(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
26వ పాఠము(పరిమళ విందు)
రాజు విందుకు కూర్చుండియుండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. ప॥గీ॥ 1:12.
ఈ వచనమునందు పెండ్లి సంఘము రాజైన క్రీస్తుప్రభువు తన కొరకు విందు చేయించెననియు, విందులో ప్రభువుయొక్క పరిమళ తైలపు సువాసన వ్యాపించెనని పలుకుచున్నది.
-
1) రాజు:- అసలు అదృశ్యదేవుడు కొల. 1:15. అయితే శరీరధారిగా వచ్చినందున ఈయనకు అనేక బిరుదులు కలిగినవి.
- (ఎ) పాతనిబంధన కాలమందు ఇశ్రాయేలీయులు నిరీక్షించిన నామము మెస్సియా. అనగా అభిషిక్తుడైన క్రీస్తు యోహాను 1:14.
- (బి) మనుష్య కుమారుడు:- ప్రభువు సిలువ మరణము నొందుటకు శరీరధారిగా వచ్చినందున ఈయన మనుష్య కుమారుడు యోహాను 5:27.
- (సి) దేవుని కుమారుడు. సర్వజనుల దోషము ఆయనమీద వేసికొని చనిపోయి లేచినందున ఈయన దేవుని కుమారుడు మత్తయి 14:33.
- (డి) పెండ్లికుమారుడు. ఈయన రెండవమారు మేఘముమీద మధ్యాకాశములోనికి వచ్చి వధువు సంఘమును ఆకర్షించి నూతన యెరూషలేమునకు తీసికొనివెళ్ళి 7 సం॥లు పెండ్లి విందు చేయనైయున్నారు. గనుకనే పెండ్లికుమారుడు లూకా 5:85; మత్తయి 9:15.
- (ఇ) రాజు వధువు సంఘముతో భూమిమీదికి వచ్చి ఆయన సిలువవేయబడిన యెరూషలేమునందు వెయ్యి ఏండ్లు రాజ్యపాలన చేయనైయున్నారు గనుక రాజు - 1తిమోతి 6:15; ప్రకటన 19:16.
-
2) విందు:- అనగా ఇతరులకొరకు చేయునది. ప్రత్యేకమైన కార్యార్థమై చేయునది. ప్రతిదినము భోజన సమయమందు సిద్ధపరచబడు
పదార్ధములకంటె
ఎక్కువ పదార్ధములు, విలువైనవి చేయబడును. ఇందు భుజించు ఆహారము, త్రాగు పానమును ఉండును. విందుకు పిలువబడినవారు తామంతట తామే
అలంకరించుకొని సిద్ధపడి వచ్చెదరు. విందులు
- (1) సర్వసృష్టికొరకైన విందు. దేవుడు సర్వజీవుల కొరకు సృష్టాదినుండి అంతము వరకు ఇచ్చుచున్న విందు.
- (2) ఏర్పాటు జనమైన ఇశ్రాయేలీయులకు 40 సం॥లు పైనుండి దేవుడు ఇచ్చిన ఆహారము మన్నా. 30 లక్షల ప్రజలకు బండలోనుండి నీళ్ళనిచ్చెను.
- (3) క్రీస్తుప్రభువు అరణ్యములో 5 వేలమందికి కావించిన అద్భుత ఆహారము.
- (4) జీతనాతములు, నిలువ సొమ్ము, నిరుకు రాబడి లేకపోయినను, క్రీస్తుప్రభువునందు విశ్వాసముద్వారా జీవించువారి జీవితము ఒక విందు. పైన చెప్పబడినవన్నియు భూలోకపు విందులు.
- (5) వాక్యవిందు : ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారలారా! క్రీస్తు ప్రభువు నొద్దకు రండి. ఆయన మీ పాపములను క్షమించి, మిమ్ములను రక్షించి, మోక్షమునకు కొనిపోవును అని వినబడుచున్న వాక్యవిందు.
- (6) ప్రతి ఆదివారము ఆలయములో జరుగు ఆరాధన విందు.
