(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
7వ పాఠము(దైవ జ్ఞప్తి)
1కొరింథి. 1:21. “నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిచేయుడి”.
ప్రార్ధన:- ఓ ప్రభువా! నీవు రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చినట్లు మాకు నీ వర్తమానము దయచేయుమని వేడుకొనుచున్నాము ఆమేన్.
జ్ఞాపకము చేసికొనుట:
- 1. గతించిన కాలములో ప్రభువు మనకు చేసిన ఉపకారములు జ్ఞాపకము చేసికొనవలెను. ఇక ముందునకు చేయు ఉపకారములకునుకూడ జ్ఞాపకము చేసికొనవలెను. జ్ఞాపకము అనునది దేవుడు మనిషి శరీరములో పెట్టిన గొప్ప శక్తి. జ్ఞాపకము అనేది లేకపోయిన మనము అన్ని మరచిపోదుము. తుదకు ప్రభువునకుకూడ మరచిపోదుము. భూలోకమును, పరలోకమును, అపవాదిని సమస్తమును మరచిపోయి తోలు బొమ్మవలెనుందుము. బొమ్మకు జ్ఞాపకశక్తి ఉండదు. అట్లే మనముకూడ నుందుము. గనుక మిక్కిలి అవసరము. ఒకవేళ జ్ఞాపకశక్తి తగ్గి ఉన్న దానిని బాగుగనుపయోగించుకొనవలెను. ప్రసంగ వాక్యములో ఏమి జ్ఞాపకముంచుకొనవలెనని క్రీస్తుప్రభువు చెప్పినారు. సంస్కార సమయమున ప్రభువును మాత్రము ఆయన క్రియలు, మాటలు ఆయన ఇచ్చిన భోజనము జ్ఞాపకము గాని ముఖ్యముగా ప్రభువును మాత్రము జ్ఞాపకము చేసికొనవలెను. మనలను ఎవరైన భోజనమునకు పిలిచిన భోజనము జ్ఞాపకము వచ్చును. గాని పిలిచిన ఆయన జ్ఞాపకము రావలెను. ఆయనకు కృతజ్ఞత మొదట. ఆ తర్వాత భోజనము మొ॥వి తలంచుకొనవలెను.
- 2. ఏదెనుతోట మొదలు అంత్యదినము వరకు ఒక వరుసగలదు. తోటలో దేవుడు నీ నిమిత్తము నేల శపింపబడెను అని చెప్పెను. అది అంత్యదినమువరకు నుండును. పాపము, పాపము వలన వచ్చిన ఫలితములు చివరవరకును గలవు దేవుడు చెప్పినమాట సత్యము; నేల శపించబడినది. ఈ శాపమునకు ప్రక్క మరియొక వరుస దీవెనలు వరుసకూడకలదు. మాటవరుసకు దేవుడు శాపము అన్నాడు గాని దానిప్రక్క పొడుగునా దీవెనల వరుసకూడ గలదు. ఈ దీవెనలవరుస ఆ శాపమును దిగ మ్రింగెను. నాగిన్నె నిండిపొర్లుచున్నది. నిండితేచాలు పొర్లు ఎక్కుట ఎందుకు? ఇంకా ఎక్కువ దీవెనలు. శాపమును దిగ మ్రింగు వరకు దీవెనలు గలవు. రెండు వరుసలు జ్ఞాపకముంచుకొనవలెను. శాపము వరుస, దీవెనల వరుస.
