(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

23వ పాఠము(దేవునిదాసుడు)



దానియేలు 1:8-13; 1పేతురు 2:16. దేవునిదాసుడు


ప్రియమైన పెండ్లికుమార్తె సంఘమా! ఈ విందుద్వారా కలుగవలసిన మేళ్ళను దేవుడు మీకు అనుగ్రహించునుగాక!


దానియేలు గ్రంథములో దాసుడు అని చెప్పుకొనుచున్న (1:13) దానియేలు దేవుని దాసుల ఆహారమేమిటో, భూలోకపురాజుగారి ఆహారమేమిటో తెలియజేయుచున్నారు. దానియేలు దాసుడుగా ఉన్నారు. అయితే దాసునిగా ఉన్న ఇతనిని ఇతని స్నేహితులను రాజు ఎంచుకొని, రాజు భోజనము పెట్టవలెనని తలంచినాడు. ఆ రాజ భోజనములోకూడా మాంసము, రొట్టె, ద్రాక్షరసము ఉన్నాయి. కాని దాసుడైన దానియేలు ఈ భూలోకపు రాజు విందును తిరస్కరించు చున్నారు. అందుకు కారణము అది అపవిత్రమైన బల్ల 1కొరింథి. 10:21. దీనినిబట్టి చూడగా సాతాను అపవిత్రపు బల్లనుకూడా పవిత్రమైన బల్లవలె ఉంచుటకు ప్రయత్నము చేయును.

షరా:- దేవదాసు అయ్యగారియొక్క అభిప్రాయము - కొంతమంది దేవదాసు అయ్యగారిని మీరు ఎందుకు బైబిలుమిషనుకు అధికారిగా ఉండరు? అని అడిగితే నాపేరు దేవదాసు, నేను దేవునియొక్క దాసుని మాత్రమే. “దాసుడు, దాసునిగా ఉండవలెను” అని చెప్పిరి.


అటువంటి దైవ దాసత్వపు జీరగలిగియున్న దైవజనుని బిడ్డలమైన మనము అట్టి దాసుని జీరకలిగి ఉండవద్దా?


33 1/2 సం॥లు కష్టపడిన కూలివాని శరీర రక్తములు నీ ప్రభునివి. తండ్రి కుమారునికి నియమించిన పని; కుమారుడు తన వధువును సంపాదించుకొనుటకు చేయవలసిన పని: ఈ రెండు పనులు కష్టపడి పూర్తిచేసిన కూలివాడు నీ వరుడు బాగా కష్టము చేసినవానిలో నుండి కండరములు ఏలాగు ఉప్పొంగుచూ ఉండునో అలాగే బాగా కష్టపడిన ఈ దాసుని యొక్క శరీర రక్తములు నీకొరకు ఉప్పాంగుచూ, నీ నోటిని తాకవలెనని వచ్చుచున్నవి. నిన్ను తృప్తిపరచవలెనని, నిన్ను ఆనందపర్చవలెనని ఈ శరీర, రక్తములు ఆశపడుచున్నవి. పెండ్లికుమారుని శ్రమ, పెండ్లికుమార్తె కోసమేగదా! యాకోబు శ్రమ రాహేలు కోసమేగదా! యాకోబు రాహేలు కొరకు ఉవ్విళ్ళూరుచున్నట్లు నీ ప్రాణ ప్రియుని శరీర రక్తములు నీ కొరకు ఉవ్విళ్ళూరుచున్నవి. అలాగే ఈ యేసు క్రీస్తుయొక్క శరీర, రక్తములు ఈ శ్రమకాలములో నీకొరకు ఉవ్విళ్ళూరుచున్నవి.


5. దాసునియొక్క స్థితి:- దాసులు అనగా యజమానులు చెప్పినది చెప్పినట్లు చేసేవారు. సేవకులు సేవచేయువారు మాత్రమే. 24గురు పెద్దలుకూడా మేము “దాసులమే” అని తమ కిరీటములు తీసి తలలువంచి సాష్టాంగపడుచున్నాడు. మన పెండ్లికుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు తండ్రి చిత్తమును నెరవేర్చుటకును, మన భారములన్నీ మోయుటకును సంపూర్ణముగా దాసుడైనాడు. అట్టి దాసుని శరీర రక్తములు పుచ్చుకొనుచున్న మనము దాసుని నైజము కలిగి ఉండవలెను. గనుక మీ పెండ్లికుమారుని ప్రేమకు దాసులైయుండుడి. ఆయన చిత్తమునకు దాసులైయుండుడి. ఆయనమాటకు దాసులైయుండుడి.