- (7) ప్రభు భోజన సంస్కారపు విందు. క్రీస్తు ప్రభువుయొక్క శరీరము రక్తము విశ్వాసి అందుకొని క్రీస్తునందు విశ్వాసి, విశ్వాసియందు క్రీస్తు నివసించు విందు.
- (8) భూమిమీద నివసించుచు మోక్ష సంబంధమైన అనుభవమును ప్రతి దినము కలిగివుండే సన్నిధి విందు. ఇవి భూలోకములో నున్న క్రైస్తవ సంఘములోని విందులు.
- (9) పెండ్లివిందు: వరుడైన క్రీస్తుప్రభువు మేఘాసీనుడై మధ్యాకాశమునకు వచ్చి భూమిపైనున్న వధువు సంఘమును ఆకర్షించుకొని పైనున్న నూతన యెరూషలేమునకు తీసికొనివెళ్ళి వధువు చెంతనే ఉండి 7 సంవత్సరములు చేయు విందు. వధువు సంఘము భూమిపై క్రీస్తుప్రభువునకు చేసిన సేవకు, పడిన శ్రమకు తగిన బహుమానము పొందును. వధువు సంఘము చేసిన ప్రతి చిన్న కార్యమునకు బహుమానము కలుగును.
- (10) పరమందు తండ్రియందు కుమారుడును, కుమారునియందు తండ్రియు. క్రీస్తునందు సంఘమును, సంఘమందు క్రీస్తుప్రభువును ఏకమై ఉందురు యోహాను 14:20. ఇదే విందు తండ్రిని, కుమారుని, కుమారుని సంఘమును ఏకము చేయునది పరిశుద్దాత్ముడే.
- (11) త్రిత్వదేవునియందుగల పావన లక్షణములను వధువు సంఘము యుగయుగములు అనుభవించుచు, మహిమనుండి అధిక మహిమకు వెళ్లుచుండును 2కొరింథి. 3:18. ఇది నిత్య విందు.
- (12) వెయ్యేండ్ల పాలనలోని విందు.
- 3) కూర్చుండియుండగా:- ప్రభువు అంతరంగ సంఘములోను, బహిరంగ సంఘములోను ఉండి సంఘముచేయు కార్యములు సరిగా ఉన్నవో లేవో చూచుటకు కూర్చొని ఉన్నారు. వడ్డించునని సరిగా నున్నవో లేవో చూచుటకున్ను, వడ్డించువారు సరిగా వడ్డించుచున్నారో లేదో చూచుటకు కూర్చుండెను. ఆయన ప్రతి సంఘమును దర్శించును. మనము గ్రహించని రీతిగా బోధకులను ఏర్పాటుచేయుట, సంఘస్తాపన చేయుట, సంఘాచారములు జరిగించుట, బోధకులు సంఘస్తులను దర్శించుట మొదలగునవన్నియు ఆయన చేయించుచున్నారు. గనుక ఇదికూడ కూర్చుండుటలో చేరినది. వాటిని మానక, వీటిని చేయవలసియుండెను - మత్తయి. 28:23. అనగా పై ఆచారములను జరిగించుచు అంతరంగ స్థితికొరకు చేయవలసినవి చేయవలెనని ప్రభువు చెప్పెను గాన బహిరంగ అంతరంగ ఆచారములను సరిచేయుటకై ప్రభువు కూర్చునియున్నాడు. ప్రభువు భూలోకములో ఉన్నపుడు 5వేల మందికి అద్భుతాహారముగా గావించినప్పుడు ప్రభువు వడ్డించలేదు గాని శిష్యులు వడ్డించుచుండగా ప్రభువు కూర్చుండియుండెనని తెలియుచున్నది మత్తయి 14:19. క్రీస్తుప్రభువు యెరూషలేము దేవాలయములో వేదాంతుల మధ్య కూర్చుండి బోధించెను లూకా. 2:46. క్రీస్తు ప్రభువు పరమందు పెండ్లివిందులో వధువు సంఘము చెంత కూర్చొని ఉండెను. వధువు పొందు బహుమానములను చూచుచుండును. నేడును దైవ నన్నిధి కూటములయందు కూర్చుండి బోధించుచున్నారు.
