(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
21వ పాఠము(భోజనములు)
దా.కీ. 26: మార్కు 14:12-16; 1కొరింథి. 11:23-34.
సంస్కార భోజనమునుగూర్చిన బోధ వినుటకు, సంస్కార భోజనము గైకొనుటకు వచ్చిన ప్రియ విశ్వాసులారా! మీకందరకు ఈ రెండు విషయములలో శుభకరమైన ఆహ్వానమందునుగాక! ఆమేన్.
మొదటిది ఉపన్యాసము, రెండవది ప్రభు భోజనము. ఈరెండు ముఖ్యమైనవే. ఉపన్యాసములు అనేక పర్యాయములు విన్నా ఉపన్యాసమే. సంస్కార భోజనము అనేక పర్యాయములు తిన్నా భోజనమే. ఈ రెండూ అవసరమే అని గుర్తించండి.
భోజనము, భోజనము, భోజనము భోజనములనే భోజనములు నాలుగు రకములు, ఈ నాలుగు భోజనముల విషయములు మనకు తెలిసినవేగాని కొద్దిగా జ్ఞాపకము చేస్తాను.
మొదటి భోజనము:- దేవుడు మనకు అనుదినము ఇచ్చే భోజనము. ఏమితిందుమో? ఏమి త్రాగుదుమో, ఏమి ధరింతుమో అని చింతించవద్దు అని ప్రభువు చెప్పెను. గనుక ఆయన అనుదిన ఆహారమిచ్చేవాడు. పక్షులకే ఇచ్చుచుండగా వాటికంటే శ్రేష్టమైన స్థితిలోనున్న మనకెందుకు ఇవ్వడు.
మనము ప్రతిదినము భోజనము తినేటప్పుడు ప్రార్ధించాలి, స్తుతించాలి. “స్తుతించి మనలను సంతోషపెట్టిన తండ్రిని మనము సంతోషపెట్టాలి”. దేవుడు మనకు అనుదినము ఇస్తున్న ఆహారము ముఖ్యమైనదే. ఈ ఆహారమువలన
- 1) ఆరోగ్యము
- 2) రోగనివారణ
- 3) ఆయుష్షు
- 4) దేవుని కళ.
ఈ నాలుగు ఫై భోజనము వలన మనకు కలుగుచున్నవి. గాన ఆ ఆహారము ఎంతో ముఖ్యము. ఈ నాలుగు అక్కరలేనివారుందురా? లేరు. నేలపైగాని, చాపపైగాని, బల్లపైగాని కూర్చుండి ఆకులలోగాని, ప్లేటులలోగాని తినే ఈ ఆహారము “వద్దు” అనేవారుందురా? ఉండరు. ప్రతి దినము భోజనము ఏలాగు తప్పదో అలాగే ప్రతిదినము స్తుతి తప్పదు. అట్లు స్తుతించిన తండ్రికి మహిమ మనకు తృప్తి సంతోషము.
రెండవ భోజనము:- మొదటి దానికంటే ముఖ్యము. మొదటి భోజనము శరీరములోని ప్రాణానికిని, రక్తానికిని ముఖ్యము. శరీరములోని ఇతర అవయవము లన్నిటికిని చర్మమునకు మాత్రమే ఈ భోజనము అవసరము. అయితే దైవగ్రంథములోని భోజనము గొప్పది. అది శరీరాహారము, ఇది ఆత్మాహారము, ఇది వాక్యాహారము, అది పదార్థ ఆహారము. పదార్థ ఆహారముకంటే వాక్యాహారము చాలా గొప్పది. మొదటి ఆహారము తిన్నప్పుడు ఆకలి తీరినట్లు వాక్యము చదువగా, తృప్తికలిగి ఆకలి తీరాలి. ఒకపాపి దైవగ్రంథము తీసి చదువగా ఆహారము తినునప్పటికంటె, వాక్యము చదువునప్పటి సంతోషము గొప్పదిగా ఉండును.
అందుకనే కొందరు 12 గంటలైనా భోజనానికి పిలిచినా చదువుచు, వస్తాను అంటారు. గాన ఈ ఆహారము చాలా గొప్పది. దీనిలో గొప్పతనమేమనగా ఈ నాలుగు భోజనములు విషయము ఇందు ఉన్నది గాన గొప్పది. ఇదే లేకపోయిన మొదటి భోజనము తిన్నా దాని విలువ తెలియదు. తక్కిన మూడు భోజన విషయము తెలియదు. మొదటి భోజనమువలన ఇచ్చుచున్న నాలుగు మేళ్ళు ఈ భోజనము వలనకూడా కలుగును.
