(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

8వ పాఠము(శరీరము రక్తము)



ప్రభువుయొక్క శరీరము
|
రొట్టె
|
మన శరీరము
|
మన ఆత్మీయ జీవనము
ప్రభువుయొక్క రక్తము
|
ద్రాక్షారసము
|
మన ఆత్మ
|
మన శరీర జీవనము

రాత్రి భోజనము విశ్వాసులకే ప్రభువు ఏర్పరచినారు. విశ్వాసులు పైవి చూడవలెను. క్రీస్తు ప్రభువు రెండు మాటలు చెప్పెను.

రొట్టె పట్టుకొని ఇది రొట్టె అనలేదు, ద్రాక్షారసము పట్టుకొని ఇది ద్రాక్షారసము అనలేదు అది రొట్టె, ద్రాక్షారసమని వారికి తెలియును. గనుక అట్లు చెప్పక ఇది నా శరీరము నా రక్తము అని చెప్పెను. వారు వెంటనే ఇది రొట్టెకదా ఎందుకు శరీరము అనుచున్నావు? ఇది ద్రాక్షారసముకదా ఎందుకు రక్తమనుచున్నావు అని అడుగవలసినది. అట్లు అడుగుటకు ప్రభువు వారికి సందివ్వలేదు. వారు నమ్మి మాట్లాడకపోవుచున్నారు. ప్రభువు చెప్పినది వినుట నమ్ముటయే వారు చేసిరి. వారికి ప్రభువునందు ఎక్కువ గౌరవము, విశ్వాసము గనుక వారట్లు అడుగలేదు. ఇప్పుడు మనకు రొట్టె అని తెలుసు గనుక నమ్మనక్కరలేదు. గాని శరీరమని తెలియదు గనుక అది నమ్మవలెను. అలాగే ద్రాక్షారసమని తెలుసు గనుక నమ్మనవసరము లేదు. గాని ఇది రక్తమని తెలియదు గనుక అది నమ్మవలెను. ఈ రెండు సబబుగా లేవుగాని ప్రభువు చెప్పినాడు. గనుక నమ్మవలెను.


ఉదా:- గ్లాసులో నీరుపోసి అడిగినవారికి ఇస్తాము. ఆయన పుచ్చుకొన్నాడు ఆయన గ్లాసు తీసికొన్నాడా, మంచి నీరు తీసికొన్నాడా? ఇచ్చిన ఆయన గ్లాసు నిచ్చినాడా, నీళ్ళు ఇచ్చినాడా? అడిగిన ఆయన నీళ్ళు అడిగినాడు గాని గ్లాసు అడగలేదు. గాని రెండు ఇవ్వడము నిజమే. అలాగే రొట్టె ఇచ్చుట నిజమే. దాని మూలముగా శరీరము ఇచ్చుట కూడ నిజమే. ద్రాక్షరసము ఇచ్చుట నిజమే. దాని మూలముగా ప్రభువు రక్తమిచ్చుటకూడ నిజమే. గ్లాసు, మంచినీళ్ళు రెండు ఆయన తీసికొనెనుగదా! అలాగే ప్రభువు రొట్టె, ద్రాక్షరసములతో, తన శరీర రక్తములనుకూడ ఇచ్చెను. ఇప్పుడు కూడ ఇచ్చుచున్నాడు. విశ్వాసులు మాత్రము తీసికొందురు. వారు తీసికొనునప్పుడు విశ్వాసమునుబట్టి ఆయన శరీర రక్తములను అందుకొనుచున్నారు. రొట్టె ద్రాక్షరసము అందుకొనుట ఎంత నిశ్చయమో ప్రభువుయొక్క శరీర రక్తములు అందుకొనుట కూడ అంత నిశ్చయము. పాదిరిగారు వాటిని బల్లమీద పెట్టి ప్రతిషించిన తర్వాత అవి వట్టి రొట్టె, వట్టి ద్రాక్షరసముకాదు. అప్పుడు పుచ్చుకొనువారు వట్టి ద్రాక్షరసము, వట్టి రొట్టె తీసికొనక వాటితోబాటు శరీర రక్తములు అందుకొందురు. ప్రతిష్ట లేక ముందు పిల్లలు ఆ రొట్టె తినిన ఆ ద్రాక్షరసము త్రాగిన అది వట్టి రొట్టె. అది వట్టి ద్రాక్షరసము మాత్రమే. ఆరాధన అయిపోయిన తర్వాత మిగిలిన రొట్టె మిగిలిన ద్రాక్షరసము పిల్లలు త్రాగిన అది వట్టి రొట్టె వట్టి ద్రాక్షరసమే గాని సంస్కారమున తీసికొన్నప్పుడు వాటితోబాటు విశ్వాసి ప్రభువు శరీర రక్తములను అందుకొనును.