- 4) నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను:- ఈ గీతమునందు దుఃఖమునుగూర్చి లేదుగాని పెండ్లికుమార్తె ప్రభువుయొక్క సహవాసమును కోరి ఆయనతో నడచి రాజనగురులోనికి, ఉద్యానవనములోనికి వెళ్ళుట ఉన్నది. ప్రభువు సంఘమునకు అలంకారములు, పరిమళ తైలములు, వస్త్రములు అనుగ్రహించినందున తన్నుగూర్చి తానే నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెనని పలుకుచున్నది. ఓ ప్రభువా! నేను శుద్ధియై ఉన్నాను నాలో ఏ పాపములేదు. నేను నీతి వస్త్రములు ధరించుకొనుచున్నాము. నేను నీ నివాస గృహములో ఉన్నాను. నీ సన్నిధిలోనే ఉన్నాను. గనుక పరిమళ తైలపు సువాసన చూడుము అని పెండ్లికుమార్తె భూమిమీద ఉండగనే పలుకుట నేర్చుకొనవలెను. అయితే మహాపరిశుద్ధత ఉంటేనేగాని ఈ మాట పలుకకూడదు యోబు. 13:5.
-
5) పరిమళ తైలములు:-
- (1) ప్రేమ - ఒక స్త్రీ ప్రభువు పాదములను కన్నీటితో కడిగి, తలవెంట్రుకలతో తుడిచి ముద్దుపెట్టుకొని అత్తరు పూసెను. ప్రభువును ఆ స్త్రీ విస్తారముగా ప్రేమించినందున ఆమె విస్తార పాపములు క్షమంపబడినవి లూకా. 7:38-47. ప్రభువుకు పూసిన అత్తరు సువాసన అందరికి వ్యాపించినది. పాపపరిహారము నొందిన స్త్రీ ప్రభువును ప్రేమించిన ప్రేమయొక్క సువాసన ప్రభువునకు వ్యాపించినది
- (2) కృతజ్ఞత - ఓడలో నుండి నోవహు దిగిన తరువాత దేవునికి దహలబలి నర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించెను ఆది. 8:20,21. జలప్రళయము నుండి తప్పించిన దేవనికి నోవహు కనబరచిన కృతజ్ఞత దేవుడు సువాసనగా నంగీకరించెను.
- (3) సువార్త - సువార్తను ప్రకటించు అపోస్తలులు దేవునికి క్రీస్తు సువాసనయైయున్నారు 2కొరింథి. 2:14-6.
- (4) సజీవయాగము : రోమా. 12:1. బ్రతికియుండి క్రీస్తుపభువుయొక్క ఇష్టప్రకారము జీవించుట. ఇదియును పరిమళ సువాసనే
- (5) విశ్వాసయాగము : ఫిలిప్పీ 2:17. షద్రక్కు మెషక్కు అబెద్నెగోలు అగ్నిగుండమునకు భయపడక దేవునియందే విశ్వాసముంచిరి. దేవుడు మమ్మును తప్పించి రక్షించుటకు సమర్దుడు ఇది విశ్వాసము. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా! నీ దేవతలను మేము పూజింపమనియు, నమస్కరింపమనియు తెలిసికొనుమని పలికిన పలుకు విశ్వాసమునకు పైన ఉన్న ఉన్నత విశ్వాసపు పలుకు - దాని. 3:18. వీరు శ్రమలో చూపిన విశ్వాసము కనబడని దేవుని వారు చూచుటకు మాత్రమే కాక చూడలేని ఇతరులకును చూపించిరి. ఈ విశ్వాసము దేవునికి సువాసనయైయున్నది.
- (6) స్తుతియాగము : హెబ్రీ. 13:5. వీరు స్తుతినే బలివలె నర్పించిరి. స్తుతినుండి బయలు వెడలిన స్తోత్ర పరిమళ సువాసన దేవుని వద్దకు చెరినది. బిడ్డలందరు ఒక్కమారే చనిపోయిన వార్త విని యోబు నేలమీద సాష్టాంగపడి, నమస్కారము చేసి, యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొనిపోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక! అనెను యోబు. 1:20,21. యోబు చేసిన స్తుతి ఆనంద పరిమళముగా పరమునకు వ్యాపించెను. అందువల్ల అపవాదికి అవమానము కలిగెను. యోబుయొక్క ఉన్నత స్థితి బయటపడెను.
