(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

15వ పాఠము(సంస్కార జీవనము)



ప్రార్ధన: - యేసుప్రభువా! సంస్కార భోజనమునకు సంబంధించిన విషయములు ఆలోచించుటకు మాకు తగిన జ్ఞాన శక్తి అంగీకరించుటకు విశ్వాస శక్తి దయచేయుము. మేము ధ్యానింపనైయున్న వాటి మూలముగా మా ఆత్మ జీవమునకు బలకరమైన సంగతులు దయచేయుము. మాలో ప్రతివారికి ఏదో ఒక వర్తమానము అందించుమని వేడుకొనుచున్నాము.


1కొరింధి. 11:26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.


ప్రియులారా! ఈ దినము భోజన సంస్కారము. ఇప్పుడు వాక్యములో ఉన్నట్లుగా ఆయన వచ్చేవరకు ఆచరించవలెను. ఆయన వచ్చేవరకు ఆచరించవలెను. ఆయన వచ్చేవరకు దీనిని ఆచరించుచు ఆయన మరణమును ప్రచురించుట మనిషి పుట్టుట ఒక పర్యాయమేగాని భుజించుట అనేక పర్యాయములు జరుగుచుండును.


ఒక విశ్వాసి సంఘములోనికి వచ్చి బాప్తీస్మము కోరినప్పుడు అతడు పునర్జన్మము పొందినాడని చెప్పవచ్చును. బాప్తిస్మము ఒక పర్యాయమే. లోకములో జన్మము ఒక్క పర్యాయము ఎట్లో సంఘములో ఆత్మ జన్మకు ముంగుర్తు అయిన బాప్తిస్మము కూడ ఒక్క పర్యాయమే. శిశువు పుట్టుట ఒక్క పర్యాయమే గాని పాలు త్రాగుట అనేక పర్యాయములు. అట్లే ప్రభువు భోజనము రాకడ వరకు జన్మము ఒక్కసారే, బాప్తిస్మముకూడ ఒక్కసారే. భోజనము అనేకసార్లు. సంస్కారముకూడ అనేకసార్లు. ఇవి పుచ్చుకొనునప్పుడెల్ల ప్రభువు యొక్క మరణము ప్రచురించుదురు. ఎందుకంటే ఆయన తన మరణ సమయమునందే తన శరీరమును మనకు సమర్పించెను. తన మరణములో తన స్వీయ రక్తమును ధారపోసెను. కాబట్టి ఇది తీసికొనప్పుడు ఆయన మరణమును ప్రచురించుదుము. అది మనకు సంతోషము మొదటిది ఆయన మరణము జ్ఞాపకము తెచ్చుకొనుట ఇది ఆచరించుట. రెండవది రాకడ. ఆయన వచ్చువరకు దీనిని జ్ఞాపకము ఉంచుకొనవలెను. మరణము తలంచుకొనుచు ప్రభు భోజనము ఆచరించుదము. గనుక ఆయన శ్రమలో, మరణములో విందులో ఆయన పునరుత్థానములో పాలివారమైయుందుము, గనుక బల్లయొద్దకు సిద్దపడకుండా రాకూడదు.


భూలోకములో మూడు స్థితులు ఉన్నవి. పరలోకములో ఒక్కస్థితి మాత్రమే ఉన్నది.

