(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
10వ పాఠము(మెస్సియా-శిష్యులు)
మత్తయి 26:26-29; మార్కు 14:22-25; లూకా 22:14-20; 1కొరింథి 11:23-28.
ఈ సంస్కారము ఏర్పాటుచేసిన ఆయన ఎవరు? సంస్కారము తీసికొన్నవారెవరు?
- 1) ఆయన పాతనిబంధనలోని భక్తులందరు కనిపెట్టిన మెస్సియీ జీవించిన కాలములో నున్నవారు. ఆ 11మంది మెస్సియాయొక్క శిష్యులు ప్రభువునకు మధ్య ప్రభుభోజనమున్నది. మా పూర్వికులు చూడవలసిన మెస్సియాను ఇన్నాళ్ళకుచూచినామని వారి సంతోషము. మొదట ఆయనను కలసికొన్నప్పుడు మేము మెస్సియాను చూచినామని ఒకరితో నొకరు చెప్పుకొనిరి. సంస్కార భోజనములో మేము మెస్సియాను కనుకొన్నాము అని చెప్పినవారు.
- 2) ఆయనెవరు? ఆయన బోధకుడు. నా శరీరము నారక్తము అనుభవించినవాడే శాశ్వతజీవి అని బోధించిన గొప్ప బోధకుడు (యోహాను 6) శరీర రక్తములు అన్నపానములుగా ఇచ్చిన బోధకుడు. ఆ శరీర రక్తములను గురించి పూర్తిగా బోధించిన బోధకుడు. వీరు ఆ సంగతి నేర్చుకొన్న విద్యార్థులు, వారే శిష్యులు.
- ౩) లోక పాపములు మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల అని ఎవనిగూర్చి చెప్పబడెనో ఆయనే ఈ మెస్సియా. ఎవరి పాపములు ఆయన మోసికొని వెళ్ళెనో ఆ పాపాత్ములందరు పవిత్రులే. ఆయన దేవుని గొర్రెపిల్ల వీరు సంస్కార సమయములో పరిశుద్ధులు.
- 4) ఆయన ఎవరు? నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పిన కాపరి. పైన ఆయన దేవుని గొర్రెపిల్ల, ఇక్కడ ఆయన కాపరి, వీరు ఆయన మేపే, నడిపించే గొర్రెలు, గాఢాంధకార లోయలో ఆయన వలన సురక్షితముగా నడిపింపబడవలసిన గొర్రెలు ఆయన కాపరియై యుండగా, వారు గొర్రెలైయుండగా వారికేమి కొదువ! “నాకేమి కొదువ నాధుడుండ”
- 5) ఆయన విందులో వడ్డించే ప్రధాని. కానానులోని వివాహములో ఒక పెండ్లి ప్రధాని ఉన్నాడు. ఆయనకు ద్రాక్షారసము అందినది. ప్రభు భోజన సంస్కార విందులో ప్రభువు వడ్డించే వడ్డనకర్త. ఆయన వడ్డించేవాడైన వీరెవరు? వీరు భుజించువారు. ఈ విందునకు ముందు 5వేల మందికి ఆయన వడ్డించక వారిచేతికిచ్చి వడ్డింపచేసెను. 12మంది అక్కడ వడ్డనకర్తలుగా నున్నారు. ఈ విందులో మీరు కొర్పొనండి. నేను వడ్డించెదనని చెప్పెను. శిష్యులకెంత సంతోషము. ఆయన మెస్సియ వారు మెస్సియాను కనుగొన్నవారు. ఆయన బోధకుడు. వీరు నేర్చుకొన్నవారు. ఆయన పాపపరిహారకుడు. వీరు పరిశుద్ధులైన వారు. ఆయన కాపరి. వీరు కొదువలేని గొర్రెలు. ఆయన విందులో వడ్డించువాడు. వీరు విందు భుజించువారు.
