(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

20వ పాఠము(వధువు విందు)



“విందు - పొందు - సందు - మందు - బందు ” ఎస్తేరు 5:3.

ఎస్తేరు గ్రంథములో 3 విందులున్నవి.

నిరంతర యాజకుడైన మెల్మీసెదెకును భుజించుటకు వచ్చిన దేవుని పిల్లలారా! దేవుని కుమారుని పోలియున్న వాని శరీరమును తినుటకు వచ్చిన దేవుని పిల్లలారా! నిరంతర మెలా సరిపోతారు? ఈయన “తరుగడు” ఈ నిరంతరముండే ఆయనను ఎంత తిన్నా ఎన్నిసార్లు తినినా తరుగడు. ఆయన నడిపించే గొర్రెపిల్లలలో చేరండి. “The orphan lamb” ఈ ఎస్తేరు దిక్కులేని గొర్రెపిల్ల. దిక్కులేదుగాని 127 సంస్థానాలకు రాణి అయినది. అధికారియై పరిపాలించిన గొర్రె. నా అంతటి గొప్పవారు లేరని చూపించుటకు 6 నెలలు విందు చేసారు అహష్వేరోషు రాజుగారు. ఇది లోకస్తులయొక్క విందు. ఈ విందు ఆయనకు సందు అయినది. ఈ విందు నాధారము చేసికొని వష్తిని రాణిగా తగవని బయటకు పంపివేసి ఎస్తేరును లోనికి రప్పించారు. ఇదినా ప్రాణప్రియుడు నన్ను తన ప్రియురాలుగా చేసికొనుటకు చేసికొన్న సందు. ఈ అనాధ గొర్రెని అన్నీ ఉన్న గొర్రెపిల్లగా చేయుటే నా ప్రాణప్రియుని చిత్తము. కాబట్టి నా ప్రాణప్రియుని చిత్తము నెరవేర్చుకొనుటకు సందు చేసుకొన్నారు. మరి మన ప్రాణప్రియుని చిత్తము నెరవేర్చుటకు ఎన్ని ఇబ్బందులున్నా మనము సందు చేసికొనవద్దా! పొందు కోరి వచ్చిన ప్రాణ ప్రియునికి సందు చేసికొని విందు ఇవ్వద్దా! విందు చేసిన ఎస్తేరుకు పొందు వచ్చింది. సహవాసము వచ్చింది. 127 సంస్థానాల మీద అధికారియైన అహష్వేరోషు పొందులోనికి ఆమె వెళ్ళారు. సాతాను చిత్తమును బందు చేయాలి. ఎస్తేరు పని దేవుని చిత్తము నెరవేర్చేపని. అదే సంఘ కన్యక యొక్క పని. యూదులందరు బ్రతుకవలెనంటే పెండ్లికుమార్తెయైన ఎస్తేరు రావాలి. ఇశ్రాయేలీయులను కాపాడు ప్రభువా! అని ప్రార్ధన చేస్తారు.


ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రార్ధన చేసిన మీకు క్షేమము కలుగును. ఈనాటి ఇశ్రాయేలీయులు బైబిలుమిషను వారే! కాబట్టి బైబిలుమిషను క్షేమము కొరకు ప్రార్ధనచేస్తే ప్రాణప్రియుని ఇష్టమును నెరవేర్చిన పెండ్లికుమార్తెలమౌదుము. ఆయన చిత్తము చేదుగా నున్నదని. నిర్లక్ష్యము చేయకండి జాగ్రత్త! ఈ గొర్రెల మందలో చేరండి. ఆయనయొక్క సొంత గొర్రెల మందలో చేరండి. ఆలస్యము చేయకండి. మీకు కావలసిన దీవెనకొరకు, ఆదరణ కొరకు చేరండి. ఆయన ఇచ్చిన తరుణమును పోగొట్టుకొనకండి.

అలాగే ఈ పెండ్లికుమార్తెయొక్క విందు సాతానును బందు చేసినది. ఇది ప్రాణప్రియుని యొక్క పని. ఎస్తేరు అనే వధువు ఆటంకములున్నా ప్రాణప్రియుని పనిని తప్పించుకొనలేదు. అలాగే నా శిరస్సు పని అని తలంచి చెప్పిన దానికన్నా ఎక్కువ చేయండి. ఇది రిబ్కా అనే వధువుయొక్క స్థితి. పొందు = సహవాసము. ఆ పొందు లేనిదే బందు రాదు. అడిగిన దానికన్నా ఎక్కువ పని చేసిన రిబ్కా పెండ్లికుమార్తె బాధ్యత ఏదనగా ఎక్కువగా చేయుట. ప్రాణమునకు తెగించి చేయుట. ఇది నా ప్రాణప్రియుని చిత్తము. ఏ కీడు వచ్చినా, ఏ అవమానము వచ్చినా నా ప్రాణ ప్రియుని చిత్తము నెరవేరుస్తాను.