- 3. పొలములు: అక్కడ ధాన్యాదులు కూరగాయలు, వృక్ష ఫలములు ఇవన్ని శాపముకాదు. దీవెనలే. శపించబడిన నేలలో నుండి వచ్చిన దీవెనలు భూమిలోనుండి ఊట, నీళ్ళు, ధనము, లోహములు వచ్చుచున్నవి. శపింపబడిన భూమిలోనుండియే వచ్చుచున్నవి. కాబట్టి శాపమనగా ఏమిటి? ధాన్యము శాపమా? కూరగాయలు శాపమా? పండ్లు శాపమా? నీరు శాపమా? శాపము అన్నాడేగాని, దీవెన ఇచ్చినాడు. పొలములో ఆహార పదార్ధములు జ్ఞాపకముంచుకొనవలెను. ఇంటిలో భోజన పదార్ధములు అనుభవించుచున్నప్పుడు ప్రభువు ఇచ్చినాడు. గనుక వందనములని చెప్పవలెను. ఆహారపదార్థములు, భోజనమును బట్టి తండ్రిని జ్ఞాపకముంచుకొనవలెను
- 4) ఇప్పుడు సంస్కారబల్లమీద యేసుప్రభువు వడ్డించు భోజనము జ్ఞాపకముంచుకొనండి. పైన చెప్పిన భోజనము (ఆహారము మొ॥నవి) మనము వడ్డించుకొనేది. మనము తినేదిగాని తండ్రి ఇచ్చిన పదార్థములే. ఆయన అన్నము, కూర, పండ్లు తెచ్చిపెట్టాడు. మనము తెచ్చుకొని అనుభవించి ఇచ్చిన తండ్రిని జ్ఞాపకముంచుకొందుము, రాత్రి భోజనపు బల్లమీద ప్రభువు మనకు రొట్టెను, ద్రాక్షరసము మనచెట్లపండ్లరసము తీసికొని ఆయన వడ్డించెను. అట్లు వడ్డించుట ఆయనకు సంతోషము. కానాను పెండ్లివిందుకు అందరు వచ్చినారు. ఆయనకూడ వచ్చినారు. వరుసలోనే ఆయనకూడ కూర్చున్నారు. ఆయనకు అన్నములేకనా? లేక విందు తెలియకనా వచ్చినది? మనము తిను ఆహారములో పాల్గొనుటకు ప్రభువు వచ్చి కూర్చుండెను. అది ఆయనకు సంతోషము. ఆయన మన భోజనపంక్తిలో కూర్చుని తినుట మనకు సంతోషము. ఆయనకు సంతోషము మనకు సంతోషము.
ఉదా:- ఒకరు విందుకు పిలిచినారు. పిలిచిన ఆయన వారితోనే కూర్చుని భోజనము చేసినారు అందువలన రెండు సంతోషములు; విందువలన సంతోషము ఒకటి, వారితో కూర్చుని భోజనము చేసినందున మరియొక సంతోషము. క్రీస్తు ప్రభువు మనకు రొట్టె, మనకు ద్రాక్షారసము వడ్డించినారు. ఆయన 5వేల మందికి వడ్డించలేదు. శిష్యులు వడ్డించినారు. సంస్కారములో వస్తువులు మనవి. వడ్డన ప్రభువుది గనుక ప్రభువు వడ్డించుచున్నాడనే సంతోషము మనకుండును. ఇంటిలోని అన్నము, పొలములోని పంటను చూచి తండ్రి జ్ఞాపకము వచ్చును. రాత్రి భోజనములో వడ్డించు యేసుప్రభువు జ్ఞాపకముంచుకొనవలెను. కొందరు విధ్యార్థులు ప్రార్ధన చేయుదురు. ఏమని? ప్రభువా! శరీరమునకు ఆహారమిచ్చినట్లు ఆత్మకుకూడ ఆహారమిమ్ము అని. వారి తలంపులో ప్రభువు భోజనము లేకపోయినా దానికి సంబంధించిన తలంపు కలదు.
- 1) పొలములోని ఆహారపదార్థములు
- 2) ఇంటిలోని భోజనము
- 3) క్రీస్తుప్రభువు ఇచ్చు రొట్టె ద్రాక్షారసము.