- (7) పరిశుద్ధత - 1పేతురు 2:5; కీర్తన 4:5. క్రీస్తుప్రభువు విశ్వాసికి అనుగ్రహించిన పరిశుద్ధత ఉన్నతమైనది. విశ్వాసియొక్క పరిశుద్ధతయే ప్రభువును ఆకర్షించునది. పరిశద్ధతయె గొప్ప పరిమళము.
- (8) కానుక ఫిలిప్పీ 4:18. మనోహర సువాసనయు దేవునికి ప్రీతికరమును, ఇష్టకరమైన యాగమునైయున్నది. అన్నియు దేవుడే మనకు ఇచ్చుచున్నాడు. ఇక్కడ దేవునికే మనము కానుకనిచ్చుట మనోహర సువాసనయై ఉన్నది. ప్రభువు చేసిన ఉపకారము వలన పైన చెప్పబడిన పరిమళములన్నియు కలిగియున్నదని పలుకుచున్నది. ఆ పరిమళముల సువాసన వ్యాపించుచున్నదనియు వధువు పెండ్లివిందులో చెప్పుకొనుచున్నది.
చదువరులారా! రారాజైన క్రీస్తుప్రభువు చేసిన విందులో చేరుదురుగాక! చేరిన మీరు ప్రభువు వలన సంపాదించిన అనుభవ తైలపు సువాసన విందులో వ్యాపించెనని వధువు పలికెను. ఈ వచనమునందు ప్రియుడైన క్రీస్తుప్రభువు ప్రియురాలైన వధువు సంఘముయొక్క రొమ్మున నుండు గోపరసమంత సువాసనగలవాడని పలుకుచున్నది ప॥గీ॥ 1:13.
- 1) నా ప్రియుడు:- సంఘము ప్రభువు నా ప్రియుడని అనేక మారులు సంబోధించుచున్నది. మిగతా విశ్వాసులు ప్రభువును ప్రియుడని పలికిన పలుకునకును, ఈ వధువు సంఘము పలికిన పలుకునకును, చాల వ్యత్యాసమున్నది. నా ప్రియుడు అని ఒకమారు పలికిన పలుకునకును, మరొకమారు పలికిన పలుకునకును వ్యత్యాసమున్నది. క్రీస్తుప్రభువును వెంబడించిన అపోస్తలుల ప్రారంభ స్థితికిని చివరిస్థితికిని అనేకరెట్లు తేడా ఉన్నది. వధువు స్థితి సంపూర్ణమైన స్థితి గనుక నా ప్రియుడని అనుటలో గొప్ప విలువ. గొప్ప స్థితి కనబడుచున్నది. ప్రభువు నన్ను వెంబడించుమని ఆయన శిష్యులతో చెప్పినపుడు వారు తమ దోనెలను, వలను విడిచి ప్రభువును వెంబడించిరి. వారికి కలిగి ఉన్న సమస్తముకంటె ప్రభువు పలుకు ప్రీతికరముగా ఉన్నవని తెలియుచున్నది. ఇప్పుడు ప్రభువు వారికి ప్రియుడే, వారు ప్రభువును వెంబడించిన తరువాత ఆయన చేసిన క్రియలనుబట్టి ఆయన వారికి ఇంకా ప్రియుడై ఉన్నాడు. ప్రభువుతో వారికి కలిగిన సహవాసమునుబట్టి రూపాంతర సమయమందు ప్రభువుయొక్క నిజరూపమును చూచిరి. ఇట్టి అనుభవ స్థితినిబట్టి ప్రభువు వారికి మరీ ప్రియుడై ఉన్నాడు. ఆయన సిలువ, మరణ, పునరుత్తాన, ఆరోహణ సమయమందు కనబరచిన ఆయన దైవత్వమును చూచి మహానందము పొందినవారైనందున ఆయన వారికి మరింత ప్రియుడైయున్నాడు. ఆయన పావన నామము ఎంత ఉన్నతమైనదో వారి అనుభవములోను, బోధలోను, శ్రమలోను కనుగొనగలము. గనుక ఆయన నామము వారికి ఎంత ప్రీతికరమైనదో తెలియుచున్నది. వారికి అనేక శ్రమలు కలిగినను ప్రభువును తమ హృదయములో ప్రతిస్ఠించుకొని హతసాక్షులైరి. ఆయన కొరకు వారు హతసాక్షులగుటనుబట్టి ఆయన వారికి ఎట్టి ప్రియుడై ఉన్నాడో తెలియుచున్నది. ఈ రీతిని వధువు సంఘము ప్రభువుయొక్క సహవాసములో పెరుగుకొలది నా ప్రియుడని పలుకుటలో ఉన్నతస్థితి కనబడుచున్నది. ఇక్కడ నా ప్రియుడు నా రొమ్ముననుండు గోపరసమంత సువాసనగలవాడని పలుకుచున్న పలుకు ఉన్నతమైనది.
