(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

సంస్కార ప్రసంగము-2



నిర్గమ. 16వ అధ్యా॥; యోహాను 6:52-58

1కొరింథి. 10:2-4


1. జీవముగలవారికి ఈ విందు:-


పాతనింబంధనలో ఒక విందు చూచినాము. తండ్రి పొడుగైన విందు 40సం॥లు చేసారు. పాతనిబంధన సంఘము ప్రయాణములో నున్న సంఘము, ఈ ప్రయాణము చేయుచున్న సంఘమునకు విందు 40 సం॥లు. మన విందులన్ని ఈ భూలోకమునుండి వచ్చినవే. ఈ విందు పరలోకమునుండి వచ్చినది. ఏడేండ్లు విందు పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తె చేసికొనే విందు. 7సం॥లు వారికి ప్రభువు మహిమే. శక్తియే అక్కడ విందు. అక్కడ మన ఏడేండ్లవిందు. వీరిద్దరు అనగా పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తె తినే విందు. దాని మహిమను గ్రహించలేము. ఈ భూలోకములో నుండి వెళ్లిన పెండ్లి కుమార్తెకు ఏడేండ్లు విందు లేకున్న బలము చాలదు. నూతన యెరూషలేము చేరుటకు ఏడేండ్లు విందులో ఉండుట పెండ్లికుమార్తెయొక్క భాగ్యము. ఈ భాగ్యము పెండ్లి కుమార్తెకు ఇవ్వబడినది. ఈ విందు బలము వలన 1000సం॥లు పరిపాలన చేస్తారు. ఏడేండ్ల విందు మహిమను రుచి చూచుటకు ప్రభువు మనలను ఆయత్త పరచునుగాక! పాతనిబంధన విందు మన్నా ఏడేండ్ల ఈ విందుకు పెండ్లివిందు అని పేరు. పెండ్లికుమార్తె విందు మహిమగలది.


2. అంత్య దినమున లేచుటకు ఈ విందు తినవలెను:-


ప్రయాణములో నున్నవారికి ఇవ్వబడిన విందు. ఈ బల్లమీద నున్న విందు తీసికొనే మనము కూడా ప్రయాణములో నున్నాము. మన ఇంటి ప్రయాణములో నున్నాము. మనము నడిచి మన ఇంటికే వెళ్లుచున్నాము. మన తండ్రి మనకు సిద్ధపరచిన నివాసములకు వెళ్లుచున్నాము. యోహాను 14:2 ఆయన ఎక్కడ ఉంటాడో మనము అక్కడనే ఉంటాము. హెబ్రీ. 11:10 ఈ మహిమ సౌధములు ప్రభువే కట్టుచున్నారు. ఎవరు ప్రభువులోనికి వచ్చి విశ్వాసము కలిగి జీవించుచున్నారో వారందరికి పునాదులు పరమందు వేయబడినవి. నా భవనము నాకు చూపించు నాయనా అనండి. ఆదామును సొంత చేతులతో చేసికొన్నాడు. ఆలాగే తన సొంత చేతులతోనే మనకు ఇల్లు ప్రభువే కట్టుచున్నారు.


నీటిమీద పునాదివేసి భూలోకమంతటిని నిర్మించిన ఆయనే మన బిల్డింగ్ కట్టుతున్నారు. ప్రభువే ఫలానా వారి బిల్డింగ్ చూపిస్తాను రా! అబ్బాయి అని చూపించారు. నేను చూచాను. పెద్ద, పెద్ద మంచు గడ్డలతోనే ఉన్నది. గృహములే నిర్మించటానికి వీలుగ ఉన్నంతకాలము నేను కడుతూనే ఉంటాను. అని ప్రభువు అన్నారు. కొంతమంది కట్టిన బిల్డింగులే పడగొట్టుకొంటున్నారు అని ప్రభువు వేదనచెందారు.


పాట:- మహిమ లోకంబునకు మళ్లినావా.....


3. నిజమైన ఆహారము, నిజమైన రక్తములో పాలుపొందుట ఈ విందుయొక్క పని:-


పరలోక భవనములకు ఎదురు చూచుచున్న మనము. ఆ భవనములవద్దకు సాగివెళ్లుటకు ఆయన ఇచ్చిన శరీరము ఆయన ఇచ్చిన రక్తము తీసికొనవలెను. సంస్కారపు విందులో పొందు భాగ్యము-నిత్యము జీవించుటకు, ఆయన శరీరమునుబట్టి ప్రభువా ప్రయాణములోనున్న నన్ను నీ శరీరముతో, నీ రక్తముతో పోషించి బలపరచుము.


ఈ విందుద్వారా బలహీనత, నీరసము, నిస్సత్తువ రాకుండా 90 సం.లు వచ్చినా పెండ్లి కళ తగ్గదు. పావురమా! నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అని పెండ్లికుమారుడు పలుకుచున్నాడు.


కైలాస మహర్షిగారికి, ఏలియాగారికి, హనోకుగారికి వయస్సులేదు. భూలోకములో నున్న వృద్ధ పెండ్లికుమార్తె, కైలాస మహబుషిగారు 400 సం॥లు దాటిపోయినది. కైలాస మహబుషిగారు ఆయనతో నున్న 7000 మంది బుషులు ఆ పెండ్లికుమార్తె కన్నులు నిప్పు కణాలులాగ ఎర్రగా ఉంటాయి. సెకండులో ఎక్కడికైనా వెళ్లిపోగలరు. వారికి పెండ్లికళ తగ్గదు. ప్రతి ఆదివారము 7 వేల మంది బుషులు కైలాస మహాబుషిగారి దగ్గరకు వస్తారు. నెలకొక్కసారి చెట్టు బెరడు తీసికొని వారికి సంస్కారమిస్తారు. హిమాలయ పర్వతములలో మహిమ ఉంటుంది. ఒక చెట్టు కొమ్మ తీసికొని ముక్కు దగ్గర పెట్టుకుంటే చనిపోరు. లేకపోతే చనిపోతారు. సృష్టిలో ఎంత మహిమ ఉన్నదో చూడండి. గ్రహించండి.


4. ప్రభువుతో మనము ఏకమగుటకు ఈ విందు అవసరము:-


సంస్కార భోజనము పై నుండి మనకు వస్తుంది. ఈ ఆహారము పై నుండి వచ్చినది. మనలను పైకి తీసికొని వెళ్లుటకు ప్రభువే మనకు అందించారు. ఇశ్రాయేలు వారు దానిని చూచి ఇది ఏమిటో అని అన్నారు. ప్రభువు శరీర, రక్తము ఆంతర్యము నాకు తెలుసు అని అన్నవారు ఎవరైనా ఉన్నారా? శరీర రక్తములు విలువ మనకు తెలియదు. విశ్వాసముతో గ్రహించి ఈ బల్ల దగ్గరకు వస్తున్నాము. విశ్వాసముతో ప్రభువునే తీసికొనుచున్నాము ఆయన శరీరమును, రక్తమును.