క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
శిరచ్ఛేదనమునకు శిరచ్ఛేదన
- 1) ప్రధాన దూతయొక్క మనస్సులో (శిరస్సులో) అనాదిలో, "దేవునితో తాను సమానమను" చెడుతలంపు పుట్టించు కొన్నాడు. ఇది అతని శిరస్సులోనిదే
- 2) అతడు దైవ సంకల్పమును భిన్నము చేయుటకు, హవ్వలో దైవాజ్ఞకు విరుద్ధమైన తలంపు పుట్టించినాడు. ఆ తలంపు అతని శిరస్సులోనుండి వచ్చినదే.
- 3) ఆదాము, హవ్వలను శాపగ్రస్తులనుగా చేయవలెననునది, అతని శిరస్సులోనిదే.
- 4) ఎన్ని పర్యాయములు మానవులలో పాపములను చేయు కోరిక పుట్టుచున్నదో, అన్ని పర్యాయములు అది సాతానుయొక్క శిరస్సునుండి వచ్చుచున్నదని గ్రహింపవలెను. పొడపాము మనుష్యుని బొటనవేలిమీద ఊది, పుట్టలోనికి పోయినప్పటికిని, ఆ ఊపిరి శరీరమంతా వ్యాపించి కుళ్ళిపోవును. అలాగే ఎప్పుడో సాతాను ఊదిన పాపము నేటివరకు వచ్చుచున్నది. ఇది అతని శిరస్సులోనిదే.
- 5) పది యాజ్ఞలను జ్ఞాపకము చేసికొనగా ఏమి తేలుచున్నది? దైవాజ్ఞలకు విరుద్ధమైన పాపములు చేయవలెనను కోరిక మనిషిలో పుట్టుచున్నది. అది సాతానుయొక్క శిరస్సులోనిదే.
- 6) దేవుడు లేనేలేడను తలంపు, సాతాను కొందరిలో పుట్టించినందున వారు నాస్తికులైరి. ఆ తలంపు సాతానుయొక్క శిరస్సునకు సంబంధించినదే.
- 7) దేవుడు చేసిన ఉపకారములను తలంచుకొని, స్తుతిచేయుటకు సిద్ధపడి కూర్చున్న విశ్వాసయొక్క హృదయములోనికి వెళ్ళి, స్తుతిచేయకుండ ఆపుచేయు వాడు సాతాను. కష్టములు కలిగినప్పుడు అతడు దేవునిమీద విసుగుదల పుట్టించి స్తుతి జరగనీయడు. ఒక్కడే కుమారుడైయుండగ, "ఆ బిడ్డను కూడ దేవుడు తీసికొనినాడు, ఓర్వలేక పోయినాడను" తలంపు పుడితే ఎట్లు స్తుతి చేయగలరు? ఆ చెడ్డ తలంపు సాతానుయొక్క శిరస్సునకు సంబంధించినదే.
- 8) ఇంటిలోనే ఉండి ప్రార్ధన చేసికొంటే చాలదా! గుడికెందుకు వెళ్ళవలెను? అను తలంపు కొందరికి కలుగును. ఇదికూడ సాతాను శిరస్సుకు సంబంధించినదే.
- 9) చదువుకొన్న పిల్లలలో కొందరు - మేమెందుకు తల్లిదండ్రుల మాట, పెద్దల మాట వినవలెను? ఇతరులెంత పెద్దవారైనప్పటికిని మేమెందుకు వందనము చేయవలెను? అని కొంతమంది పిల్లలు, తమ ఇష్ట ప్రకారముగా సంచరింతురు. ఇటువంటి తలంపు సాతాను శిరస్సులోనిదే.
- 10) తిట్టుట, కొట్టుట, చంపుట మొదలైనవి మానవులలో కొందరియొద్ద నుండు దుర్గుణములు. ఇవి కూడ సాతాను శిరస్సులోనివై యున్నవి.
- 11) కుటుంబ సంబంధమైన కలహములు, ఆపదలు, పాపములు సాతాను శిరస్సు తెచ్చిపెట్టినవే.
- 12) ఆకలివేస్తే ఒకరి ఇంటిలోనివి తీసికొని తింటే ఏమి తప్పు? అని కొందరు దొంగతనము చేయుదురు. ఇదికూడ సాతానుయొక్క శిరస్సుకు అన్వయించినదే.
- 13) ఒకరిని అల్లరి పెట్టుచు, అతని తప్పును బైటపెట్టు గుణములు చాలమందిలో నున్నవి. దాని జన్మస్థానము సాతానుయొక్క శిరస్సు (అన్ని అబద్ధములు సాతానుకు సంబంధించినవే).
- 14) పది యాజ్ఞలలో నున్నటువంటి పాపములే కాక, బైబిలులో ఇతరచోట్ల ఉదహరించియున్న పాపములు అతని శిరస్సులోనివే.
- 15) బైబిలులో ఉదహరించియున్న పాపములే కాక మన కాలమువరకు వస్తూయున్న క్రొత్త క్రొత్త పాపములు గూడ సాతాను శిరస్సు లోనివే.
- 16) దేవునిరాజ్యము భూమిమీద వ్యాపింపబడ కుండునట్లుగా అడ్డములు బెట్టుట, సాతాను యొక్క శిరో కార్యములే.
- 17) మహా ముఖ్యముగా క్రీస్తు సంఘమును నమ్మకుండ చేయువాడు అపవాది. దీనిలో అతని శిరస్సునకు ఎక్కువ సంబంధము కలిగియున్నది.
- 18) పాపమును విసర్జించుట, రక్షణను పొందుట, రాకడకు సిద్ధపడుట అను ఈ మూడును వట్టివే అనిపించుట, అతని శిరస్సుయొక్క పని.
- 19) పరలోకము, నరకలోకము లేవు. హేడెస్సు లేదనిపించుట అతని శిరో వృత్తి.
- 20) ఇవిగాక శాఖోపశాఖలుగా నున్నటువంటి పాపములు అనేకములున్నవి. అవికూడ అతని శిరస్సునకు సంబంధించినవే.
- 21) "సాతాను, అతని చెడ్డదూతలు అనగా భూతములున్నవి" అను బోధ వట్టిదే అనిపించుట అతని పని.
- 22) ఆ పైన ఉదహరించిన సాతాను యొక్క దురాలోచనలు మాత్రమేగాక కర్ణ దోషములు, నేత్ర దోషములు, హస్త దోషములు, పాద దోషములు ఈ మొదలైనవి కూడ అతని శిరస్సుయొక్క పనులే.
- 23) పైన వ్రాసియున్నవన్నియు కలిసి, సాతాను యొక్క శిరస్సగును. అపవాదికి శరీరము లేదు, మన శిరస్సు వంటి శిరస్సు లేదు. అయినప్పటికిని నిరాకారముగా నుండు, ఈ ఇరవై మూడు దుర్గుణములున్నవి. అవియే అతని శిరస్సు.
గమనిక: భయంకరమును, పాపభూయిష్టమునైన ఈ సాతానుయొక్క శిరచ్ఛేదనము చేయుటకై ప్రతి క్రైస్తవుడు ఈ ప్రార్ధన(సాతాను నెదిరించు సూత్రములు) చేయుట అవసరము.