యేసుప్రభువు వచ్చి ఈ శరీర జీవితమును అంతరింపచేయలేదు. గాని ఈ శరీర జీవితములోని అంశము తీసివేయక ఆత్మ జీవిత అంశము ప్రవేశపెట్టి శరీర జీవితమును బలపర్చెను, మహిమపర్చెను. ఈ అంశములు విశాలమైన దీర్ఘ అంశములు. యేసుప్రభువు వచ్చినప్పుడు శరీర జీవితములో ఏమిచూపెను. భోజనము అంటే అందరికి తెలుసు. ప్రభువు అది కొట్టివేయక ఆత్మ భోజనము ప్రవేశపెట్టెను. యేసుప్రభువు ఈ వేళ మన మధ్యకు వస్తె అన్నం అని అంటారు. గాని రొట్టె అని అనరు. ప్రభువు కాలమునందు రొట్టె, ద్రాక్షరనము ఆహారమైయున్నది. ప్రభువు రొట్టెకు బదులుగా శరీరమును, రక్తమునకు బదులుగా ద్రాక్షరసమును ప్రవేశపెట్టినారు. మనకు సంస్కారపు విందులో చిన్నరొట్టె త్రుంచి యిస్తే కడుపునిండలేదు అని అనము. అది ఎట్లు భోజనము కాగలదు? న్యాయము చొప్పున సూడిదగాని అది కడుపునిండేదికాదు. ఇంటివద్ద తినే ఆహారము ఆకలి తీరేదైయున్నది. శరీర జీవితములో మనము భుజించే ఆహారము, శరీరమును, రక్తమును జ్ఞాపకముచేయుచున్నది. శరీర భోజనములో ఆత్మ జీవనము ప్రవేశపెట్టి మనకు శక్తి అనుగ్రహించుచున్నాడు.


అలాగే బాప్తీస్మము అనే స్నానమున్నది. ఈ స్నానములో నెత్తిమీద కొన్ని నీళ్లు పోసినంత మాత్రమున స్నానమగునా? లేకపోతే నీళ్ళలో మునిగినంత మాత్రమున స్నానమగునా? అది నీళ్ళతో తడుపుటయేగాని పూర్తి స్నానముకాదు. ఈ స్వల్పకార్యములనుబట్టి గొప్ప పునర్జీవము మనకు కలుగుటకు ఆత్మ జీవితములో కొనసాగించేదైయున్నది.


తనయొద్ద నున్న జన సమూహమును చూచి మీయొద్ద ఏమి యున్నదని ప్రభువు ప్రజలను అడిగెను. అవి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు మాత్రమే. అయితే ఆ జనమునకు అవి సరిపోవు. ఆ రొట్టె అలాగే ఉన్న యెడల అది ఐదుగురికే సరిపోవును. ప్రభువు వాటిని తీసికొనెను గనుక అవి అన్నివేల మందికి సరిపోయినవి. అలాగే గురువు చిన్న రొట్టెలు తీసుకొనెనుగాని అది ఆత్మ జీవనమును సంతుష్టి పరచేదినైయున్నది. ఈస్వల్ప భోజనము వల్ల ఆ భోజనమునకు విలువ వచ్చినది. తక్కిన సమయములలో ఈ రొట్టెకు గాని ద్రాక్షరసమునకు గాని విలువ లేదు. బల్లయొద్ద ఈ స్వల్పభోజనము ప్రభువు ఇచ్చినప్పుడు అది గొప్పదైయున్నది. యేసుప్రభువు మన శరీర జీవితములో మన ద్వారా ఆయన ఈ లోకములోనికి మనవలె వచ్చెను. 30వ సంవత్సరమునందు మనవలె ఉద్యోగములో ప్రవేశించలేదా? ఆయన ప్రతి అంశమును ఆత్మ జీవనమునకు సమానమైనదిగా చేసెను. మనవలె భోజనము చేసెను. మనవలె నీళ్ళు త్రాగెను.


శరీర జీవనములో జన్మము, ఆత్మజీవనములో పునర్జన్మము.


