(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

13వ పాఠము(ఆత్మ పోషణ)



దా.కీ. 134; లూకా 8:22; రోమా 11:33-36


ప్రార్ధన:- సర్వజన పోషకుడువైన ఓ తండ్రీ! సర్వలోక రక్షకుడువని గ్రహించే కృప నిమ్ము. మా శరీర ఆత్మలను నీవు పోషించే దేవుడవైయున్నావు. నీకు వందనములు. మోక్షలోకములో మహిమాహారముతో పోషించేవాడవైయున్నావు అది సాగించుము. మాలో ప్రతివారిలో చొరబడి వర్తమానము అందించుము. క్రొత్తవారికి ఎప్పుడు వర్తమానము అందనివారికి వర్తమానము అందించుమని క్రీస్తు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము ఆమేన్.


సర్వలోక జనపోషకుడైన దేవుని భోజన పంక్తిలో కూర్చుండు సహకారవిశ్వాసులారా ఈ వర్తమానము అందుకొనుడి.


1) శరీరము ప్రాణము:- దేవుడు ఈ రెంటిని అద్భుతంగా పోషించే పోషకుడైయున్నాడు. గనుక మనము ఆయనను స్తుతింపవలెను. ఆ శరీరములో ప్రాణమేకాదు ఆత్మకూడా ఉన్నది. శరీరము ప్రాణము ఆత్మయై యున్న మనము పోషింపబడవలెను పోషించేవాడు దేవుడే.


మోక్షలోకములోను పోషణ అగత్యమైయున్నది

నరులు పొలములో పనిచేసి సంపాదించి తినే భోజనము ఇది సామాన్య పోషణయైయున్నది. ఇది దేవునియొక్క సెలవునుబట్టి వచ్చుచున్నది. మేఘములు, వర్షము, పైరు, వెన్ను గింజ, పంట, ఇవన్నియు శరీర విషయములు.


ఆత్మపోషణ:- శరీర పోషణార్ధము తప్పక దేవుడు పోషణ ఏర్పరచెను. బైబిలు కథ ప్రకారము ఇశ్రాయేలీయులు తమ స్వదేశమునకు వెళ్ళడానికి అరణ్యము అడ్డువచ్చినది. 40సం॥లు వారక్కడ గడుపవలెను. నదులు, పొలాలేగాని బజార్లు లేవు అప్పుడు వంట అక్కరలేని చల్లని ఆహారము ఆకాశమునుండి కురిపించెను. 40 సం॥లు ఆరు లక్షల మందికి ఇట్టి ఆహారము కురిపించి వారిని పోషించెను. మనలను సహా దేవుడు పోషించును అనే నమ్మకమునకు ఈ సంఘటను దేవుడు వ్రాయించెను.


ఏలియా కథలో వర్షము లేక, మంచులేక కరువు వచ్చినది. పంట పండలేదు. రాజునకు, కూలికి ఈ కరువు వచ్చినది. భక్తులు భక్తిహీనులు ఆకలికి చావవలసినదే. దేవుడు భక్తులనుకూడ చావనిచ్చునా? ఏలియాతో దేవుడు నీవు అరణ్యమునకు వెళ్ళు. అక్కడ నివసించు కాకులు నీకు ఆహారము తెచ్చిపెట్టునని చెప్పెను. మనమైతే దొంగిలించే కాకులు ఆహారము పెట్టునా అని అనుకొందుము. గాని ఏలియా అట్లు అనుకొనక రొట్టె ముక్కలు తిని ఏటి నీరు త్రాగెను ఏలియాతో దేవుడు అరణ్యము విడచి పట్టణములోకి వెళ్ళుము. బస, భోజనపు ఏర్పాట్లు విధవరాలి వద్ద ఏర్పరచితిని అని అనెను. ఒక్కనీటి చుక్కలేకుండా ఏరు ఎండిపోవును అని దేవుడు సెలవిచ్చెను. ఏలియాకు దేవుడు చూపించిన ఆ విధవరాలు ఒకప్పుడు భాగ్యవంతురాలే గాని కరువువల్ల బీదరాలుగా మారిపోయెను. పుల్లలు ఏరుకొనుచున్నది. ఏలియా ఆమెను రొట్టెలు తెమ్మని కోరగా కొంచెమెయున్నది అని ఆ విధవరాలు పలికెను. అప్పుడు ఏలియా కరువుపోయెవరకు నూనె, పిండి అయిపోదు అనెను. అలాగే జరిగెను. కరువు దినములు అయిపోయెవరకు వారు తిన్నారు. అలాగే భక్తులకు కరువు ఉండరాదు. దేవునిని నమ్ముకొన్నవారికి ఆహార, కరువు ఉండకూడదు.