-
2) నా రొమ్ముననుండు, ప్రభువు వధువు సంఘము యొక్క అంతరంగములో ఉన్నట్లు తెలియుచున్నది 1పేతు. 3:16.
- (ఎ) తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడైన క్రీస్తుప్రభువు (యోహాను 1:18). మరియు గర్భమందు ప్రవేశించి దేవత్వముగల దేవుని కుమారుడు మానవత్వముగల మనిషి కుమారుడయ్యెను. దేవమానవుడుగా లోకమందు సంచరించి దైవత్వమును, మానవత్వమును కనబరచి మనుష్యుడుగా మనుష్యులమధ్య జీవించుచు, దేవునిలో ఏకమై దైవత్వమును లోకమునకు బయలుపరచెను (యోహాను 12:44, 45). మహిమగల కార్యములెన్నో చేసి మనిషిగా ఉండి మనుష్యుల కొరకు మరణమునొంది, జీవముగల దేవునిగా మరణమునుండి లేచి జీవించి, నిత్యమరణ పాత్రులను నిత్యజీవ పాత్రులనుగా చేసెను. అనగా మనుష్య కుమారులను దేవకుమారులుగా చేసెను. ఇట్లు చేయుటకే మానవ హృదయాంతరంగ వాసి ఆయెను.
- (బి) దేవుడు సృష్టిలో నరుని ఉంచి, నరునిలో దేవుడు ఉండుటచే నరుని చేసెను. గాని నరుడు దేవుని ఆజ్ఞను మీరి దేవునిని తనలో లేకుండా చేసికొనెను. అందుకే నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్లున్నవిగాని మనుష్య కుమారుడు తల వాల్చుటకైనను స్థలములేదని ప్రభువు పలికెను. అనగా సాతానుయొక్క కార్యములకును, లోకపు కుయుక్తులకును, మానవుని అంతరంగములో స్థలమున్నది. గాని దేవుని నివాసమునకు స్థలములేదు. ప్రభువు మానవునిలో ప్రవేశించి శుద్ధిచేసి, అందు నివసించుటకే మానవ హృదయ కవాటమును తట్టుచున్నాడు (ప॥గీ॥ 5:22; ప్రక. 3:20). మనిషి తీసినయెడల అందు ప్రవేశించును. అందుకే ప్రభువు నా కుమారుడా! నీ హృదయము నాకిమ్ము అని పలుకుచున్నాడు సామె. 23:26. ప్రభువు మనిషి గనుక మానవుల మధ్య నివసింపగలడు. దేవుడు గనుక మనిషియొక్క హృదయ నివాసి కాగలడు. ఆయన పునరుత్తానుడైన తరువాత ఆయన శిష్యులు తలుపులు వేసికొని గదిలో ఉన్నపుడు ఆయన వారి మధ్యకు రాగలిగెను. తలుపులు వేసినను వారి మధ్యకు రాగలిగిన దేవుడు గనుకనే మానవునియొక్క హృదయములోనికి రాగలడు. దేవుని రొమ్మున నున్న క్రీస్తుప్రభువు సంఘముయొక్క రొమ్మున నుండుటకే మరియ రొమ్మున నుండెను.