- 6) ఒక గొప్పవారు విందుచేసి, పదార్ధములు వడ్డించుమని ఇతరులకు అప్పగించి తాను మొదటి పంక్తిలోని వారికి మాత్రము వడ్డించిన ఆ పంక్తిలోనివారికి ఎంత సంతోషము, అలాగే యేసుప్రభువు ఇతరులైన శిష్యుల సేవకులు గలిలైయలోను యూదయలోను ఉండగా ఆ 11మందికే వడ్డించెను. వారు ఆయనకు మూల చుట్టములు (ప్రత్యేక బంధువులు) అయినారు. బేతనియలో, కపెర్నహూములో, కనానులోను, నజరేతులోను శిష్యులున్నారు. వారందరికన్న ఆ 11మంది ప్రత్యేక బంధువులైన ఆయన అతిధి అయినారు.
- 7) ఈ ప్రభురాత్రి భోజనమునకు సమభాక్త్వము అనిపేరు కూడ ఉన్నది. ఎవరి ఉంటిలోవారు భోజనముచేసిన అది సమభాక్త్వమనబడదు. అన్ని ఇండ్లలోనివారు ఒకచోట కూర్చుని భోజనముచేసిన సమభాక్త్వము అనబడును. శిష్యులు వేర్వేరు గ్రామములవారు. ప్రభువు సముద్రము దగ్గర నున్నవారిని సుంకపు మెట్టుదగ్గర నున్నవారిని అంజూరపు చెట్టుక్రింద నున్నవారిని పిలిచి వరుసగా కూర్చుండపెట్టి విందు చేసెను గనుక సమభాక్త్వము. గనుక ఆయన సమభాక్త్వ దానకర్త. వారు సమభాక్త్వబాగులు అనగా పాలుపొందిన వారు. యేసుప్రభువు గార్థభాసీనుడై యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఈయన ఎవరు అని ప్రశ్నించిరి. ఈ రాత్రి భోజన సమయములో నేను "ఈయన ఎవడు" అని వివరించుచున్నాను.
- 8) ఆయన 3సం॥లు వారితో కలిసి మెలిసి ఉన్న ఆయన ఒక బాటమీద నడిచిరి. ఒక దోనె ఎక్కిరి, ఒకే పంక్తిలో ఉండిరి. పాపులతో, సుంకరులతో భోజనముచేసి బసచేసిరి. ఈయన ఎవరనగా గొప్ప సహవాసికూడ ఉండివెళ్ళిన చోటకెల్ల వారిని త్రిప్పిన సహవాసి. ఆ సహవాసి ఈ విందులో వడ్డించే సహవాసి అయినాడు. వారు ఆయన జట్టులోని సహవాసులు. గనుక ఆయన సహవాసులు.
- 9) ఆయన అసలైన మానవుడు. మనుష్యులు పరిశుద్దులైనను ఒకప్పుడు పాపులే. పరిశుద్ధులగుచున్న పాపులు. ఆయన పాపిగాదు, పరిశుద్దుడు పరిశుద్దుడుగాదు. ఒకరివల్ల పరిశుద్దుడుగా మార్చబడువాడుకాడు. అసలే పరిశుద్దుడు. వారు పాపులుగాని పరిశుద్దులగుచున్నారు. కొంతకాలమునకు ఆయన రూపలావణ్యములు వారికి వచ్చుననిగలదు. ఆయన నరరూపి. వారు పరిశుద్ధులు కావలసిన నరరూపులు. ఆదిలో తన రూపము ఇచ్చిన నరరూపులు గాన తిరిగి ఆయన రూపములోనికి వచ్చుటకు వారిని మేపుచున్నాడు. (ఆహారమిచ్చుచున్నాడు) అదే ఈ విందు.
- 10) యెషయా 9:7లో మనకొరకు శిశువు పుట్టెను ఆయన బలమైన శిశువు. అనగా మన తండ్రియైయున్న దేవుడు. ఆయన తండ్రి. వీరు తండ్రియొక్క బిడ్డలు. నేను ఆ 11మందిలో ఉంటేనా! అప్పుడు లేకపోయిన పోనీలెండి ఈ సంస్కార భోజనములో ఇప్పుడు ఉంటే చాలును. కృప తోడైయుండునుగాక!