ఈ ఏలియా అరణ్యప్రయాణములో అలసి చెట్టు క్రింద పరుండి నా ప్రాణము తీసికో ప్రభువా అని అనగా దేవుడు నీవు చాలా దూరము వెళ్ళవలెను లేచి భోజనము చేయుమనెను. బుడ్డితో నీళ్ళను పెనముపై రొట్టెయుండగా తిని బలము పొంది ఏలియా 40 దినములు ప్రయాణము చేసెను.


ప్రవక్త అయిన ఎలీషాను దర్శించుటకు 100మంది వచ్చిరి. ఎలీషా యొద్ద 40 మంది యుండిరి. వీరందరికొరకు ఒకరు 20 రొట్టెలు తెచ్చిరి. మీరు లేచి రొట్టెలు పంచుడని శిష్యులకు సెలవిచ్చెను. 20 రొట్టెలు వందమందికి పంచగా ఇంకా మిగిలెను. ఈరీతిగా ఆ రొట్టెలు అద్భుత ఆహారమైనది.


యేనువ్రభువు ఈలోకములో ఉన్నప్పుడు సముద్రతీరమున బోధించుచుండెను. చక్కని వాక్యమును ప్రభువు బోధించుచున్నందున వినుచున్న ప్రజలు ఆకలిగా ఉన్నను ఇంటికి వెళ్ళకుండా ఉండిపోయిరి. వారు ఆకలితో ఉండిరి. వారినిచూచి ప్రభువు 5 రొట్టెలు, 2 చేపలు పంచగా 12 గంపలు మిగిలెను. 20 రొట్టెలు వద్దయున్న దేవుడు ఇక్కడ మనిషిగాను, అక్కడ దేవుడుగాను ఉండెను. ఆయన ఈయన 5వేల మంది తినిరి. 12 గంపలు మిగిలెను. ఇది శరీరమునకు ప్రాణమునకు పోషణ. ఇది అద్భుత ఆహారము.


2. ఆత్మ ఆహారము:- పైన ఉదహరింపబడిన ఈ ఆహారము గింజల ఆహారము. అది ఈ లోకములో ఉన్నప్పుడు అవసరమైయున్నది. ఒక దినమందు ప్రభువు 40 దినముల ఉపవాసప్రార్ధనలో అరణ్యములో ఉన్నారు. అక్కడ నీళ్ళు, ఆహారములేదు. అరణ్యములో ఆకలిగా ఉన్న ప్రభువును సందుచెసికొని కవీస్వరుడు వచ్చెను. అయ్యా! ఈ శిలలతో మీరు రొట్టెలైపొండి అంటే అవి అగును గదా మీరు తినవచ్చునని అనెను. అందుకు ప్రభువు నరుడు రొట్టెవల్లకాదు దేవుని నోటి మాటవల్ల జీవించునని చెప్పెను. ఈ వాక్యము ద్వితీయోపదేశకాండములోనిది. ఒక దొరసానమ్మగారు 6 దినములు ఆహారము మానివేసి వాక్యమునే చదివి జీవించెను. దేవుని వాక్యము లేకుండా సృష్టి కలుగలేదు. ఒక బోధకుడు జబ్బుగా ఉన్న ఒక ఆమెయొద్దకు వెళ్ళి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పెను. అట్టి మాటవిన్న ఆమె ఆత్మకు ఆదరణ కలిగెను. దేవుని వాక్యము అనుదినము చదివిన ఆత్మకు ఆహారము దొరుకును.


3) యేసుప్రభువు ఈలోకములో తన శిష్యులకు బల్ల ఏర్పరచెను. ఆ బల్లపై రెండు పాత్రలు ఉండెను. ఒక పాత్రలో రొట్టెలు ఉండెను. ఆ పాత్రలోని రొట్టె తీసి తన శిష్యుల చేతికిచ్చి ఇది నా శరీరము తినుడని చెప్పెను. రెండవ పాత్రలో ద్రాక్షరసము ఉండెను. ఆ రసమును తీసికొని ఇది నా రక్తము తీసికొని త్రాగుడి అని చెప్పెను. రొట్టెనుబట్టి, ద్రాక్షారసమునుబట్టి యేసుయొక్క శరీరము, రక్తముకూడ మనకు లభించుచున్నది. ఆయన బ్రతికియుండగా ఆయన శరీరమును, రక్తమును ఎట్లు భుజించగలము ఇది మనకు అర్ధముకాదు. అది మహిమ శరీరము, తల్లిదండ్రుల శరీరము బిడ్డలకు వచ్చునట్లు యేసుప్రభువు పాపములేని శరీరము మనకుకూడా వచ్చెను.


ఉదా:- ఈ అమ్మాయి తల్లివలెను, ఈ అబ్బాయి తండ్రివలె ఉన్నారు అని మనము అందుము. యేసుప్రభువు రూపము మనకుకూడా వచ్చునట్లు మనము సిద్ధపడవలెను.