- (సి) మానవుడు దైవవాక్యమున క్రీస్తుప్రభువు మానవ పాపపరిహారకుడని విశ్వాసము కలిగి ఉన్నాడు. ప్రభువును ఆశ్రయించి మానవుని అంతరంగములో పాపములన్నీ ఒప్పుకొని, ఆయన రక్తము ద్వారా శుద్ధినొంది (1యోహాను 1:7). క్రీస్తునందు బాప్తీస్మము పొందుటద్వారా క్రీస్తును ధరించుకొనుచున్నాడు (గలతీ. 3:27). పరిశుద్దాత్ముని నింపుదల వలన క్రీస్తు ప్రభువును హృదయములో ప్రతిష్టించుకొని (గలతీ 4:16) ఆయనతో సహవాసము గలిగి ఆయన స్వరూపమునకు మార్చబడుచున్నాడు (ఫిలిప్పీ 3:21) జీవించునది నేనుకాదు క్రీస్తే నాయందు జీవించును. ఈ రీతిగా క్రీస్తునుకలిగిన వారును, లేనివారును సంఘములో ఉన్నారు. సాధుసుందర్ సింగు అను భక్తుడు ప్రభువు తనకు ప్రత్యక్షము కాగానే తన హృదయములోనికి చేర్చుకొనును. ఆ దినము నుండి నేటివరకు క్రీస్తుప్రభువు సుందర్ సింగుగారిలో నిలిచిపోయెను. ఆహారము భుజించినపుడు ఆ ఆహారము పైకి కనబడకపోయినను కడుపు నిండినట్లు ఎట్లు తెలియుచున్నదో అట్లే సుందరసింగుగారి హృదయములో ప్రభువు నిండియున్నట్లు ఆయనకు తెలిసినది. ఇట్టి అనుభవము గలవారే నా ప్రియుడు నా రొమ్ముననుండు గోపరసమంత సువాసనగలవాడు అని పలుకగలరు.
-
3) గోపరసమంత సువాసనగలవాడు:- పరిశుద్ధ తైలమునందు వాడబడు వస్తువులలో ఒకటి. రాజగృహములలో వాడునది. వారు వస్త్రములపై పడకలపై వేసికొనునది. గొప్ప పరిమళ వాసనగలది కీర్తన. 45:8. ప్రభువే పరిమళ వాసనయై యున్నారు. అనగా అపోస్తలులే సువాసనయైయున్నారు 2కొరింథి 2:15.
ప్రభువునుగూర్చి విని ఆయనను తెలిసికొనుట, ఆయనతో సహవాసము కలిగియుండుట ఒక స్థితి. అపోస్తలులవలె ప్రభువును చూచుట ఒక స్థితి 1యోహాను 1:1. ఆయనను రుచి చూచి తెలిసికొనుట మరొక స్థితి 1పేతురు 2:1. ఆయన పరిమళ వాసనగలవాడని తెలిసికొనుట ఇంకొకస్థితి వారు పరిమళవాసనగా మార్చబడుట మరొక స్థితి చిన్న పిల్లలకు రంగు, వాసన తెలియవు. పెద్దవారికి తెలియును. అట్లే అంతరంగ స్థితిలో ఉన్నత అనుభవముగలవారికే ప్రభువుయొక్క గోపరసవాసన తెలియును గాన సామాన్యులకు తెలియదు. పరమగీతము ఉన్నత అంతస్థుగలవారికేగాని సామాన్యులకుకాదు.
ప్రభువుయొక్క జన్మము, ఆయన బోధ, సేవ, పరిచర్య, జీవితము, ఆయన శ్రమ, మరణ, పునరుత్తాన, ఆరోహణము ఆయన రెండవరాకడ, వెయ్యేండ్ల పాలన, అనంతజీవితము, పరిశీలనము చేసినయెడల ప్రభువుయొక్క ప్రేమ, జీవము, శక్తి జ్ఞానము, పరిశుద్ధత, సర్వవ్యాపకత్వము, న్యాయము, స్వతంత్రత, అనాది, అనంతము అను పావన లక్షణముల గోపరల వాసనను కనుగొనగలము.