ఈ రెండవ భోజనము వలన కలుగుచున్న మేళ్లు ఏవనగా,
- 1) పాపపరిపారం
- 2) పాపరోగ పరిహారం
- 3) ఇది చదువగానే ఎక్కడలేని ఉద్రేకము కలుగును.
- 4) ఆయుష్కాలము కలుగును.
వాక్య భోజనము యొద్ద మొదటి భోజనములో లేని పదార్ధములు ఉన్నవి. దేవుని వాక్కువలన పాపహరణ, ఆరోగ్యమార్గం, ఆయుష్కాల మార్గము, సంతుష్టి మార్గము ఉన్నది.
మూడవ భోజనము:- సంస్కార భోజనము: ఇది శరీరానికి ఆత్మకు రెంటికి సంబంధించినదే. మొదటి భోజనము ఎక్కువగా శరీరానికే. సంస్కారము ఎక్కువగా ఆత్మకు. పై రెండు భోజనములలో ఉన్న నాలుగు లక్షణములు ఈ భోజనములోకూడా నున్నవి. అంతేగాక ఈ భోజనమువలన ఆత్మకు కళ కలుగుచున్నది.
మొదటి భోజనములో అన్నము, కూర, నీళ్లు, పాలు, పండ్లు ఉన్నవి.
రెండవ భోజనములో మొదటిదానిలో లేని పదార్థములు ఉన్నవి.
మూడవ భోజనములో ఏకముగా ప్రభుని శరీర రక్తములే యున్నవి.
మొదటి భోజనముకంటే మిగతా రెండు:
- 1) శ్రేష్టమైనవి
- 2) గొప్పవి. ఇవి ఇలాంటివి అని చెప్ప వీలులేదు. ఒకదానికంటే మరొకటి గొప్పగా చేసిన తండ్రి ఎంత గొప్పవాడో.
మొదటి భోజనము సృష్టిలోని భోజనమే రెండవ భోజనము వాక్కులో ఉన్న భోజనమే అయితే మొదటిది, రెండవది కలుగజేసిన ఆయనే మూడవ భోజనమైయున్నాడు. “అది అనుభవించుట మన పని”.
ఏదికూడ అయోగ్యముగా పుచ్చుకొనకూడదుగాని, దేవుడు అయోగ్యులకు మొదటి భోజనము, రెండవ భోజనము, మూడవ భోజనము ఇచ్చుచునే యున్నాడు. ఈ మూడవ భోజనముయొద్దకు అయోగ్యముగా వస్తే రావద్దు అని దేవుడు చెప్పవలసినదిగాని ఆయన అలాగు అనుటలేదు.
జీర్ణమో, అజీర్ణమోగాని మొదటి భోజనముయొద్దకు వచ్చి తినవచ్చును. వచ్చి తినుటకు శక్తి ఉన్నది. అలాగే రెండవ భోజనము యొద్దకును గ్రంథ భోజనము వద్దకును రాగలరు. అలాగే క్రైస్తవులు ఈ సంస్కార భోజనము యొద్దకు కాళ్ళతో నడిచి వస్తారు. అయోగ్యులను “పుచ్చుకొనవద్దు” అని దేవుడు చెప్పడు గాని అయోగ్యముగా రావద్దు అని ముందే వ్రాసినారు గనుక మనము అయోగ్యముగా భోజనము యొద్దకు వెళ్ళకూడదు.
ఆయన నా వద్దకు వచ్చువానిని నేనెంతమాత్రము త్రోసివేయను అన్నారు గాన త్రోసివేయడు గాని ఫలితము తరువాత ఉన్నది. మొదటిది, రెండవది, మూడవది సాధారణ భోజనములే.
నాలుగవ భోజనము:- పరలోకములో "రేపు" అనగా త్వరగా అని అర్ధము, పెండ్లి విందు పరలోకములో జరుగనైయున్నది. మొదటి భోజనమువలెగాదు, రెండవ భోజనమువలెగాదు, మూడవ భోజనమువలెగాదు. వీటిని అయోగ్యముగా తీసికొన్నట్లు ఈ విందు తీసికొనలేము. ఎందుకనగా ఇది పరలోకములో జరుగుచున్న విందు. ఈ విందుయొద్దకు అయోగ్యుడా నీవు రావద్దు అని ప్రభువు చెప్పరుగాని పరలోక ప్రవేశార్దత లేనందున ఈ మనిషి వెళ్ళలేడు. ఎందుకు? మొదటి మూడు భోజనాలు భోజనాలేగాని ఇది “విందు” అని బైబిలులో వ్రాయబడియున్నది. ఈ విందు ఎందులో ఎక్కువ అంటే
- 1) రావద్దు అని చెప్పడు. కాని మనిషిరాలేడు ఎందుకని అది ఎక్కువ.