రాజా! నేను విందు చేస్తాను. మీ ఇద్దరూ రండి. నా ప్రాణప్రియుని చిత్తము నెరవేర్చుటే ఈ దినము నా తీర్మానము ఆయన చిత్తము నెరవేర్చుటే. మహిమ తలంపులు, మహిమ పెండ్లికుమార్తె, మహిమ పెండ్లికుమారుడు, మహిమ పొందు. సాతాను కుట్రను బయలుపరచాలంటే పెండ్లికుమార్తె విందు కావాలి. ప్రియుని కిష్టమైన విందు నేను చేస్తానోహో! సాతాను కుట్రనంతటిని విడదీసిన ఎస్తేరు విందు. నా ప్రాణప్రియుడు ఆనందముతో నా ముఖము చూడటానికి వస్తారు. అప్పుడు సాతాను కళ్ళు పేలిపోతాయి. లోకమునకు విరుద్ధము పరలోకమునకు సంతోషమే, ఎస్తేరు విందే విందు. సాతాను కుట్రను కూలద్రోసిన విందు. అందరు ఏకంగా ఉండుటే సాతానుకు బందు. దేవుని పిల్లలమీద జయము పొందలేరు జాగ్రత్త! సహించుకోండి. నోటిమాట పారవేసికొనవద్దు. ఎస్తేరుయొక్క విందు పెండ్లికుమార్తెకు సందు. ఈ పెండ్లికుమార్తె విందువలన అనగా 7 ఏండ్ల విందు వలన 1000 ఏండ్లు పిశాచికి మట్టులేని గొయ్యి. అదే సాతానుకు మందు. కాబట్టి వారికి ఎప్పుడైనా అపజయమే! 7 ఏండ్లు సంపూర్ణముగా విందు తిన్నావు గనుక సాతానుకు బందు.


“హామాను కుటుంబానికి మందు వేశారు” జాగ్రత్త. ఇక పైకిరాలేరు. అధికారమంతా రాణిగారి చేతిలో ఉంది. పెండ్లికుమార్తె చేతిలో పెత్తనమంతా ఉంది. ఈ ఎస్తేరే మొదటి అధికారి. మొర్దెకై ఓ కూలి మనిషి అయితే 127 సంస్థానాలకు రెండవ అధికారి అయ్యారు. దైవచిత్తమును నెరవేర్చినందువలన పిన తండ్రి కూతురు దేవుని పక్షముగా నున్నందువలన సాతానును జయించారు. ఎస్తేరు వంటి జయమే మీ జయము.


విందు-సందు-పొందు-బందు : విందులో సంపూర్ణమైన ఆనందము. 1000 ఏండ్ల పరిపాలన 7 ఏండ్ల పెండ్లివిందు: అందు అధికారము వీరిద్దరిదే. ఈ సంతోషమును ఆటంకపరచువారు ఎవరైనా ఉంటారా! 1000 ఏండ్లు సంతోషమే. సంపూర్ణ సంతోషమనే విందు. ఇప్పుడు మనము గ్రహించలేము. ఆ సంతోషము నాదే. మనసులో భద్రము చేసికొని స్తుతించండి.

పై అనుభవము కొరకు నిరీక్షించి చూస్తున్న మీ చేతిలో రాజదండము వుంటే పారిపోవలసిన పనిలేదు. సిద్ధపడండి రండి. బైబిలుమిషను సంస్కారపు విందు 1000 ఏండ్ల ఆనంద విందునకు ఆయత్తపరుచును అట్టి మహిమ విందునకు ఆయత్త పరచుటకే రాణిగారు ధరించుకొన్నంది. Modesty (వినయము, విధేయత). ఇదే ఆమె మెడలో ధరించుకొన్న ముత్యము. ఆ ముత్యము రాజుగారిని ఆకర్షించినది. సంపూర్ణ విధేయత. వ్యర్దాతిశయము వలన పెండ్లికుమార్తె అంతస్థును పోగొట్టుకుంటారు జాగ్రత్త.


మొర్దెకైకి విధేయురాలు
హేగేకి విధేయురాలు
రాజుగారికి విధేయురాలు.


ఇట్టి విధేయులుగా నమ్మకత్వము కలిగిన పెండ్లికుమార్తెలుగా ఈ విందు యొద్దకు వచ్చిన వారిని ప్రాణప్రియుడు నడిపించును గాక! నేటి కాలములో సాతానును బంధించాలంటే మీరందరూ ఏకమనస్సు కలిగివుంటే సాతాను బందు అవుతుంది.


పెండ్లికుమార్తె పని (నేనే) నాయొక్క పని Active గా పనిచేయుటే! అపుడే సాతాను బంధించబడుతుంది. రాకడ వరకు కాదు ఇపుడే సాతాను బంధించబడవలెను. ప్రభువు మీకు నిత్యము విందైయుండునుగాక! మొర్దెకై విందు. మహిమ విందులు చేయుటకు ఈ విందు మిమ్ములను బలపర్చునుగాక ఆమేన్.


“ప్రభు సంస్కారపు విందు - ప్రభు సంస్కారపు విందు-పరుగెత్తుకొని రండి ప్రభువే మన విందు = ప్రభువు జతకిదే సందు పాపవ్యాధికి మందు సభలన్నిటి యందు - సంతుష్టి పెంపొందు”.