ఎ) దాసుని కళ్ళు:- సహజముగా దాసుని కళ్ళు, దాసుని కడుపు పెద్దవే. దాసుడు తన కళ్ళతో ఎక్కువ ఆశ కలిగియుండును. అలాగే తన కడుపులో ఎక్కువ ఆకలి కలిగియుండును. అలాగే మన నిజమైన దాసుడైన యేసుక్రీస్తు ప్రభువే తన కళ్ళలో సమస్తమైనవారు తనయొద్దకు రావలెనని ఆశించుచున్నారు. “ప్రయాసపడి... సమస్తమైన వారలారా నాయొద్దకు రండి.” ఇది ఆయన ఆశ. భూలోకములో భారము వహించనివారెవరు? సమస్తమైన వారు భారము వహించుచున్నారుగదా! అందుకే ఆయన అలాగు ఆశిస్తున్నారు. అలాగే తండ్రి చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చుటకు సంపూర్ణమైన ఆకలి కలిగియున్నారు. అదే ఆయన ఆహారము యోహాను 4:34. అలాగే మన ఆత్మీయ జనకులైన దేవదాసు అయ్యగారుకూడా ఇదే ఆశ. ఇదే ఆకలి కలిగియున్నారు. ఈ దాసుని కడుపులోనుండి వచ్చిన పాటే “అంతయు మనదేగదా” లోకమంతటిని మార్చమని ప్రార్ధన చేసిన దైవజనులారా మనలో అదేస్థితి ఉండవద్దా? (దాసుని కళ్ళు, కడుపు) మీరుకూడా ఈ నూతన సం॥లో “దేవదాసులు” అవ్వాలేమో? ఎవరికి తెలియును. గనుక సంపూర్ణమైన ఆశ, ఆకలి గలిగి ఈ సంస్కార భోజనమును తీసికొనండి.


ప్రియమైన పెండ్లికుమార్తె సంఘమా! దేవుని దాసునిగా మారి, శ్రమించి నీకు సరిపడు ఆహారమును వడ్డించుచున్నారు. గనుక దాసుని స్థితిలేకుండా నీవు భుజిస్తే అది నామకార్ధమే.


6. దాసునియెదుట దాసునిగా ఉండుట:- నీవు దాసునియెదుట దాసునిగా నున్నావా? లేక రాజుగా నున్నావా? నీవు ఏలాగున్నావు? ఎక్కడ కూర్చున్నావు? దాసుడు దాసునికి మాత్రమే స్వేచ్చగా వడ్డించగలడుగాని తనకంటె పైనున్న రాజునకు స్వేచ్చగా వడ్డించలేడు. చనువు ఉండదు. “నా పాపి విందునకు నడచి రాకున్నా నా తాపమెంతో చెప్పదగునా అనుచున్నారు”. అను పాటలో “తాపమెందుకు” దాసునియొద్దకు దాసునివలె వినయముగా రాకపోతే ఆయనకు తాపముకాదా? నీవు నీ ఇహలోక అతిశయములతో రాజు సింహాసనముపై కూర్చుంటే ఆయనకు నీకు చనువుగా వడ్డించలేరు. అప్పుడు నీవు తీసికొనే సంస్కారము నామకార్ధమే. నీవు ఎక్కడ ఉంటున్నావో ఒక్కసారి ఆలోచించు. ఏలాగు తీసుకొనుచున్నావో, ఒక్కసారి ఆలోచించుకొనుము.


అంత దేవుడు దాసుడైపోతే మట్టివారమైన మనము ఆయన సన్నిధిలో ఇంకా ఎంతగా దాసులమవ్వాలి? మన శరీరమును, ఆత్మను, ప్రాణమును చుట్టచుట్టి సంపూర్ణముగా ముద్దగా చేసుకొని ఆయనయొద్దకు వెళ్ళవలెను. “నాయిష్ట మిదిగో యిది నీ యిష్టముగా చేయ నా యిష్టమిక కాదది” కనుక ఈలాగున ముద్దగా మారి ఆయన దగ్గరకు వెళ్ళలేకపోతే ఆ రక్తపు ముద్దలోనుండి ఏమీ పొందలేము. గనుక ఈ దినమున ఈ దాసుని రక్తము, శరీరము, నైజము మనల్ని కప్పి ఉంటే తగ్గింపు అంటే ఏమిటో మనకు తెలుస్తుంది. అందుకొరకే ఈ దాసుడు తన రూపమును మనకు అద్ది, తన నైజమును మనకు కప్పి ఈ విందును వడ్డించుచున్నారు. ఈలాగు మనలను దాసులుగా మార్చుకొనుటలో ఆయన చేయు చాకిరీ మనకు అర్ధముకాదు.