మరియ గర్భమందు పావన రక్షకుడైన క్రీస్తు జన్మించుననెడి వార్తను ఆమె విని ఎలిజబెత్తును దర్శింప వచ్చి వందనము చేయగానే మరియ గర్భమందున్న శిశువైన క్రీస్తుప్రభువుయొక్క జ్ఞానమును గోపరస వాసన ఎలిజబెత్తు కనుగొని నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట ఎలాగు ప్రాప్తించెను అని పలికెను. అంతట ఎలిజబెత్తు గర్భములోనే గంతులు వేసెను.
సమరయ స్త్రీని ప్రభువు పావన పరచినందున ఆ పరిశుద్ధ పరిమళము సుకారను గ్రామమంతయు వ్యాపించినది. ఆ గ్రామస్తులు వచ్చి గోపరస వాసనయైన యేసును కనుగొని ఈయన లోకరక్షకుడని మేము తెలిసికొని ఉన్నామని పలికిరి. అనగా లోకమంతటికి ఈయనే రక్షణ పరిమళమని వారి మాటవల్ల తెలియుచున్నది.
ప్రభువు గెరాసేనుల దేశములోను సమాధులలోనున్న అపవిత్రాత్మ పట్టినవానిని బాగుచేయుటకు వచ్చుచుండగా, ఆ భూత పీడితుడు యేసును దూరమున ఉండగానే చూచి నమస్కారము చేసెను మార్కు 5:6. గనుక దీనినిబట్టి చూడగా ప్రభువేమియు మాట్లాడకపోయినను ప్రభువులోని శక్తిగల పరిమళవాసన భూత పీడితునికి అర్ధమైనట్లు తెలియుచున్నది.
ప్రభువు లాజరును బ్రతికించుటకు సమాధియొద్దకు వచ్చి సమాధిపైనున్న రాతిని తీసివేయుమని పలుకగా మార్త ప్రభువా! అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు ప్రభువు నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతునని చెప్పి, వారు రాయి తీసిన తరువాత లాజరూ! బయటికి రమ్మని చెప్పగా అతడు బయటికి వచ్చెను. అయితే ఇక్కడ మరణపు వాసన రావలసినదేగాని జీవపు వాసనయైయున్న క్రీస్తు ఉన్నందున మరణపు వాసన రాలేదు. ఈలోకములోని పాపము, వ్యాధి, మరణమువల్ల కలిగిన వాసనంతయు ఈ ప్రేమ పరిమళ వాసనయై యున్న క్రీస్తుప్రభువు వలన పరిహారమగును.
ప్రభువు సమాధిలోయున్నను ఆయన శరీరము కుళ్ళుపట్టలేదు. మానవ శరీరమును మహిమ పరిమళ శరీరముగా మార్చగల ప్రభువు శరీరమెట్లు కుళ్ళు పట్టగలదు?
ఈ దినములలో ప్రభువు సన్నిధి యందుండు వారికి ప్రభువుయొక్క పరిమళ వాసన వారి గదిలోనికి వ్యాపించు చున్నది.- 1) బేరి యేసమ్మ అను ఆమె హిమాలయములలో ప్రభువు చెప్పగా మృగములుండు ఒక గుహయందు ప్రార్థించుటకు వెళ్లినది. అక్కడ దుర్వాసన, పురుగుల ఉన్నందున సహించలేక ప్రభువా! ఈ వాసన తీసివేయుమని ప్రార్ధించగా అప్పుడు ఆ గుహలోనికి మూడు దినములు మంచి పరిమళ వాసన వ్యాపించినది. పురుగులకూడ పోయినవి.
- 2) రెవ. వి. సుజీవరాజు ప్రభువు చెప్పగా మధ్యప్రదేశ్ లో గల బాగ్-లౌడు అను స్థలములో (పులుల గుహ) తొంబది దినములు ఉపవాస ప్రార్ధన చేసెను. అందు మృగములు ఉన్నందున దుర్వాసనతో నిండియున్నది. ప్రార్ధించినందున 90 దినములు పరిమళ వాసన ఆ గుహయందు కలిగినది.
ప్రియ చదువరులారా! మీ హృదయమునందు ప్రభువు నివాసముండి మీ జీవితముద్వారా ఆయనయొక్క మహిమ పరిమళము అనేకులకు వ్యాపించును గాక!