిన పిదప ప్రభువు తనను ఇంక చేర్చుకొనడని నిరాశచే ఆలస్యము చేయునా! “తాను నిలచుచున్నాననుకొనువాడు పడకుండనే చూచుకొనవలెనని పౌలు చెప్పెను. ప్రభువుయొక్క మహిమ, జీవము మనకందునని నమ్మి తీసికొనుడి. వట్టి శరీరమును అనగా ప్రాణములేని శరీరము మనిషికాదు శవమే. అందుచే ప్రభువు రొట్టె, ద్రాక్షరసమునిచ్చెను.


రొట్టె - ఆ ప్రభువు శరీరము


ద్రాక్షరసము - ప్రభువు జీవము (రక్తము)


ప్రభువే ఆ దృష్టాంతము.


ఆఖరు దృష్టాంతము ప్రభువే. పరిసయ్యులు ఆయన నరరూపమును చూచి ఆయనను నమ్మలేదు. ఆయన లోపల దేవుడైయున్నాడనికూడా నమ్మలేదు. కాని శిష్యులు, ఇతరులు నమ్మినారు. పరిసయ్యులకు యేసుప్రభువు మరియు యోసేపుల పుత్రునివలె కనబడుచున్నారు. గాన నమ్మలేదు. అట్లే ఈ విధముగా నేడు అనేకులు ఆయన ఇచ్చిన రొట్టె ద్రాక్షరసములను ఆయన శరీరము, ఆయన రక్తము అని నమ్మలేరు. ప్రభువే మన విందు. రొట్టె ద్రాక్షరసము కలిసి ఒక మనిషి అయినాడు. అట్లే శరీరము, జీవము కలిసి ప్రభువు అయినారు.