- 2) యోగ్యులే వెళ్ళాలి.
- 3) ఇంకొక దానిలో మహా ఎక్కువ. పెండ్లివిందువంటి విందు. అందుకని ఎక్కువ.
- 4) దేవుని లక్షణాలేవో అవి స్పష్టముగా చూస్తు ఆనందిస్తూ ఉంటాము.
ఆ లక్షణాలు చూస్తు అనుభవిస్తూ ఉంటాము. ఇక్కడే దేవుని లక్షణములు తెలుసుకొంటాము. అక్కడ ఇంకా తేల్చుకొంటాము. అనుభవిస్తాము.
దేవుని లక్షణములు మొదటి మూడు భోజనములయొద్ద అనుభవిస్తాము కాని ఇక్కడ ఇంకా అనుభవిస్తాము. దాని పేరే విందు. దేవదాసు అయ్యగారు కొద్ది అనుభవించినారు. గాని వర్ణింపలేరు. నాలుగవది గొప్పది. మొదటి మూడూ సరిగా అనుభవించనిదే ఇది దొరుకదు. ఇదెప్పుడు దొరుకుననగా మొదటి మూడు భోజనములలో ఉన్న అయోగ్యత తీసివేసుకున్నవాడే.
ఈ విందు ఎవరిది?
- 1) పరలోకవిందు, పెండ్లికుమార్తె సంఘ విందు
- 2) పెండ్లి కుమారుడని బిరుదుపొందిన యేసుక్రీస్తువిందు.
- 3) తండ్రి సిద్ధపరచిన విందు
- 4) పరిశుద్దాత్మ తండ్రి భూలోకములో ఎవరిని పెండ్లికుమార్తెగా సిద్ధపరచునో వారిదే ఆ విందు
- 5) ముగ్గురు (త్రిత్వము) ఉన్న విందు గాన గొప్ప విందు. ముగ్గురు కన్పించుచుందురు.
- 6) ఆ విందు నీకు కావాలని నా గొప్పగా సిద్ధపడుము. ఆ విందు గొప్పతనము వివరించిన ఆ విందులో కూర్చోవాలని భ్రమ కలుగును.
ఉదా:- ఒక పళ్లెములో పండ్లు, ఒక పళ్ళెములో మిఠాయి, ఒకదానిలో “రూపాయలు” పెట్టిన మొదటి రెండు చూడక మూడవ దానికొరకు చెయ్యిచాపును. అతనికి దొరకదుగాని భ్రమ, అలాగే పరలోక విందు కావాలన్నా వారు తమ "అయోగ్యత" తీసివేసికొనిన ఈ విందు అందును. పరలోకమునకు వెళ్ళేవారు పెండ్లికుమార్తె ఒక్కరే. అలాగే గొప్ప అంతస్థుకు సిద్ధపడిన వారే అందులో ఉందురు. వారే పెండ్లికుమార్తె. 1కొరింతి. 15 అధ్యాయము. ప్రకటనలో, మత్తయి 13 అధ్యాయములో పెండ్లికుమార్తెనుగూర్చి ఉన్నది. అయితే పెండ్లికుమార్తె పరలోకమునకు వెళ్ళి విందులో కూర్చుని పెండ్లికుమార్తె వరుసలో లేని భక్తులను ఈమె పిలుచుకొనును. వారు రక్షణలోని వారే అనేక స్థలాలనుండి పంక్తులు, పంక్తులుగా వచ్చి 7 సం॥లు భోజనము చేయుదురు. తరువాత వారు తమ స్థలములకు వెళతారు. పెండ్లికుమార్తె శాశ్వతకాలముండును. ఈమె ఉండు ప్రదేశము వేరు. మహిమవేరు. రక్షితులు ఆ స్థలములో శాశ్వతకాలముండరు. అర్హతలేదు. కాబట్టి మీ ప్రవర్తన, మీ సిద్ధపాటు, మీయోగ్యతా, మీస్తుతి, మీ ప్రార్థననుబట్టి పెండ్లికుమార్తెగా సిద్ధపడండి.
మీ అయోగ్యతను వెనుక విడిచిపెట్టి ప్రభువిచ్చు శరీర రక్తములు పుచ్చుకొని ఆయనను సంతోషపెట్టి మేలుపొందండి. లోతు భార్యవలె వెనుకకు తిరిగి మీ అయోగ్యతవైపు చూడక బల్లయొద్దకు రండి. ఈ కొద్ది మాటలు మీకు మేలుగా అందునుగాక! ఆమేన్.