7. దాసుడును, రాజునైన యేసుక్రీస్తుయొద్ద విందు పుచ్చుకొను విధానము:- పరలోక స్థితినిబట్టి ఈయన రాజు. భూలోకపు స్థితినిబట్టి కూలివాడు దాసుడు. “రాజు భోజనకర్త". ఈ దినమున మనకు భోజనము వడ్డిస్తున్నారు. గనుక దాసుని స్వరూపము ధరించుకొనిన ఈ నిజమైన దాసుని యొద్ద, దైవదాసులమైన మనము చనువుగా భోజనము తీసికొందాము. దాసునికి, దాసునికి మధ్య చనువు ఉండునుగదా! గనుక ఇది చనువు విందు. ఒక దాసుడు మరియొక దాసునియొద్దకు వచ్చినప్పుడు తన పైకండువా తీసి క్రింద దులిపి కూర్చోబెట్టుకొనును గదా! అలాగే మీ కన్నీటి కండువా తీసి క్రింద దుపిలి ఈ నిజమైన దాసుని ఈ దినమున మీతో కుర్చుండబెట్టుకొని ఆయనయొద్ద విందును తీసుకొనండి. గనుకనే ఇది చనువుల విందు.


రెండవదిగా ఈయన రాజే గనుక రాజు యొద్దకు దాసుడు వెళ్ళునప్పుడు వినయముగా వెళ్ళునుగదా! ఈ దినమున పరలోకపు రాజు విందును వడ్డించుటకు వచ్చియున్నారు. గనుక దైవదాసులమైన మనము వినయముగా ఆయన యొద్దనుండి విందును తీసికొనవలెను. గనుక వినయ చనువుల విందే ఈ సంస్కారపు విందు. ఈ విధముగా సంస్కారపు విందులో పాల్గొనుచున్నారా? భూలోక స్థితినిబట్టి చనువు పరలోక స్థితినిబట్టి వినయము.


8. యేసుక్రీస్తు రాజు రూపము, దాసుని రూపములు ఏలాగు యిమిడి యున్నవి:- నీ ప్రాణ ప్రియుని దాసుని స్వరూపములో, రారాజు స్వరూపము ఇమిడి యున్నది. అలాగే నీ ప్రాణ ప్రియుని చనువులో మీ వినయము ఇముడ్చుకొని భుజించండి. శరీరము చనువును కనబరుస్తుంది. ఆత్మ వినయమును కనబరుస్తుంది. శరీరమునుబట్టి చూడగా మానవ శరీరమును ధరించుకొన్నవాడేగాని ఆత్మనుబట్టి చూడగా ఆయన దైవాత్మ.


నీ ప్రాణప్రియుని శరీరములో దాసత్వము, రాజరికము పెనవేసుకొనియున్నవి. రాజరికము దాసత్వము పెనవేసికొనుట ఏలాగు? దాసత్వములో ఇమిడిపోయే స్వభావమున్నది. దాసుడు ఏలాగైనా ఇమిడిపోగలడు. అలాగే రాజరికములో ఆక్రమించుకొనే గుణమున్నది. ఈలాగున దాసత్వము రాజరికములో ఇమిడిపోగా, రాజరికము ఆవరించుకొనగా ఈ రెండు లక్షణములు పెనవేసుకొని జీవించిన జీవితము నీ ప్రాణప్రియుని జీవితము. దాసుని స్వరూపమును బట్టి నీ ప్రాణప్రియుడు నీలో ఇమిడిపోవుచున్నారు. రాజరికమును బట్టి నిన్ను తనలో ఇముడ్చుకొనుచున్నారు.


నా శరీరములో శరీరము, నా రక్తములో రక్తము అని తన శరీర రక్తములను ఇచ్చి ఈ దాసుడు నీలో ఇమిడిపోవుచున్నారు. తన రాజరికమునుబట్టి “ఇది నాది” అని అనుచున్నారు. రాజరికమునుబట్టి స్వంతము చేసికొనుట. కనుక ఈలాగు ఏకమైపోవుటే వివాహము.


దాసుని విందు కళావిహీనముగా కనబడుచున్నదని నెట్టివేయవద్దు. ఇది అంతరంగ కళ కలిగినదే. ఆయనకు కళలేకకాదు. మనకొరకు ఆయన కళావిహీనముగా మారినారు. కళావిహీనముగా కనబడుచున్న ఈ దాసుని స్వీకరించగలిగిన యెడల కళ నిచ్చేది ఈ విందే. భూలోకములో ఉన్నంతకాలము దాసునిగానే ఉండు. అది నీ నైజమైయుండాలి. అది నీ బలమైయుండాలి. నేను దాసునిదాసుడనే అనే స్మరణ నీలో ఉండాలి. ఈ దైవ దాసత్వమును కాదంటే లోకపు రాజరికములు నిన్ను చుట్టుముడతాయి.


నిత్యము దైవదాసులుగా ఉండగలిగే నైజము ఈ విందుద్వారా దేవుడు మీకు అనుగ్రహించునుగాక! ఆమేన్.