ఈ రొట్టె ద్రాక్షారసము తీసికొనునప్పుడు ప్రభువు శరీరమును, రక్తమును జ్ఞాపకము చేయును. ఈ భోజనము అనగా ప్రభువు యొక్క శరీర భోజనము, మన ఇంటిలోని భోజనమును మించినది. ఒక భోజనము మరియొక భోజనమును జ్ఞాపకముచేయును. ఒక భోజనమును మించిన భోజనము మరియొకటి. ఒకదానికంటె ఒకటి ఎక్కువ. పంటకన్న భోజనము ఎక్కువ. ఆ భోజనముకన్న రొట్టె, ద్రాక్షారసము ఎక్కువ. వీటికన్న ప్రభువుయొక్క శరీరము రక్తము ఎక్కువ. శాపము ఏది? నేల శపింపబడ్డది, శపింపబడిన నేలమీద రక్షకుడు నిలువబడి శాపమునకు లోబడి 11మంది శిష్యులకు భోజనము శపింపబడిన నేలమీద వడ్డించెను. శాపము ఏది? మంచి మనస్సుతో పుచ్చుకొనిన శాపములేదు. ప్రసవవేదన శాపము, బిడ్డ పుట్టగానే చెంతనే దీవెన. పొలములో చెమట, కష్టము, శాపము. దానిచెంతనే పంట, దీవెనకాదా! శాపము ఏది? దీవెనలే నిండి పొర్లుచున్నవి. అయితే ఎన్నిమార్లు సంస్కారములో ప్రభువుయొక్క శరీర రక్తములు తీసికొన్నను వ్యాధులు, కష్టములు, చిక్కులు ఉంటూనేయుండును. అయినను సంతోషము, కృతజ్ఞతకూడ ఉండును. అయితే ఇంకొక కాలము రావలెను. పాపములో పడని కాలము, శాపము పేరుకైనను లేనికాలము, మరణములేని కాలము రావలెను. అప్పుడు ఒక విందు ఉండును. అప్పుడు ఆ శాపము పోయి, దీవెన ఉండవలెను. అది పరలోకములో జరుగును. క్రీస్తుప్రభువు అక్కడివిందు.
ఆయన లక్షణములు గుణములు. ఆయన కళ విందుగా ఆచరింతుము. ఆయన జీవము విందు, అదే రక్తము. శాశ్వతకాలము అక్కడివిందు. ఆయన లక్షణములు గుణములు. ఆయన కళ విందుగా ఆచరింతుము. ఆయన జీవము విందు. అదే రక్తము. శాశ్వతకాలము పుచ్చుకొందుము. ఇక్కడ పుచ్చుకొనుటకంటె పరలోకములో పుచ్చుకొనుట ఇంకా ఎక్కువ. ఇక్కడ తీసికొనుటలో ప్రభువుయొక్క శరీర రక్తములు తక్కువకాదు. మనము పుచ్చుకొనుట, అంగీకరించుట తక్కువ. అక్కడ తీసికొనకపోవుట, అంగీకరించకపోవుట ఉండదు. గనుక పరలోకములో ఎక్కువ. అనేకులు క్రీస్తుయొక్క శరీర రక్తములు తీసికొనుచుండగా బలహీనత ఎందుకు ఉండవలెనను చున్నారు. ఆయనలో లోపములేదు. మనము అంగీకరించుటలో, మనము నమ్ముటలో, మనము జ్ఞాపకము చేసికొనుటలో లోపమున్నది. గనుక బలహీనతకూడ ఈలోకములో గలదు. ఆ లోకములో ఏ బలహీనత ఉండదు. మనము అంగీకరించుట, తీసికొనుట, అనుభవించుట, శాశ్వతకాలముండును.
పొలములోని ఆహారపదార్ధములకన్న ఇంటిలోని ఆహారము ఎక్కువ, ఇంటిలోని ఆహారముకన్న సంస్కార భోజనము అనగా ప్రభువు శరీరరక్తముల భోజనము ఎక్కువ. ఈ లోకములో ఈ విందుకన్న పరలోకపు విందు ఇంకా ఎక్కువ. గనుక సంస్కార భోజనము అజాగ్రత్తగా, నిర్లక్ష్యముగా కాక సిద్ధపడి సంతోషముతో పుచ్చుకొనవలయును. విందుకు పోవువారు స్నానముచేసి వస్త్రము ధరించి సంతోషముతో భుజింతురు. ఇప్పుడుకూడ దోషములేకుండా శుభ్రముగానుండి నీతి వస్త్రము ధరించి, సంతోషముతో పుచ్చుకొనండి.