అవిశ్వాసి వచ్చి అందరు తీసికొనుచున్నారు. నేను తీసికొందును నామార్ధముగా ఆచారమునుబట్టి రెండు తీసికొనును. అప్పుడు క్రీస్తు ప్రభువుయొక్క శరీరము రక్తము అతనికి అందునా? రొట్టె ద్రాక్షారసము అందునుగాని, ప్రభువు శరీర రక్తములు అందవు (1కొరి 11:29) శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని గలదు. విశ్వాసి ఉపయోగము కొరకును మేలుకొరకును తీసికొనుచున్నాడు. అవిశ్వాసి శిక్షకొరకు తీసికొనుచున్నాడు. విశ్వాసి అవి వట్టి రొట్టె, వట్టి ద్రాక్షారసము కాదు. అవి బజారులోనుండును. అయితే ఈ బల్లమీదనున్నవి క్రీస్తు శరీరము, రక్తము అని విశ్వసించి తీసికొనును. అవిశ్వాసికి ఇవన్నియు ఉండవు. ఆచార ప్రకారముచేసి క్రీస్తు శరీర రక్తములవలన కీడు కలిగించుకొని అపరాధి ఆయెను. గనుక శిక్షార్హుడైనాడు. రొట్టె తీసికొనునప్పుడు ప్రభువు శరీరమే. ద్రాక్షారసము తీసికొనునప్పుడు ప్రభువు రక్తమే అని అనుకొనుచు బల్లయొద్దకు రండి. అది మాకేలాగు తెలియును అని అడుగవచ్చును. అది క్రీస్తు ప్రభువే చెప్పెను. ఆయన చెప్పినదే నిజము. మనకు తెలియనక్కరలేదు. ప్రభువు చెప్పినది అర్ధమైన కాకపోయిన నమ్ముటయే విశ్వాసియొక్క పని.


యేసుప్రభువుయొక్క శరీర రక్తములు తీసికొనిన తర్వాత మన శరీర జీవితము, ఆత్మీయ జీవితము మేలు పొందవలెను. సువార్తలలో పాపక్షమాపణ నిమిత్తము చిందింపబడుచున్న రక్తము అని మత్తయి 26:28లో గలదు. మన శరీరము మట్టియగును. ఆత్మ జీవించియుండును గనుక పాపము అంటుకొని యుండును. గనుక రక్తమువలన పాపపరిహారము కలుగును. అయితే క్రీస్తు శరీరము తీసికొనుటవల్ల ఉపయోగమేమి? మనిషియొక్క శరీరము ఆత్మ కలిసి ఉన్నది. రక్తము ఆత్మ జీవనములోని పాపపరిహారము కొరకు, ఆయన శరీరము మన శరీర జీవనము యొక్క వృద్ధికొరకు. ఆయన రక్తము మన ఆత్మజీవనవృద్ధి, శుద్ధికొరకు, ఆయన శరీరము మన శరీర జీవన వృద్ధికొరకు, శరీరమునకు వ్యాధి ఉన్నది గనుక వ్యాధి పరిహారము అవసరము. 1పేతురు 2:24లో ఆయనపొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి అని గలదు. గనుక క్రీస్తు శరీరము తీసికొనుట మన శరీర స్వస్థత కొరకు.


ఉదా:- ఒకరు సంస్కారము తీసికొని నా జబ్బు పోయెనని సాక్ష్యము చెప్పెను. గనుక సంస్కార భోజనము మన శరీర ఆత్మలకు ఉపయోగము. శరీరమునకు రోగపరిహారము. ఆత్మకు పాప పరిహారము కలుగును. అవిశ్వాసికి జబ్బు, పాపము ఎక్కువగును. ఈ రెంటిలో చనిపోయి నాశనమునకు వెళ్ళును. లూథరన్ ఆరాధన పుస్తకములో విశ్వాసమునందు బలపరచి అని వ్రాయబడి యున్నది. సంస్కార సమయమున పాపపరిహారము తర్వాత శరీరాత్మలకు బలము కలుగును.

క్రీస్తుప్రభువు చేసిన ఏర్పాటును తృణీకరింపక, ఆచారమునుబట్టి పుచ్చుకొని విశ్వాసమునుబట్టి మేలు పొందవలెను. అపరాధులగుకును, శిక్ష పొందుటకును పుచ్చుకొనరాదు. యెషయా 53:4లో ఆయన మన పాపములను, రోగములను భరించెనని గలదు. పాప పరిహారము, రోగ పరిహారము రెండును గలవు. క్రీస్తు సిలువమీద చిందించిన రక్తము మన ఆత్మ జీవనముయొక్క మేలుకొరకు సిలువమీద శరీరము అర్పించుట మన శరీరమునకు స్వస్థత నిచ్చుటకు ప్రభువు 33 1/2 సం॥లలో శరీర రక్షణకు ఆత్మ రక్షణకు కావలసిన కార్యములన్ని చేసెను. కొందరు శరీరము అముఖ్యము అనుచున్నారు, శరీరముకూడ అవసరమే.


ఎంతకాలము సంఘము ఈ సంస్కారము ఆచరింపవలెను? ప్రభువు వచ్చువరకు. తర్వాత ఉండదు గనుక సంస్కారము ఉండదు. సంఘము పరలోకములో విందులోనుండును. వెయ్యేండ్లలో సంస్కార భోజనపు ఏర్పాటు ఉండదుగాని ప్రభువు రక్తమువలన వారికి శుద్ధి కలుగును. వాక్యములో ప్రభువు వచ్చు పర్యంతము అని గలదు. గనుక పైన 6ను ప్రభువుయొక్క రాకడనుకూడ జ్ఞాపకము చేసికొనవలెను. మరియు ప్రభువుయొక్క మరణమును రోగ నివారణను పాపక్షమాపణనుకూడ జ్ఞాపకముంచుకొనవలెను. ఈ కొన్ని మాటలు మిమ్మును సంస్కారమునకు సిద్ధపరచునుగాక! విశ్వాసులకు బలమును ఆదరణమును కలిగించునుగాక!