శరీర జీవనములో ఆహారము, ఆత్మ జీవనములో ప్రభు భోజనము. ఎవరైనా తమ బంధువులు ఉరివేయబడితే ఆ ఉరి కొయ్యవంటిది చేసికొని మెడలో వేసికొనునా? అలాగు ఎవరు చేయరు. అది అసహ్యమైన పని. భోజనము చేయునప్పుడు చావును తలంతురా? అయితే ఇది యేమిటి? యేసుప్రభువు ఈ భోజనము చేయునప్పుడు తన శిష్యులతో నా మరణమును తలంచుకొనుడి అనెను. యేసుప్రభువువలె సంఘము తన సంతోషమునుబట్టి అట్టిది కల్పించుకొన్నది. సంఘస్తులైనవారు తమ మెడలో సిలువ వేసికొనుచున్నారు. అది అసహ్యమైనదిగా దానిని ఎంచలేదు. ఎందుకంటే ఆయన మన పాపమంతయు తనమీద వేసికొన్నాడు గనుక మనము మెడలో సిలువ వేసికొనుటకు సిగ్గుపడము. సిలువను ప్రభువు ఎంత తేలికగా చేసెనో రొట్టెను, ద్రాక్షారసమును అంత తేలికగా చేసెను.


బాప్తిస్మము అనగా జన్మము, రాత్రి భోజనము అనగా పునర్జన్మము.


ఈ రెండు మనకు కావలసినవే. అంతేకాక ప్రభువు సిలువ భరించెను. ఆ సిలువను మనము ఎత్తుకొనుచున్నాము. మనకేమి శ్రమ. ఆయనే మన నిమిత్తమై శ్రమ భరించెను. గనుక మనము సిలువను ధరించుకొనుచున్నాము. ప్రభువు సిలువను మోసెను. సిలువకు అంటగొట్టబడెను. తరువాత మరణము పొందినను జీవించెదననెను గనుక మనకు మరణము లేదు. మనము శాశ్వత జీవనములో ప్రవేశించుటకు ప్రభువు మరణము నొందెను. యేసుప్రభువునుబట్టి ఐదు రొట్టెలు ఐదువేలమందికి సరిపోయినవి. అలాగే రెండు చేపలు 5వేల మందికి సరిపోయినవి. యేసుప్రభువునుబట్టి మనకు మరణము జీవసాధనమైనది. మనము చనిపోయిన తరువాత జీవములోనికి ప్రవేశించెదమని నిరీక్షించవలెను. ఒక ఆయన మరణించేటప్పుడు నూతన యెరూషలేము అని అనెను.


మరణము - శరీర జీవనము
ఆత్మజీవన సాధనము - ఇచ్చునది
గనుక శరీర జీవనములో ఉన్న మూడింటిని ఆత్మ జీవనములో ఉన్న మూడింటిగా మార్చి యేసుప్రభువు మనలను దీవించెను.


మరణము, జీవము, మహిమ జీవితము. శరీర జీవితములో ఎండ, గాలి అన్నియు అనుభవించుచున్నాము. ఇది మంచి జీవితమే ఈ శరీరము పరలోకమునకు వెళ్ళునప్పుడు మహిమ శరీరముగా మారును. ఇక్కడ ఈ రొట్టెపోయి పరలోకములో ఎన్నటికిని ఆకలిలేని విందు దొరుకును. క్రొత్త జీవము, క్రొత్త ఆయుష్కాలము అక్కడ ఉండును. ఆత్మ జీవనమే ఎక్కువ గాని దానికంటే మహిమ జీవనము మరెక్కువ. మనము శరీర జీవితములో ఆత్మజీవనమును జ్ఞాపకము చేసికొనవలెను. ఈ ప్రకారముగా ఒకదానికొకటి సంబంధమున్నది. క్రొత్త రూపము మనకు వచ్చును. క్రొత్త శక్తి మనకు వచ్చును.


మనము శుభ్రమైన భోజనము చేసిన అంత శుభ్రముగా మన శరీరము ఉండును. అట్లే మనకెన్ని పర్యాయములు సంతోషముతో ప్రభురాత్రి భోజనము తీసికొనుచు ఉన్నామో అన్ని పర్యాయములు ఆత్మీయ జీవనములో సంతోషించెదము. ఇవన్నియు జ్ఞాపకము చేసికొని ప్రభురాత్రి భోజనము ఆచరించుట మనకర్తవ్యమై యున్నది. అట్టి దీవెన మీకు కలుగునుగాక.