(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
25వ పాఠము(ప్రభురాత్రి సంస్కారము)
కీర్తన 28:5 నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు
- 1) ప్రభు భోజనము
- 2) రాత్రి భోజనము
- 3) సంస్కార భోజనము.
ప్రభువు స్థాపించినందున ప్రభురాత్రి భోజనమన్నారు. భయంకరమైన రాత్రి సమయమున దీనిని ఆచరించినారు. గనుక రాత్రి భోజనమన్నారు. ఈ భోజనము వలన మామూలు భోజనము చేసినప్పుడు కడుపునిండునట్లు నిండదు. ఇది మతసంబంధమైన ఆచారము గనుక సంస్కార భోజనము కృతజ్ఞత వెల్లడిచేయుట. గనుక దీనిని యాకిరిస్టు(Eucharist) అనికూడ అందురు. శరీర భోజనము వలన ఎంత ఉపకారము కలుగుచున్నదో అంతకన్న ఎక్కువ ఉపకారము ఈ ప్రభు భోజనము వలన కలుగుచున్నది.
శత్రువులు చూచుచుండగా ప్రభువు భోజనపు బల్లను మనకు ఏర్పాటు చేసియున్నాడు. మనము భోజనము చేయచుండగ శత్రువులు వస్తారు. మనము భోజనము చేయుదుమా, పారిపోవుదుమా గొర్రెల దగ్గర కాపరి ఉన్నాడు. కుక్కకూడ గలదు. కొంచెము దూరముగా తోడేలు ఉన్నది. గొర్రెపిల్లలు ఉండునా పారిపోవునా? మేతమేయునా? మనకు ముఖ్య శత్రువు పాపనైజము. ఇది తోడేలుకన్న భయంకరమైనది. మన రెండవ శత్రువు లోకము. మనలను నిరుత్సాహపరచు వారున్నారు. ఆత్మీయ జీవనము సాగిపోవుట కష్టముగా నుండును. మరియు కొంచెము దూరములో మూడవ శత్రువు సైతాను గలడు. వెలిగింపబడినది ఆర్పివేయుటకు చూచుచుండును. మనకు దుర్భుద్ధులు గలవు. దుష్టనైజము గలదు. చెడ్డచూపు, చెడ్డ తలంపులుగలవు. ఇవన్నీ మనశత్రువులె. ఇంతమంది శత్రువులుండగా ఏలాగు భోజనము చేయుట. మన ఇంటిలోనే స్నేహితులైన శత్రువు. లోకముగలదు. సైతాను. అతని సైన్యము, దయ్యములు ఇవన్నియు శత్రువులు.
పది ఆజ్ఞల ప్రకారము మనలోని లోపములను దిద్దుకొని ఈ భోజనము పుచ్చుకొనవలెను. కళంకముతో తీసికొనరాదు. ఉదరశుద్ది లేకుండ భుజించిన ఎట్లు జబ్బు చేయునో అలాగే కళంకము గలిగి ఈ భోజనము పుచ్చుకొనినయెడల కష్టములు కలుగును. అందుచేతనే పౌలు వ్రాయుచున్నాడు. నీలో అనేకులు నిద్రించుచున్నారు. యేసుప్రభువు రొట్టె చేత పుచ్చుకొని ఇది నా శరీరమనిరి. రొట్టె ఆయన శరీరము, ఇది గురుతు మాత్రము కాదు నిజమైన వృత్తాంతము. ప్రభు భోజనమువల్ల కలుగు గొప్ప దానములు జీవము, మోక్షము పాపపరిహారము, మనకు ప్రభువుయొక్క సహవాసము కలుగును. ఎవరైనా మనలను భోజనమునకు పిలిచిన వెళ్ళిన తరువాత మనకు పరిచయము కలుగును. అలాగే ఈ భోజనము వలన ప్రభువుతో సహవాసము కలుగును. శరీరాహారము రక్తముగా మారి దేహమునకు బలమిచ్చునట్లు ఈ ఆహారము లోకమును పాపమును జయించుటకు బలమిచ్చును. ఈ భోజన సమయములో ప్రభువు పరలోకపు విందునుగూర్చి కూడ చెప్పెను. గనుక రాబోవు ఆ విందునుకూడ మనము జ్ఞాపకముంచుకొనవలెను. ఈ భోజనమువలన మీకు ఆత్మీయ బలము కలుగును గాక!