(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
5వ పాఠము(సంస్కార మనోనిదానము)
దా.కీర్తన 23:5,6; లూకా 14:20; 1కొరింథి. 11:23-34.
ఆత్మీయ పోషణ ఆత్మీయ భోజన విశ్వాసులారా మీకు ప్రభువు చేసిన విందుయొక్క ఫలితము కలుగునుగాక! నేను చెప్పే మొదటి చివరి మాటలు ఏదంటే మీరు భోజనము దగ్గర మోకరించిన మొదటి నిమిషము నుండి భోజనము అయిపోయిన కడవరి నిమిషమువరకు మిక్కిలి కష్టపడి ఒక పని చేయవలెను. అది యేదనగా మనోనిదానకార్యము మీ మనస్సు రొట్టెమీదే ఉండవలెను. మీ మనస్సు ద్రాక్షారసముమీదనే ఉండవలెను. అదే మనోనిదానము.
మీ మనస్సు ప్రభువుయొక్క పరిశుద్ధ శరీరమువంకే ఉండవలెను. మీ మనస్సు ప్రభువుయొక్క అమూల్యరక్తమువైపే ఉండవలెను. అదే మనోనిదానము. అలాగు ఉన్నయెడల అప్పుడు మీరు ప్రభువు భోజనము పుచ్చుకొన్నట్టే. మీరు మీ ఇంటిలో భోజనము భోంచేసేటప్పుడు దిక్కులుచూస్తూ తింటే ఈగలు, దోమలు వాలవచ్చును. గనుక మీదృష్టి అన్నమువైపే ఉండవలెను. భోంచేయవలెను ముగించేవరకు ఉండవలెను.
నీళ్ళు త్రాగేటప్పుడు దిక్కులు చూస్తు త్రాగిన యెడల నీళ్ళు మీ బట్టలమీద పడును. అయితే నీళ్ళవైపే దృష్టి ఉంచినయెడల అన్నమువైపే దృష్టి ఉంచినయెడల అదే మనోనిదానము. అలాగే సంస్కార భోజనము భుజించినప్పుడు ఈ నాలుగు మనస్సులో చూడవలెను. అనగా రొట్టె ద్రాక్షారసము; రొట్టె వెనుక శరీరము, ద్రాక్షారసము వెనుక రక్తము ఈ నాల్గింటిని చూస్తుండవలెను. అయితే మీ పాపములను జ్ఞాపకము రానీయకండి. ఈగలు, దోమలు వాలవచ్చు. దృష్టి అన్నము వైపే ఉండాలి. మీ మనస్సులోనికి మీ బస, మీ పిల్లలు, మీ ఆస్థి, మీ సొమ్ము, జ్ఞాపకమునకు రానీయకండి. అదే మనోనిదానము మరియు మీరు మనస్సులోనికి ఏ చెడుగైనా సరే యే మంచివైనను రానీయకండి. చెడుగును రానీయకూడదు. మంచిని రానీయకుడదు. ఈ నాల్గే జ్ఞాపకముండవలయును. అప్పుడు సంస్కార భోజన ప్రయోజనము మీకు కలుగును. రొట్టె మీరు తినుచున్నారని మీకు ఏలాగు నిశ్చయమో అలాగే యేనుక్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధ శరీరము అందుకొనుచున్నారనే నిశ్చయము మీకు తెలియవలెను.
మనస్సులో రొట్టెయొక్క నిశ్చయము మీకు తెలిసినట్లు దానితోపాటు ఆయన శరీరముకూడ మీకందుచున్నదనే నిశ్చయత మీ మనస్సుకు తోచవలెను. అది మనోనిదానము. అలాగే ద్రాక్షరసము కూడా పుచ్చుకొనేటప్పుడు ఆయన అమూల్యరక్తమును పుచ్చుకొంటున్నానని మీ మనస్సునకు తోచవలెను. దర్శనము కాదు. దేవోక్తికాదు మరేమికాదు. అది మీ మనస్సు పని. దర్శనవరము దేవోక్తివరము గలవారికి తెలియవచ్చును. అది ప్రభువు పని మీ యెడల అయితే మీరనుకొనడము మీకు తోచడము మీకు నమ్మిక పుట్టడము ఇవి మీ పనులు.
ప్రభువు తన పని చేస్తాడు. మీరు మీ పనులు చేయవలెను.
- 1) మనోనిదానము
- 2) అవి మనకు అందుచున్నవని మనస్సుకు తోచడము
- 3) ఈ నాల్గు నాలోనికి వెళ్ళుచున్నవని నమ్మడము అదే సంస్కార భోజనము.
మన ఇండ్ల దగ్గర చేసేది భోజనము; గుడిలో భోజనము - సంస్కార భోజనము.
సంస్కారమనగా ఇంటి సంబంధము. సంసారమనే కీర్తనకూడా నొక చరణములో ఉన్నది. ఇది పాడుచుండగా ఒక మిషనరీ సంసారమని ఉన్నదేమని అయ్యగారిని అడిగిరి. అందరు వివాహము చేసికొని సంసారము చేస్తారా అని అడిగిరి. అర్ధము అదికాదు లోకమంతా కలసి ఉన్నది సంసారమని చెప్పిరట.
పురుషోత్తముగారు కట్టిన కీర్తనలో ఉన్నది. అనగా ఈలోకమంతా అటన్నీ లోకజీవితమని అర్ధము. అది సంస్కార భోజనము దానికి లోకభోజనమనియు పేరున్నది. సంస్కార భోజనమనగా యేసుప్రభు ఏర్పరచిన భోజనము. తన శరీర రక్తముల భోజనము. అన్నము కూరల భోజనము కాదు. ఇది ప్రత్యేక భోజనము. ఈ వేళ గుడియైన తర్వాత నేనెవరినైనా మీరు ప్రభువు భోజనము తీసుకున్నారా? అని ప్రశ్నిస్తాను, అవును అంటారు. అప్పుడు ఇతర తలంపులు రాలేదా? అంటాను వచ్చాయంటారు. అలాగైతే మీరు రొట్టె, ద్రాక్షారసమేగాని సంస్కారము తీసికోలేదంటాను. ఇంకొకరిని అడుగుతాను. ఇతర తలంపులు వచ్చాయిగాని నేను ఈగలను, దోమలను తోలివేసినట్లు తోలివేసానంటారు. అలాగైతే నీవు సంస్కారము పుచ్చుకొన్నావంటాను. ఇంకొక అబ్బాయిని అడుగుతాను రాలేదంటాడు. అలాగైతే నీకు ఇతర తలంపులు రాలేదు గనుక నీవు ప్రభువు భోజనము పుచ్చుకొన్నావంటాను.
నేను చేసిన వ్యక్తులమీద ప్రశ్నించినది చివరి భాగము. ఈ మూడు జ్ఞాపకముంచుకొని ప్రభు సంస్కారపు విందు పరుగెత్తుకొని రండు ప్రభువే మన విందు అని రండు.
- 1) మనోనిదానము
- 2) ముగ్గురు వ్యక్తులమీద ప్రశ్నలు
- 3) ముగ్గురి జవాబులు.