క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
ప్రశంస
దేవుడు దేవదూతలను కలుగజేసెను. వారు స్త్రీలు కారు, పురుషులు కూడా కారు. వారు ఆత్మ స్వరూపులు. వారిలో ఏడుగురు ప్రధాన దూతలుండిరి. వారిలో ఒకరు లూసీఫర్. ఇతడు అనాదిలో దైవకార్యములను జాగరూకతగానే చేసియుండెను గాని వానిలో దుర్భుద్ధికలిగి, దేవుని నెదిరించినందున, అతడు తన అంతస్తునుండి దేవునిచేత పడద్రోయబడెను. అప్పటినుండి అతడు సాతానను పేరున తిరుగులాడు చుండెను. అంతేగాక అప్పటినుండి దేవునికి విరోధియై, దేవునియొక్క పరిశుద్ధ పనిని పాడుచేయవలెనని, ఆది దంపతులైన ఆదాము, హవ్వల యొద్దకు వచ్చి, తనలోని దుర్బుద్దిని తన యుక్తిగల జ్ఞానముచేత వారిలో ప్రవేశపెట్టి; దేవుని పోలికకు, దేవునికి, దేవుని సహవాసమునకు వారిని దూరము చేసెను. ఇట్లు పాపము వృద్ధికాగా, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు తన బలి అర్పణ ద్వారా సాతానును చితుక త్రొక్కి పాపులను రక్షించెను. యేసుప్రభువు తన సిలువ రక్తము ద్వారా సమస్త పాపముల నుండి రక్షించిన సంఘమునకు, సాతానును చితుక త్రొక్కే సర్వాధికారమిచ్చెను.
ఈ కడవరి కాలములో సంఘ క్షేమము కొరకు యం. దేవదాసు అయ్యగారి ద్వారా, సంఘమునకు అందింపజేసిన ఈ మర్మమునుబట్టి దేవునికి స్తోత్రములు. చెడుగును ప్రపంచములోను, సమస్త ప్రజలలోను, మనలోను ప్రవేశపెట్టిన సాతానును, ఈ సూత్రముల ద్వారా రోషము తెచ్చుకొని ఎదిరించి, సాతానుపై జయము పొందుదురు గాక!
యం. దేవదాసు అయ్యగారి సలహాపై ఈ సూత్రములన్నింటిని ప్రోగుచేసి, వర్గీకరించిరి. ఇవి ఒకరిని చూచి ఒకరు వ్రాసికొన్నందున కొన్ని మార్పులుండును, కొన్ని మాకు దొరుకనివి కూడ ఉండును. అట్టివానిని బైబిలుమిషను ఆఫీసుకు తెలియజేసిన యెడల తరువాత ముద్రణ సమయమున సరిచేయుదురు.
దేవుడు మిమ్ములను దీవించును గాక! ఆమేన్.
ప్రవేశము
సాతానును ఎదిరించకపోయిన యెడల మన దేవునిరాజ్యము వృద్ధిలోనికి రాదు. అన్నిటికిని వాడు అడ్డు వచ్చుచుండును. సాతాను ప్రతిదినము శోధించు చుండును గనుక అతనిని మనము సాధించవలెను. కొన్ని విషయములు ఎత్తి వాడిని సిగ్గుపరచవలెను. బాణములు అనగా, సాతాను నెదిరించు సూత్రములు పుస్తకములోనే వ్రాసియుండిన యెడల వానికి భయము తక్కువ. ఒక్కొకటి చదివి వదిలిన వానికి భయము. వేటకాని సంచిలో బాణములు ఉండిన ఏమి ప్రయోజనము? వాటిని తీసి విల్లెక్కుపెట్టి వదలవలెను. అనగా సాతానును జయించు సూత్రములను చదువుటవలన వానికి భయము కలుగును. తుదకు వాని రాజ్యము కూలిపోవును.
క్రీస్తుప్రభువు దైవసన్నిధి కూటములోనికి వచ్చి కనబడుచున్నారు గనుక సాతాను కూడ - "ఆయన కనబడితే నేనెందుకు కనబడకూడదు" అని వచ్చును. భయపడవద్దు, వాడు ప్రభువు సెలవుమీద వచ్చి కనబడును గాని స్వయముగా రాలేడు. వాడువచ్చి మన మనోనిదానమును కుదరనీయడు, పిచ్చి పిచ్చి ఆలోచనలు పుట్టించును, అవసరము లేని సంగతులు చెప్పును. ఇవన్నియు పిశాచి పనులే. కాబట్టి సాతాను శోధించినప్పుడు, "దేవా! నా బలము కొరకు, నా జయము కొరకు, నా బహుమానము కొరకు సాతానును రానిచ్చినావు గనుక నీకనేక స్తోత్రములు" అంటే వాడు పారిపోవును. ఒకరు వెళ్ళుచుండగా మరియొకరు రాయి విసిరి కొట్టెను. గాని రాయి విసిరిన అతడు కనబడనంత మాత్రమున అతడు లేనట్టేనా? అలాగే సాతాను కనబడక పోయినను, వాని శోధన కనబడుచున్నది. అందువలన వాడు కనబడినట్టే. సాతానుకు కోపమువచ్చి చెలరేగినపుడు, మన సన్నిధి కూటస్థులను బాధించును, విశ్వాసులను బాధించును. అందుచేత మనము చెలరేగి, మన సత్కార్యములను వృద్ధి చేసికొనవలెను.
షరా: బోధకులు నేర్పినవేగాక శోధన కాలమందు, పరిశుద్దాత్మ తండ్రి అందించిన ఎదిరింపులు వాడుట కూడ అవసరము గనుక వాడిని రోషముతో ఎదిరించవలెను.